telugudanam.com

      telugudanam.com

   

పిల్లల ఆటలు (కొన్ని)

అయిస్ - బాయ్

ఎంతమంది ఆడవచ్చు : పది మందిలోపు పాల్గొనవచ్చు.

ఈ ఆటలో ముందుగా పంటలేసి దొంగైన బాలుడు 15 లేదా 20 అడుగుల దూరం వెళ్ళాలి. ఈ లోగా ఆటగాళ్ళు దూరంగా వెళ్ళి దాక్కుంటారు. దొంగయిన బాలుడు వెనక్కి తిరిగి ఆటగాళ్ళ కోసం వెతకడం ప్రారంభిస్తాడు. ఎవరైనా కనిపిస్తే అతని పేరు చెప్పి అయిస్ బాయ్ అంటే చాలు అతను దొంగయిపోయినట్టే. అదే దొంగకు కనిపించకుండా అతని వెనుక నుండి వీపు మీద చిన్నగా తట్టి అయిస్ బాయ్ అంటే దొంగ మళ్ళీ వెనక్కి వెళ్ళి రావాలి. ఇలా ప్రతిసారి జరుగుతూనే ఉంటుంది.


[ వెనుకకు ]


అవ్వా - అప్పచ్చా

ఎంతమంది ఆడాలి : ముగ్గురు ఆడాలి.

ముగ్గురు పంటలెయ్యాలి. ముందుగా ఎవరు పండితే వారు అతన్ని ఏనుగు మీద ఎక్కించాలి. మరి ఏనుగేది. మిగతా ఇద్దరూ ఏనుగుగా మారతారన్నమాట. ఎలాగంటే - ఇద్దరూ ఎదురెదురుగా నిలుచుని తమ కుడి అరచేతులను పైకి లేపి నిచ్చెన కట్టాలి. ఎదురు బాలుడు కూడా అలాగే కట్టాక ఇద్దరు చేతులు కలుపుతారు. ఇప్పుడు ఆ నిచ్చెన ఏనుగు అన్నమాట. పండిన బాలుడు చేతుల మధ్య కూర్చుండ బెట్టుకొని పైకి లేపి, వూరేగించాలి. అప్పుడు ఇలా పాడాలి.

ఏనుగమ్మ ఏనుగూ, ఏనుగు ఒళ్ళు నల్లనా

ఏనుగు కన్నులు తెల్లనా, ఏనుగు మీద రాముడు ఎంతో చక్కని దేవుడు.

చివరి దాకా తీసుకెళ్ళి అక్కడ దించాలి. ఇప్పుడు రెండవ బాలుడు, తర్వాత మూడవ బాలుడు ఇలా వూరేగుతారు.


[ వెనుకకు ]

అష్ట చెమ్మ


ఎంతమంది ఆడవచ్చు : ఇద్దరు లేదా నలుగురు లేదా, రెండు జంటలు ఎదురెదురుగా కూర్చొని ఆడతారు.

గవ్వలు గాని, చింతపిక్కలు గాని, అరగదీసి గాని పిక్కలను కుదిపించి ఆడాలి. పిక్కలను సమయోచితంగా కదుపుతూ, ఎదుటి వ్యక్తి పిక్కలను చంపుతూ ముందుకు దూసుకుపోవటం విజేతలక్షణం. అష్ట (అన్నీ నలుపులు) పడితే చనిపోయిన పిక్కలు రెండు వచ్చేస్తాయి. చెమ్మా (అన్నీ తెలుపులు) పడితే ఒక పిక్క వచ్చేస్తుంది. ఇది భలే పసందైన ఆట.


[ వెనుకకు ]


ఏడు పెంకులు

ఎంతమంది ఆడవచ్చు : 12 మంది ఆడవచ్చు.

ఈ ఆటలో రెండు గ్రూపులు ఉండాలి. ఒక్కో గ్రూప్ లో ఆరుగురు చొప్పున రెండు గ్రూపులలో పన్నెండు మంది ఆడాలి. ఇద్దరు లీడర్లు తమ రెండు గ్రూపులకు కావలసిన వారిని కోరుకుంటారు. తరువాత 7 పెంకులను నేల మీద ఒక దాని మీద ఒకటి పేరుస్తారు. అటు వైపు ఒక గ్రూపు, ఇటు వైపు ఒక గ్రూపు నిలబడతారు. అచ్చు వేసి ముందుగా నెగ్గిన వారు బంతితో ఆ ఏడు పెంకులను కొడతారు. ఇంకో బ్యాచ్ వారు ఆ బంతిని వేస్తే మొదటి గ్రూపు వాళ్ళు క్యాచ్ పట్టుకోవాలి. క్యాచ్ పట్టుకొంటే అతను అవుట్. అప్పుడు మిగతా వాళ్ళు బాల్ వేయాలి. మొత్తం ఎవరూ పెంకులను కొట్టలేకపోతే రెండవ గ్రూపు వాళ్ళు బాల్ తో పెంకులను కొడతారు. ఇప్పుడు ఇవతలి గ్రూపు వారు బంతిని క్యాచ్ చేస్తారు. బంతి పెంకులకు తగిలి అవి చెల్లాచెదురై పోతే బంతిని అప్పుడే క్యాచ్ చేస్తే మొత్తం టీం అంతా అవుటయి పోతుంది. అలా క్యాచ్ చేయలేకపోతే పెంకులను కొట్టిన గ్రూపు వాళ్ళు బంతికి దూరంగా పారిపోయి మెల్లగా నక్కుతూ పెంకులను ఒకదానిమీద ఒకటి పేరుస్తారు. వాళ్ళు పెంకులను పేర్చనివ్వకుండా అవతల గ్రూప్ వాళ్ళు వీళ్ళను బాల్తో కొడుతుండాలి.


[ వెనుకకు ]

కర్రా బిళ్ళా

ఎంతమంది ఆడవచ్చు : ఇద్దరు.
కావలసిన వస్తువులు : సుమారు 4 అంగుళాలు ఉన్న కర్రముక్క, ఇంచుమించు ఒకటిన్నర అడుగు పొడవైన కర్ర ఒకటి.

వీటిలో చిన దానిని "బిళ్ళ" అని పెద్ద దానిని "కర్ర" అని అందురు. అందువల్లనే ఈ ఆటకు కర్ర బిళ్ళ అని పేరు వచ్చింది. నేలమీద చిన్న గుంట తవ్వి ఈ కంచా మీద బిళ్ళను ఉంచి కర్రతో ఎగుర కొట్టుచుందురు. దీనిని "గూటుట" అందురు. ఒకరు బిళ్ళను గూటునప్పుడు రెండవ వాడు కంచాకు కొంత దూరంలో నిలబడి బిళ్ళ క్రింద పడకుండా పట్టుకోవలెను. అలా పట్టుకోగలిగితే బిళ్ళను గూటినవాడు ఓడినట్టు. అలా పట్టుకోలేకపోతే బిళ్ళ పడిన స్థలం దగ్గర నుంచి దానిని తిరిగి కంచా దగ్గరకు విసురును. విసరినప్పుడు కంచాను బిళ్ళ ఉన్న స్థలాన్ని కర్రతో కొలవగా ఆ దూరం కర్ర కంటే ఎక్కువదూరం ఉంటే ఆట సాగించవచ్చు. తక్కువ వుంటే గూటిన వాడు ఓడిపోయినట్లే. ఒక కర్ర పొడవు కంటే ఎక్కువ ఉన్నప్పుడు గూటిన వాడు ఆ బిళ్ళ చివరను కర్రతో కొట్టి అది పైకి లేచినప్పుడూ దూరమునకు పోవునట్లు దానిని కర్రతో కొట్టి విసరును. ఈ విధంగా మూడు పర్యాయములు కర్రతో బిళ్ళను కొట్టి మూడవసారి కొట్టినప్పుడు బిళ్ళ పడిన స్థలం నుంచి కంచా వరకు గల్ల దూరాన్ని కొలువ వలెను. పది కర్రల పొడవును "లాల" అందురు.ముందు నుండి కొలుచుట, వెనుక నుంచి కొలుచుట అని లాలలు కొల్చుట రెండు విధములు. కంచాకి ఎదురు వైపుగానున్న కొన ముందరి కొన అని, రెండవది వెనుక కొన అని భావన. ఏ కొన నుండి కొలుచుట అనేది వారిష్టం. వారి ఇద్దరి అంగీకారము పై ఆధారపడును. గూటిన వాడు కొలిచే ముందు ఆ దూరము అంచనాగా ఎన్ని లాలలుండునో చెప్పును. అంత కంటే ఎక్కువ ఉన్న వాడు ఓడినట్లు. "లాల" లెక్క పెట్టుట ఒకటి, రెండు, అని కాక కండి, రెళ్ళ, మూళ్ళ అని గాని, అనేక రకాలుగా, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రీతిగా, లెక్క పెట్టుదురు. అలా లెక్క పెట్టినప్పుడు ఎన్ని లాలలుంటే అన్ని సార్లు ఓడిపోయిన వారు ఒంటి కాలితో గెంతుతూ కూత పెడుతూ బిళ్ళ పడిన స్థలం నుంచి కంచా వరకు, కంచా నుంచి బిళ్ళ వరకు పోవలెను. కూత మధ్యలో ఆపినచో ఆపిన స్థలం దగ్గిర నుండి వెనుకకు కొట్టుదురు. అలా వెనుకకు బిళ్ళను కొట్టుటను "చెప్పు దెబ్బ కొట్టుట" అందురు. తిరిగి బిళ్ళ పడిన దగ్గర నుంచి గెంతటం మొదలు పెట్టవలెను.


[ వెనుకకు ]

కాళ్ళ గజ్జ కంకాళమ్మ

ఎంత మంది పాల్గొనవచ్చు : నలుగురు.

ఎక్కువగా ఆడపిల్లలు ఈ ఆటను ఆడతారు. ముందుగా పిల్లలు కింద కూర్చుని తమ కాళ్ళను బారచాపాలి. అనంతరం గ్రూప్ లీడర్ మొదట కూర్చున్న ఆటగాడు ఆటగత్తెల మోకాళ్ళ మీద చెయ్యి వేసి దాన్ని వరుసగా అందరి కాళ్ళ మీదకు జరుపుతూ ఇలా పాట పాడతారు. కాళ్ళ గజ్జ కంకాళమ్మ, వేకువ చుక్క వెలగ మొగ్గ, కాళ్ళూ తీసి పక్కన పెట్టు" ఇలా చివరి పదం ఏ కాలు వద్ద ఆగిందో ఆ కాలుని ఆ ఆటగాడు మడిచేయాలి. మరలా పాట ప్రారంభించి పైన చెప్పినట్టు పాడాలి. చివరి పదం ఏ కాలి వద్ద ఆగితే ఆ కాలుని మడిచేయాలి. అందరి కాళ్ళు మడిచేయగా చివరగా మిగిలిపోయిన ఆటగాడు గెలిచినట్లు.


[ వెనుకకు ]

కుంటుళ్ళు

ఎంతమంది ఆడవచ్చు : అయిదుగురు నుంచి ఎంతమందైనా ఆడవచ్చు.
ఏ వయస్సువారు : 12 సంవత్సరాలలోపు వారు.

ముందుగా పంటలు వేసుకున్నాక అందరూ పండిపోగా మిగిలిన వారు దొంగవుతారు. దొంగయిన బాలుడు/ బాలిక కుంటుతూ గెంతుతుంటే మిగతా వారు అతన్ని ఆటపట్టిస్తూంటారు. అతని వెనుకగా వెళ్ళి వీపుని తట్టి వంకాయ్, టెంకాయ్, ములకాయ్, దోసకాయ్ ఇలా రకరకాల పేర్లతో పిలుస్తూ నన్నంటుకో అంటుంటారు. దొంగైన వారు కుంటుతూనే వారిని అంటుకోవాలి. కాలు క్రింద పెట్టకూడదు. ఎవరిని అంటుకుంటే వారు దొంగ. వారు కుంటుతూ మిగతా వారిని అంటుకోవాలి. ఇలా సాగిపోతూ వుంటుంది.


[ వెనుకకు ]

గాలిపటాలు

కావలసిన వస్తువులు : రంగు కాగితాలు, జిగురు , చీపురుపుల్లలు, గాలిపటాలకు వాడే దారం ఇవన్ని పచారి షాపులో అమ్ముతారు.

రంగురంగుల కాగితాలను చతురస్త్రాకారంగా చేసి వాటిని ఒక సూత్రం ప్రకారం కట్టాలి. అప్పుడే ఈ గాలి పటాలు చక్కగా ఎగురుతాయి. వీటికి తోకలు కూడా ఉంటాయి. ఆటగాళ్ళంతా ఈ గాలి పటాలకు దారాలను కట్టి గాల్లో ఎగురవేస్తారు. ఎవరు ఎక్కువ దూరం ఎగుర వేస్తారో వారు గెలిచినట్లు.


[ వెనుకకు ]

చికు చికు పుల్లాట

ఆడేవారు : ఇద్దరు.
ఆటస్థలం : ఆరుబయట ఇసుక ఉన్న చోట.

ఇసుక ఉన్న చోట కూర్చొని ఆడే ఆట ఇది. చిన్న చీపురు పుల్లని విరచి దాన్ని అరచేతిలో పెట్టుకొని ఇసుకలో దాచేయ్యాలి. పుల్ల ఇసుకలో పెడుతూ ఇలా పాడాలి. "చికు చికు పుల్లా చికారు పుల్ల దానిమ్మ చెట్లో దాక్కో పుల్ల". తరువాత అవతలివారు తన రెండు అరచేతులు కలిపి పుల్ల ఫలానా దగ్గర వుందని గ్రహించి దానిపై అరచేతులను వేస్తారు. ఇప్పుడు పుల్లను ఇసుకలో దాచిన వ్యక్తి దాన్ని వెతుకుతాడు. పుల్ల ఇతనికే దొరికితే ఇతను గెలిచినట్టు. పుల్ల ఎదుటి వ్యక్తి చేతుల కింద ఉంటే అతను గెలిచినట్టు. గెలిచిన వారు పుల్లతో ఆటను ప్రారంభించాలి. ఇలా ఆట సాగిపోతూ వుంటుంది.


[ వెనుకకు ]

చెప్పింది చెయ్యి

ఎంతమంది ఆడవచ్చు : ఎంతమందైనా ఆడవచ్చు.

ఈ ఆటలో లీడర్ ఉండాలి. లీడర్ ముందుగా చిన్న చిన్న తెల్ల కాగితాలపై రకరకాల పనులు రాసి మడత పెట్టాలి. అంటే ఒక దాంట్లో పాట పాడాలి, రెండవ దాంట్లో పకపకానవ్వాలి, వరుసగా కుంటుకుంటూ రావాలి, బ్రహ్మానందం లాగా మాట్లాడాలి., బాలకృష్ణ లాగా డైలాగ్ లు చెప్పాలి అని రాయాలన్నమాట. కూర్చున్న పిల్లలందరికి తలొకటి ఇచ్చి అవి విప్పి లోపల ఉన్నది చెప్పి వరుసగా అవి చేయ్యాలని చెప్పాలి. ఒక అమ్మాయికి మగాడిలా షేవింగ్ చేసుకోవాలి అని అందులో ఉంటే షేవింగ్ చేస్తున్నట్లు నటించాలి. మగపిల్లాడికి వంట చేయమని వస్తే వంట చేస్తున్నట్లు నటించాలి. భలే సందడిగా నవ్వులతో హోరెత్తిపోతుంది. ఒక సారి ప్రయత్నం చేసి చూద్దామా!


[ వెనుకకు ]

చెయిన్ కట్

ఎంతమంది ఆడవచ్చు : ఐదుగురు ఆడవచ్చు.

అందరూ పంటలు వేశాక ఒకరు దొంగవుతారు. దొంగ మిగతా ఆటగాళ్ళ వెనుక పరిగెట్టి పట్టుకోవాలి. అయితే కేవలం చేతిని మాత్రమే పట్టుకోవాలి. దొంగ మరొకరి చేతిని పట్టుకోగానే అతను కూడా దొంగవుతాడు. ఇప్పుడు ఇద్దరూ కలిసి మిగతా వారిని పట్టుకోవాలి. చేతులు మాత్రం పట్టుకునే వుండాలి. మూడో వాడు దొరికితే అతని చేతిని కూడా పట్టుకొని పరుగెత్తాలి. ఇలా అందరినీ పట్టుకోవాలి. అయితే ఎవరయినా చేయి వదిలేస్తే అతనొక్కడే దొంగవుతాడు.

[ వెనుకకు ] [ ముందుకు ]

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: