telugudanam.com

      telugudanam.com

   

యోగ

సంస్కృతీ, సంప్రదాయాలకు నిలయమైన భారత దేశానికి అత్యంత ప్రాచీనమైన సంపద యోగ.భారత సంతతికి వంశపారంపర్యంగా, గురూపదేశంగా నేటికీ విడువకుండా అనుసరిస్తూ వస్తున్న ఏకైక హృదయ తరంగమిది. ఇది భారత ఋషుల అద్భుత సృష్టి. ఈ సృష్టికి 5 వేల సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది. మనసుని అధీనంలో ఉంచుకోవడం ద్వారా ప్రాణ శక్తిని పెంపొందించడమనే ఈ ప్రక్రియ అద్భుతాలలోకెల్లా అద్భుతం. ఎటువంటి ఔషధాలూ, శస్త్ర చికిత్సలూ అవసరం లేకుండా కేవలం చిన్న చిన్న వ్యాయామాల ద్వారా దీర్ఘకాలిక రోగాలనుండి విముక్తులు కావడం వైద్య శాస్త్ర రంగానికి ఓ చాలెంజ్.

క్రమశిక్షణతో కూడిన ఆరోగ్యాన్ని అలవరచుకోవడానికి యోగ అనువైన విధానం. ప్రత్యామ్నాయ వైద్య విధానంగా అమిత ప్రాచుర్యంలో ఉన్న యోగ నియమబద్ధమైన ఆహారం, అలవాట్లు ఉన్నవారికే సాధ్యం. సహజసిద్ధమైన ఆహారం యోగా అభ్యాసకులకు అతి ముఖ్యం. తీపి పదార్ధాలు, రసాయనాలు కలిపిన పదార్ధాలు వీరికి నిషిద్ధం. వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వ్యసనాలకు కూడా దూరంగా ఉండాలి. నేటి ఆధునిక జీవనం ఇందుకు ఏమాత్రం అనువుగా లేకపోవడంతో యోగ సాధన కష్టసాధ్యమైనా, యోగానే జీవన విధనంగా ఎంచుకుంటే ఎవరి ఆరోగ్యం వారి అధీనంలోనే ఉంటుంది.

ఆసనం అంటే?

ఆసనం పుట్టుక గురించి మూలాధారాలు లేవు. మనిషి పుట్టిన నాటినుంచి అది ఉంది. ఉయ్యాలలోని పసిబిడ్డ చేసే విన్యాసాలు కూడా ఆసనం క్రిందే వస్తాయి. మనిషి శారీరకంగా వ్యక్తపరచే ఏ భంగిమనైనా ఆసనం అనవచ్చు. ఐతే ఆ భంగిమలు ఒక క్రమపద్ధతిలో ఉండాలి. వాటికి తగినంత వ్యాయామం ఉండాలి. ఆసనాలు ఎన్ని అనడంలో భేదాభిప్రాయాలున్నా మనిషి సంపూర్ణ ఆరోగ్యవంతుడు కావడానికి కనీసం 25 ఆసనాలైనా వేయడం ఉత్తమమని యోగ పండితులు చెబుతారు. వాటిలో పద్మ, చక్ర, సర్వాంగ, హల, ధను, మయూర,పశ్చిమోత్తన, శీర్ష, శవాసనాలు తప్పకుండా వేయాల్నిన ఆసనాలు.

భగవద్గీతలో శ్రీ కృష్ణ పరమాత్మ, ఉపనిషత్తులలో మహర్షులు అత్యంత యోగ విజ్ఞానాన్ని అందించారు. యోగాలలో కూడా పలు రకాలున్నాయి. అవి రాజ యోగము, హఠ యోగము, కర్మ, భక్తి, ధ్యాన, జ్ఞాన యోగము...ఇంకా అనేకం. రాజ యోగాన్ని శ్రేష్టమైనదిగా చెబుతారు. యోగాసనాలతోపాటు నేతి, ధౌతి, భస్తి, త్రాటకం, కపాలభాతి మొదలైన హఠ యోగ క్రియలు కూడా నేడు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కానీ వీటిని అభ్యసించేవారు చాలా తక్కువ.యోగాసనాలు ఎందుకు వేయాలి?

మానవ శరీరం మాలిన్యాల పేటికలాంటిది. దాన్ని ఎప్పటికప్పుడు శుభ్రపరుచుకుంటూ ఉండాలి. మాలిన్యాలే అనారోగ్యానికి మూలకారణం. వాటిని నిర్వీర్యం చేయనిదే ఆరోగ్యం సాధ్యం కాదు. మాలిన్యాల నిర్మూలకు యోగా చక్కని పరిష్కారం. యోగ వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అందువల్ల పెద్దగా కష్టపడనవసరంలేని యోగాసనాలు చేయడం ప్రతి ఒక్కరికీ అవసరం.

అర్హత?

వయసుతో నిమిత్తం లేదు. పసిపిల్లాడినుంచి పండు ముదుసలి వరకు అందరూ అర్హులే. దీనికి స్త్రీ, పురుష విచక్షణ అంతకంటే లేదు. శారీరక దృఢత్వంతో అవసరం లేదు. పరికరాల ఊసే లేదు. ఒక్క రూపాయి ఖర్చు కూడా కాదు. అందరూ అర్హులే. అంతటా అర్హతే.

యోగ చికిత్స అంటే ఆసనాలు, ప్రాణాయామ పద్ధతులు, ముద్రలు, బంధాలు, క్రియల సహాయంతో ఆరోగ్యవంతులను చేసే విధానం. పతంజలి మహర్షి 195 సూత్రాలను "యోగ సూత్రాలు" అనే గ్రంధంలో క్రోడీకరించాడు. ఒక్కో యోగాసనం ఒక్కో అనారోగ్యాన్ని నయం చేస్తుంది. దీర్ఘకాలిక రోగాలకు దీనిని మించిన చికిత్స లేదు. కాబట్టే ఇప్పుడు ప్రజలు ఎక్కువగా యోగ థెరపివైపు మొగ్గుచూపుతున్నారు. యోగ అంటే ప్రకృతికి సన్నిహితంగా సహజీవనం చేయడమే. ప్రకృతి వైద్య విధానంలో ఇది ఒక భాగం. సహజసిద్ధమైన ఆరోగ్యానికిది ఇది చక్కని మార్గం. స్థూలకాయం, మధుమేహం, రక్త పోటు, ఉదరకోశ వ్యాధులు, మలబద్ధకం, కీళ్ళు మరియు నడుము నొప్పులు రాకుండా ఉండాలంటే యోగా ఒక్కటే మార్గమని అనుభవపూర్వకంగా తెలుస్తోంది. యోగా ద్వారా ఆరోగ్యమే కాదు, ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది కాబట్టి కాబట్టి వెంటనే ప్రారంభించడం ఉత్తమం.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: