telugudanam.com

      telugudanam.com

   

ఒంటె ఇద్దరు వ్యాపారులు

ఒక ఊరిలో ఒక కూరగాయల వ్యాపారి, ఒక కుమ్మరి పక్క పక్క ఇళ్లలో ఉండేవారు, పక్కనే ఉన్నా, ఇద్దరికీ క్షణం కూడా పడేది కాదు. చీటికీ మాటికీ తగాదాలు పెట్టుకునేవారు. ఒకరోజు ఇద్దరికీ తమ తమ సరుకులను పట్నంలో అమ్మాలంటే వాటిని మోసుకుపోయేందుకు ఒక ఒంటె అవసరమయింది.

వేరువేరుగా రెండు ఒంటెలను అద్దెకు తీసుకునే బదులు ఇద్దరు కలిసి ఒకే ఒంటెను అద్దెకు తీసుకోవడం వల్ల ఖర్చు తగ్గుతుందని అనుకున్నారు ఇద్దరూ. ఒకే ఒంటెను అద్దెకు తీసుకుని ఇద్దరూ చెరోవైపు సామానులను కట్టుకున్నారు. ఇక ప్రయాణం మొదలుపెట్టారు.

కొద్ది దూరం ప్రయాణించిన తర్వాత ఆకలిగొన్న ఒంటె కూరగాయల వ్యాపారి సంచుల్లోంచి కూరగాయలను తీసుకుని నమలటం ప్రారంభించింది. అది చూసిన కుమ్మరి తన సంచుల్లో ఉండేవి కుండలే కాబట్టి వాటికి ఎలాంటి నష్టం కలగదు అని అనుకున్నాడు. ఒంటె రెండోసారి కూడా కూరగాయలను నమలడం చూసిన కుమ్మరి నవ్వు ఆగలేదు. తనివితీరా నవ్వుకోసాగాడు కుమ్మరి. మధ్యాహ్నవేళ కావడంతో అలసిపోయిన కుమ్మరి, కూరగాయల వ్యాపారి ఇద్దరూ సేద తీర్చుకుందామని ఒక చెట్టు నీడన కూర్చున్నారు. వీరిద్దరినీ గమనించిన ఒంటె తాను కూడా విశ్రాంతి తీసుకునేందుకు చెట్టు నీడన కూర్చుంది. సహజంగానే బరువున్న వైపుకు వంగి కూచునే అలవాటుగల ఒంటె, కూరగాయలు తినేందుకు వీలుగా కూడా ఉంటుందని భావించి కుమ్మరి కుండలు ఉన్న వైపునకు ఒరిగి కూర్చుంది. అంతే కుమ్మరి కుండల్లో సగం కుండలు పెళ పెళమని పగిలిపోయాయి. ఈసారి నవ్వడం కూరగాయల వ్యాపారి వంతయింది.

నీతి : హేళన, వెకిలితనం అన్ని వేళలా పనికి రాదు.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: