telugudanam.com

      telugudanam.com

   

పిల్లల పాటలు (కొన్ని)

అల్లరి రాజా...

అల్లరి రాజా వచ్చాడు

పిల్లలందర్ని పిలిచాడు

అల్లరి ఎంతో చేసాడు

గొడవలు ఎన్నో తెచ్చాడునాన్నతో తన్నులు తిన్నాడు

అల్లరి అంతా మానాడు

పుస్తకం చేత పట్టాడు

శ్రద్దగా నాన్నతో వెళ్ళాడుగురువు వద్ద చేరాడు

బుద్దిగ మాటలు విన్నాడు

చదువులు బాగా చదివాడు

శ్రద్దగా పాఠాలు విన్నాడుపాఠాలెన్నో నేర్చాడు

పరీక్షలెన్నో రాసాడు

ఫస్టుక్లాసులో నెగ్గాడు

పెద్దల మన్నన పొందాడు


[ వెనుకకు ]


అమ్మకొక ముద్ద

ఆకేసి ఉప్పేసి

పప్పేసి అన్నం పెట్టి

చారేసి నెయ్యివోసిఅమ్మకొక ముద్ద

చెల్లికొక ముద్ద

అక్కకొక ముద్ద

అవ్వకొక ముద్ద

తాతకొక ముద్దఅందరికి పెట్టి

నువ్వు తిని

నేనూ తినిఆకెత్తేసి ఆకేసి వక్కేసి

సంతకు పోయే దారేది

అత్తారింటికి దారేది??


[ వెనుకకు ]


ఓ బొజ్జ గణపయ్య...

ఓ బొజ్జ గణపయ్య - నీ బంటు నేనయ్య

కమ్మని నెయ్యయ్య - కంది పప్పయ్య

పేరిన నెయ్యయ్య - పెసర పప్పయ్య

ఎలుక వాహనమదీ - ఎక్కి రావయ్య

ఉండ్రాళ్ళ మీదికి - దండు బోవయ్య


[ వెనుకకు ]


ఏది మేలు...?

గడపలన్నిటిలోన ఏ గడప మేలు?

మహలక్ష్మి నర్తించు మా గడప మేలుఅరుగులన్నింటిలోన ఏ అరుగు మేలు?

అతిధులందరు జేరు మా అరుగు మేలువీధులన్నింటిలోన ఏ వీధి మేలు?

కొట్లాటలే లేని మా వీధి మేలుఊరులన్నింటిలోన ఏ ఊరు మేలు?

సిరులు సంపదలు తులతూగు మాఊరు మేలుగురువులందరిలోన ఏ గురువు మేలు?

వేదసారము తెలుపు మా గురువు మేలు


[ వెనుకకు ]


లాలమ్మ లాలి...

లాలి లాలమ్మ లాలి లాలమ్మ

లాలమ్మ గుర్రాలు లంకల్లో మేసె

బుల్లెమ్మ గుర్రాలు బీడుల్లో మేసె

అప్పన్న గుర్రాలు అడవుల్లో మేసెఊరుకో అబ్బాయి వెర్రి అబ్బాయి

ఉగ్గెట్టు మీయమ్మ ఊరెళ్ళింది

పాలిచ్చు మీయమ్మ పట్నమెళ్ళింది

నీరోసె మీయమ్మ నీళ్ళకెళ్లింది

లాలి లాలమ్మ లాలి లాలమ్మ


[ వెనుకకు ]


మంచి అలవాట్లు...

పొద్దున మనమూ లేవాలి - పళ్ళను బాగా తోమాలి

చక్కగ స్నానం చేయాలి - చింపిరి తలనూ దువ్వాలి

ఉతికిన దండం పెట్టాలి - గ్లాసెడు పాలను తాగాలి

దేవునికి దండం పెట్టాలి - చక్కగ బడికి పోవాలి

గురువు మాట వినాలి - చదువులు చక్కగ చదవాలి


[ వెనుకకు ]


జయ జయ ప్రియభారత

జయ జయ జయ ప్రియ భారత - జనయిత్రీ, దివ్య ధాత్రి

జయ జయ జయ శత సహస్ర - నరనారీ హృదయ నేత్రి

జయ జయ సస్యశ్యామల సు - శ్యామ చలన్చేలాంచల!

జయ వసంత కుసుమ లతా - చలిత లలిత చూర్ణకుంతల!

జయ మదీయ హృదయాశయ - లాక్షారుణ పద యుగళా!    || జయ ||

జయ దిశాంత గత శమంత - దివ్యగాన పరితోషణ!

జయ గాయక, వైతాళిక - గళ విశాల పద విహరణ

జయ మదీమ మదురగేయ - చుంబిత సుందర చరణా!         || జయ ||


[ వెనుకకు ]


శ్రీలు పొంగిన జీవగడ్డ

శ్రీలు పొంగిన జీవగడ్డయి పాలు పాఱిన భాగ్యసీమయి

వరలినది యీ భరత ఖండము భక్తి పాడర; తమ్ముడా!

వేద శాఖలు పెరిగినిచ్చట ఆదిక్యం బందెనిచ్చట

బాదరాయణ పరమ ఋషులకు పాదు సుమ్మిది చెల్లెలా!విపిన బంధుర వృక్ష వాటిక ఉపనిషన్మధు వొలికెనిచ్చట

విపుల తత్వము విస్తరించిన విమల తలమిదె తమ్ముడా

సూత్ర యుగముల శుద్ధ వాసన క్షాత్ర యుగముల శౌర్య చండిమ

చిత్రదాస్యముచే చరిత్రల చెఱిగిపోయెనె చెల్లెలా!మేలి కిన్నెర మేళవించీ రాలు కరగగ రాగమెత్తీ

పాల తీయని బాల భారత పదము పాడర తమ్ముడా!

నవరసమ్ములు నాట్యమాడగ చివుర పలుకులు చెవుల విందుగ

కవిత లల్లిన కాంత హృదయుల గారవింపవె చెల్లెలా!దేశ గర్వము దీప్తి చెందగ దేశ చరితము తేజరిల్లగ

దేశ మరసిన ధీర పురుషుల తెలిసి పాడర తమ్ముడా!

పాండవేయుల పదును కత్తుల మండి మెఱసిన మహిత రణకధ

కండగల చిక్కని తెఱంగుల కలసి పాడవె చెల్లెలా!లోకమంతకు కాక పెట్టిన కాకతీయుల కదన పాండితి

చీకిపోవని చేవ పదముల చేర్చి పాడర తమ్ముడా!

తుంగభద్రా భంగములతో పొంగి నింగిని పొడిది త్రుళ్ళి

భంగపడని తెలుంగు నాధుల పాట పాడవె చెల్లెలా!


[ వెనుకకు ] [ ముందుకు ]

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: