telugudanam.com

      telugudanam.com

   

సంధులు

సంధి అనగా రెండు పదముల కలయిక మొదటి పదములోని చివరి అచ్చు పోయి రెండవ పదములోని మొదటి అచ్చు వచ్చిన సంధి అగును.

ఉదా: రాముడు + అతడు = రాముడతడు.

ఇందులో ' రాముడు ' మొదటి పదము అతడు రెండో పదము. మొదటి పదమైన ' రాముడు ' లోని ఉకారము పోయి రెండవ పదములోని ' అ ' కారము వచ్చినది.

రాముడ్ + అతడు = రాముడతడు అయినది.


తెలుగు సంధులు

ఇవి అచ్చులకును, హల్లులకును చెందియున్నవి.


అచ్చు సంధులు

అకారసంధి: అత్తునకు సంధి బహుళముగానగు.


ఉదా: మేన+అల్లుడు=మేనల్లుడు.


యడాగమసంధి: సంధిరాని చోట స్వరంబు కంటే పరంబయిన స్వరంబునకు యడాగమంబగు.

ఉదా: వెల+ఆలు=వెలయాలు.


ఇకారసంధి: ఇత్తునకు సంధి వైకల్పికముగానగు. .

ఉదా: వచ్చితిమి+ఇప్పుడు=వచ్చితిమిప్పుడు


ఉకారసంధి: ఉత్తునకు అచ్చు పరంబగునపుడు సంధియగు

ఉదా: మనము+ఉంటిమి=మనముంటిమి.


ఆమ్రేడితసంధి: అచ్చునకామ్రేడితంబు పరంబగునపుడు సంధి తరచుగానగు.

ఉదా: ఏమి+ఏమి=ఏమేమి.


హల్సంధులు

గసడదవాదేశ సంధి: ప్రథము మీది పరుషములకు గ-స-డ-ద-వ లు బహుళముగానగు.

ఉదా: వాడు+కొట్టె=వాడుగొట్టె


సరళాదేశ సంధి: ద్రుత ప్రకృతికము మీది పరుషములకు సరళములగు

ఉదా: పూచెను+కలువలు=పూచెనుగలువలు


పుంప్వాదేశ సంధి: కర్మధారయంబునందు మువర్ణకంబునకు పుం-పు లగు

ఉదా: సరసము+మాట=సరసపుమాట


ద్విరుక్తటకారాదేశ సంధి: కుఱు-చిఱు-కడు-నడు-నిడు శబ్దముల 'ఱ-డ ' లకు అచ్చు పరంబగునపుడు ద్విరుక్త టకారంబగు.

ఉదా: నడు+ఇల్లు=నట్టిల్లు


టుగాగమ సంధి: కర్మధారయమునందు ఉత్తునకు అచ్చు పరంబగునపుడు టుగాగమంబగు.

ఉదా: పేరు+ఉరము=పేరుటురము


రుగాగమ సంధి: పేదాది శబ్దములకు ఆలు శబ్దము పరంబగునపుడు కర్మధారయమునందు రుగాగమంబగు

ఉదా: పేద+ఆలు=పేదరాలు


దుగాగమ సంధి: యుష్మత్, అస్మత్, ఆత్మార్ధకంబులకు ఉత్తర పదంబు పరంబగునపుడు దుగాగమంబు విభాషనగు.

ఉదా: నీ+చెలిమి=నీదు చెలిమి


నుగాగమ సంధి: సమాసంబుల ఉదంతంబులగ స్త్రీ సమంబులకు, పు - ంపులకు, పరుష సరళంబులు పరంబులగునపుడు నుగాగమంబగు.

ఉదా: సొగసు+తనము=సొగసుందనము


పడ్వాది సంధి: పడ్వాదులు పరంబగునపుడు ము వర్ణ కంబునకు లోప పూర్ణ బిందువులు విభాషనగు.

ఉదా: భయము+పడె=భయపడె


త్రిక సంధి: ఆ - ఈ -ఏ అను సర్వనామంబులు త్రికంబనబడు.

ఉదా: ఆ+క్కడ=అక్కడ.


ద్విగు సమాస సంధి: సమానాధికరణంబగు ఉత్తర పదంబు పరంబగునపుడు 'మూడు' శబ్దములోని 'డు' వర్ణమునకు లోపంబును, మీది హల్లునకు ద్విత్వంబునగు.

ఉదా: మూడు+లోకములు=ముల్లోకములు.


బహువ్రీహి సమాస సంధి: బహువ్రీహిని స్త్రీ వాచ్యంబునగుచో ఉపమానంబు మీది మేనునకు బోడియగు.

ఉదా: అలరు+మేను=అలరుఁ బోడి.


ప్రాతాది సంధి: సమాసంబులన్ ప్రాతాదుల తొలి యచ్చుమీది వర్ణంబుల కెల్ల లోపంబు బహుళంబుగానగు.

ఉదా: క్రొత్త+గండి=క్రొగ్గండి.


సంస్కృత సంధులు


సవర్ణదీర్ఘ సంధి: అ - ఇ - ఉ - ఋ -ల కు సవర్ణములైన అచ్చులు పరంబగునపుడు ఆ రెండింటికి కలిపి దీర్ఘము ఏకాదేశమగును.

ఉదా: భాను+ఉదయము=భానూదయము.


గుణ సంధి: అకారమునకు ఇ - ఉ - ఋ ల పరంబగునపుడు క్రమముగా ఏ - ఓ - ఆర్ లు ఆదేశమగును.

ఉదా: చంద్ర+ఉదయము=చంద్రోదయము


యణాదేశ సంధి: ఇ - ఉ - ఋ లకు అసవర్ణములైన అచ్చులు పరమగునపుడు క్రమముగా య - వ - ర లు ఆదేశమగును

ఉదా: అతి+అంతము=అత్యంతము.


వృద్ధి సంధి: అకారమునకు ఏ - ఐ లు పరమగునపుడు ఐ కారమును, ఓ - ఔ లు పరమగునపుడు ఔ కారమును వచ్చును

ఉదా: ఏక+ఏక=ఏకైక.


అనునాసిక సంధి: క - చ - ట -త - ప లకు 'న - మ ' అను అనునాసికాక్షరములు పరమైనపుడు క్రమముగా ఆయా వర్గ అనునాసికాక్షరములు వికల్పముగా ఆదేశమగును.

ఉదా: జగత్+నాటకము=జగన్నాటకము.


జస్త్వ సంధి: వర్గ ప్రధమాక్షరములకు అచ్చులుగాని,వర్గ తృతీయ, చతుర్ధాక్షరములుగాని, హయవరలు గాని పరమగునపుడు క్రమముగా ఆయా వర్గ తృతీయాక్షరములు ఆదేశమగును.

ఉదా: వాక్+ఈశ=వాగీశ.


శ్చుత్వ సంధి: సకారత వర్గములకు, శకార చవర్గములు పరమగునపుడు శకార చవర్గములు ఆదేశమగును.

ఉదా: తపస్+శక్తి=తపశ్శక్తి

ష్టుత్వ సంధి: సకార తవర్గములకు; షకార- టవర్గములు పరమైన, షకార టవర్గములే వచ్చును.

ఉదా: తత్+టీక=తట్టీక.

ఛత్వ సంధి: క - చ - ట - త - ప లకు శ వర్ణము పరమైనపుడు 'ఛ' కారము వికల్పముగా వచ్చును.

ఉదా: విద్యుత్+శక్తి=విద్యుచ్ఛక్తి.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: