telugudanam.com

      telugudanam.com

   

వ్యాకరణం ఉపోద్ఘాతం

ఏ భాషలోనైనా అంతర్గతంగా ఉన్న లక్షణాలను సూత్రీకరించి వ్రాసిన గ్రంధం వ్యాకరణ గ్రంధమవుతుంది.శబ్ద శాస్త్రమే వ్యాకరణం. ఆ భాషలో లక్షణాలే ఆ భాషకు వ్యాకరణం అవుతుంది. వ్యవహారంలో మాట్లాడుకునే భాషకు కూడా వ్యాకరణం ఉంటుంది. వ్యావహారికంగా దేశ కాల పాత్రలనుబట్టి వచ్చే మార్పులు ఆ భాష వ్యాకరణంలో మార్పులు తీసుకొస్తాయి. ఎప్పటికప్పుడు వీటినుండి వ్యాకరణ సూత్రాలకు కూడా మార్పులు చేసుకుంటుండాలి. కాబట్టి ఆయా కాలాలలో శిష్ట వ్యవహారాలన్నింటినీ ఆధారం చేసుకుని వ్యాకరణ సూత్రాలని సరిదిద్దుకుంటూండడం సంప్రదాయకం అయింది.

భారత రాజ్యాంగం గుర్తించిన ముఖ్యమైన నాలుగు ద్రావిడ భాషలలో తెలుగు ఒకటి. మిగిలినవి తమిళం, కన్నడం, మలయాళం. భారతదేశంలో ద్రావిడ భాషలను మాట్లాడేవారిలో తెలుగు మాట్లాడేవారి సంఖ్య అధికం. ఈ విషయంలో మొత్తం భారతదేశంలో హిందీ ప్రధమ స్థానం వహిస్తే తెలుగు రెండవ స్థానం పొందుతూంది. తెలుగు వారి సాహిత్యం అతి ప్రాచీనమైంది. రెండు సంవత్సరాల క్రితమే తెలుగు ఒక స్వతంత్ర భాషగా స్థిరపడిపోయింది. తెలుగు నుడికారము, మృదుమధుర భావగర్భితము, అత్యంత హృదయానందకము.

ప్రపంచ భాషలలో ఎట్టి శబ్దాన్నైనా తనలో జీర్ణించుకోగల సత్తా, ఏ శబ్దాన్నైనా ఉచ్చరింపజేయగల శక్తి అటు సంస్కృతానికీ ఇటు తెలుగుకు తప్ప మరే భాషకూ లేదు. ఇట్టి తెలుగు భాషకు నన్నయభట్టు మొదలుకొని ఎందరెందరో కవులు వ్యాకరణాలు రచించారు. ఇంకా రచనలు కొనసాగిస్తూనే ఉన్నారు. తెలుగు వ్యాకరణాలలో మొట్టమొదటిది 11వ శతాబ్దంలో వెలువడిన "ఆంధ్ర శబ్ద చింతామణి". భారత రచనకు పూర్వమే నన్నయ దీనిని రచించాడనే వాదోపవాదాలు ఉన్నాయి. ఇది నన్నయ కృతమని కొందరు, కాదని మరికొందరూ వాదిస్తున్నారు. ఇది 80 అర్యావృత్తములతో సంస్కృతములో రచించబడింది.

క్రీ.శ. 13వ శతాబ్దంలో అధర్వణాచార్యులు ఆంధ్ర శబ్ద చింతామణి సూత్రాలకు వివరణలు, సవరణలు చూపుతూ వార్తికములు సంస్కృతంలో రచించారు. ఇంతేగాక ఇతడు తెలుగునకు సంస్కృత భాషలో వికృతి వివేకము లేక అధర్వణ కార్తికావళి, త్రిలింగ శబ్దానుశాసనము అను రెండు వ్యాకరణాలను రచించాడంటారు. పై రెండు గ్రంధాలలోనూ లక్షణములేగానీ లక్ష్యములు లేవు. లక్షణ లక్ష్య సమన్వయంగా క్రీ.శ. 13వ శతాబ్దంలో కేతన (దశ కుమార చరిత్ర రచించిన కవి) ఆంధ్ర భాషాభూషణము తెలుగు మాటలకు తెలుగు భాషలో వ్రాయబడిన మొదటి గ్రంధము.

15వ శతాబ్దంలో విన్నకోట పెద్దన వ్యాకరణాంశములతోపాటు చందోలంకార రూపమగు కావ్య లక్షణాలను కూడా చేర్చి కావ్యాలంకార చూడామణిని తెలుగు పద్య రూపంలో రచించాడు. ఇదే కాలంలో వెల్లంకి తాతంభట్టు కవి లోక చింతామణి వ్యాకరణాంశాలతోపాటు కొన్ని లక్షణాలను చేర్చి తెలుగు పద్యాలలో రచించాడు. తరువాత 16వ శతాబ్దంలో ముద్దరాజు రామన పైవాటికన్నా కొంత మేలుగా "కవిజన సంజీవని" రచించాడు. ఇది కూడా పద్య రూపంలో ఉన్నా అక్కడక్కడ వచనాలతో వివరించబడింది.

17వ శతాబ్దంలో బాల సరస్వతి ఆంధ్ర శబ్ద చింతామణికి బాల సరస్వతీయము అను తెలుగు టీకను వ్రాశాడు. బాల సరస్వతీయం వల్లే ఆంధ్ర శబ్ద చింతామణి ప్రచారంలోకి వచ్చింది. ఇదే శతాబ్దంలో కాకునూరి అప్పకవి ఆంధ్ర శబ్ద చింతామణిని తెనిగించి అప్పకవీయము రచించాడు. ఇదే సమగ్ర లక్షణ గ్రంధమనిపించుకుంది. 17వ శతాబ్దంలోనే అహోబల పండితుడు పూర్వ కవుల గ్రంధాలను పరిశోధించాడు. కవి శిరోభూషణము అను గ్రంధమును సంస్కృతంలో చింతామణికి వ్యాఖ్యానం వ్రాశారు. దీనినే పండితులు అహోబల పండితీయం అన్నారు. ఈ శతాబ్దంలోనే మండ నరసింహ కవి సూత్ర వివరణము సంస్కృతంలోనూ, ఉదాహరణలు తెలుగులోను పెట్టి ఆంధ్ర కౌముదిని రచించాడు.సర్వ లక్షణ సార సంగ్రహం గణపవరపు వేంకటకవి (17వ శతాబ్దం) రచంచాడు. అదే పేరుతో 18వ శతాబ్దంలో కూచిమంచి తిమ్మకవి మూడు ఆశ్వాసముల పద్య గ్రంధమును ఎక్కువ వ్యాకరణ విశేషాలతో లక్షణ సంస్కారంతో రచించాడు. తరువాత కస్తూరి రంగకవి "ఆనందరంగరాట్చందము", ఆడిదం సూరకవి యొక్క "కవి సంశయ విచ్చేదము" వచ్చాయి. ఆయా కాలాలకు తగినట్టుగా ఈ గ్రంధాలు కనిపించినా 19వ శతాబ్దం నాటికి అన్నీ అసమగ్రాలుగనే కనిపించాయి. చింతామణి, అహోబిల పండితీయం సంస్కృతంలో వచ్చాయి. ఇవి సంస్కృతం తెలిసినవారికి మాత్రమే ఉపయోగపడుతున్నాయి. తరువాత వచ్చిన ఆంధ్ర భాషాభూషణాదులు తెలుగు పద్యాలలో ఉన్నాయి. ఇవి తెలుగు తెలిసిన వారికి ఉపయోగపడినా ఎక్కువగా కావ్య లక్షణాలను నిరూపిస్తున్నాయి. కావ్యాలంకార చూడామణి, అప్పకవీయం మొదలైన వాటిలో వ్యాకరణాంశాలు బహుకొద్దిగా ఉన్నాయి.

కావ్య వాజ్ఞ్మయం బహుముఖంగా విస్తరించుకుపోయింది. ముందువచ్చిన వ్యాకరణాలన్నీ 19వ శతాబ్దం నాటికి అసమగ్రాలుగా కనిపించాయి. ఇది గ్రహించి పరవస్తు చిన్నయ ప్రాచీన వ్యాకరణ మర్యాదలతో సంస్కృతంలో సూత్రప్రాయంగా తెలుగు వ్యాకరణం రచించాడు. ఇదేగాక ఇతడు సంస్కృత భాషలో పాండిత్యం సంపాదించాడు. అనేక ప్రాచీన లక్షణ గ్రంధాలను పరిశీలించాడు. తెలుగు భారతము, భాగవతము మొదలైన గ్రంధాలలో ప్రయోగాలను తెలుసుకున్నాడు. వీటితోపాటు అనుభవాన్ని కూడా జోడించి క్రమపద్ధతిలో తెలుగు సూత్రాలతో మిక్కిలి సులభ శైలిలో వివరణలతోసహా బాల వ్యాకరణం రచించాడు. ఈ చిన్నయ బాల వ్యాకరణమే తరువాత వచ్చిన వ్యాకరణకర్తలకు అందరికీ ఆధారమైంది. ఇదే ఆంధ్ర భాషకు ప్రామాణికమైన వ్యాకరణ గ్రంధము. ఆంధ్ర వాజ్ఞ్మయానికి చిన్నయ రచించిన బాల వ్యాకరణం సంస్కృత వాజ్ఞ్మయానికి సిద్ధాంత కౌముది వంటిది.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: