telugudanam.com

      telugudanam.com

   

పిల్లల ఆటలు (కొన్ని)

ముక్కుగిల్లే ఆట

ఎంతమంది ఆడవచ్చు : 10 లేక 16 మంది ఆడవచ్చు.

పిల్లలందరూ రెండు జట్లుగా ఏర్పడి ఎదురెదురుగా కూర్చుంటారు. ఒక్కొక్క జట్టుకు ఒక్కో నాయకుడుంటాడు. ఉన్న నాయకుడు తమ తమ పిల్లలకు చెవిలో రహస్యంగా ఎవరు వినకుండా మారు పేర్లు పెట్టుకొని, ఆ పేర్లను బాగా గుర్తుంచుకుంటారు. మారు పేర్లు అనగా మామిడి పండు, చందమామ, మల్లె మొగ్గ ఇలా ఏదైనా పెట్టుకుంటారు. మొదటి జట్టు నాయకుడు రెండవ జట్టులోని పిల్లల వద్దకు వచ్చి అందులో ఒకరికి కళ్ళుమూసి, తన జట్టులోని ఒక పేరు చెప్పి తాను కళ్ళు మూసిన వాని ముక్కు గిల్లి పొమ్మంటాడు.


ఉదా : చందమామ చందమామ ముక్కు గిల్లి పోవే" అని లయబద్దంగా పిలుస్తారు. వెంటనే ఆ పేరు గల వాడు మెల్లగా వచ్చి ముక్కు గిల్లి పోయి తన ప్లేసులో కూర్చుంటాడు. కళ్ళు అడ్డు తెరవగానే ముక్కు గిల్లిన జట్టులోని వాళ్ళందరూ నవ్వుతూ చప్పట్లు కొడతారు. తరువాత కళ్ళు మూయించుకున్నవాడు తన ముక్కు ఎవరు గిల్లారో కనుక్కోవాలి. కనుక్కుంటే ముక్కు గిల్లినవాడు వచ్చి ఈ జట్టులో చేరి పోతాడు. ఈ సారి రెండవ జట్టు నాయకుడు వచ్చి మొదటి జట్టు పిల్లలలో ఒకరికి కళ్ళు మూసి తన జట్టులోని పిల్లలను పిలిచి "ముక్కుగిల్లిపో" అని ఆటను కొనసాగిస్తాడు. ఇలా ఆడేటప్పుడు కొందరి పేర్లు తెలసిపోతాయి. ఆ జట్టులోని వారు ఈ జట్టులోకి వస్తారు. కాబట్టి ఎప్పట్టికప్పుడు కొత్త పేర్లు పెట్టుకోవాలి. జట్ల నాయకులు కొంత నిర్దిష్ట సమయం తరువాత ఏ జట్టులో ఎక్కువ మంది పిల్లలుంటే ఆ జట్టు గెలచినట్లు.


[ వెనుకకు ]

మ్యూజికల్ ఐటమ్

ఎంతమంది ఆడవచ్చు : ఆరు నుంచి ఎంతమందైనా
కావల్సిన వస్తువులు : బంతి, రింగు, దిండు ఏదైనా ప్లాస్టిక్ వస్తువు
కావలసిన పరికరాలు : ఒక టేప్ రికార్డర్, క్యాసెట్లు

ఆటగాళ్ళు కింద గుంపుగా కూర్చోవాలి. టేప్ రికార్డర్ ఆన్ చేయగానే పాట ప్రారంభం అవుతుంది. వెంటనే బంతినో, రింగునో, దిండునో విసురుతూ ఉండాలి. ఇలా వస్తువు రౌండ్ తిరుగుతూ ఉంటుంది. లీడర్ పాటను ఆపాలి. అయితే వస్తువు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు ఓడిపోయినట్టు. వాళ్ళు బయటకు వచ్చేయాలి. మరలా ఆటను ప్రారంభించాలి. ఈ సారి ఇంకొక ఆటగాడు అవుటయి పోతాడు. ఇలా చివర మిగిలిన వ్యక్తి విజేతగా నిలుస్తాడు.


[ వెనుకకు ]

రాముడు - సీత - లక్ష్మణుడు - శతృజ్ఞుడు - భరతుడు - హనుమంతుడు ఆట

ఎంతమంది ఆడవచ్చు : 3 నుంచి 6 గురి వరకు ఆడవచ్చు
కావల్సిన పరికరాలు : ఒక చార్టు, ఆరు కాగితం ముక్కలు

ఒక్క కాగితం మీద రాముడు - 1000, సీత -0, లక్ష్మణుడు - 500, భరతుడు - 400, శతృజ్ఞుడు - 300, హనుమంతుడు - 400 అని రాయాలి. చార్టు మీద ఆటగాళ్ళ పేర్లు రాసి వుంచాలి. కాగితాలను గుండ్రంగా చుట్టాలి. ఆటగాళ్ళు చుట్టూ కూర్చొని అన్ని రౌండ్లను నేల మీద వేయాలి. వెంటనే ఎవరి ఇష్టం వచ్చిన కాగితం రౌండ్ ని వారు తీసుకుంటారు. ఆ రౌండ్ ని తెరచి చూస్తారు. రాముడెవరో ముందు చెప్పాలి. ఆ రాముడు సీత ఎవరో అంతమందిలో కనుక్కోవాలి. కరెక్టుగా కనుక్కుంటే అతనికి 1000 మార్కులు వేస్తారు. తప్పు చెబితే అతనికి "0" మార్కులు. సీత కాగితం వచ్చిన వారికి 1000 మార్కులు పడతాయి. మిగతా వారికందరికీ వారి వారి మార్కులు వెయ్యాలి. 10 ఆటలలో ఎవరికి ఎక్కువ మార్కులు వస్తే వారు విజేత.


[ వెనుకకు ]

వంగుళ్ళు - దూకుళ్ళు

ఎంతమంది ఆడవచ్చు : 5 గురు నుంచి 10 మంది వరకు
ఆడే స్థలం : ఖాళీ స్థలం

ముందుగా పంటలు వేసి మిగిలిపోయిన బాలుడు దొంగవుతాడు. దొంగైన బాలుడు వంగుని నించోవాలి. అతని మీద నుంచి మిగతా ఆటగాళ్ళంతా దూకుతూ ఉండాలి. దూకేటప్పుడు దూకేవాళ్ళ కాళ్ళు గాని, శరీరంలోని ఏ భాగమైన గాని వంగివున్న బాలుని తగలరాదు. ఇలా ఎత్తులు పెంచుతూ దూకుతుండాలి. దూకలేని వారు దొంగవుతారు. అప్పుడు అతను వంగుతుంటే మిగతా వారు దూకాలి.ఇలా ఆట మరల ప్రారంభం అవుతుంది.


[ వెనుకకు ]

వాసన కనుక్కోవడం

ఎంతమంది ఆడవచ్చు : ఎంతమందైనా ఆడవచ్చు

పిల్లల కళ్ళకు గంతలు కట్టి వాళ్ళకి రకరకాల పదార్ధాల వాసన చూపించాలి. అవి వారు గుర్తించి సరైన సమాధానం చెప్పిన లేదా రాసిన వారు విజేతలు.

ఉదా :

వెల్లుల్లిపాయ, యాలకులు, నెయ్యి, కిరసనాయిలు, కాఫీ పొడి, టీ పొడి, జీలకర్ర, వాము, సంపంగి పువ్వు, మల్లె పువ్వు, సన్నజాజి, విరజాజి, చామంతి, గులాబి.


[ వెనుకకు ]

వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేంటి

ఎంతమంది ఆడవచ్చు : ఎంతమందైనా ఆడవచ్చు
ఆడే స్థలం : ఖాళీ ప్రదేశంలో

పిల్లలందరిలో కాస్త పెద్ద వయసు ఉన్నవారు ఆ ఆటను నిర్వహించేవాడు అవ్వాలి. ఆ నిర్వహించేవాడు ముందు పిల్లలందరి చేత పంటలు వేయించాలి. అందరూ పండిపోగా మిగిలిన వారు దొంగవుతారు. నిర్వహించేవాడు దొంగయిన పిల్లాడిని తన ఒడిలో కూర్చోబెట్టుకొని కళ్ళు మూస్తాడు. మిగిలిన ఆటగాళ్ళంతా దొంగ ముందు నిలుచుంటారు. నిర్వహించేవాడు ఒడిలోని దొంగ చెయ్యి పట్టమని వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి? అని ఒక్కొక్క పిల్లాడి వైపు చూపిస్తాడు. అతను కచ్చితంగ గుర్తుపట్టి పేరు చేబితే అతను దొంగవుతాడు. సాధారణంగా దొంగయినపిల్లలు వంకాయ, కాకరకాయ, దొండకాయ, దోసకాయ, పిల్లి, ఎలుక అని నవ్వించే పేర్లు చెబుతారు. చివరలో నిర్వహించేవాడు "దాఖలమూచి దండాకోర్ ఎక్కడ దొంగలక్కడే గప్ చిప్ సాంబార్ బుడ్డి" అనగానే పిల్లలంతా పారిపోయి దాక్కుంటారు. తరువాత నిర్వహించేవాడు దొంగయిన పిల్లాడి కళ్ళు విప్పుతాడు. ఇప్పుడు ఆ కుర్రాడు దాక్కునివున్న వారిని పట్టుకోవాలి. ఎవరిని ముందుగా పట్టుకుంటాడో వాడు దొంగయిపోతాడు. మరలా ఆట వీరి వీరి గుమ్మడిపండు నుంచి ప్రారంభమవుతుంది.


[ వెనుకకు ]

వైకుంఠపాళి

ఎంతమంది ఆడవచ్చు : ఇద్దరు
కావలసిన వస్తువులు : పరమపద సోపానం ఇది పాచారి కొట్టులో (జనరల్ షాపులో ) లభిస్తుంది, చింతపిక్కలుగాని, గవ్వలుగాని

పరమపద సోపానం ఈ పటం (చార్టు ) నిండా గడులుంటాయి. పాములు, నిచ్చెనలు ఉంటాయి. ఆటగాళ్ళకు సంబంధించిన పిక్క పాము గళ్ళలోకి వెళ్తే చనిపోయి, ఆ పాములు ఏ గదిలోకి జారివుందో ఆ గడికి దిగిపోతుంది. అదే నిచ్చెన మొదలు ఉన్న గదికి చేరితే ఆ నిచ్చెన ఎన్ని పై గడులకు చేరిందో అక్కడకు ఎక్కి వెళ్ళిపోతుంది. ఇలా పాములను తప్పించుకుంటూ, నిచ్చెనల సహయంతో ముందు స్వర్గాన్ని చేరిన వారు విజేతలు.


[ వెనుకకు ]

సర్కిల్ - కర్చీఫ్ ఆట

ఎంతమంది ఆడవచ్చు : 12 మంది ఆడవచ్చు.
ఆడే స్థలం : : ఖాళీ ప్రదేశం.

ఈ ఆటలో రెండు గ్రూప్ లు ఉండాలి. ఒక్కొక్క గ్రూప్ లో అయిదు నుండి ఆరుగురు ఆటగాళ్ళుండాలి. వాళ్ళకొక లీడర్ వుంటాడు. అంటే రెండు గ్రూప్ లలో కూడా ఇద్దరు లీడర్లు ఉంటారు. ఈ ఇద్దరు లీడర్లు తమ గ్రూప్ లోని ఆటగాళ్ళకు రహస్యంగా నెంబర్లు చెప్పాలి. అవి అంకెల నంబర్లు. రౌండ్ గా ఒక సర్కిల్ గీయాలి. మధ్యలో ఒక కర్చీఫ్ ను వేస్తాడు. "ఏ" గ్రూప్ లీడర్ "బి" గ్రూప్ లీడర్ ఇద్దరూ ఏదొక నంబర్ ను చెప్పి లోపలకు పంపుతారు. అంటే "ఏ" లీడర్ మూడవ నంబర్ పంపితె, "బి" గ్రూపలీడర్ కూడా మూడవ నంబర్ మనిషిని పంపాలి. ఈ మూడవ నెంబర్ పిల్లలిద్దరూ కర్చీఫ్ చుట్టూ తిరుగుతూ ఎవరైనా లాఘవంగా కర్చీఫ్ ను దొరకబుచ్చుకొని తమ గ్రూప్ వారు ఉన్నవైపు పరుగెత్తాలి. అడ్డుగా ఉన్న గీత దాటి తన గ్రూప్ వారిని చేరుకోవాలి. అంటే "ఏ" గ్రూప్ లో మూడవ నెంబర్ బాలుడు కర్చీఫ్ తీసుకొని పారిపోతే అతన్ని గీత దాటకుండా "బి" గ్రూప్ లోని మూడవ నెంబర్ వ్యక్తి పట్టుకోవాలి. అలా పట్టుకుంటే అతను ఔటు. ఇలా తలొక నెంబర్ గల ఆటగాళ్ళను పంపుతూ ఉండాలి. ఒకరు అవుటయితే రెండవ గ్రూప్ లోని అవుటయిన ఆటగాడు బతుకుతాడు.


[ వెనుకకు ]

హౌసీ ఆట

ఎంతమంది పాల్గొనవచ్చు : 5 గురు
ఎక్కడ ఆడవచ్చు : ఇంట్లోనైనా, బయటైనా

మార్కెట్లో ఇది దొరుకుతుంది. ఒకటి నుంచి 100 నంబర్లు గల ప్లాస్టిక్ బిళ్ళలు, ఒక నెంబరు ఉన్న టికెట్ బుక్ ఇస్తారు. ఆటగాళ్ళు తలా ఒక టికెట్ తీసుకోవాలి నంబర్లు ఉన్న ప్లాస్టిక్ బిళ్ళలను ఒక కప్పులో వేసి బయటి వ్యక్తితో వాటిని తీయించాలి. అందులో వచ్చే నంబర్లు తమ టికెట్ లో ఉంటే వాటిని పెన్సిల్ తో కొట్టివేయాలి. ఎవరి అంకెలు ముందు అయి పోతే వారు విజేతలు.

[ వెనుకకు ] [ ముందుకు ]

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: