telugudanam.com

      telugudanam.com

   

నిఘంటువు (Dictionary)

సమాచారాన్ని, విజ్ఞానాన్ని అందించే విజ్ఞానఖనులు నిఘంటువులు. అనంతమైన పదాల సమూహాన్ని అందించే సంపుటాలు. సామాజిక, రాజకీయ, ఆర్ధిక, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో విస్తరిస్తున్న ప్రగతిని ప్రతిఫలించే పదజాలాన్ని దాచుకున్న పెన్నిధులు. వివిధరంగాల్లో ఆదానప్రదానాలకు అనువైన వేదికలు. హద్దులు, సరిహద్దులు చెరిపేస్తూ ప్రపంచ దేశాల ప్రజల మధ్య అనుసంధానానికి ఉపకరించే వారధులు. ఆధునిక జీవితానికి అవసరమైన జ్ఞాన గవాక్షాలు.

నిఘంటువుల్ని పదకోశమని కూడా పిలుస్తారు. ఏ నిఘంటువులోనయినా పదాలు ఆకారాది క్రమంలో ఉంటాయి. ప్రతి మాటకు అదే భాషలో లేదా వేరే భాషలో అర్ధం ఉంటుంది. కొన్ని నిఘంటువుల్లో ప్రతి మాటకు అర్ధంతో ఉచ్చారణ, భాషాభాగం, పదం పుట్టుపూర్వేత్తరాలు కూడా ఇస్తారు. అయితే అన్నిట్లో ఇవి ఉంటాయని కాదు. కొన్నిటిలో ఉండకపోవచ్చు. నిఘంటువులో అనేకరకాలున్నాయి. ఒక్కొక్క శాస్త్రంపై లేదా ఒక్కో రంగంపై ప్రత్యేకించిన నిఘంటువులు కూదా వస్తున్నాయి. నిఘంటువులని ఆంగ్లంలో డిక్షనరీలు అంటున్నాం. డిక్షన్ అంటే పదసరళి అని అర్ధం. ఈ పదం నుంచే డిక్షనరీలు అంటున్నాం. డిక్షన్ అంటే పదసరళి అని అర్ధం. ఈ పదం నుంచే డిక్షనరీ అనే పదం వచ్చింది. డిక్షనరీలతోపాటు అనేక గ్లాసరీలు వస్తున్నాయి. గ్లాసరీ అంటే పారిభాషిక పదాల కోశం. ఒక శాస్త్రానికి లేదా కళకు సంబంధించిన పదాల సంకలనం. "ఒక నిర్ధిష్ట కళకో, శాస్త్రానికో, వృత్తికో, వ్యాపారానికో, మరి అటువంటి దేనికయినా ప్రత్యేకించిగాని విలక్షణంగా గాని సంబంధించిన ఒక వస్తువునో, ఒక భావాన్నో పేర్కొనే ఒక పదానికిగాని, భాషారూపాల సమూహానికిగాని "పారిభాషిక పద" మని పేర్కొన్నారు బూదరాజు రాధాకృష్ణ. ఇలాంటి పారిభాషిక పదకోశాలు ఆంగ్లంలో అనేకం వస్తున్నాయి. ఇంకా రావాలి. భాషలు నేర్చుకునేవారికి, వివిధ రంగాలలో చదువుకునేవారికి ఇలాంటి పారిభాషిక పదకోశాల అవసరం ఎంతయినా ఉంది. వీటిని ప్రత్యేకంగా తయారుచేసుకోవాలి. అయితే మొత్తం భాషకి సంబంధించిన పదాలన్నీ ఉండే డిక్షనరీల అవసరం ఎంతయినా ఉంది. ఈ అవసరాన్ని కొన్ని వందల ఏళ్ళ కిందటనే గుర్తించారు.


నిఘంటువుల చరిత్ర:

క్రీస్తు శకం ఒకటో శతాబ్ధంలో చైనీస్ భాషలో 'షువా-వెన్ ' అనే పేరుతో ఒక నిఘంటువుని రూపొందించారు. రోమన్ సామ్రాజ్య కాలంలో లాటిన్ భాషలో నిఘంటువులు సంకలనం చేశారు. క్రీస్తు శకం ఎనిమిదో శతాబ్ధంలో అరబిక్ భాషలో పెద్ద నిఘంటువుని తయారుచేశారు. సంస్కృత నిఘంటువులలో అత్యంత ప్రాచీనమైనది అమరసింహుడు క్రీస్తు శకం నాలుగో శతాబ్ధంలో రాసిన అమరకోశము. తెలుగు నిఘంటువులు 17వ శతాబ్ధంలో తొలుత పద్యరూపంలో రచించారు. ప్రపంచవ్యాప్తంగా నిఘంటువులో అత్యంత ప్రాచీనమైనది అమరసిమ్హుడు క్రీస్తు శకం నాలుగో శతాబ్దంలో రాసిన అమరకోశము. తెలుగు నిఘంటువులు 17వ శతాబ్దంలో తొలుత పద్య రూపంలో రచించారు. 16వ శతాబ్దం నుంచి ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషలలో నిఘంటువులు రావడం మొదలయింది. 1604లో ఇంగ్లీషులో రాబర్ట్ కొడ్రే మొదటిసారి నిఘంటువును రూపొందించినట్లు తెలుస్తోంది. సమగ్రమైన నిఘంటువు ఈ భాషలో 1750లో వెలువడింది.

తెలుగులో ప్రాచీన నిఘంటువులు చాలా వరకు పద్య నిఘంటువులు. 20వ శతాబ్దంలో రూపొందిన సూర్యరాయాంధ్ర నిఘంటువులే ప్రామాణికమైనవిగా పేరొందాయి. భాష అభివృద్ధి చెంది, ముద్రణా పరిజ్ఞానం విస్తరించాక పుస్తకాల ప్రచురణ విస్తృతమైంది. ఈ క్రమంలోనే నిఘంటువుల అవసరం పెరిగింది. భాషలు నేర్చుకోవడానికి, ఇతర భాషల నుంచి, ఇతర దేశాలనుంచి జ్ఞానాన్ని అందిపుచ్చుకోవటానికి నిఘంటువులు దోహదపడుతున్నాయి.

నిఘంటువు చూడడంవల్ల ఒక పదానికి ఎన్ని అర్ధాలున్నాయో తెలుస్తుంది. అర్ధ చాయలు అవగతమవుతాయి. స్పెల్లింగ్ తెలుస్తుంది. పద ప్రయోగాలు బోధపడతాయి. దీనివల్ల ఏ పదాన్ని ఎలా ఉపయోగించాలో, ఏ సందర్భంలో ఎలా వాడాలో అర్ధమవుతుంది. ఒక భాషలో ఉన్న సమాచారాన్ని మరొక భాషలో ఉన్నవారికి అందించేందుకు నిఘంటువులు ఉపయోగపడతాయి. ఇందుకోసమే ద్విభాషా నిఘంటువులు రూపొందించారు. 30 రోజుల్లో ఎంగ్లీషు, 30 రోజుల్లో తమిళం, కన్నడం వంటి పేర్లతో ఎన్నో నిఘంటువులు మార్కెట్‌లోకి వస్తున్నాయి. అంటే ఒక భాష వచ్చిన వారు మరొక భాషని నేర్చుకోవాలంటే తపనిసరిగా నిఘంటువుల ద్వారానే సాధ్యం. కనుక నిఘంటువులు చూడడం రోజువారీ జీవితంలో భాగం కావాలి.


ఆన్‌లైన్ ద్వారా :

నిఘంటువులు ఇంటెర్నెట్‌లో అనేకం ఉన్నాయి. తెలుగు నిఘంటువులు కూడా నెట్‌లో ఉన్నాయి. కొన్ని నిఘంటువులకు సంబంధించిన సీడీలు కూడా దొరుకుతున్నాయి.

సాహిత్య అకాడెమీ నిఘంటు నిర్మాణాలకు మౌలికమైన కృషి చేసింది. తెలుగులో మాండలిక పదకోశాన్ని తీసుకొచ్చింది. తెలుగు అకాడెమి పారిభాషిక పదకోశాలు తీసుకువచ్చింది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం నిఘంటు నిర్మాణ శాఖ తరపున భాషా శాస్త్ర సూత్రాలకు అనుగుణంగా 1995లో పత్రికా భాషా నిఘంటువు వెలువడింది. 2000లో డా.ఉషా దేవి ధ్వన్యనుకరణ నిఘంటువు వెలువడింది.

నిఘంటువులు జీవితకాలమంతా ఉపయోగపడతాయని గుర్తుంచుకోవాలి. పత్రికలు చదివే అలవాటున్న వారికి కూడా నిఘంటువులు కావాలి. ఈ గ్లోబలైజషన్ కాలంలో మతృ భాష ఒక్కటే సరిపోదు. ప్రతి ఒక్కరూ ఇతర భాషలు తెలుసుకోవాలి. ఇది సృజనాత్మకంగా ఆలోచించడానికి ఉపకరిస్తుంది.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: