telugudanam.com

      telugudanam.com

   

జాతీయాలు (IDIOMS)

తెలుగు నేర్చుకోవాలనుకునేవారు మేమిచ్చిన పాఠాలను క్షుణ్ణంగా నేర్చుకున్న తరువాత వాడుక భాషలోని కొన్ని పదాల అర్ధాలను తెలుసుకోవడం అవసరమని భావిస్తూ మనం నిత్యం మట్లాడే కొన్ని పదాల వివరణలను ఇప్పుడు ఇస్తున్నాం. ఈ మాటలు ఏ సందర్భంలో అనాలో తెలిసినప్పటికీ గమ్మత్తైన ఈ పదాలు అసలు ఎలా పుట్టాయో తెలుసుకోవడం విఙాఞనదాయకంగానూ, వినోదాత్మకంగానూ ఉంటుంది. తెలుగు భాషకు మాత్రమే సొత్తైన ఈ పదాలను, పదబంధాలను జాతీయాలు అంటారు. మీక్కూడా తెలీకుండా అలవోకగా మీరు అనే ఈ జాతీయాల వివరణలోకి ఇప్పుడు వెళ్దాం.


జాతీయం అంటే?

ఒక జాతి ప్రజ ఒకభావాన్ని ప్రకటించడంలో వ్యక్తం చేసే భాషాపరమైన విలక్షణత. దీన్నే పలుకుబడి అని కూడా అంటారు. "ఓరంతపొద్దు, ఓడలు బండ్లు బండ్లోడలు, గుండెరాయి చేసుకొను, చెవిలో ఇల్లుగట్టుకొనె పోరు, కాలికి బలపం గట్టుకొని తిరుగు, కొట్టీనపిండి, కొంపముంచు, గంగిగోవు, కత్తులునూరు, మొదలైన పదబంధాలు జాతీయాలుగాను, నుడికారాలుగాను వ్యవహృత మవుతాయి. ఇవే సామెతరూపాన్ని కూడా సంతరించుకొనడం జరగవచ్చు.

సామెతలు, జాతీయాలు ఒకేలా అనిపిస్తాయి. కాని చిన్న తేడా ఉంది. జాతీయాలు సామాన్యంగా చిన్నవిగా అంతే చిన్న చిన్న పదాల రూపంలో ఉంటాయి. సామెతలు పెద్దవిగా వాక్యాల రూపంలో ఉంటాయి.

కొన్ని జాతీయాలు : అకాశ రామన్న, మక్కీ కి మక్కి మొదలైనవి.


జాతీయాలు ఎలా ఏర్పడ్డాయి?

కొన్ని ఉదాహరణలు :


1. అమీ తుమీ :

వాస్తవానికి ఇవి బెంగాలీ భాషకు చెందిన పదాలు. అయినప్పటికీ తెలుగు పదలుగా చెలామణి అవుతున్నాయి. ఇక అర్ధంలోకి వస్తే అమీ అంటే నేను, తుమీ అంటే నువ్వు అనర్ధం. ఏదేని ఒక సంఘర్షణ సంభవించినప్పుడు నువ్వో నేనో తేల్చుకుందాం అనే చాలెంజి విసురుకునే క్రమంలో అమీ తుమీ అనే జాతీయాన్ని వాడతాము.


2. కత్తి మీద సాము :

సాము అంటే విన్యాసం. విన్యాసమనేది ఒక యుద్ధ విద్య కావచ్చు లేక నాట్యానికి సంబంధించినదైనా కావచ్చు లేక ఏకాగ్రతతో చేసే ఏ పనైనా కావచ్చు. ఏదేమైనా వీటిని నేల మీద చెయ్యాలంటేనే ఎంతో నేరుపు, ఓర్పు, సహనం ఉండాలి. అటువంటిది కత్తి మీద సాము చెయ్యడమంటే ఎంత కష్ట సాధ్యమో ఆలోచించాలి. ఏదైనా పని అసాధ్యం అని చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతాం.


3. కరతలామలకం :

చాలా సులభం అని దీనికి అర్ధం. కరం అంటే చెయ్యి. అమలకం అంటే ఉసిరికాయ. ఉసిరికాయ అరచేతిలో చాలా తేలిగ్గా ఇమిడిపోతుంది కాబట్టి అంత తేలిక అని దీని భావం. ఒక వ్యక్తి ఏదేని విషయంలో ఎక్స్పర్ట్ అనే అర్ధంలో ఈ జాతీయాన్ని వాడతాం.


4. గాడిద గుడ్డు :

గాడిద గుడ్డు పెట్టదు. అంటే ఏమీ లేదని దీనర్ధం. విసుగు పుట్టినప్పుడు ఈ జాతీయం అక్కరకొస్తుంది సహజంగా.


5. గొంతెమ్మ కోరిక :

కుంతికి విక్రుత నామమే గొంతి. కాలక్రమేణా అదె గొంతెమ్మ అయ్యింది. తనకు వరప్రసాదమైన కోరికను అనాలోచితంగా కుంతి కోరుకోవడంతో ఆమెకు వివాహానికి ముందే సూర్య భగవానుడి వల్ల కర్ణుడు జన్మిస్తాడు. అందువల్ల ముందుచూపు లేకుండా చేసే చర్యలు ఇబ్బంది పెడతాయని దీని భావన. అంతేకాకుండా కురుక్షేత్ర యుద్ధంలో తన ఇద్దరు కుమారులైన కర్ణుడు, అర్జునుడు ఇద్దరూ బ్రతకాలని ఆమె కోరుకుంటుంది. అది సాధ్యం కాదు కాబట్టి అటువంటి సాధ్యం కాని కోర్కెలను కోరుకునేవారిని గొంతెమ్మ కోరికలు కోరుకోవద్దని పెద్దలు సలహా ఇస్తుంటారు.


6. తథాస్తు దేవతలు :

తమ పిల్లలు వేకువ జామునగానీ, చీకటి పడే సమయంలోగానీ చెడు మాటలు పలక్కుండా పెద్దలు నియంత్రణలో పెడతారు. దానికి కారణం ఆ సమయాల్లో దేవతలు ఆకాశంలో సంచరిస్తుంటారనీ, ఆయా వేళల్లో తిట్టుకుంటే ఆ దేవతలు తథాస్తు అంటారని, దానివల్ల వారికి చెడు జరుగుతుందని పిల్లలకు చెప్పి వాళ్ళను భయపెడతారు. ఇది కేవలం వారి మానసిక ప్రవృత్తిలో మార్పు తీసుకురావడంకోసం మాత్రమే పెద్దలు అలా అంటుంటారు. తమ పిల్లల నోట ఏ సమయంలోనూ పాడు మాటలు రాకూడదని పెద్దల ఆలోచన.


7. నకరాలు పోవడం :

నకరం అంటే వ్యాపారం చేసే ప్రాంతం. నకరాలు పోవడం అంటే కొనుగోలు చేయడం కోసం ఆర్భాటంగా పోవడం. నకరాకి వెళ్ళి అక్కడ పెద్దయెత్తున కొంటున్నట్లు హడావిడి చేయడం. చివరికీ మాట బడాయి పోవడం, పోజు కొట్టడం అనే అర్ధాలనిచ్చే జాతీయంగా మారింది.


8. మొసలి కన్నీరు :

ఎడుపు నటించే వారిని మొసలి కన్నీరు కారుస్తున్నాడంటారు. అసలు మొసలి కన్నీరు అనే పేరు ఎందుకొచ్చిందంటే...మొసలికి దయా దాక్షిణ్యాలు ఉండవు. అందిన జీవిని అందినట్లు తినడమే దాని పని. జాలి, దయ లేని మొసలి ఎదుటి వ్యక్తి గురించి కన్నీరు కార్చడమనేది అసాధ్యం. అది జాలి, దయ లేని మానవులకు కూడా వర్తిస్తుంది. అంతే కాదు నయవంచకులకు కూడ వర్తిస్తుంది. అందుకే మొసలికి కన్నీరు ఎలా రాదో కల్లబొల్లి కబుర్లరాయుళ్ళకు కూడా అంతే అనీ, అటువంటి వారి కన్నీళ్ళను నమ్మరాదని దీని భావన.


9. వేలం వెర్రి :

వేలం పాటంటే అందరికీ తెలిసిందే. ఒక వస్తువును బహిరంగంగా ప్రజల సమక్షంలో అమ్మకానికి పెట్టడం. ఇది కొనుగోలుదారుల మధ్య పోటీ అన్నమట. ఆ వస్తువులు ఎవరు ఎక్కువ ధరకు కొనుక్కుంటారో వాళ్ళదే ఆ వస్తువు. ఆ వస్తువు మీద మోజున్నవారు మాత్రమే ఆ పోటీలో పాల్గొంటారన్నమాట. దానివల్ల ఒక్కొక్కప్పుడు ఆ వస్తువు అసలు ధరకంటే కూడా వేలంలో మరింత ధర ఎక్కువ పలకవచ్చు. ఐనా పట్టుదలకు పోయి అలా ధరని పెంచుకుంటూ పోవడాన్ని వేలం వెర్రి అంటారు. వస్తువును దక్కించుకున్నవారు ఆ తరువాత ధర ఎక్కువ పెట్టినందుకు చింతించక మానరు. ఈ విధమైన పోటీ తత్వం మంచిది కాదనే ఉద్దేశ్యంలో ఈ జాతీయం ఏర్పడింది.

ఇలా అనేక జాతీయాలు తెలుగు భాషను సుసంపన్నం చేసాయి. జాతీయాలు అనుకరణకు సాధ్యం కానివి. అందుచేత తెలుగు నుడికారమంటే ఇతర భాషలలోనూ ఎంతో గౌరవముంది.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: