telugudanam.com

      telugudanam.com

   

ఉదయగిరి

ఉదయగిరి కోట

ఉదయగిరిలోని ప్రతి కట్టడం ఆనాటి నిర్మాణ కర్తల సాంకేతిక నైపుణ్యాన్ని చాటుతుంది. అప్పటి వీరుల యుద్ధతంత్రాలను విడమరిచి చెబుతుంది.


ఎక్కడ ఉంది? ఎలా వెళ్ళాలి?:

నెల్లూరుకు 100 కిలోమీటర్ల దూరంలో మండల కేంద్రం ఉదయగిరికి ఆనుకుని ఉన్న ఉదయగిరి దుర్గం తిరుమలగిరిని పోలిన కొండపై ఉంది. దుర్గాన్ని అధిరోహించడానికి నాలుగు మార్గాలున్నా ఎక్కువ మంది దుర్గంపల్లె మీదుగా ఉన్న మెట్ల దారే ఎన్నుకుంటారు.


ఘనమైన చరిత్ర:

క్రీస్తుశకం 930లో తూర్పు చాళుక్య చక్రవర్తి సేనాని పట్రంగడు కొండపై ఉన్న అరాచక తెగలను తరిమికొట్టి ఈ దుర్గాన్ని స్వాధీనం చేసుకున్నాడు. అనంతరం వచ్చిన పాలకుల వ్యూహాలకు అనుగుణంగా పటిష్టమవుతూ వచ్చిందది. పల్లవరాజు నందివర్మ అమ్మరాజు దీన్ని పాలిస్తుండగా 1160లో వెలనాటి రాజులు దండెత్తి వచ్చి ఓడించారు. 1235లో ఉదయగిరి కాకతీయ సామ్రాజ్యంలో భాగమైంది. తర్వాత విజయనగర సామ్రాజ్య నిర్మాణకర్తల వంశానికి చెందిన విరూపాక్షరాయలు, అతని సోదరుడు కంపరాయలు గెలుచుకున్నారు. 1404లో ఇది కందుకూరు దుర్గాధిపతి శ్రీగిరిరెడ్డి వశమైంది.

1471 నుంచి విజయనగర రాజుల అధీనంలో ఉంది. అయితే 1488లో పురుషోత్తమ గజపతి ఉదయగిరిని స్వాధీనం చేసుకుని సాళువ నరసింహరాయల్ని బందీగా పట్టుకున్నాడు. చేసేది లేక నరసింహరాయలు కోటను అప్పగించి, అవమానభారంతో విజయనగర రాజధానికి చేరుకున్నాడు. 1509లో పట్టాభిషిక్తుడైన శ్రీకృష్ణదేవరాయలు తిరిగి ఉదయగిరిని సాధించడానికి నాలుగేళ్లపాటు వ్యూహరచన చేశాడు. 1513లో కోటను ముట్టడించాడు. 938 మీటర్ల ఎత్తున ఉన్న కోటను, పొంచి ఉన్న శత్రుసేనల్ని జయించడానికి ఆయనకు ఏడాదిన్నర పట్టింది. దుర్గంపైకి నీటిని సరఫరా చేసే జలాశయానికి గండి కొట్టడం ద్వారా ఆయన ఆ ఒరియా రాజులపై విజయం సాధించారనీ అందుకే ఆ జలాశయానికి గండిపాళెం అనే పేరొచ్చిందనీ కథనం.

తర్వాతి కాలంలో ఉదయగిరి గోల్కొండ నవాబుల వశమైంది. 1626లో ఢిల్లీ పాదుషాల ప్రతినిధి మీర్‌జుమ్లా దీన్ని స్వాధీనం చేసుకున్నట్టు ఇప్పటికీ పెద్ద మసీదు వద్ద చెక్కు చెదరకుండా ఉన్న శాసనం ద్వారా తెలుస్తోంది. చివరికి 1836లో ఆంగ్లేయుల వశమైంది. అప్పటి కలెక్టర్‌ డైకస్‌ దీనిపై అద్దాలమహల్‌ నిర్మించి వేసవిలో విడిది చేసేవాడు.

కోట బురుజు

దారిపోడవునా దుర్గం రక్షణ ఏర్పాట్లు ఆశ్చర్యం గొలుపుతాయి. దాదాపు కిలోమీటరు నడిస్తే 'టప్‌కా' అనే ప్రాంతానికి చేరుకుంటాం. నీరు చుక్కలుగా పడటం వల్ల దానికా పేరు వచ్చింది. ఇక్కడినుంచే నీరు పైకి తరలించేవారని చెబుతారు. కొబ్బరినీళ్ల కన్నా తియ్యనైన ఆ నీటిని తాగి మరో అరగంట నడిస్తే ప్రధానద్వారానికి చేరతాం. చుట్టూ ఉన్న బురుజులపై నుంచి వందల జతల సైనికుల కళ్లు పహారా కాస్తున్న అనుభూతికి లోనవుతాం. ద్వారం దాటి ముందుకు పోతే అద్దాలమేడ శిధిలాలు, రాణిమహల్‌, చిన్న మసీదు, గోషా మసీదు ఒకదాని వెంట ఒకటి కనువిందు చేస్తాయి. చిన్న మసీదు ఎక్కి చూస్తే, వందలాది బురుజులు చకితుల్ని చేస్తాయి.


పెద్దమసీదు పరమావధి:

రంగనాథ ఆలయం

ఉదయగిరి దుర్గారోహణలో మెట్లదారిన చిన్నమసీదుకు చేరడం ఒక ఎత్తయితే అక్కడి నుంచి మూడు కిలోమీటర్ల దూరంలోని పెద్దమసీదుకు చేరడం మరో మధురానుభూతి. ఈ దారిలో రాజదర్బారు (దీన్ని గుర్రపుశాలగానూ చెబుతుంటారు). నర్తనశాల తదితర నిర్మాణాలు కంపిస్తాయి. దాదాపు టన్ను బరువున్న కొండరాళ్లు ఒకదానిపై ఒకటి పేర్చి నిర్మించిన ఈ భవంతులు నాటి ఇంజనీరింగ్‌ నైపుణ్యాన్ని తెలుపుతాయి. అక్కడే నీటినిల్వ నిమిత్తం ఏర్పాటు చేసుకున్న బావి కూడా ఉంది. అయితే దీనికి నీరు ఎక్కడి నుంచి వస్తుందన్నది ఇప్పటికీ చిదంబర రహస్యమే. నెలల తరబడి ఆహారధాన్యాల నిల్వకు పెద్దపెద్ద గోదాములు, అత్యవసర పరిస్తితుల్లో రాజకుంటుంబీకులు తప్పించుకోడానికి అనువుగా నేలమాళ్గలు ఆనాటి యుద్ధతంత్రాలను మనకళ్ల ముందుంచుతాయి. ఇవన్నీ దాటితే చివరగా పెద్దమసీదును చేరుకుంటారు. కింది నుంచి చూస్తే ప్రముఖంగా కనిపించేదిదే.

ఉదయగిరి దుర్గంపై విస్తరించి ఉన్న కారడవిలో అమూల్యమైన ఆయుర్వేద వనమూలికలు లభ్యమవుతాయి. ఈ కారణంగానే దీన్ని సంజీవపర్వతం అని పిలవడం వాడుకలో ఉంది. దుర్గం చుట్టూ యాభై కిలోమీటర్ల పరిధిలో శ్రీకృష్ణదేవరాయలు 360 గుళ్ళు కట్టించారని చెబుతారు. అందులో కొన్ని శిధిలంకాగా కొన్ని నిత్యపూజలు పొందుతున్నాయి. ఉదయగిరిలో చూడదగిన ముఖ్యమైన ప్రదేశాల్లో ఎన్నదగినది రంగనాథ ఆలయం. శిధిలమైనా ఆనాటి వైభవానికి తిరుగులేని సాక్ష్యం. దండయాత్రల సమయంలో ఇక్కడి విగ్రహాన్నే రహస్యంగా పెన్నానది గుండా నెల్లూరుకు తరలించి అక్కడ ప్రతిష్టించారన్న కథ వ్యాప్తిలో ఉంది. ఉదయం ఆరింటికి దుర్గారోహణం మొదలుపెడితే సాయంత్రం నాలుగింటికల్లా తిరిగి రావచ్చు. శ్రీకృష్ణదేవరాయలు దుర్గాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు పొందిన విజయానందాన్ని ప్రతి పర్యాటకుడూ అనుభవించవచ్చు.

మూలం: ఈనాడు (ఆదివారం), 29-04-07.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: