telugudanam.com

      telugudanam.com

   

జానపద గీతాలు (కొన్ని)

మొక్కజొన్న తోటలో

సుక్కలన్ని కొండమీద - సోకుజేసుకునే వేళ,

పంటబోది వరమడితో - పకపక నవ్వే వేళ,

సల్లగాలి తోటకంత - సక్కలగిల్లి పెట్టువేళ,

మొక్కజొన్న తోటలో - ముసిరిన సీకట్లలో,

మంచెకాడ కలుసుకో, - మరువకు మామయ్య,

చీకటి మిణుగురు జోతుల - చిటిల చిల్లులడక మునే,

సుద్దులరాగాలు చెవుల - నిద్దరతీయక మునుపే,

ఆకాశపుటొడిని తోట - ఆవలింత గొనక మునే,

పొద్దువాలుగంటనే - పుంతదారి వెంటనే,

సద్దుమణగనిచ్చిరా - ముద్దులమామయ్య!

గొడ్డుగోద మళ్లేసే - కుర్రకుంకలకు గానీ,

కలుపుతీతలయి మళ్ళే - కన్నెపడుచులకు గానీ,

బుగ్గ మీస మెలివేసే - భూకామందుకు గానీ,

తోవకెదురు వస్తివా - దొంగచూపు చూస్తివా,

తంటా మన యిద్దరికీ - తప్పదు మామయ్య!!

కంచెమీద గుమ్మడిపువు - పొంచి పొంచి చూస్తాది;

విరబారిన జొన్న పొట్ట - వెకిలినవ్వు నవుతాది;

తమల తీగెలు కాళ్ళకు - తగిలి మొరాయిస్తాయి;

చెదిరిపోకు మామయా - బెదిరిపోకు మామయా

సదురుకొని నీ పదునుగుండె - సక్కని మామయ్య

పనలు కట్టి యెత్తి నన్ను - పలకరించ బోయినపుడు

చెరుకుతోట మలుపుకాడ - చిటిక వేసి నవ్వినపుడు,

మోట బావి వెనక నాతో - మోటసరస మాడినపుడు

కసిరితిట్టినాననీ, - విసిరికొట్టినాననీ,

చిన్నబోకు నలుగురిలో - సిగ్గది మామయ్య.


చల్ మోహనరంగా...

నీకు నీవారు లేరు నాకూ నా వారు లేరు

ఏటి ఒడ్డున ఇల్లు కడదము పదరా చల్ మోహనరంగానీకు నాకు జోడు కలసెను గదరా

మల్లె తోటలోన మంచినీళ్ళ బావికాడ

ఉంగరాలు మరచి వస్తిని కదరా || చల్ ||కంటీకి కాటుకెట్టీ కడవా సంకాన బెట్టి

కంటి నీరు కడవ నింపితి గదరా || చల్ ||గట్టుదాటి పుట్టదాటి - ఘనమైన అడవిదాటి

అన్నిదాటి అడవి బడితిమి గదరా || చల్ ||నీకు నాకు జోడు అయితే - మల్లెపూలా తెప్పగట్టీ

తెప్పమీద తేలిపోదము పదరా || చల్ ||అదిరా నీ గుండెలదరా - మధురా వెన్నెల రేయి

నిదరాకు రమ్మంటిని కదరా || చల్ ||


ఏడవకు ఏడవకు!

"ఏడవకు కుశలవుడ రామకుమార,

ఏడిస్తె నిన్నెవ్వ రెత్తుకుందూరు;

ఉంగరమ్ములు గొనుచు ఉయ్యాల గొనుచు,

ఊర్మిళా పినతల్లి వచ్చె నేడవకు;

పట్టు టంగీ గొనుచు పులిగోరు గొనుచు,

భూదేవి అమ్మమ్మ వెచ్చె నేడవకు;

రావిరేకలు గొనుచు రత్నాలు గొనుచు,

లక్ష్మన్న పినతండ్రి వచ్చె నేడవకు;

ఏడవకు కుశలవుడ రామకుమార,

ఏడిస్తే నిన్నెవ్వ రెత్తుకుందూరు".


జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం

జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం

అర్జునుడు తిన్న అరటిపండ్లరిగి

భీముడు తిన్న పిండివంటలరిగి

గణపతి తిన్న ఖజ్జాలరిగి

అబ్బాయి తిన్న పాలు, ఆముదము అరిగి

పామల్లెపాకి కుందల్లె కూర్చుండి

నందల్లె నడిచి గుఱ్ఱమంత పరుగు

ఏనుగంత సత్తువు ఉండేటట్లు

సాకుమా బిడ్డను సంజీవరాయ"


కోడలా కోడలా కొడుకు పెళ్ళామా

"కోడలా కోడలా కొడుకు పెళ్ళామా

పచ్చిపాల మీద మీగడలేవి?

వేడిపాల మీద వెన్నల్లు యేవి?

నూనెముంతల మీద నురగల్లుయేవు?""అత్తరో ఓయత్త ఆరళ్ళయత్త

పచ్చిపాలమీద మీగడుంటుందా?

వేడిపాల మీద వెన్నలుంటాయా?

నూనె ముంతల మీద నురగలుంటాయా?""ఇరుగు పొరుగులార! ఓ చెలియలార

అత్తగారి ఆరళ్ళు చిత్తగించరా?

పెత్తనం లాగేస్తే పేచీలుపోను

ఆరళ్ళ అత్తయిన సవతి పోరయిన

తల్లిల్లు దూరమైన భరియించలేము.""కోడలా కోడలా కొడుకు పెళ్ళామా!

కొడుకు ఊళ్ళోలేడు మల్లెలెక్కడివి?"

"గంపంత మబ్బేసి గాలి విసిరింది

కొల్లలుగ మల్లెలు కొప్పులో రాలె."

[ వెనుకకు ] [ ముందుకు ]

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: