telugudanam.com

      telugudanam.com

   

ఇల్లలుకుతూ అలుకుతూ

ఆంధ్రప్రదేశ్ అవతరణోత్సవ దినాన

అబద్దం ఆడటానికి నోరు రాక

అంతా క్షేమంగా వున్నామని చెప్పలేక

అటూ ఇటూ వూగిసలాడూతూ

అల్లుకు వచ్చిన గీతం వినండి

నిజానికి కాలం మన మీద యింకా

కారాలు మిరియాలు నూరుతూనే ఉంది

కఠినంగా కరిచింది కాలం మనల్ని

అందరి మనసుల్ని అడ్డంగా విరిచింది

ఐక్యతా లత అల్లుకున్న అందాల పూల పందిరి మీద

అంగుళానికి అరడజను వంతున

గొంగళి పురుగులు ప్రాకుతున్నాయి

వాటి పీడ పడలేక తోటంతా

పీకేద్దామంటున్నారు కొందరు!

చుక్కల లోకంలోకి ఎక్కాలని

వేసిన నిచ్చెన్లు విరగ్గొట్టారు కొందరు

కూర్చున్న కుర్చీ కుషన్లలో

గుండు సూదులు గ్రుచ్చి వెళ్ళారు కొందరు

వానదేవుణ్ణి రమ్మని టెలిగ్రాం పంపితే

వరద దేవుడొచ్చి కూర్చున్నాడు

పైర గాలిని రమ్మని కబురు చేస్తే

తుఫాను గాలులు తొంగి చూశాయి

కూలిపోయిన నిరుపేదల గుడిశెలు

కాలిపోయిన గ్రామీణుల జీవితాలు

హృదయం దహించుకు పోయే

విషాద సంఘటనలు ఒక వైపు

కొండ అడ్డు తగిలి రెండుగా చీలుతానంటున్న ప్రవాహం

కక్షలు కార్పణ్యాలు ప్రాంతీయ తత్వాల ప్రభావం

మనసులు చెదిరి మనుషులందరూ చెదిరి

తొలగి దూరంగా పోతున్న దృశ్యాలు ఒక వైపు

ఏం చెప్పను నాదేశపు శోభ

మనసులు మారడం లేదు మాకేమిటి లాభమనీ

మాట మారడం లేదు ఆంధ్రులెవరో అరవలెవరో అసలే తెలీదు నాకు

తెలుగు వారికి ఈ మధ్య పుట్టిన తెగులేమిటో తెలీదు నాకు

అనైక్యత బీజాలు నాటిన వారికి నికరంగా వచ్చిన

ఆదా ఎంతో తెలీదు నాకు

చరిత్రను వెనక్కు మళ్ళింపజూస్తున్న వారి

చేతుల్లో ఎంత బలముందో తెలీదు నాకు

ఇల్లలుకుతూ అలుకుతూ ఈగ తన పేరు తాను మరిచిపోయినట్లు

ఇటీవల మన తెలుగువాండ్లు తమ ఊరూ పేరూ మరచిపోయి

ఊరేగారు వీధుల వెంట!

అవును ప్రజలు నిజంగా నిద్రపోతున్నారు

చైతన్యం చంద్రమండలానికి వలస పోయింది

మనిషి కత్తికి పదును పోయింది

చరిత్ర పొలంలో నాటదలచుకున్న

పైరుకు అదును పోయింది

పామరుడు పొదలో పొంచి కూర్చున్నాడు

పాములా కాటేస్తాడు బహుపరాకే

తెల్లవారకుండా సూర్యుడికి మబ్బులు అడ్డు వస్తున్న

బడాబడా కామందులు బహుపరాకే!

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: