telugudanam.com

      telugudanam.com

   

లాలి పాటలు (కొన్ని)

ఉయ్యాల జంపాల

ఉయ్యాల జంపాలలూగరావమ్మ

వెలలేని బంగారుటూగుటుయ్యాల ||ఉ||

కమలమందున బుట్టి కమలాక్షుని చేపట్టి

కామూని కన్నట్టి కంజదళనేత్రి ||ఉ||

శుభశుక్రవారమున సుదతులు వూచ

నూరి జనము పొగడ సుందరముగాను

కోటి సూర్యుల కాంతి కొల్లగొట్టగను

కావేటీ రంగనితో కలసినీవూగ ||ఉ||

శ్రీ విల్లి పూత్తూరిలో వెలసితివి తల్లీ

శ్రీరంగధాముని చేపట్టితివమ్మా

చేరి కూర్చుండేటి చక్రధరుని గూడి

చేతనులను రక్షించ చెలులందరు ఊచ ||ఉ||


ఊయలూగుమా కృష్ణ

ఊయలూగుమా కృష్ణ ఊయలూగుమా

హాయిగా వినిపింతు జోల ఊయలూగుమా ||ఊ||

లాలీ గోపాలకృష్ణ లాలీ గోవింద కృష్ణ

లాలీ మా పాలి దైవమ లాలీ లాలీ

రేపల్లియే ఊయలై వూగగా

గోపెమ్మ యెద జోలలే పాడగా

ఆనందమూ నందునీ యింట విరిసే

జగమందు కనువిందగు లీల వెలిసే ||లా||

నిన్ను గన్న తల్లి దేవకియే ధన్యము

ఎన్ని ముద్దులు దీర్చె యశోదదే పుణ్యము

ఆనాటి అనుభూతి యెదనిండనీ

ఈనాటి ఈ సేవ నీకందనీ ||లా||


కృష్ణ లాలీ యశోదమ్మ

కృష్ణలాలీ నందుని కృష్ణలాలీ యశోదమ్మ

నోముల పంట కృష్ణలాలీ || కృ ||

పాలు పెరుగు వెన్నతిని గోల చేసేవు

రవ్వలేల నీతో కృష్ణ వేగలేనురా || కృ ||

గోపకాంతలంతవచ్చి చాడీ చెప్పేరు

నీకు కరువ ఇంట పెరుగు పాల కెపుడైన || కృ ||

మన్ను తిన్నావని అన్న నాతో చెప్పగా

నోట భువనములన్ని జూపి మాయచేసేవు || కృ ||

కన్ను మూయగ కన్నతండ్రి కలలోనైనను

అల్లరి పనులను మానివుండు చిన్ని కృష్ణయ్య || కృ ||


చిట్టిపాప

చిన్ని మా అమ్మాయి శ్రీ ముఖము చూసి

సిగ్గుపడి జాబిల్లి పొడువగా వెఱుచు

పందిట్లో అమ్మాయి పాకుతూ వుంటే

పనసపండని జనులు పరుగులెత్తేరు

దొడ్లోను అమ్మాయి దొర్లాడుతుంటే

దోసపండని జనులు దోసిలొగ్గేరు

నీలాలు కెంపులూ నిలువు వజ్రాలు

నిత్యమూ అమ్మాయి నీళ్ళాడుచోట

పగడాలు రత్నాలు పారిజాతాలు

పడలి మా అమ్మాయి పనిచేయుచోట

చూడగా ముద్దమ్మ పాడగా ముద్దు

అందరికి మా అమ్మి అల్లారు ముద్దు.


జో అచ్యుతానంద

జో అచ్యుతానంద జోజో ముకుందా

రార పరమానంద రామ గోవిందా ||జోజో||

నందు నింటను జేరి నయము మీఱంగ

చంద్రవదనలు నీకు సేవ చేయంగా

నందముగ వారిండ్ల నాడుచుండగ

మందలకు దొంగ మా ముద్దురంగ ||జోజో||

పాలవారాశిలో పవళించావు

బాలుగా మునుల కభయమిచ్చినావు

మేలుగా వసుదేవు కుదయించినావు

బాలుడై యుండి గోపాలుడైనావు ||జోజో||

అట్టుగట్టిన మీగడట్టె తిన్నాడే

పట్టి కోడలు మూతిపై రాసినాడే

అట్టె తినెనని యత్త యడుగ విన్నాడే

గట్టిగా నిది దొంగ కొట్టుమన్నాడే ||జోజో||

అంగజుని గన్న మాయన్న యిటురారా

బంగారు గిన్నెలో పాలు పోసేరా

దొంగ నీవని సతులు పొంగుచున్నారా

ముంగిట నాడరా మోహనాకార ||జోజో||

గోవర్ధనంబెల్ల గొడుగుగా బట్టి

కావరమ్ముననున్న కంసు బడగొట్టి

నీవు మధురాపురము నేల చేపట్టి

ఠీవితో నేలిన దేవకీపట్టి ||జోజో||

రంగుగా తాళ్ళపాకన్నయ్య చాల

శృంగార రచనగా జెప్పె నీ జోల

సంగతిగ సకలసంపదల నీవేళ

మంగళము తిరుపట్ల మదనగోపాల ||జోజో||

[ వెనుకకు ] [ ముందుకు ]

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: