telugudanam.com

      telugudanam.com

   

అసూయ - అనారోగ్యం

అసూయ అన్నది ఎంత మోతాదులో ఉన్నా అది విషంలా పనిచేస్తుంది. అంతేకాదు అది మన మానసిక అరోగ్యంపై దెబ్బతీస్తుంది. దయాగుణం మనకు రెండింతల ఆశీర్వచనాలను అందజేస్తుంది. కాని అసూయ గుణం మనకు రెండింతల హానిని కలిగిస్తుంది.

మన నిజజీవితంలోనూ, పుస్తకాలలోనూ అసూయ వల్ల గలిగే నష్టాలను చూస్తూనే ఉన్నాము. తొలుత ఇది అతి చిన్న భావనగా మొలకెత్తుతుంది. ఆ తరువాత ఇది పెరుగుతూ వస్తుంది. ఆ కారణంగా మనం చెప్పలేనన్ని కష్టాలకు గురి అవుతుంటాము. అసూయ అన్నది ఒక బలహీనత. పరిస్థితులు ఎటువంటివైనా మనం అసూయను సమర్ధించకూడదు. ఇది ముమ్మాటికి మనకు ఇంటాబయటా హానిని కలిగిస్తుంది.

ఈ అసూయ అన్నది ఎలా పుట్టుకొస్తుంది? ఇతరులతో సరితూగనప్పుడంతా ఆ భావన మనలో అసూయకు జన్మనిస్తుంది. అవతలి వాడి వద్ద ఉన్న గుణం లేదా వాస్తవం మీలో లేదన్న భావన వల్ల అసూయ మనసులో జనిస్తుంది. ఆ కారణంగానే మీరు అవతలి వ్యక్తిని చూసి అసూయపడడం జరుగుతుంది. అవతలి వ్యక్తి మీకంటే అందంగా ఉన్నాడనుకోండి లేదా సాంఘికంగా మీకంటే కూడా హెచ్చు పదవిలో ఉన్నారనుకోండి, లేదా మీ కంటే కూడా ఎక్కువ పేరు ప్రఖ్యాతులను సంపాదించాడనుకోండి లేదా మీ కంటే కూడా ఎక్కువగా చదువుకున్నవాడనుకోండి అసూయ మీలో పుట్టుక వస్తుంది. అసమానత్వం, అన్యాయానికి దారి తీస్తున్నప్పుడు ఆ అసమానత్వాన్ని తప్పకుండా దూరం చేసుకోవాలి. కాని చాలా వరకు అసమానత్వాలన్నవి స్వాభావికమైనవి. అందులో ఎలాంటి అన్యాయానికి చోటు ఉండదు. అప్పుడప్పుడు సరిసమానత్వం లేకుండా ఉండడం అన్నది ప్రకృతికి ఆహ్లాదాన్ని ఇస్తుంది. అందుకే మనం లోకోభిన్నరుచిః అంటాము. తెలుగులో వివిధ తత్వంలోనే జీవితసారం దాగుందని అంటుంటాము.

మీ చేతి ఐదు వేళ్ళను చూసుకోండి. ఒక వేలుకు మరొక వేలుకు ఎలాంటి సామ్యం ఉండదు. అంతమాత్రాన ఒక వేలు మరొక వేలును చూసి అసూయ పడదు. అదేవిధంగా మనిషి రంగు కూడా మనల్ని బాధ పెట్టే విషయం కాకూడదు. శ్రీకృష్ణుడు నలుపు. నలుపు నారాయణుడు మెచ్చు. అన్న సామెత కూడా ఉంది. ఆ కారణంగానే కృష్ణుడు నల్లగా ఉన్నాసరే ఆడ, మగ, చిన్నా పెద్దా, వయసులో ఉన్నవారు వయసుమళ్ళినవారూ అందరూ అతని ప్రేమలో పడ్డారు. అతడు మొత్తం మానవాళికి ప్రియమైన వ్యక్తి.

గ్రీసుదేశానికి చెందిన సోక్రటీసు పొట్టిగా, లావుగా ఉండేవాడు. అతడికి చప్ప ముక్కు ఉండేది. అయినా ప్రపంచపు అతిపెద్ద మేధావులు అతడి వద్ద కూర్చుని పాఠాలను నేర్చుకున్నారు.అమెరికా దేశపు నాయకుడు అబ్రహాంలింకన్ బక్క పలచగా ఉండేవాడు. కానీ మొత్తం ప్రపంచం అమెరికా సమ్యుక్త రాష్ట్రాలను ఒకటి చేసిన వ్యక్తిగా అతడిని గుర్తించింది. గ్రీసుదేశానికి చెందిన హొమర్ కవి గుడ్డివాడు. అలాగే 40 సంవత్సరాల వయసులో ఇంగ్లాండుకు చెందిన మహాకవి మిల్టన్ కూడా గుడ్డివాడయ్యాడు. కాని ఈ రోజు యూరప్‌కు చెందిన కవులలో వీరిద్దరినీతప్ప మరెవ్వరిని మనం గొప్ప కవులుగా పరిగణించడంలేదు.

పొట్టిగా ఉన్నంత మాత్రాన సామర్ధ్యం అతడిలో తక్కువగా ఉంటుందని భావించకూడదు. ఏసుక్రీస్తు, గౌతమ బుద్ధుడు, గాంధీ మొదలైన నాయకుల వద్ద ఆర్ధిక వనరులు ఉండేవికావు. కానీ ఈ ముగ్గురు ప్రపంచశాంతికి చాలా ఎక్కువగా దోహదం చేసారు. శ్రీరమకృష్ణ పరమహంసకు శ్రీ శారదాదేవికి అక్షరం ముక్కరాదు. కానీ వారి నోటి నుండీ అమృతతుల్యమైన ప్రవచనాలు ప్రవహించాయి.

మీ దగ్గర లేనిది అవతలివాడి వద్ద ఉన్నదని అసూయపడకుండా భగవంతుడు మీకు ప్రసాదించిన తెలివితేటలను ఎంత ఉత్తమంగా మీరు వాడుకోగలరో అంత ఉత్తమంగా వాడుకోండి. చిన్న బుద్ధిగల వారే అసూయతో కృంగిపోతారు. మీ మనసు పరిపక్వ దశకు చేరినప్పుడు, మీలో ఉన్న గొప్పగుణమును అభివృద్ధి పరచడానికి అది ప్రయత్నిస్తుంది. అప్పుడు ఇతరులను చూసి అసూయపడడానికి కావలసిన సమయంగానీ, శక్తిగానీ, మీలో ఉండవు.

అసూయ అన్నది వక్రగుణం. సక్రమమైన గుణాన్ని అభివృద్ధి పరుచుకోవడమే అసూయను దూరం చేసుకునే ఉత్తమ మార్గం. మంచిగా ఉంటూ, గొప్పగా ఉండడం అన్నది అసూయలేకుండా ఉండడం అవుతుంది.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: