telugudanam.com

      telugudanam.com

   

పిల్లల పాటలు (కొన్ని)

అమ్మ

అమ్మ కన్న మంచిదీ

ఆమె వంటి పెన్నిధీ

ఎంత వెదకి చూచినా

లేదు లేదు ఎందునా.అమ్మ కంటి వెలుగుతో

ఆమె చేతి చలువతో

బ్రతుకు పూలు పూయదా?

సతము ఫలము లీయదా?అమ్మ మనసు ప్రేమలో

ఆమె మాట తీపిలో

అమృతమ్ము తొణకదా?

అమర సుఖము దొరకదా?


[ వెనుకకు ]


పూ, చిలుకలు

రంగు రంగుల పూవులోయ్

కమ్మ కమ్మని తావులోయ్వన్నెవన్నెల చిలుకలోయ్,

సీతాకోక చిలుకలోయ్.అందమంటే వానిదే,

స్నేహమంటే వానిదే.పూవు లందం చెట్లపైనా,

చిలుక లందం పూలపైనా.తియ్యని తేనెల సారం

చిలుకకు ప్రాణాధారంపువ్వు చూపు ఆదరణం

పూజాతికి విస్తరణంపువ్వు లేదో చిలుక లేదు

చిలుక లేదో పువ్వు లేదు.పూ, చిలుకల సంబంధం

యుగ యుగాల అనుబంధం.


[ వెనుకకు ]


ఈ దేశం నా దేశం

ఈ దేశం నా దేశం

ఎన్నటికీ నాదేశం

కాశ్మీరీ, బెంగాలీ

గుజరాతీ, మళయాళీ

అంగామీ, లంబాడీ

నా వాడే ఎవడైనా.

గంగా, యమునా, కృష్ణా

గోదావరి, కావేరీ

తపతీ, నర్మద, పెన్నా

నాదే ఏ నదియైనా.

పంజాబూ, బీహారూ

మహారాష్ట్రం, కర్ణాటం

తమిళనాడు, హరియానా

నాదే ఏ నాడైనా

ఈ గాలే నా ఊపిరి

ఈ నీరే నా రక్తం

ఈ మన్నే నా భాగ్యం

ఈ దేశం నా సర్వం.


[ వెనుకకు ]


సంక్రాంతి

సంక్రాంతి పండక్కి సంబరాలెన్నో;

సందళ్ళు, సరదాలు, సయాట లెన్నో,సాతాని పాడితే సంక్రాంతి మొదలు;

గంగిరెద్దాడితే పొంగళ్ళు మొదలు.ముత్యాల ముగ్గులతో ముంగిళ్ళు మెఱయు;

కొలువుండి ఆ నడుమ గొబ్బిళ్ళు మురియు.బంతి, చేమంతులతో వాకిళ్ళు వెలుగు;

పుట్టింట పడుచులతో నట్టిళ్ళూ వెలుగు.పాతాళ మందుండి బలిదాత వచ్చు;

పంట కళ్ళము నుండి మహాలక్ష్మి వచ్చు.బరిమీద పుంజులకు పౌరుషము పెఱుగు;

పంతాలు, పందేలు ప్రజలలో పెఱుగుబావలూ మరదళ్ళ పరియాచకాలు

వీనులకు విందైన వింత పాకాలుసంక్రాంతి పండుగదె సౌభాగ్యమంతా;

అపురూపమైన దా అనుభవమ్మంతా.


[ వెనుకకు ]


గోరింటాకు

చెట్టు మీద అది పచ్చని ఆకు

ఎఱుపు నెంతో మెఱపించు ఆకు

చిన్ని ఎదల మురిపించే ఆకు

ఆడువారి నలరించే ఆకు

చేతికి సొగసులు చేర్చే ఆకు

కాళ్ళకు మెఱుగులు దిద్దే ఆకు

తద్దె పండుగకు ముద్దగు ఆకు

దాని పేరే కద గోరింటాకు.


[ వెనుకకు ]


కృష్ణ వేణి

బిరబిరా చరచరా ముందునకు సాగేవు

చివరకా మున్నీట మాయమై పోయేవు

పరుగులిక చాలునే ఓ కృష్ణవేణి!

కరుణించవే మమ్ము నిత్యకల్యాణి!తెలియదటనే నీకు మున్నొక్కనాడు

కలిమిలో పేరొందె మా తెలుగునాడు

తొలగిపోయిన వెనుక ఆ గొప్ప సిరులు,

అలముకొన్నవి తల్లి చీకటుల తెరలు!పారతంత్ర్యము బాపి మొన్ననే గదవే

స్వాతంత్ర్య భానుండు వెలుగసాగినది!

తన వారి మేలుకై నిన్ననే గదవే

తెనుగన్న వేరుకాపురము పెట్టినది!ముంగారు పంటలో బంగారు సిరుల

సిగారములు మరల సంతరింపగ

నిలిచినాడు కార్య రంగమున నాభ్రాత

నిరుప మానందన ఈవె! కేలూత!భీమానదీ తుంగభద్రలం గూడి

భీషణార్భటులతో గట్టులనొరసి

ప్రవహించి జలధిపాలైన దికచాలు

నవజీవనానంద మొసగి మమ్మేలు!


[ వెనుకకు ]


కోయిలొచ్చింది

కోయిలొచ్చిందమ్మ

కోయి లొచ్చింది.చలి వదలి పోగానే

సాగి వచ్చింది.గున్న మామిడిపైని

కొలువు తీర్చింది.'కూ' అంటు కమ్మగా

గొంతు విప్పింది.గానాల సుధలతో

కడలు నింపింది.కోయిలమ్మకు తెలుసు

కోటి రాగాలు.


[ వెనుకకు ] [ ముందుకు ]

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: