telugudanam.com

      telugudanam.com

   

ఉడిపి

ఉడిపి

కర్ణాటక రాష్ట్రం దక్షిణ కన్నడ జిల్లాకు పశ్చిమంగా మంగళూరుకు 60 కి.మీ. దూరంలో ఉన్న ఉడిపి ఒక పుణ్యక్షేత్రం. అనేక దేవాలయాలతో, ప్రతినిత్యం లక్షలాది మముక్షువులైన యాత్రికులతో, నిత్యనూతనోత్సవాలతో కళకళాలాడుతుంటుంది. ఇచ్చటి వాతావరణం ఎప్పుడూ అనుక్షణ ప్రవర్ధమానమైన దివ్య చైతన్యంతో స్పందిస్తూ ఉంటుంది. 'ఉడుప ' (చంద్రుడు) అనే పదాన్ని అనుసరించి 'ఉడిపి' అనే పేరు ఏర్పడింది. చారిత్రక ప్రసిద్దమైన ఈ పవిత్ర యాత్రాస్ధలం పరిశుభ్రంగా చంద్రుడిలా ప్రకాశిస్తూ ఉంటుంది. అక్కడక్కడ పెద్ద పెద్ద అందమైన మామిడి తోటలతో, పనస తోటలతో సువిశాలమైన వరి పొలాలగుండా ప్రయాణంచేసే యాత్రికులకు ఇచ్చటి కొబ్బరి చెట్లు, పోకచెట్లు స్వాగతం పలుకుతుంటాయి. 13వ శతాబ్దానికి చెందిన శ్రీ మధ్యచార్యులు శ్రీ శంకరుల అద్వై తమతాన్ని, శ్రీ రామానుజుల విశిష్టాద్వైత మతాన్ని పూర్తిగా ఖండించి కొత్తగా ద్వైత మతాన్ని (మద్వ మతం) ప్రతిపాదించిన అవతారమూర్తి - వాయుదేవుడు, హనుమంతుడు, భీమసేనుల అవతారం అని ప్రతీతి. గొప్ప పండితుడైన అచ్యుత ప్రేక్షుల ఆశ్రయంలో వేదవేదాంతంగాలు అధ్యయనం చేసిన మధ్వచార్యు (వాసుదేవుడు) ల ధారణాశక్తి సునిశితమైనది. వీరి శరీరం దార్ధ్యం అసాధారణ, అపారం.

ఉడిపిభారతదేశమంతా కాలినడకన తిరిగి తన ద్వైతమతాన్ని ప్రచారంచేసి అనేక అద్వైత పండితులను ఓడించి తన శిష్యులుగా తీసుకున్నారు. వీరు ప్రతిపాదించిన వైష్ణవం 'సద్ వైష్ణవం ' శ్రీ రామానుజుల శ్రీ వైష్ణంకంటే భిన్నమైనది. ప్రాపంచిక జీవితానికి ప్రాధాన్యం ఇస్తూ జీవులలో అనేక భేదాలు ఉన్నాయని, ఆనంద స్వరూపుడైన విష్ణువూ, చైతన్యంతో గల జీవుడు, చైతన్యంలేని జడపదార్ధాలు వేరువేరని వీరు ప్రతిపాదించారు. భక్తితో శ్రీ కృష్ణ పరమాత్ముని సేవిస్తూ నీతి నియమాలతో పవిత్రంగా జీవించడమే భక్తులకు అతి సులభమైన తరుణోపాయం అని సులభంగా భోదించారు. వీరికి గల అపూర్వమైన దివ్యమహిమలతో తీవ్రమైన గాలివానకు సముద్రంలో మునిగిపోతున్న ఓడను రక్షించినప్పుడు ఆ ఓడలో నావికుడు ఒక గోపీచందనం మూటను కానుకగా సమర్పించాడు. ఆ మూటలో గోపీచందనం కణికల మధ్య వీరికొక చిన్న కృష్ణ విగ్రహం లభించింది. ఈ చిన్న విగ్రహాన్ని శ్రీ మధ్వచార్యులవారు సుమారు 800 సం. లకు పూర్వం ఉడిపి క్షేత్రంలో ప్రతిష్ఠించారు. అంత్యకులజుడైన కనకదాసు ఈ కృష్ణ దర్శనం చేసుకుని తరించాలని ప్రాధేయపడగా, పూజారులు నిరాకరించినప్పుడు, కనకదాసుకి సాక్షత్ ప్రత్యక్ష దర్శనమిచ్చిన శ్రీ కృష్ణ విగ్రహమే ఈ విగ్రహం. పరమ భక్తుడైన కనకదాసుని కరుణించి తూర్పు ముఖంగా ఉన్న కృష్ణుడు పశ్చిమాభిముఖుడై దివ్యదర్శనాన్ని సాక్షాత్కరించాడు. ఆనాడు కనకదాసుకు గవాక్షంగుండా దర్శనమిచ్చిన కిటికీలో నుంచే భక్తులు ఈనాటికి కృష్ణ దర్శనం చేసుకుంటారు. దీనినే కనకుని కిటికి అంటారు. కనకదాసు కృష్ణుని ప్రార్ధించిన చోట ఒక దివ్య మంటపాన్ని నిర్మించారు. ఇదే కనకదాసు మంటపం.

శ్రీ మధ్వాచార్యులే ఆనందతీర్ధలు. వీరు మొత్తం 37 గ్రంధాలు రచించారు. అవి: గీతా భష్యము, గీతా తాత్పర్యము, సూత్రభష్యము. అణుభాష్యము, అణువ్యాఖ్యానము,న్యాయవిచారణ, నఖస్తూతి, మహార్ణము, తంత్రసారము, సదాచారస్మృతి, యతిప్రణవకల్ప, జయంతి నిర్ణయ, భాగవత తాత్పర్య, మహాభరతి తాత్పర్య నిర్ణయ, సంహితాభాష్య, ప్రమణలక్షణ, కధాలక్షణ, ఉపాధి ఖండన, మాయావాద ఖండన, ప్రపంచ మిద్యాత్వనుమానఖండన, తత్వసంఖాన, తత్త్వవివేక, తత్త్వోద్యోత, కర్మనిర్ణయం, విష్ణు తత్త్వ వినిర్ణయ, ఇతరేయు భాష్య, తైత్తరేయభాష్య, బృహదారుణ్య భాష్య, ఈ శావాస్యభాష్య, శాఠకభాష్య, చాందోగ్యభాష్య, ఆధర్వణభాష్య, మండూక్యభాష్య, షట్ర్పశ్నభాష్య, తలవకారభాష్య! ద్వైత సిద్ధాంత స్ధాపనాచార్యులనే బిరుదును పొందిన మహనీయుడు. వీరికి పద్మనాభ తీర్ధులు. నరహరి తీర్ధులు, మాధవ తీర్ధులు, అక్షోభ్య తీర్ధులు అను నలుగురు ముఖ్య శిష్యులు.

శ్రీ కృష్ణ విగ్రహాన్ని ప్రతిష్ఠించిన ఉడిపి క్షేత్రాన్ని తన కార్యక్రమాలకు ప్రధాన కేంద్రంగా చేసుకొని శ్రీ మధ్వాచార్యులు ఎనిమిది మంది శిష్యులను ఎన్నుకుని వారికి దీక్షనిచ్చి పలుమారు మఠం (శ్రీ హృషికేశ తీర్ధులు), అదమారు మఠం, (శ్రీ నరసింహా తీర్ధులు ) కృష్ణాపురం మఠం (శ్రీ జనార్దన తీర్ధులు), శిరూర మఠం (శ్రీ వామనతీర్ధులు ) సోదెయ మఠం, (శ్రీ విష్ణు తీర్ధులు) కాణూరమఠం, (శ్రీ రామతీర్ధులు), పేజవర మఠం (శ్రీ అదోక్షజతీర్దులు) అనే ఎనిమిది మఠాలను ఏర్పరిచారు. ఈ మఠాదిపతులే ఒక్కక్కరు, రెండేసి సంవత్సరాలకొక పర్యాయం ఒకరివంతు చొప్పున కృష్ణ దేవాలయంలో పూజాది కార్యక్రమాలు, నిత్య అర్చనలు జరపాలని ఏర్పాటుచేశారు. ప్రతి రెండేసి సంవత్సరాలకు ఒకసారి ఇచ్చట జరిగే ఈ పర్యాయ మహోత్సవానికి కోటానుకోట్లు యాత్రికులు ముఖ్యంగా మాధ్వలు (ద్వైత మతానుయాయలు) వస్తారు.

ఉడిపిఉడిపి క్షేత్రంలో 'మధ్వసరోవర ' మహోత్సవం చాలా ముఖ్యమైనది. ఆ తిరునాళ్ళకు వేలాది యాత్రికులు దానిని సందర్శిస్తారు. ప్రాచీన భారతీయ సంస్కృతి కన్నులకు కట్టినట్లుగా ఉంటుంది. కన్నడ జానపద నృత్య నాటిక సంబందమైన యక్షగానాలను ప్రత్యేకంగా ప్రదర్శిస్తారు. యాత్రికులు దివ్యచైతన్యంతో ఆనందానుభూతిని పొందుతారు. ఉడిపి కి 5మైళ్ళు దూరంలో కొండమీద ఉన్న మణిపాల ఆహ్లాదకరమైన స్వర్గధామం. ఇచ్చటి నెహ్రూ మెమోరియల్ లైబ్రరీ, అపూర్వమైన అనాటమీ మ్యూజియం సౌకర్యంతో కస్తూర్బ మెడికల్ కాలేజీ, భారతదేశంలో సుప్రసిద్ధమైన ఆరోగ్య కేంద్రం మొదలెన వాటిని చూస్తుంటే యాత్రికులకు సస్యశ్యామలమైన దివ్య ప్రపంచంలో నుంచి ఒక్కసారిగా స్వప్న ప్రపంచంలోకి దిగినట్లు అనిపించక మానదు. ఉడిపికి చేరువగా 3 మైళ్ళ దూరంలోగల మాల్పె బీచ్ మద్రసు 'మెరీనా బీచ్' ని మించి ఉంటుంది. అనేకమంది కవులకు, రచయితలకు, కళాభిజ్ఞులకు ఉత్తేజాన్నీ, విలాసాన్ని కలిగించి యాతనామయమైన ప్రాపంచిక జీవితాన్ని మరిపిస్తున్న బీచ్ ఇది.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: