telugudanam.com

      telugudanam.com

   

వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌

వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌
పేరు : వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌.
తండ్రి పేరు :

(తెలియదు).

తల్లి పేరు :

(తెలియదు).

పుట్టిన తేది : 1883.
పుట్టిన ప్రదేశం : నాశిక్‌ లో జన్మించాడు.
చదివిన ప్రదేశం : లండన్‌.
చదువు : 'లా' చదవాలన్న కోరికతో లండన్‌కు వెళ్ళారు.
గొప్పదనం :

(తెలియదు).

స్వర్గస్తుడైన తేది :

(తెలియదు).


"మరణాన్ని ముద్దాడి వచ్చిన వాళ్లకు జీవితం విలువ ఎక్కువగా తెలుస్తుంది." అంటారు అందుకే కాబోలు విశాల సాగరంతోనే సుదీర్ఘ సమయంపాటు మరణంతో పోరాడి ఒడ్డుకువచ్చిన వినాయక దామోదర్‌ సావర్కర్‌ తన జీవితాన్ని భారతదేశ అభ్యున్నతికే అంకిత ఇచ్చారు. 'సావర్కర్' అన్న పేరు ఒక చరిత్ర, ఒక సంచలనం.

రెండు యావజ్జీవ కారాగార శిక్షలనుభవించి కూడా, బయటకు వచ్చిన తర్వాత భారతదేశ అభ్యున్నతికి కృషి చేసిన పోరాటయోధుడు సావర్కర్‌. క్రీ.శ. 1883వ సంవత్సరంలో మహరాష్ట్రలోని నాశిక్‌ లో జన్మించారు. చిన్ననాడు తన తల్లిదండ్రులు చెప్పిన రామాయణ, మహాభారత కధలు, ఛత్రపతి శివాజీ, మహారాణా ప్రతాప్‌ వంటివారి వీరగాధలు సావర్కర్‌ను ప్రభావితం చేశాయి. చిన్ననాడే 'మిత్రమండలి' స్థాపించి, మిత్రులలో జాతీయతాభావం పెంపొందించటానికి కృషి చేసి, పలువురి ప్రశంసలు అందుకున్నారు. ఆ జాతీయతా స్ఫూర్తి సావర్కర్‌ను జీవితపు చివరి క్షణం వరకు పోరాటయోధునిగా నిలబెట్టింది. 'లోకమాన్య' బాలగంగాధర తిలక్‌ను కలవడం అతనిలోని స్వాతంత్ర్యసాధన కాంక్షను మరింతగా ప్రభావితం చేసింది.

బి.ఎ.పూర్తి చేసింతర్వాత, 'లా' చదవాలన్న కోరికతో సావర్కర్‌ లండన్‌కు వెళ్ళారు. అక్కడ శ్యామ్‌జీ కృష్ణవర్మ, మదన్‌లాల్‌ ధింగ్రా వంటి వారిని కలవడం సావర్కర్‌లోని విప్లవ భావాలను ఉధృతం చేశాయి. సావర్కర్‌ లండన్‌లో బసచేసిన 'ఇండియాహౌజ్‌' విప్లవకారులకు వేదిక అయ్యింది. సావర్కర్‌ యిలా విప్లవకార్యాల్లో పాల్గొనుటవల్ల, బ్రిటిష్‌ ప్రభుత్వం అతన్ని నిర్బంధించి, భారత్‌కుపంపింది. మార్గమధ్యంలో సావర్కర్‌ సముద్రంలో దూకి, తప్పించుకుని కొన్ని మైళ్ళదూరం యీదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నప్పటికీ, దురదృష్టవశాత్తూ పోలీసుల చేతచిక్కి అండమాన్‌కు పంపబడ్డారు. తరువాత రత్నగిరిలో గృహనిర్బంధంలో ఉంచారు. జైల్లో వున్న సమయంలో అనుభవించిన శారీరక శిక్షణ వల్ల సావర్కర్‌ జీవితాంతం అనారోగ్యంతో బాధపడవలసి వచ్చింది.

స్వాతంత్ర్య సముపార్జనకే కాక, సావర్కర్‌ హిందూమత పునరుద్ధరణ కొరకు కృషి చేశారు. 'హిందూ మహాసభ' ను స్థాపించి హిందువులను సంఘటితం చేయటానికి కృషి చేశారు. 1948వ సంవత్సరంలో మహాత్మాగాంధీ హత్య కేసులో నిందితునిగా అరెస్టు చేయబడినప్పటికీ, సావర్కర్‌పై మోపబడిన అభియోగాలు నిరూపితం కాకపోవడంతో నిర్దోషిగా విడుదలయ్యారు. సుదీర్ఘకాలపు జైలు మిగిల్చిన అనారోగ్యం కారణంగా 1966వ సంవత్సరంలో సావర్కర్‌ గారు భౌతిక జీవనాన్ని ముగించవలసి వచ్చింది.

ఒక స్వాతంత్ర్య సమరయోధునిగా, హిందూమత పునరుద్ధరణకు కృషికల్పిన వారిగా మాత్రమేకాక కవిగా, రచయితగా, మేధావిగా సావర్కర్‌గారు బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించారు. అండమాన్‌లో జైలుజీవితం గడిపిన సమయంలో జైలు గోడల పై దాదాపు పదివేల పంక్తులను వ్రాసి, వాటిని గుర్తుంచుకుని, బయటకు వచ్చిన తర్వాత గ్రంధస్తం చేశారంటే సావర్కర్‌ మేధోప్రతిభ ఏపాటిదో అర్థం అవుతుంది. ఇక రచయితగా కూడా ఆయన పలు ప్రామాణిక గ్రంధాలు రచించారు. 1857వ సంవత్సరపు సిపాయి తిరుగుబాటును 'ప్రధమ స్వాతంత్ర్యం సమరం' గా అభివర్ణిస్తూ సావర్కర్‌ రచించిన 'The Indian War of Independence:1857 ' పుస్తకం పలువురు విప్లవకారులకు పఠనీయ గ్రంధంగా నిలిచి వారిలో స్ఫూర్తి నింపింది. అదేవిధంగా భారతీయ సంస్కృతి ఉత్ధానపతనాలను, వాటికి గల కారణాలను తనదైన శైలిలో వివరిస్తూ సావర్కర్‌ రచించిన 'Six Golded Epoches of Indian History' (భారతీయ చరిత్రలో ఆరుసువర్ణపత్రాలు) అన్న పుస్తకం పలువురి ప్రశంసలందుకుంది. అవేకాక యింకా 'Hindu Pad-Padshahi', 'My Transportation through Life' వంటి పలు పుస్తకాలు ఆయనలోని రచనా ప్రతిభకు, భావ తీవ్రతకు అద్దం పడతాయి.

వినాయక దామోదర సావర్కర్‌ వంటి బహుముఖ ప్రజ్ఞాశాలురు అరుదు. సావర్కర్‌ జీవితాన్ని పరిశీలిస్తే నేటి యువతకు పోరాటపటిమ అంటే ఏమిటో, మొక్కవోని పట్టుదల అంటే ఏమిటో అర్థం అవుతుంది. అందుకే సావర్కర్‌ ఆదర్శనీయులయ్యారు.


మూలం: భారతీయం, ఆదెళ్ళ శివకుమార్, ఓం పబ్లికేషన్స్.

[ వెనుకకు ] [ ముందుకు ]

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: