telugudanam.com

      telugudanam.com

   

అనిబిసెంట్

పేరు : అనిబిసెంట్
తండ్రి పేరు :

(తెలియదు).

తల్లి పేరు :

(తెలియదు).

పుట్టిన తేది : 1-10-1847.
పుట్టిన ప్రదేశం : లండన్.
చదివిన ప్రదేశం : లండన్.
చదువు : 1977.
గొప్పదనం : స్వాతంత్ర్యం తీసుకురావటానికి మన దేశ నాయకులతో చేతులు కలిపి, ఒక భారతీయ మహిళ కంటే ఎక్కువగా కృషి చేసింది. ' న్యూ ఇండియా ' అనే ఆంగ్ల పత్రికను స్థాపించి, రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటూ ' కామన్ వీల్ ' అనే వారపత్రిక నడూపుతూ ' హొం రూల్ లీగ్ ' ఉద్యమాన్ని లేవదీసింది. బాలగంగాధర్ తిలక్, జిన్నా, మోతీలాల్ నెహ్రూ వంటి మహానాయకులు ఆ లీగ్‌ను సమర్ధిస్తూ అందులో చేరారు. 1917లో కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెసు వార్షిక సమావేశానికి అధ్యక్షతవహించి, భారతీయ నాయకులలో అలుముకొని ఉన్న వైషమ్యాలను పోగొట్టడానికి గట్టి కృషి చేసింది అనిబిసెంట్.
స్వర్గస్థురాలైన తేది : 1933.

భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకురావాలని అనేక మంది నాయకులు పోరాడినారు. భారతీయులతోబాటు ఒక ఆంగ్ల స్త్రీ కూడా ఆంగ్లేయులపైన తిరుగుబాటు ప్రకటించింది. భారతీయులు బానిసలుగా నలిగిపోతుంటే చూడలేక, వారిని దాస్యశృంఖలాల నుంచి విముక్తి చేయాలని కంకణం కట్టుకుంది. ఆమె అనిబిసెంట్. ప్రాంతీయ భేదాలను మరిచి, ప్రేమ, త్యాగం, మూర్తీభవించిన మహమహిమాన్వితురాలు అనిబిసెంట్. తన దేశం ప్రజలు సంస్కృతి అన్నీ మరిచి, విభిన్న సంస్కృతులకు నిలయమైన భారత దేశంలో స్థిరపడాలని నిశ్చయించుకొని, చివరి శ్వాస వరకు మన దేశంలోనే గడిపిన అనిబిసెంట్ భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకురావటంలో తన పాత్రను ఎంతో సమర్థవంతంగా పోషించింది. అనీవుడ్ 1847 అక్టోబర్ 1 న లండన్ నగరంలో జన్మించింది. చిన్నతనం నుంచి సత్ ప్రవర్తన ప్రేమ, స్రేవ, త్యాగం వంటి లక్షణాలు అలవరచుకుంది. తల్లి ఇచ్చిన బ్రెడ్ ముక్కలను, ఆపిల్ ముక్కలను పాఠశాలలో తనతో చదువుకునే పేద విద్యార్ధినులతో కలిసి తినేది. తెచ్చిన తినుబండారాలు సరిపోకపోవటంవల్ల మర్నాడు ఉదయం తల్లితో ' అమ్మా ఈ మధ్య నాకు ఆకలి చాలా ఎక్కువగా ఉంటుంది. దయ్యం తిన్నట్టుగా తింటున్నాను. కాబట్టి నా కేరేజీలో నలుగురికి సరిపడేంత ఆహారం పెట్టు అంది. తల్లి నిజమే అనుకుని, నలుగురికి సరిపడే రొట్టెలు, పళ్ళూ కేరేజీలో పెట్టి ఇచ్చింది. సాయంత్రం అనీవుడ్ మామూలుగా ఖాళీ కేరేజీ తేవటం తల్లికి ఎంతో ఆశ్చర్యం కలిగించింది.

నిజంగా ఒకవేళ తన కూతురుని ఏదైనా దయ్యం ఆవహించిందేమోనని భయపడి ఆ సాయంత్రమే ఆమె స్కూలు టీచరుని కలిసి అన్ని ఆహారపదార్ధాలు ఆమె ఒక్కర్తీ ఎలా తింటుందో గమనించమని కోరింది. మర్నాడు టీచరు అసలు విషయం చూసి తల్లికి చెప్పింది. అప్పుడూ తల్లి అనీవుడ్ తో ' నువ్వు చేస్తున్నది చాలా మంచిపని. భగవంతుడి దయ వలన మనకు ఆర్ధిక ఇబ్బందులు లేవు కాబట్టి ఆ పని చేయవచ్చు. కానీ నువ్వు దాని గురించి అబద్దం ఆడవలసిన పనిలేదు, ధైర్యంగానే చెయ్యి' అని హితబోధ చేసింది. ఆ రోజు నుంచి మళ్ళీ అబద్దం ఆడలేదు. ఆమె చిన్నతనంలోనే తండ్రి మరణించటంతో ఆమె లేత హృదయం గాయపడింది. ఆమె తల్లే అనీవుడ్ కు, తండ్రిగా, స్నేహితురాలుగా ఉంటూ ఆమెను అనుక్షణం కంటికి రెప్పలా చూసుకుంటూ ఒక సంపూర్ణవ్యక్తిగా తీర్చిదిద్దింది.

అనీవుడ్ కి చిన్నతనంలో క్రైస్తవ మతంపైన అపారవిశ్వాసం ఉండేది. తన జీవితమంతా ఆధ్యాత్మిక చింతనలోనే గడపాలని స్పూర్తిగా కోరుకునేది. అదే ఉద్దేశంతో మతబోధకుడైన ఫ్రాంక్ బిసెంట్‌ను వివాహమాడి, అనీవుడ్ అనిబిసెంట్ గా మారింది. దురదృష్టవశాత్తు వారిద్దరి అభిప్రాయాలూ ఏనాడూ కలవలేదు. ఫలితంగా వారిద్దరి మధ్యా వాగుద్యాలు ప్రతిరోజూ జరుగుతుండేవి. మతం గురించి తను ఏర్పరచుకున్న భావాలను, అభిప్రాయాలను భర్త గౌరవించకపోవటంతో ఆమెకు జీవితంపైనే విరక్తి కలిగింది. భర్త ప్రవర్తన ఆమెకు తీవ్ర మనస్తాపాన్ని కలిగించింది. ఒక స్థితిలో ఆమె ఆత్మహత్య చేసుకుందామని కూడా అనుకుంది. కాని పిరికిదానిలా ఆత్మహత్య చేసుకోకూడదనీ, తన జీవితాన్ని పదిమందికి పనికి వచ్చేలా తీర్చిదిద్దుకోవాలనీ నిశ్చయించుకుని ఆ ప్రయత్నం విరమించుకుంది.

భర్త మతం పేరుతో చేసే చెడుపనులు, చెడు వ్యవహారాలను చూసి విసుగుచెంది, కాలక్రమేణా ఆమెకు చర్చి మీద, క్రైస్తవ మతం మీద విశ్వాసం సన్నగిల్లి, తన అభిప్రాయాలను ఒక గ్రంధంగా రాసింది. అది చదివి కోపోద్రేకుడైన భర్త ఆమెను తిట్టాడు. కొట్టాడు. చివరకు విడాకులిచ్చాడు. అదే సమయంలో ఆమె తల్లి మరణించింది. ఆ క్షణం నుంచి ఆమెకు కష్టాలు ప్రారంభమయ్యాయి. కుటుంబ జీవితానికి పూర్తిగా దూరమయిన తరువాత తన శేషజీవితాన్ని మానవసేవలో గడపాలని నిర్ణయించుకుంది. ఫలితంగా అనిబిసెంట్ థియోసాఫికల్ సొసైటీ (దివ్యజ్ఞాన సమాజంలో ) చేరి తన దివ్య ప్రేమను ప్రపంచమంతా వెదజల్లడానికి, సమాజం తరుపున ఐరోపా, అమెరికా, ఆస్ట్రేలియాలు తిరిగి, అనేక ఉపన్యాసాలు ఇచ్చి ఎందరినో సమాజ సిద్దాంతాలతో ఉత్తేజితుల్ని చేసి, 1893లో భారతదేశం వచ్చింది. ఆ సమయంలో భారతదేశం అంగ్లేయుల పరిపాలనలో అత్యంత దయనీయస్థితిలో ఉంది. కళలకు కాణాచి అయిన భారతదేశంలో తన దేశం వారు చలాయిస్తున్న పెత్తనం చూసి సహించలేకపోయింది. ప్రజలలో ఉన మూఢనమ్మకాలను, అజ్ఞానాన్ని, నిరక్ష్యరాస్యతను, సాంఘీక దురాచారాలను రూపు మాపి వారిని చైతన్యవంతులుగా మార్చినప్పుడు, ప్రజలే ఆంగ్లేయులకు సరైన గుణపాఠం నేర్పి వారిని తిరుగు ప్రయాణం కట్టించగలరని ఆ మహా మహిళ ఆనాడే ఊహించింది. అంతే మరుక్షణం భారతదేశమే తన ఆఖరి మజిలీగా ఏర్పరచుకొని, తన జీవిత సర్వస్వం భారతీయులకు త్యాగం చేయాలని దృఢంగా నిర్ణయించుకుంది.

భారతదేశంలో సాంఘీక దురాచారాన్ని రూపు మాపటానికి ఎన్నో ఉద్యమాలు చేపట్టిందీ స్త్రీ. విద్యావశ్యసతను నొక్కిచెప్పి, వారిని చైతన్యవంతుల్ని చేయగలిగింది. అగ్రకులాలవారు, అంటరానివారు అని రెండు వర్గాలుగా విడిపోయి ఉన్న ప్రజలను ఒకే వర్గంగా చేయడానికి అవిరామకృషి సల్పింది. అస్పృస్యతా నివారణకై ఆమె సలిపిన కృషి అనిర్వచనీయం. హరిజన బాలబాలికలకు పాఠశాలలు స్థాపించి, వారిని చదివించేలా చేసింది. సత్యం, ధర్మం, న్యాయం, త్యాగం ఈ నాలుగు సూత్రాలనూ ప్రజలకు బోధించి, వారిలో నూతన చైతన్యాన్ని కలిగించింది. 1898లో కాశీలో కేంద్రీయ హిందూ కళాశాలను స్థాపించి అనంతరం మదనమోహన మాలవ్యా వంటి నాయకుల సహయంతో ఆ కళాశాలను ఎంతో వృద్ధి చేసింది.

అనేక సంస్కృతులకు నిలయమైన పవిత్ర భారతదేశం నిత్య నూతనంగా సుగంధ సౌరభాలను వెదజల్లాలంటే ఆంగ్లేయులను దేశం నుంచి బయటకు పంపాలనీ, వారివల్ల దేశ సంస్కృతి కలుషితమయిపోతున్నదని ఆమె భావించి, మన దేశ నాయకులతో చేతులు కలిపి, ఒక భారతీయ మహిళ కంటే ఎక్కువగా కృషి చేసింది. ' న్యూ ఇండియా ' అనే ఆంగ్ల పత్రికను స్థాపించి, రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటూ ' కామన్ వీల్ ' అనే వారపత్రిక నడూపుతూ ' హొం రూల్ లీగ్ ' ఉధ్యమాన్ని లేవదీసింది. బాలగంగాధర్ తిలక్, జిన్నా, మోతీలాల్ నెహ్రూ వంటి మహానాయకులు ఆ లీగ్‌ను సమర్ధిస్తూ అందులో చేరారు. 1917లో కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెసు వార్షిక సమావేశానికి అధ్యక్షతవహించి, భారతీయ నాయకులలో అలముకుని ఉన్న వైషమ్యాలను పోగొట్టడానికి గట్టి కృషి చేసింది అనిబిసెంట్.

[ వెనుకకు ] [ ముందుకు ]

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: