telugudanam.com

      telugudanam.com

   

మన కవులు

కావ్యాలు తాము పుట్టిన కాలం యొక్క సామాజిక పరిస్థితులను తెలియజేస్తాయి. నాటి ఆచార వ్యవహారాల గురించి సమగ్రంగా వివరిస్తాయి. జాతి జీవన పురోగతికి ఇవి దిశా నిర్దేశాలు కావడంతో వాటిని ప్రజలు అనుసరిస్తుంటారు. ఆచారాలు ఎప్పటివైనా, వాటిలోని మంచి చెడులను విశ్లేషించుకుంటూ, కొత్త పోకడలను రూపుదిద్దుకుంటూ సాగుతారు. ఇది చరిత్రలో ఓ అంతర్భాగం. ఆ చరిత్ర గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలంటే కావ్య పఠనం తప్పనిసరి. అందుకే జాతి నిర్మాణంలో కీలక పాత్ర వహించే కావ్యాల గురించి తెలుసుకున్నట్టే కావ్య రచనా కర్తలైన కవుల గురించి కూడా తెలుసుకోవడం ఎంతైనా అవసరం. ఆ ఉద్దేశంతోనే ఆంధ్ర జాతికి అక్షర రూపంలో అంతులేని విజ్ఞానాన్ని అందించిన కవుల వివరాలను అందిస్తున్నాం.


తొలితరం కవులు :

నన్నయ:

నన్నయ 11వ శతాబ్దానికి చెందిన చాళుక్య కాలమునాటి కవి. రాజమహేంద్రవరములోని రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి. రాజరాజ నరేంద్రుని కోరిక మేరకు అతడు సంస్కృత భారతాన్ని తెనిగించ పూనుకున్నాడు. తెలుగు భాషలో కావ్య రచనకు తగిన భాష లేని ఆ కాలంలో నన్నయ ప్రజల వాడుకలో ఉన్న తెలుగు భాషా పదాలను సమీకరించి ఆ పదాలను కావ్య భాషకు సరిపోయేట్టు చేయడానికి "ఆంధ్ర శబ్ద చింతామణి" అను తెలుగు వ్యాకరణ గ్రంధాన్ని సంస్కృతంలో రచించాడు. కావ్య రచనకు కావలసిన భాషను తయారుచేసుకుని మహాభారత అనువాదానికి పూనుకున్నాడు. సంస్కృత భారతాన్ని అనుసరిస్తూనే స్వేచ్చానువాదంతో భారతాన్ని తెలుగులో స్వీయ రచనయా అని అబ్బురపడేట్లు రచించాడు. మూలములోని కథను యథాతధంగా అనువదించక కొన్ని మార్పులు చేశాడు. మూలము నందు హిడింబి భీమునియందు తనకుగల మోహాన్ని ధర్మరాజు సమక్షాన కుంతితో చెప్పినట్లు ఉండగా నన్నయ కుంతితో రహస్యంగా చెప్పినట్లు రచించాడు. దృతరాష్ట్రుడు దుర్యోధనుడివలె దుర్వ్యసనపరుడు కాగా అతడిని సౌమ్యుడుగా చిత్రించాడు. అలాగే శకుని దుర్యోధనుని కపటద్యూత విముఖునిచేయ ప్రయత్నించినట్లు సంస్కృత భారతంలో ఉండగా శకునియే దుర్యోధనుని ప్రేరేపించినట్లు చిత్రించాడు.

ఆది, సభా పర్వాలు, అరణ్య పర్వంలో 3 అశ్వాసాలు, 142 పద్యాలు రచించి అస్తమించాడు. అతను జీవించియున్నప్పుడే సహ పండితులతో "సకల సుకవి జన వునుతుడి"గా ప్రఖ్యాతిపొందాడు. వాంగ్మయములో పదాలు చెప్పలేని భావాలను కవితా రూపాన నిర్వహించడానికి అక్షర రమ్యత మూలమున సాధించాడు. చందస్సును, చందస్సుకంటే ఉత్తమమైన నాదాన్ని తన పద్య శిల్పాన ఉపయోగించి శబ్దాలు చెప్పలేని అనుభవైకవేద్యమైన భావాలను మనోజ్ఞంగా గానం చేశాడు. ఇతనికి "ఆదికవి", "ఆంధ్ర వాగమ శాసనుడు" అను బిరుదములు కలవు.


తిక్కన:

తిక్కన 13వ శతాబ్దం ప్రథమ పాదంలో జన్మించాడు. కాకతి గణపతిదేవుని కాలములో పుట్టి, రుద్రమదేవి పరిపాలనమును, రెండవ ప్రతాపరుద్రుని రాజ్యారంభ కాలాన్ని చూసియున్నాడు. నెల్లూరు సీమను ఏలిన మనుమసిద్ది ఆస్థానంలో మంత్రి అయినటువంటి తిక్కనను తిక్కనామాత్యుడు అంటారు. వీరిది పండిత వంశం. నన్నయ తరువాత 200 సంవత్సరాల తరువత అనగా క్రీ.శ. 1250 సంవత్సరంలో తిక్కన అరణ్య పర్వ శేషాన్ని వదిలిపెట్టి విరాట పర్వము మొదలుకొని చివరివరకూ గల 15 పర్వాలను అనువదించాడు. ఇతను స్వయంగా మంత్రి కావున రాజనీతి, కార్యజ్ఞత, లోకజ్ఞత మొదలైన విషయాలను ఉద్యోగ విరాట పర్వాలలో ఎంతో స్పష్టంగా వ్రాశాడు. తిక్కనకు అతి యిష్టమైన ప్రక్రియ నాటకీకరణ. తన భాషలోని కొన్ని పదాలను చేరుస్తూ, కొన్ని తొలగిస్తూ, ఔచిత్యం చెడకుండా మొత్తం 15 పర్వాలను ఆంధ్రీకరించాడు. అందుకే సమకాలికులు ఇతన్ని "కవి బ్రహ్మ" అని కీర్తించారు. తిక్కన "నిర్వచనోత్తర రామాయణము" అను మరో కావ్యాన్ని కూడా రచించాడు.

ప్రజలు మతం పేరిట విడిపోయి కలహములాడుకుండడంతో తిక్కన హరిహరనాథతత్వాన్ని ప్రవేశపెట్టాడు. శివకేశవులు ఒక్కరే అని నమ్మిన తిక్కన తన భారతాంధ్రీకరణ పద్యాలను హరిహర విభునికి అంకితమిచ్చాడు. సంస్కృత సమాసాలను ఎలా ప్రయోగించాడో తెలుగు పదాలను కూడా అలానే ఉపయోగించడం వలన తిక్కన "ఉభకవిమిత్రుడు"గా ప్రసిద్ధి పొందాడు. మార్కండేయ పురాణాన్ని రచించిన మారన తిక్కన శిష్యుడు. చరిత్రలో ప్రసిద్ధికెక్కిన ఖడ్గ తిక్కన కవి తిక్కనకు పెద్ద తండ్రి కుమారుడు. అద్వైత సిద్ధాంతం విస్తారంగా నెలకొనడానికి విశేషంగా కృషి చేసిన తిక్కన సమాజ పునర్నిర్మాణ విషయంలో ఎంతో కృషి చేసిన సమాజ సేవకుడు.


ఎర్రన :

ఎర్రన 14వ శతాబ్దానికి చెందినవాడు. నెల్లూరు జిల్లా గుడ్లూరు వాస్తవ్యుడు. ఇతడు ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవి. తిక్కన వదిలిపెట్టిన అరణ పర్వ శేషభాగాన్ని ఎర్రన ఆంధ్రీకరించాడు. అరణ్య పర్వంలో మొత్తం గద్య పద్యాల సంఖ్య 2900. ఇందులో నన్నయ 1300 రచించగా ఎర్రన 1600 రచించాడు. పద్ధతిలో నన్నయను అనుకరించాడు. తాను వ్రాసిన అరణ పర్వాన్ని వేమారెడ్డికి అంకితమిచ్చాడు. "నృసింహ పురాణము", "హరివంశము" అను ఇతర కావ్యాలను ఎర్రన రచించాడు.ఎర్రన కవితా శైలిని అనుకరించిన ప్రముఖ కవులలో శ్రీనాధుడు, పోతన మొదలగువారు కలరు. ఇతనికి "శంభుదాసుడు", "ప్రబంధ పరమేశ్వరుడు" అను బిరుదములు కలవు.


నన్నెచోడుడు :

12వ శతాబ్దానికి చెందిన నన్నెచోడుడు మొట్టమొదటి శివ కవి. నన్నయ, తిక్కనల మధ్య కాలమే శివకవి యుగము. శివ కవులకు శివతత్వమే కవితోద్దేశంగా ఉంటుంది. ఇతడు రచించిన "కుమార సంభవము" శివుని గొప్పతనాన్ని తెలియజేసే గొప్ప గ్రంధము. నన్నెచోడునికి పూర్వము "ప్రబంధ" శబ్ద ప్రయోగమును చేసినవారు లేరు. రాయల కాలాన పిలవబడిన ప్రబంధ లక్షణాను కుమార సంభవమునందు ఉండుట వలన కుమార సంభవమే మొట్టమొదటి ప్రబంధమని చెప్పవచ్చు. నన్నెచోడుడు అనగానే "జాను కవిత", "వస్తు కవిత" గుర్తుకొస్తాయి. ఆ రెండు పదాలను మొట్టమొదట పేర్కొన్నవాడు నన్నెచోడుడు. జాను అనేది చదును శబ్దానికి రూపాంతరం. చదును చదురునకు రూపాంతరం. "జాను తెనుగు" అంటే లోక వ్యవహారములోనున్న సర్వజన సుబోధమైన తెనుగు" అని చిలుకూరి నారాయణరావు గారు అభిప్రాయపడ్డారు.


మల్లికార్జున పండితారాధ్యుడు :

12వ శతాబ్దానికి చెందిన పండితారాధ్యుడు గోదావరి మండలానికి చెందినవాడు. బాల్యం నుండి వివేకవంతుడు. శైవ మత రహస్యాలను తెలుసుకున్నాడు. భక్తుల చరిత్రములను, మహిమలను వర్ణించాడు. ఎందరో బౌద్ధ పండితులను ఓడించాడు. తన మతమును తీవ్రంగా ప్రచారం చేశాడు. శైవ మతాన్ని సంస్కరించి ఆరాధ్య శాఖను నెలకొల్పాడు. సంస్కృతం, తెలుగు, కన్నడాలలొ పండితుడు. ఇతని తెలుగు రచనలలో "శివతత్వసారము" ప్రధానమైనది. ఇది వీర శైవ మత గ్రంధాలలో ప్రామాణికమైనది. తెలుగులో శతక కవిత్వాలకు తొలి ఉదాహరణముగ శివతత్వసారము పేర్కొనబడింది.


పాల్కురికి సోమన :

ఇతడు వరంగల్లు జిల్లా పాలకుర్తి గ్రామంలో క్రీ.శ. 1240 ప్రాంతాల్లో జన్మంచాడు. వేద వేదాంగాలను అధ్యయనం చేసిన సోమన వీర శైవ మతాన్ని స్వీకరించాడు. వీర శైవం ఆనాటి సంప్రదాయాల మీద, ఆచార వ్యవహారాల మీద తిరుగుబాటు చేసింది. వీర శైవంలో కులభేదాలుగానీ, స్త్రీ పురుష తారతమ్యాలుగానీ, బీద గొప్ప తారతమ్యంగానీ, పండిత పామర తారతమ్యాలుగానీ ఉండవు. పురుడు మైల, చావు మైల ఉండవు. శివభక్తులంతా ఒకే కులమని భావిస్తారు. సోమన వ్రాసిన మొదటి గ్రంధం "అనుభవ సారము". సోమన ప్రజల కోసం ప్రజల భాష అయిన అచ్చ తెనుగు చందస్సు "ద్విపద"కు జీవితాన్ని అంకితం చేశాడు. "బసవ పురాణం" ఇతని మరో ఉత్తమ రచన. "రగడ" అనునది ఒక సాహిత్య ప్రక్రియ. ద్విపాద నియమం గలది. ప్రాసతోపాటు అంత్య ప్రాసకూడా కలది. రగడలో ఇతడు బసవస్తుతిని రచించాడు. అంతేకాకుండా ఉదాహరణ రచనకు సోమనే ఆద్యుడు. సోమన కన్నడంలో కూడా అనేక రచనలు చేశాడు. శైవ మతావలంబికులు నిత్యం పూజ చేసుకునేందుకు ఉపయోగపడే స్తోత్ర గంధాన్ని రచించిన సోమన శైవ మత ప్రచార లక్ష్యాన్ని నెరవేర్చాడు.


మారన :

మారన 13వ శతాబ్దానికి చెందినవాడు. తిక్కన సోమయాజికి శిష్యుడుగా ప్రసిద్ధుడు. "మార్కండేయ పురాణము"ను రచించాడు. ఈ పురాణాన్ని కాకతీయ చక్రవర్తి రెండవ ప్రతాపరుద్రదేవుని (1298-1323) సేనాపతియగు నాగయగన్ననికి అంకితమిచ్చాడు. అష్టాదశ పురాణాలలో మార్కండేయ పురాణం ఏడవది. మారన మూలాన్ని కొంతవరకు మాత్రమే తీసుకుని రచన చేశాడు. ఇది ధర్మ సందేహాలను నివృత్తి చేయడానికి పుట్టింది.


కేతన :

మూలఘటిక కేతన క్రీ.శ. 1200లో జన్మించాడు. ఇతని రచన "దశకుమార చరిత్ర". దీనిని తిక్కనకు అంకితమిచ్చాడు. ఇతడు "ఆంధ్ర భాషాభూషణం" మరియు "విజ్ఞానేశ్వరీయం" అను మరో రెండు గ్రంధాలు రచించాడు. ఆంధ్రా భాషణం తెలుగు భాషలో మొట్టమొదటి స్వతంత్ర వ్యాకరణం. కేతనకు "అభినవ దండి" అనే బిరుదు ఉంది. దండి వ్రాసిన దశకుమార చరిత్రను కేతన చంపూ కావ్యంగా రచించాడు. ఇది తెలుగులో తొలి కథా కావ్యం. సామెతలు, పలుకుబళ్ళు, జాతీయాలు ఇతని రచనల్లో కోకొల్లలు. తెలుగులో తొలి కథా కావ్యము, తొలి ధర్మ శాస్త్ర గ్రంధము, తొలి లక్షణ గ్రంధమును రచించిన కేతన సదా స్మరణీయుడు.


మంచన :

గుంటూరు జిల్లా రేపల్లె తాలూకాలోని చందవోలుకు చెందినవాడు మంచన. ఇతని కాలము క్రీ శ. 1300 ప్రాంతం. ఇతడు "కేయూరబాహు చరిత్ర" అను గ్రంధాన్ని రచించాడు. సంస్కృతంలో రాజశేఖర కవి రచించిన "విద్ధసాలభంజిక అను నాలుగు అంకాల నాటికకు ఇది చంపూ రూపమైన స్వతంత్రానువాదం. సంస్కృతంలోని దృశ్య కావ్యాన్ని శ్రవ్య కావ్యంగా అనువదించుటకు ఆరంభం కేయూరబాహు చరిత్రతోనే ఆరంభమయింది. మంచన కవిత్వం సలక్షణం సరసమైంది. ఇతని పదభావ సంపద, రచనా ప్రౌఢిమ, ధారాశుద్ధి ఎన్నదగినది. మంచన తన కేయూరబాహు చరిత్రను వెలనాటి చొళ రాజామాత్యుడైన నండూరి గుండ మంత్రికి అంకితమిచ్చాడు. మంచెన వ్రాసింది ఒకే ఒక్క కావ్యమైనా జగద్విఖాతినొందినది.


బద్దెన :

సుమతీ శతకం గురించి వినని తెలుగువాదు ఉండడు. ఇది ఒక నీతి శతకం. ఈ శతక రచయిత బద్దెన. ఈయన ఓ చిన్న సామంత రాజు. 13వ శతాబ్దికి చెందినవాడని భావిస్తున్నారు. కడప జిల్లాలోని ఇప్పటి బద్వేలును ఒకప్పుడు బద్దెప్రోలు అని పిలిచేవారు. బద్దెన పేరు మీద వచ్చిందే బద్దెప్రోలు.

"శ్రీరాముని దయ చేతను

నారూఢిగ సకల జనులు ఔరాయనగా

ధారాళమైన నీతులు

నోరూరగ చవులు పుట్ట నుడివెద సుమతీ"...ఇది సుమతీ శతకములోని మొదటి పద్యము. "సుమతి" అంటే మంచి మతి కలిగిన స్త్రీ, మరియు మంచి మతి కలిగిన పురుషుడు అని అర్ధం. ఈ సంబోధన స్త్రీ పురుషులిరువురికీ వర్తిస్తుంది. బద్దెన సుమతీ నీతి శతకం మాత్రమే కా, నీతి శాస్త్ర ముక్తావళి కూడా రచించాడు. ఆంధ్ర సాహిత్యంలో బద్దెనది ఓ ప్రత్యేక స్థానం.


నాచన సోమన:

ఇతడు క్రీ.శ. 1390 ప్రాంతానికి చెందినవాడు. సంస్కృతములోని హరివంశమునందలి ఉత్తర భాగాన్ని "ఉత్తర హరివంశం" అను పేర తెలుగులో రచించాడు. ఇది 6 ఆశ్వాసములుగల ప్రబంధము. వర్ణనలందు పురాణ పద్ధతిని విడనాడి ప్రబంధ మార్గాన్ని అనుసరించాడు. ఇతడు సందర్భానుసారంగా వాడే సామెతలు, జాతీయాలు మనోహరంగా ఉంటాయి. ఇతనికి "సర్వజ్ఞ సకల భాషాభూషణ" "సాహిత్య రసపోషణ" అనే బిరుదులు ఉన్నాయి.


గోనబుద్ధారెడ్డి :

ఇతడు 1375 లో జన్మించాడు. తెలుగులో వెలిసిన మొట్టమొదటి రామాయణమైన "రంగనాధ రామాయణము"ను రచించాడు. ఈతని తండ్రి పేరు రంగనాధుడు. తన తండ్రి పేరుతో ఈ రామాయణాన్ని రచించినందువల్ల ఆ పేరు వచ్చిందని పరిశోధకుల అభిప్రాయం. సేతువు కడుతున్నప్పుడు రాముల వారికి ఉడుత చేసిన సాయం కథ గోన బుద్ధారెడ్డిదే. ఆనాటి నుంచే "ఉడుతాభక్తి" అనే జాతీయం ఆవిర్భవించింది. ద్విపదలో రాసిన ఈ రామాయణమును యుద్ధకాండ వరకు మాత్రమే ఈయన రచించాడు. మూలంలో లేని తెలుగుదనాన్ని, దేశీయతా సొంపును చేకూర్చాడు. ఊర్మిళాదేవి నిద్ర, లక్ష్మణ దేవర నవ్వు మొదలగునవి రంగనాధ రామాయణములోని దేశీయ కథలు. సామాన్యులకు కూడా ఈ రామాయణం సాహిత్యపు ఆనందాన్ని సమకూర్చిపెట్టింది.


శ్రీనాధుడు :

13, 14 సంవత్సరాల వయసులో "మరుత్తరాజు కథ"ను పద్యకావ్యంగా రచించిన శ్రీనాధుడు 1377 ప్రాంతంలో జన్మించాడు. ఇతని జన్మస్థలం కాల్పట్టణం. కవిత్రయం తరువాత చెప్పుకోవలసిన కవి కులగురువు శ్రీనాధుడు. కొండవీటి రెడ్డి రాజైన పెదకోమటి వేమారెడ్డి వద్ద విద్యాధికారిగా శ్రీనాధుడు 1402 నుండి 1420 వరకు పదవి నిర్వహించాడు. రెడ్డి రాజ్య పతనం అనంతరం రాజాశ్రయం కోసం రాజమండ్రి రెడ్డిరాజులను ఆశ్రయించాడు. వారు ఆశ్రయం ఇవ్వకపోవడంతో పల్నాడుకు వెళ్ళాడు. పల్నాడులో సంచరిస్తూ "పల్నాటి వీరచరిత్ర"ను ఆశువుగా ద్విపదలో రచించాడు. పల్నాడు నీటి కరువు ఉండడంతో

సిరిగలవానికి జెల్లును - దరుణులు బదియారువేల దగబెండ్లాడన్

దరిపెమున కిద్దరాండ్రా - పరమేశా గంగ విడుము పార్వతి చాలున్" ...

అని పరమేశ్వరుణ్ణి ఎత్తిపొడిచాడు. 1429 ప్రాంతాల్లో దాక్షారామం వెళ్ళాడు. తన బంధువైన బెండపూడి అన్నమంత్రి ద్వారా రెడ్డి రాజుల ప్రాపకం పొందాడు. అయితే అందుకు ప్రతిగా అన్నమంత్రి "శివపురాణం"ను తనకు అంకితం కావించుకున్నాడు. "శ్రీహర్ష నైషధము"ను ఆంధ్ర భాషలో శ్రీనాధుడు రచించాడు. అయితే కొన్ని ఆయువుపట్టు శ్లోకాలను అతడు యథాతథంగా తెలుగులోకి దించి, చివరన "డుమువులు" చేర్చడంతో సంస్కృత పండితులు నీ డుమువులు నువ్వు తీసుకొని మా నైషధం మాకిచ్చెయ్ అన్నారని చెప్పుకొంటారు. రాజమండ్రి పండితుల మూకుమ్మడి దాడి ఎక్కువ కావడంతో కర్ణాట రాజ్యంలో తన ప్రతిభ రాణిస్తుందని విజయనగరం బయల్దేరాడు. రెండవ దేవరాయలు విజయనగరాన్ని పాలిస్తున్న రోజులవి. అక్కడ డిండిమభట్టుతో వాదన సలిపి అతన్ని ఓడించి "కవి సార్వభౌమ" బిరుదును పొందాడు. "హర విలాసము", "భీమేశ్వర పురాణము", "క్రీడాభిరామం", "కాశీఖండము", "శివరాత్రి మహాత్మ్యము" వంటి అనేక గ్రంధాలను రచించాడు. తెలుగులో వీరగాధా కావ్యం రాసిన మొట్టమొదటి కవైన శ్రీనాధుని సీస పద్యాల సొంపు అనితరసాధ్యమైనది. తెలుగు భాషకు పట్టం కట్టి, తెలుగు భాష లెస్స అనిపించి, చాటువుల ద్వారా తెలుగు కవిత్వాన్ని పండితులకేకాక పామరులకు కూడా రుచి చూపించిన యుగకర్త శ్రీనాధుడు.


పోతన :

వరంగల్లు నగరానికి 32 మైళ్ల దూరంలోని బమ్మెర గ్రామంలో పోతన జన్మించాడు. బాల వయసులోనే "వీరభద్ర విజయం" అనే గ్రంధం రాసిన పోతన భాగవత వైశిష్ట్యాన్ని ప్రచారం చేసి పునీతుడైనాడు. వీరభద్ర విజయంలో ఆయన మంగళ సూత్ర బంధం గురించి వివరించాడు."భోగినీ దండకం" అను గ్రంధాన్ని సింగభూపాలునికి అంకితమిచ్చాడు. చిన్నతనంలో చేసిన రచనలను నరాంకితం చేసినందుకు వయసు వచ్చాక పశ్చాత్తాపపడిన పోతన ఇక తన రచనలు వేటినీ నరాంకితం చేయనని చాటి ఆ మాట మీదే నిలబడ్డాడు. బీదతనం అనుభవిస్తూ, వ్యవసాయం చేసుకుంటూ జీవించాడు. రాజులన్నా, వారిచ్చే సంపదలన్నా కిట్టక భోగాలకు విముఖుడై ఆయన భాగవతాన్ని రచించాడని చెప్పుకుంటారు.

పలికెడిది భాగవతమట

పలికించెడువాడు రామభద్రుడట"...

అంటూ ఆంధ మహాభాగవత రచనకు శ్రీకారం చుట్టి అష్టాదశ పురాణాలలో ఒకటైన భాగవతాన్ని తెనిగించాడు. పోతన రచించిన పద్యపాదాలలో ఒకటైన "ఊరకరారు మహాత్ములు" జాతి జీవనంలో కలిసిపోయింది. భాగవతంలోని దశమ స్కంధంలో బలరామకృష్ణులకు సంస్కారం చేసి నామకరణం కావించడానికి గర్గుడు మంద్రకు వెళ్తాడు. అప్పుడు నందుడు తగిన సత్కారాలు చేసిన అనంతరం "ఊరక రారు మహాత్ములు" అంటాడు. పోతనకు శబ్దాలపై మక్కువ ఎక్కువ. భాగవతానికి అంతటి ప్రజాదరణ ఈ శబ్ద విన్యాసం వలన వచ్చింది. ఆటవెలది చందస్సు ఆంధ్ర భాషలోకి అడుగుపెట్టింది పోతనతోనే. భాగవత రచన వల్ల తనకు పునర్జన్మ లేదని భావించిన పోతన అద్వైతాన్ని అనుసరించాడు.


అన్నమయ్య :

అన్నమయ్య పేరు వినని ఆంధ్రుడు ఉండడు. అతని పాట పాడని తెలుగు వ్యక్తీ ఉండడు. ఆబాలగోపాలానికి తెలిసిన "చందమామ రావే, జాబిల్లి రావే", "జో అచ్చ్యుతానంద జోజోముకుందా" పాటల సృష్టికర్త అన్నమయ్య పసి బాలా హృదయాలలోకి సైతం ప్రవేశించిన మహనీయుడు. కడప జిల్లా రాజంపేట, సిద్ధపటం మండలాల భూభాగంలోని తాళ్ళపాక గ్రామంలో 9-5-1904 సంవత్సరంలో అన్నమయ్య జన్మించాడు. చిన్నప్పట్నుంచి అన్నమయ్య స్వంతంగా పాటలు కట్టి పాడుకునేవాడు. 16 ఏళ్ళ వయసులో అంటే 1424లో మొట్టమొదటిసారి తిరుమల కొండ ఎక్కుతూ ఆశువుగా వెంకటేశ్వర శతకం చెప్పాడు. తనకి వేంకటేశ్వరుడు కలలో కనిపించిన నాటినుంచి రోజుకో పాటను తక్కువ కాకుండా రచించాడు. పాటలకి సాహిత్య గౌరవం ఇవ్వడానికి సంస్కృతంలో సంకీర్తన లక్షణం వ్రాశాడు. రామాయణాన్ని తెలుగులో ద్విపదలో వ్రాశాడు. "శ్రంగార మంజరి" అను ద్విపదను వ్రాశాడు.

ప్రపత్తి అను శరణాగతి యోగమే సర్వజనకోటికి ఉపయుక్త యోగమని విశిష్టాద్వైతం చాటిచెబుతుంది. ప్రపతిలో ముఖ్యమైంది భగవానుని లీలలను అనుభవించి అతని దయను ప్రస్తుతించడమే. ప్రపత్తినే వ్యాసముని అని కూడా అంటారు. వైష్ణవ పరిభాషలో వ్యాసము అంటే భక్తుడు తన ఆత్మను పరిపూర్ణంగా పరమాత్మాధీనం చేయడం. ఈ మత సూత్రాలను వివరించే గేయాలను ఎన్నో రచించాడు. "తందనానా అహి", "బ్రహ్మమొక్కటే" వంటివి ఇందుకు ఉదాహరణలు. శాంత, దాస్య, సఖ్య, వాత్సల్య, మధుర భావాలనే ఐదు భక్తి రూపాలలోనూ అన్నమయ్య వేలాది కీర్తనలు రచించాడు. తన దేవుణ్ణి చూసె "చిన్ని శిశువూ" అంటూ పొంగిపోయాడు. అన్నమయ్య రచనంతా దేశీయమే. అడుగడుగునా సామెతలే. ప్రతి చర్ణంలోనూ నానుడులే. కీర్తన అను ప్రక్రియను ప్రారంచిన మొట్టమొదటి వ్యక్తి అన్నమయ్య. పల్లవి, అనుపల్లవి, చరణం కలిగిన కల్పనకు ప్రారంభకుడు అన్నమయ్య. 32000 సంకీర్తనలను, 12 శతకాలను రచించిన అన్నమయ్య మూర్తీభవించిన తెలుగుతనం .


పిల్లలమర్రి పినవీరభద్రుడు :

నల్లగొండ జిల్లా పిల్లలమర్రి గ్రామానికి చెందిన పినవీరభద్రుడు 1450 ప్రాంతానికి చెందినవాడు. "వాణి నా రాణి" అని సగర్వంగా చాటినవాడు. 30 ఏళ్ళు వచ్చేసరికి అతడు అనేక గ్రంధాలు రచించాడు. "నారదీయ పురాణం"ను తెలుగులో రచించాడు. కాళిదాసు శాకుంతలన్ని "శృంగార శాకుంతలం"గా తెలుగులో చెప్పాడు. సాళువ నరసింహ రాయల ఆస్థాన కవిగా ఉంటూ ఆయన కోరడంతో "జైమినీ భారతం"ను తెలుగులోకి అనువదించాడు. ఇతను రచించిన జైమినీ భారతంలో ఒక చోట "చిరుబంతి పసుపు" అనే సమాసం వాడాడు. దీన్ని శ్రీనాధుడు ఎంతో ఇష్టపడ్డాడు.


అల్లసాని పెద్దన :

అష్టదిగ్గజ కవులలో అల్లసాని పెద్దన మొదటివాడు. ఇతని జన్మస్థలం కడప జిల్లాలోని పెద్దనపాడు అనే గ్రామం. యుద్ధ సమయాల్లో కూడా రాయలు పెద్దన వంటి కవుల్ని తన వెంట తీసుకునివెళ్ళేవాడు. తీరిక దొరికినప్పుడల్లా యుద్ధ విరామ సమయంలో కవిత గోష్టి జరిపేవాడు. "మను చరిత్ర"ను రచించి పెద్దన ఆ ప్రబంధాన్ని రాయలుకు అంకితమిచ్చాడు. ఆ రోజు పెద్దనను పల్లకిలో ఉంచి ఊరేగించారు. ఆ పల్లకీని మొట్టమొదట రాయలే ఎత్తిపట్టుకున్నాడు. పెద్దన కవితా మాధుర్యానికి అబ్బురపడి రాయలు ఆయనకు "ఆంధ్ర కవితా పితామహ" అని గౌరవించాడు. పెద్దన "హరికథాసారం" అనే గ్రంధం కూడా రచించాడు. పెద్దన రచించిన మను చరిత్ర నాటికీ, నేటికీ ప్రబంధరాజం.


ధూర్జటి :

రాజులు మత్తులు, వాళ్ళ సేవ నరకప్రాయం, వారిచ్చే దాసీలు, పల్లకీలు, గుర్రాలు, నగలు మొదలైనవి ఆత్మవ్యధా బీజాలు అని నిర్భయంగా చాటిన మొదటి తెలుగు కవి ధూర్జటి. "శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యం" అనే పద్య కావ్యాన్ని రాసి దేవినికే అంకితమిచ్చాడు. కాళహస్తి స్థల పురాణాన్ని తక్కిన కవులందరూ భౌతిక వర్ణన చేస్తే ధూర్జటి ఆధ్యాత్మిక సంపదతో పురవర్ణన చేశాడు. ఇతను గొప్ప శివ భక్తుడు.


తెనాలి రామకృష్ణుడు :

క్రీ.శ. 1500 సంవత్సరానికి ఐదారేళ్ళు కొంచెం కుడి ఎడంగా తెనాలి గ్రామంలో గార్లపాటి వారి కుటుంబంలో రామకృష్ణుడు జన్మించాడు. 1525 ప్రాంతంలో కృష్ణదేవరాయల వారి అష్టభానుడు పడమటకు వాలుతున్న కాలంలో ఆస్థాన ప్రవేశం చేశాడు. అక్కడ ఉంటూనే "కందర్పకేతువిలాసం" రచించాడు. రాజాశ్రయం కోసం భట్టరు చిక్కాచార్యుల వారి వద్ద వైష్ణవ మతాన్ని స్వీకరించాడు. వైష్ణవాన్ని స్వీకరించాక "హరిలీసావిలాసము" రచించాడు. రాయల వారి ఆస్థానంలో రామకృష్ణునికి సంబంచించిన కథలు కోకొల్లలు. వికటకవిగా, విదూషకునిగా దక్షిణ భారతదేశంలో ఇతనికున్న పేరు మరెవ్వరికీ లేదు. "పాండురంగ మహాత్మ్యం"ను రచించి విరూరి వేదాద్రికి అంకితమిచ్చాడు. ఔచిత్యం లేని సంస్కృతాన్ని తెచ్చి చక్కని జాతీయత ఉట్టిపడే తెలుగు పదాలతో జోడించి సమాసాలు కట్టడం అతనికే తెలుసు.


కందుకూరి రుద్రకవి :

రాయల వారి అష్టదిగ్గజ కవులలో కందుకూరి రుద్రకవి ఒకరు. ఈయన కాలం క్రీ.శ. 1480-1560. ఇతడు ఆశు కవిత్వం చెప్పడంలో దిట్ట. తిట్టు కవిత్వంలో ఉద్దండుడు. మొదట్లో రాయల వారి దర్శనం రుద్రకవికి లభించలేదు. చివరికి రాయల వారికి క్షవరం చేసే కొండోజి వల్ల దర్శనం దొరకడంతో ఈ పద్యం చెప్పాడు...

ఎంగిలి ముచ్చు గులాములు

సంగతిగా గులము జెరుప జనుదెంచిరయా

ఇంగిత మెరిగిన ఘనడీ

మంగలి కొండోజి మేలు మంత్రుల కన్నన్"

రుద్రకవి రచనలలో "సుగ్రీవ విజయం" మొదటిది. ఇది యక్షగానం. ఇది కందుకూరి జనార్ధన దేవునికి అంకితం కావించాడు. "నిరంకుశోపాఖ్యానం" ఇతడి రెండవ రచన. రుద్రకవిని చిరస్థాయిగా నిలిపినది అతని "జనార్ధనాష్టకం". తెలుగులో అష్టక రచన చేసినవారిలో మొదటివాడు కందుకూరి రుద్రకవి. తెలుగువారి హృదయాలను అలరించిన వారిలో కందుకూరి రుద్రకవి ఒకరు.


నంది మల్లయ్య, ఘంట సింగన :

తెలుగు సాహిత్యంలోని తొలి తెలుగు జంట కవులు నంది మల్లయ్య, ఘంట సింగనలు. వీరికి 'రాచమల్లు కవులు అని పేరు కూడా ఉంది. వీరు గుంటూరు, నెల్లూరు మండలాల్లో 1480 ప్రాంతాల్లో ఉండేవారు. వీరిలో ఘంట సింగన నంది తిమ్మనకు మేనల్లుడు. నంది ఘంట కవులు కొత్త కొత్త మాటలు వాడడమేగాక చిత్ర, బంధ, గర్భ కవిత్వాలలో కూడా తమాషాలు చేశారు. ప్రతిలోమానులోమ కందం వ్రాశారు. తొలినుంచి చదివినా, కొస నుంచి చదివినా ఈ క్రింది పద్యం ఒకేలా ఉంటుంది...


సారసనయనాఘనజఘ - నారచితరతారకలికహరిసారరసా

సారరసారహకలికర - తారతచిరనాఘజనఘనాయనసరసా".

అనే కాకుండా కేవలం రెండు అక్షరాలు మాత్రమే ఉపయోగించి ఒక కంద పద్యం రచించారు.

కాకలికాకలకలకల - కోకిలకులలీలకలులకులుకులకలుకే

కైకోకుకేలికొలకుల - కోకాలీకేలికులికొంకకుకలికీ" (వరాహపురాణం).

అలాగే ఒకే అక్షరంతో కూడా ఈ జంట కవులు ఒక పద్యం చెప్పారు...

నానననుని ననూనున - నేనేనిను ననన్ను నెన్న నీనీ

న్నానౌననోన్నినానౌ - నేనే నను నన్ను నాన నేను నన్నన్".

ఇలా కవిత్వాన్ని చిత్రవిచిత్రంగా పలికి మార్గదర్శకులయ్యారు ఈ జంట కవులు.


మాదయగారి మల్లన :

మాదయగారి మల్లన అష్టదిగ్గజ కవులలో ఒకదు. "రాజశేఖర చరిత్ర" అనే ప్రబంధాన్ని రచించాడు. చిన్న కథను తీసుకుని పెద్ద కావ్యంగా దీన్ని మలిచాడు. తరువాతి కవులకు ఈ రచనా విధానం అనుసరణీయమయ్యింది. ఈతని పద్యాలు చాలా మధురంగా ఉంటాయి. మన తెలుగు ప్రబంధాలన్నిటికీ మూల కథలున్నాయి. ఒక్క రాజశేఖర చరిత్రకు మాత్రం లేదు. ఇది స్వతంత్ర రచన. పెళ్ళి కూతురికి మంగళ సూత్రం కట్టే ఆచారం తెలుగువాళ్ళదే. కావ్యాల్లో పోతన, శ్రీనాధుడు మంగళ సూత్రాన్ని పేర్కొన్నారు. అలాగే ఇల్లాలి మెడలో నల్ల పూసల్ని కట్టించిన తొలి కవి మల్లన.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: