telugudanam.com

      telugudanam.com

   

మాట

ఏ భాషలోనైనా భాష యొక్క శబ్ద స్వరూపంలోను, నిర్మాణంలోను జరిగే మార్పుల వల్ల, పదజాలానికి అర్ధంలో కలిగే మార్పుల వల్ల భాషా పరిణామం జరుగుతూంటుంది. పదజాలానికి అర్ధంలో కలిగే మార్పుల వల్ల అర్ధ విపరిణామం కూడా జరుగుతుంది. పద స్వరూపం మార్పు చెందకుండానే అర్ధ విపరిణామం జరుగవచ్చు. పద స్వరూపం మారినప్పుడు అర్ధం మార్పు చెందాలనే నియమం ఉండదు. తెలుగు భాషా పదజాలంలో ధ్వని అనుకరణ పదాలు, నిష్పన్న రూపాలు, తద్దిత రూపాలు, సమాసాలు, శబ్ద పల్లవాలు, ఆమ్రేడిత రూపాలు, లక్ష్యార్ధ ప్రయోగాలు, జాతీయాలు అనేకార్ధ పదాలు ఉన్నాయి. తెలుగు దేశ చరిత్రలో విజయనగరం, కొండవీడు, నెల్లూరు, అద్దంకి, రాజమహేంద్రవరం, వరంగల్లు, చంద్రగిరి వేరు వేరు కాలాలలో రాజధానులుగా ఉండేవి. అంతేగాక కృష్ణా, గోదావరి పరిసర మధ్య మండలం విద్యకు, సౌభాగ్యానికి, సంస్కృతికి విద్యావంతులకు ఆటపట్టయింది. తెలుగు దేశంలో ఏ ఒక్కటీ కొన్నిశతాబ్దాలపాటు సాంస్కృతిక కేంద్రంగా రాణించలేదు. కాబట్టి ఒకే పదం ఆయాప్రాంతాల పలుకుబళ్ళతో రూపవైవిధ్యం పొందింది. ఒకే పదానికి ముఖ్యమైన అర్ధంతో పాటు అర్ధవ్యాప్తివల్ల అనేక అర్ధాలు ఏర్పడ్డాయి. మాటవరసకి తెలుగు భాషలో "మాట" అనే పదానికి అనేక అర్ధాలు ఏర్పడ్డాయి. అసలు మాట అంటే వచనము, పదము, నింద, వృత్తాంతము అనే రూఢి అర్ధాలున్నాయి. ఇవేగాక పలుకు, వాక్యము, సందేశము, వార్త, చరిత్ర, కథ, ప్రార్థన, తిట్టు అనే అర్ధాలు కూడా ఉన్నాయి. ఇన్ని అర్ధాలున్న పదం మాట పలుకుబడులలో సహజార్ధమిచ్చేవి ఉన్నాయి. గూఢార్ధమిచ్చేవి ఉన్నాయి. రూడ్యార్ధమిచ్చేవి ఉన్నాయి. అన్యార్ధమిచ్చేవి ఉన్నాయి. అపార్ధాలు ఇచ్చేవి ఉన్నాయి. మాటలాడుట ప్రసంగం అవుతుంది. మనస్సు నిలకడలేకుండా మాటిమాటికి మనస్సు మార్చుకునే వారు ఘడియకు ఒక మాట చెబుతారు. వాగ్దత్తం చేసేవారు ఆడిన మాట తప్పరు. వాగ్దానం చేసేవారు మాట ఇస్తారు. చెప్పిన ప్రకారం చేయకపోతే మాటతప్పినవారు అవుతారు. అన్నమాటను తప్పనివారు పెద్ద మనుషులే, వందనీయులు.

మాటల చమత్కారం వ్యంగ్యం అవుతుంది. మాటలలో పట్టుదల ఉంటే మాటపట్టు ఉంటుంది. నిందలపాలైతే మాటపడతారు. నిష్టూరాలాడేవారు ఊరికే మాటలాడతారు. ముందే జాగ్రత్తగా ఉండాలి. మాట జారిన తరువాత ఏమనుకున్నా ఏం లాభం ఉండదు. తిట్లు ప్రారంభిస్తే మాటలు ముదురుతాయి. కొందరు మాటవరసకు ఏదైనా చెప్పినా నిజమే అని నమ్మేస్తారు. ఇంట్లో పని చేసేవారైనా అడ్డమైన మాటలు అంటే మాటపడరు. కొందరు అడిగిన దానికి జవాబుచెప్పకుండా మాటామంతీ లేకుండా కూర్చుంటారు. కొందరికి దగ్గర ఉంటే ఒకమాట, దూరమైతే ఇంకోమాట. నోరు మంచిదైతే ఊరంతా మంచిదే అవుతుంది. కొంటె మాటలతో కొంపలు అంటుకుంటాయి. అంతం లేకుండా మాట్లాడేవారు మాటలకు పట్టుకుంటే వదలరు. నీకు నాకు అంతరాలు, అభిప్రాయాలు వేరైతే నీ మాట వేరు, నా మాట వెరు అవుతుంది. ఇలా ఇంకా ఎన్నో ఉన్నాయి.

ఇంత బ్రహ్మాండమైన మాట భగవంతుడు మనందరికీ ప్రసాదించిన వరం. భగవంతుడు ప్రసాదించిన ఈ మాటను మనం వ్యర్ధం చేసుకోకూడదు. అనవసరంగా మాట పడకుంటా లాభసాటిగ ఉపయోగించుకోవాలి. దీనికి మంచి పట్టుదల, అభ్యాసం ఉండాలి. మాట మంచితో మర్యాదను అభివృద్ధి చేసుకోవాలి. మనిషి శాశ్వతమా? మాట మాత్రం కలకాలం ఉండిపోతుంది. పదునైన కత్తికి లేని వాడి వాక్కుకు ఉంటుంది. మంచి మాటతో శీలాన్ని పెంచుకోవచ్చు. మాట్లాడేటప్పుడు మన సంకల్పాలు, వాక్కులు ప్రతిబింబిస్తాయి. అసత్యపు మాటలు అనర్ధాన్ని తెచ్చిపెడతాయి. మౌనం వేయి మాటలకన్నా అతి గంభీరంగా శ్రావ్యంగా ఉంటుంది. ధర్మబద్ధంగా ఉండడం నేర్చుకుంటే సంకల్పాలను ఉన్నదున్నట్లుగా చెప్పగలుగుతాము. అధిక ప్రసంగం వల్ల మాటకు, మనసుకు పొత్తు కుదరదు. మాట్లాడేటప్పుడు సంకల్పం, భావం, ఆచరణ అన్నిటికీ సమైక్య భావం ఏర్పడాలి. నీవి పలికే పలుకులో ఏకమైపోయి ఉచ్చరించాలి. మాటలు దిగమ్రింగుకోకూడదు. మితంగా మాట్లాడడం అభ్యాసం చేసుకోవాలి. సాధ్యమైనంగ తక్కువగా మాట్లాడి సాధ్యమైనత ఎక్కువగా వినడానికి ప్రయత్నించాలి. ముందు వెనుక, మంచి చెడ్డ ఆలోచించి మాటలాడుతూండాలి. మాట్లాడే మాటలు ఎదుటివారికి ఇబ్బంది కలిగించేవిగా ఉండకూడదు. అర్ధభరితంగా, ఆసక్తిదాయకంగా మాట్లాడాలి. నిత్య జీవితంలో అనేక సన్నివేశాలలో అనేక మాటలు మాట్లాడుతుంటాం. మాట ప్రభావం మాట కాదు. మాటలో ఎంతో శక్తి ఇమిడి వుంటుంది. మానవుడికి బలాన్ని ఇచ్చేది మాటే, బలాన్ని పోగొట్టేది ఈ మాటే. మంచి మాటతో ఎంతైనా సాధించవచ్చు. కార్య విఫలత, సఫలత కూడా మాట మీదే ఆధారపడి ఉంటాయి. జాగ్రత్తగా తూచి తూచి యోచించి మాట్లాడాలి.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: