telugudanam.com

      telugudanam.com

   

జంట కవులు

ద్రవిడ భాషాకుటుంబానికి చెందిన 21 భాషలలో తెలుగు ఒకటి. అంధ్ర, ఆంధ్ర, తెనుంగు, తెనుగు, తెలుంగు, తెలుగు, త్రిలింగ, వడగు, వడుగ, జెంతూ అనే నామాలతో పిలువబడే తెలుగు భాషా సౌందర్యం, అది సంతరించుకున్న పుష్టి, ఎదిగిన రీతి, చూపిన సొగసు, అలవరచుకున్న సొగసు, అలవరచుకున్న సభ్యత హృదయానందకరమైనది. తేనె సొనలు జాలువారే తెలుగు భాష భారతీయ భాషలలో మణిపూసవంటిది. తెలుగు నుడికారము మధురము, భావగర్భితము. ఇట్టి తెలుగు భాషలో మహాభారతంలో ఆదిపర్వము, సభాపర్వము, అరణాపర్వము, అర్ధ భాగాన్ని రచించిన నన్నయ, నాల్గవ పర్వం నుంచీ చివరిదాకా 15 పర్వాలు తెలుగు చేసిన తిక్కన, మిగిలిన అరణ్య పర్వపు శేషాన్ని తెనిగించిన ఎర్రన కవిత్రయంగా కొనియాడబడుతున్నారు. అయితే వీరిలో ఎవరికి వారు వారివారి కాలాల్లో రచన చేసినప్పటికీ ఐక్య కవులవలె పేరుపొందారు. ఇద్దరు కవులు చేరి పరస్పరం చేర్పులు, కూర్పులు, మార్పులతో కావ్య కన్యను తీర్చిదిద్దేవారిని జంట కవులు అంటారు. ఇట్టి కవులలో కవిసార్వభౌముడు శ్రీనాధుని యుగంలో వెలసిన నంది మల్లన, ఘంట సింగయ్య తెలుగు వాజ్ఙయంలో మొదటి జంట కవులు లేక కవి యుగళం అని చెప్పుకోవచ్చు. ఈ జంట కవులు రచించిన కావ్యాలు ప్రబోధ చంద్రోదయము, వరాహ పురాణము.


తిరుపతి వేంకట కవులు:

వీరిద్దరూ అష్టావధాన, శతావధాన విద్యలందు ప్రవీణులు. ఈ జంట కవులలో మొదటివారు దివాకర్ల తిరుపతి శాస్త్రి, రెండవవారు చెళ్ళపిళ్ళ తిరుపతి శాస్త్రి. ఆంధ్ర కవితా సామ్రాజ్యాన్ని ఏకచత్రంగా పరిపాలించిన తిరుపతి వేంకట కవులు జగమెరిగిన బ్రాహ్మణులు. "దోసమటం చెరిగియును దుందుడు కొప్పగా పెంచి నారా మీ మీసము రెండు బాసలకు మేమే కవీంద్రులమంచు" అని ప్రతిపట్టణం, గ్రామము తిరుగుతూ వీరిద్దరూ సోదరులవలె పరస్పర సహకారంతో అవధానాలు, ఆశుకవితలు చెబుతూ అనేక నాటకాలు, పద్య కృతులు, వచన గ్రంధాలు, విమర్శ గ్రంధాలు రచించారు. మదరాసు ప్రభుత్వం వేంకట శాస్త్రిని ప్రధమ ఆస్థాన కవిగా ఆదరించింది.


వేంకట రామకృష్ణ కవులు:

ఈ జంటలో మొదటి వారు ఓలేటి వేంకట రామశాస్త్రి కాగా రెండవవారు వేదుల రామకృష్ణశాస్త్రి. వీరు మేనత్త, మేనమామ బిడ్డలు. వీరు దమయంతీ కళ్యాణం, విశ్వగుణాదర్శము, మదాలస, ఇందిరాదేవి, శకుంతల, భోజ చరిత్ర, కాత్యాయన చరిత్ర మొదలైన రచనలు చేశారు. వీరు కూడా శతావధానులే.


వేంకట పార్వతీశ కవులు:

ఈ జంట కవులలో మొదటివారు బాలాంత్రపు వేంకట రావు, రెండవవారు ఓలేటి పార్వతీశం. వంగ భాష నుంచి పెక్కు నవలలను తెలుగులోనికి వీరు అనువదించారు. వీరు ఇందిర, అరణ్యక, ఉన్మాదిని, సీతాదేవి వనవాసము, నీరద, వసుమత్తె వసంతము, మనోరమ, మాతృమందిరము మొదలైన నవలలు రచించారు. కావ్య, కుసుమావళి, బృందావనము అను పద్యకావ్యాలు రచించారు. ఆంధ్ర దేశమున వీరు కవిరాజహంసలుగా పేరుపొందారు.

జంట కవులలో చివరగా పేర్కొనదగినవారు పింగళి లక్ష్మీకాంతం, కాటూరి వేంకటేస్వర రావు. వీరు తిరుపతి వేంకట కవుల శిష్యులు. సౌందరనందము అను కావ్యాన్ని రచించారు. ఇరువురూ మేధావులు.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: