telugudanam.com

      telugudanam.com

   

పిల్లల పాటలు (కొన్ని)

అ ఆ ల పాట...

అ ఆ లు దిద్దుదాము... అమ్మమాట విందాము

ఇ ఈ లు చదువుదాము - ఈశ్వరుని కొలుద్దాము

ఉ ఊ లు దిద్దుదాము - ఉడతలను చూద్దాము

ఎ ఏ ఐ అంటూ అందరినీ పిలుద్దాము

ఒ ఓ ఔ అంటూ ఓనమాలు దిద్దుదాము

అం అః అంటూ అందరం ఆడుదాము

గురువు గారు చెప్పిన పాఠాలు చదువుదాము

తాతగారు చెప్పిన నీతి కధలు విందాము

అమ్మ మాట విందాము

నాన్న చెప్పిన మంచి పనులు చేద్దాము

అందరం కలిసి ఆనందంగా ఉందాము.


[ వెనుకకు ]


అక్షర జ్యోతి

పలకేమో నల్లన

అక్షరాలు తెల్లన

నలుపంటే చీకటి

తెలుపంటే వెలుతురు

చదువు దివ్వె వెలిగిద్దాం

చీకట్లను తరిమేద్దం.


[ వెనుకకు ]


అల్లి బిల్లి పాట...

కొండాపల్లీ కొయ్యా బొమ్మా

నీకో బొమ్మా నాకో బొమ్మా

నక్కపల్లీ లక్కా పిడతలు

నీకో పిడత నాకో పిడత

నిర్మలపట్నం బొమ్మల పలకలు

నీకో పలకా నాకో పలకా

బంగినపల్లీ మామిడి పండ్లూ

నీకో పండూ నాకో పండూ

ఇస్తానుండూ తెచ్చేదాకా

చూస్తూవుండూ తెచ్చేదాకా.


[ వెనుకకు ]


ఉయ్యాల జంపాల...

ఉయ్యాల జంపాలలూగరారమ్మ

వెలలేని బంగారుటుయ్యాల ||ఉయ్యాల||

కమలమందున బుట్టీ కమలాక్షుని చేపట్టి

కాముని కన్నట్టి కంజదళనేత్రి ||ఉయ్యాల||

శుభశుక్రవారమున సుదతులు వూప

నూరి జనము పొగడ సందరముగాను

కోటి సూర్యుల కాంతి కొల్లగొట్టగను

కావేటీ రంగనితో వెలసితివి తల్లీ ||ఉయ్యాల||

శ్రీ విల్లి పూత్తూరిలో వెలసితివి తల్లీ

శ్రీ రంగధాముని చేపట్టితివమ్మా

చేరి కూర్చుండేటి చక్రధరుని గూడి

చేతనులను రక్షించ చెలులందరు ఊప. ||ఉయ్యాల||


[ వెనుకకు ]


ఎందుకురా?

ఎండలు కాసేదెందుకురా?

మబ్బులు పట్టేటందుకురా.

మబ్బులు పట్టేదెందుకురా?

వానలు కురిసేటందుకురా.

వానలు కురిసేదెందుకురా?

చెరువులు నిండేటందుకురా.

చెరువులు నిండేదెందుకురా?

పంటలు పండేటందుకురా.

పంటలు పండేదెందుకురా?

ప్రజలు బ్రతికేటందుకురా.

ప్రజలు బ్రతికేదెందుకురా?

దేవుని కొలిచేటందుకురా.

దేవుని కొలిచేదేందుకురా?

ముక్తిని పొందేటందుకురా.


[ వెనుకకు ]


ఏనుగు పాట

ఏనుగు ఏనుగు నల్లన

ఏనుగు కొమ్ములు తెల్లన

ఏనుగు మీద రాముడు

ఎంతో చక్కని దేవుడు.


[ వెనుకకు ]


ఏనుగొచ్చింది...

ఏనుగొచ్చింది ఏనుగు - ఏ వూరొచ్చిందేనుగు

మావూరొచ్చిందేనుగు - మంచినీళ్ళే తాగిందేనుగు

ఉప్పునీళ్ళు తాగిందేనుగు - ఊరెళ్ళగొట్టిందేనుగు.


[ వెనుకకు ] [ ముందుకు ]

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: