telugudanam.com

      telugudanam.com

   

ప్రాచీన విద్య

ఆధునిక విద్యాలయాలు ఉన్నత చదువులకంటే ఉన్నతోద్యాగాల దిశగా మాత్రమే విద్య బోధిస్తున్న విషయం తేటతెల్లమైనదే. ముఖ్యంగా టెక్నికల్ విద్య ఈనాడు చూపిస్తున్న ప్రభావానికి ప్రభావితం కాని విద్యార్ధి లేడు. టెక్నికల్ విద్య మాత్రమే తెలివైన విద్య అనే భావన విద్యా వ్యవస్థలో వేళ్ళూనుకుపోవడంతో విద్యార్ధులు ఆ విద్యపట్ల ఎక్కువ మక్కువ చూపుతున్నారు. తల్లితండ్రులు కూడా తమ బిడ్డలను ఈ విద్యలపట్లే ఆసక్తి పెరిగేట్లు చిన్నతనంనుంచే బోధిస్తున్నారు. టెక్నికల్ విద్య ద్వారా విదేశాల్లో ఉద్యోగాలు తెచ్చుకోవచ్చనే ఆశ వారిని ఈ విద్యపట్ల ఆసక్తిని పెంపొందింపజేస్తోంది. ఈ రోజుల్లో ఉన్నత విద్యంటే విదేశాలలో ఉన్నత స్థానానికి ఎగబ్రాకవచ్చనే ఒకే ఒక్క ధ్యేయమే నేడు సర్వత్రా ఉంది. నేటి విద్యా విధానం ఈ దిశగా సాగుతుంటే మన ప్రాచీన విద్య మాత్రం విజ్ఞానమే విద్వత్తు అనే మార్గంలో బోధించబడేది.

ప్రాచీన విద్యా విధానపు చరిత్ర 2000 బి.సి. నుండి 1200 ఏ.డి. వరకు విస్తరించుకుని ఉన్నట్లు విశ్వసించబడుతూంది. క్రీ.పూ. 2000 మొదలు 1000 బి.సి.లో వేదకాలంలో సాంఘిక విధానం అతి సామాన్యంగానూ, సరళంగానూ ఉండేది. పురుషులకు, స్త్రీలకు సమానమైన హక్కులు ఉండేవి. కుల, మత వివక్షత రూపొందని కాలమది. వ్యావహారికంగా ఎవరికి వారే స్వంతంగానే విద్య నేర్చుకునేవారు. యుద్ధ నైపుణ్యం కూడా స్వంతంగానే సంపాదించుకునేవారు. వ్యవసాయం చేసేవారు. 1000 మొదలు 200 బి.సి. అనగే ఉపనిషత్తుల కాలంలో సమాజంలో వర్గ విభజన ప్రారంభమైంది.

200 బి.సి. నుండి 500 ఏ.డి. అనగా ధార్మిక శాస్త్ర కాలంలో కళ, సాహిత్య, గణిత మరియు నాటక రంగాలలో చైతన్యత ప్రారంభమైంది. సంస్కృతం ప్రామాణిక భాషగా పరిణమించింది. ప్రాకృతం దైనందిన వ్యావహారిక భాషగా ఏర్పడింది. కులమత విధానం తీవ్ర రూపం ధరించింది. స్త్రీలకు మొదట అనుభవించిన వ్యక్తిగత స్వాతంత్ర్యం మృగ్యమైంది. 500 ఏ.డి.మొదలు 1200 ఏ.డి. కాలంలో అంటే పురాణ యుగ కాలంలో విద్యా విధానంలో ముఖ్యంగా బౌద్ధ యుగం ప్రారంభమైందని చెప్పాలి. నలంద మరియు విక్రమశిల విశ్వవిద్యాలయాలు, ముఖ్యమైన బౌద్ధ సంస్థలు ఏర్పడ్డాయి. వారి వాడుక భాష పాలి. ప్రప్రధమంగా విద్యా సంస్థలలో విద్య ప్రారంభమైంది.

గురుకుల విద్య ద్వారా విద్యాబోధన జరుగుతున్న కాలమది. గురుకులంలో గురుశిష్యులు ఇద్దరూ కలిసిమెలిసి జీవించేవారు. అందరూ ఒకే ఇంట్లో సహజీవనం చేసేవారు. నిత్యావసర వస్తువుల గురించి ఇరువురికీ బెంగ ఉండేది కాదు. సంతృప్తిగా జీవించేవారు. క్రమశిక్షణలో మర్యాద లోపం సాధారణంగా ఉండేది కాదు. అందువల్ల శిక్షలకు, దండనలకు అవకాశం ఉండేది కాదు. నాటి ప్రముఖ విద్యాలయాలైన తక్షశిల, నలంద, కంచి, శ్రీధాన్యకటక, విక్రమశిల మరియు కాశి వంటి విశ్వవిద్యాలయాలలో విద్య మిక్కిలి ఉదారంగా ఉండేది. విద్యార్ధులకు ఉచిత విద్యతోపాటు భోజనము, దుస్తులు కూడా ఉచితంగా అందజేసేవారు. ఉపాధ్యాయులు తమ విద్యాలయాల నిర్వహణ కోసం గ్రామస్తుల నుంచి నిధులు సేకరించేవారు. విద్యా విధానం ప్రధానంగా మౌఖికంగా ఉండేది. వ్యక్తిగతంగా కూడా ఉండేది. వినుట, ఆలోచన, అభ్యాసం అనేవి ఈ విధాన ముఖ్య లక్షణాలు. పుస్తకాలు చాలా కొద్దిగా మాత్రమే ఉండేవి. ప్రతి పాఠాన్నీ కంఠోపాఠంగా నేర్పేవారు. ప్రతిరోజూ ఒక ప్రత్యేక నిర్ణయ కాలంలో గురువులు ఉన్నత విద్యార్ధులకు పాఠాలు నేర్పితే, ఇతర సమయాలలో ఉన్నత విద్యార్ధులు (సీనియర్లు) చిన్న విద్యార్ధులకు (జూనియర్లు) విద్య నేర్పుతూండేవారు.

భారతదేశంలో 630 ఏ.డి. నుంచి 645 ఏ.డి. వరకు పర్యటించిన చైనా యాత్రికుడు హుయాన్సాంగ్ రచనల ద్వారా ఆనాటి నలందా విశ్వవిద్యాలయం గురించి మనకు తెలిసింది. ఆయన రచనల ప్రకారం తొమ్మిది అంతస్తుల పెద్ద భవనంలో గ్రంధాలయం ఏర్పాటుచేయబడింది. ఇందులో మొత్తం 300 గదులు ఉండేవి. విద్యార్ధులందరికీ కలిసి భోజనం పెట్టేవారు. ఆనాటి విశ్వవిద్యాలయాలలో విద్య నిమిత్తం చేరాలంటే ఎంతో కష్టంగా ఉండేది. విపరీతమైన పోటీ ఉండేది.ఉపాధ్యాయులు కూడా 10,000 మందికి తక్కువ ఉండేవారు కాదు. ఈవిధంగా రెండవ శతాబ్దంలో ప్రారంభమై ఎనిమిది, తొమ్మిది శతాబ్దాలతోపాటు నిరాటంకంగా ఈ విద్య నడిచింది. వీటి నిర్వహణకు గుప్త రాజులు 200 గ్రామాలను కేటాయించారు. నలందా విశ్వ విద్యాలయం బౌద్ధ సంస్థ కాబట్టి బౌద్ధ సన్యాసి అధిపత్యం వహించేవాడు.బౌద్ధ భిక్షువులు ఉపాధ్యాయులుగా ఉండేవారు. ఆనాడు సంస్కృతం నిర్బంధ విద్య ఉండేది.

పొరుగు దేశాలైన చైనా, టిబెట్, జావా, సమత్రా, కొరియా, గ్రీసు, ఇరాన్ మరియు అరేబియాలనుంచి విద్య నేర్చుకోవడానికి విద్యార్ధులు భారతీయ విశ్వవిద్యాలయాలకు వచ్చేవారు. వీరు ఇక్కడ 10 సంవత్సరాలకు పైగా ఉండి తర్క, వైద్య, ఖగోళ శాస్త్ర సంబంధమైన విషయాలు నేర్చుకునేవారు. శస్త్ర విద్యలో కంటి పొరలు, గర్భ కోశం నుంచి మృతపిండాన్ని తీయడం వంటి శస్త్ర చికిత్సలు చేసేవారు. మానవులతోపాటు ఇక్కడ జంతువులకు కూడా పరిపూర్ణమైన వైద్య సౌకర్యం ఉండేది.

క్రీ.శ. 1వ శతాబ్దం ప్రారంభంలో కూడా తక్షశిల యూనివర్సిటీలో వైద్య విద్య ఉచ్చ స్థితిలో ఉండేది. ఉజ్జయిని యూనివర్సిటీలో గణిత శాస్త్రం మరియు ఖగోళ శాస్త్రంలో నిపుణులు ఉండేవారు. ఇక్కడ అబ్జర్వేటరీని కూడా స్థాపించారు. దక్షిణ దేశంలో కాంచీపురం సుప్రసిద్ధ విద్యాకేంద్రంగా ఉండేది. ధనవంతులు, దరిద్రులు అని కాకుండా విద్యార్ధులందరికీ సమానావకాశాలు లభించేవి. విద్యా బోధన విస్తృత ప్రాతిపదికన ఉండేది. యూనివర్సిటీల నిర్వహణకు రాజులు, విదేశీయులు ధర్మాదాయాలు ఏర్పాటు చేసేవారు. విద్యాలయాలపై ప్రభుత్వాధిపత్యం ఉండేది కాదు. తమకు మంచి అని తోచింది ఉపాధ్యాలు విద్యార్ధులకు బోధించడానికి స్వాతంత్ర్యం పొంది ఉండేవారు.

గురుశిష్యుల అనుబంధమే ప్రధానంగా బోధన జరిగిన ప్రాచీన విశ్వ విద్యాలయాలు మన చరిత్ర సంస్కృతికి దర్పణాలు. విద్యా దానం మహా దానం అన్న సూక్తిని పాటించి మనసా ,వాచా, కర్మణా విద్యార్ధి సంక్షేమమే సమాజ సంక్షేమంగా బోధించే ఉపాధ్యాయులు ఆనాటి జాతి జీవన నిర్మాణంలో నిజమైన కర్తలు. ఆనాడు ఉపాధ్యాయులకు సంఘంలో ఉన్న గౌరవ మర్యాదలు ఎనలేనివి. వారి వేసిన బాటలోనే మనం నడుస్తున్నాం. విజ్ఞానమే విద్యగా బోధించిన అటువంటి గురువులు, అటువంటి విశ్వవిద్యాలయాలూ నేడు ఎంతో అవసరం. నేటికీ కొన్ని గురుకుల పాఠశాలలు ప్రాచీన గురుకులాల స్ఫూర్తితోనే నడుస్తున్నాయి. టెక్నికల్ విద్యకు సమాంతరంగా బోధిస్తూ, నేటి ఆధునిక విద్యా విధానాన్ని కూడా అవపోశన పట్టి, పాత కొత్తల మేలుకలయికగా భాసిల్లుతున్నాయి.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: