telugudanam.com

      telugudanam.com

   

తెలుగు దేశమే నాది

తెలుగు దేశమే నాది తెలుగు బిడ్డనే నేను

తెలుగు పేరు వింటేనే మురిసిపోతాను

తెలుగు భాష అంటే మైమరచిపోతాను

నన్నయ భట్టిక్కడనే పుట్టినాడు

తిక్కన కవి ఘంట మిచట పట్టినాడు

పోతన్నలు, శ్రీనాధులు రామ బాహు భూషణులు

తెలుగు భాషకై వన్నెలు దిద్దినారు

తెలుగు జాతి నాల్కలపై నిలిచినారు

ఆట వెలదులను ముద్దుల మూటగట్టె వేమన్న

భావి కాలగతుల తెలియ బల్కెడు వీరబ్రహ్మం

కర్ణాటక గానానికి కళదెచ్చెను త్యాగరాజు

ఇంతటి విజ్ఞాన ధనులు ఎవరున్నారు

వెదకి చూచినా గాని కానరారు

బరిపై తొడగొట్టి, కత్తి బట్టెను నాయకురాలు

పురుష వేషమున శత్రుల మారుమాడెను రుద్రమ్మ

మొల్లలు మల్లమ దేవులు మహిళలకే మణిపూసలు

తెలుగు గడ్డకే పేరు దెచ్చినారు

స్త్రీ జాతికి గౌరవమ్ము నిచ్చినారు

ఓరుగల్లు నేలిన శూరుడు ప్రతాపరుద్రుడు

పౌరుషమ్ము చిందించిన బాలచంద్రుడు

రాచకొండ వెలను దొరలు కొండవీటి రెడ్డి విభులు

మన ప్రతాపమునకు భలే మచ్చు తునకలు

వేడి నెత్తురు పారించిన వీరపుత్రులు

కలియుగ భీముడని బిరుదు గొన్న కోడి రామమూర్తి

అద్భుత మేధావిగా, పేరొందిన విశ్వేశ్వరయ్య

జగము మెచ్చు రాధాకృష్ణ, త్యాగమూర్తి ప్రకాశం

సత్యసాయి బాబాలు మనవాళ్ళంటే చాలు

సింహాచల మప్పన్న శ్రీశైలం మల్లన్న

యాదగిరి నరసింహ ఏడుకొండల వెంకన్న

వీరంతా తెలుగువారి కిలవేలుపులు

మహిమలు జూపించునట్టి మన దేవుళ్ళు

కృష్ణా, గోదావరులు కేరింతలు గొడుతున్నవి

తుంగభద్ర మంజీరలు అంగలు వేస్తున్నవి

నిత్యము ప్రవహించుచున్న నిర్మలమగు జీవనదులు

బంగారపు పంటలు పండిస్తున్నవి

కరువు రక్కిసిని దూరం తరుముతున్నవి

తెలుగువాడు ఏడనున్న, తెలుగువాడు

తెలుగు బాషనే సొంపుగ పలుకుతాడు

మరచిపోని అతని కట్టు మారిపోని అతని బొట్టు

తలచుకున్న రోమ రోమం పులకరిస్తుంది

అభిమానం పొంగిపొరలి ఉరకలేస్తుంది

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: