telugudanam.com

      telugudanam.com

   

తెలుగు సాహితీవనంలో వనితలు

స్త్రీ అనగానే సమాజంలోని మనుషుల మనస్తత్వాలనుబట్టీ, కవుల ఊహా కల్పనలను అనుసరించి వాస్తవ అవాస్తవాలకు అనుగుణంగా ఆడదనీ, అబల అనీ కొన్ని సందర్భాలలో వక్కాణించగా మరి కొన్ని సందర్భాలలో ధైర్యసాహసాలకు చిరునామాగా, రాజ్యాలనేలు చక్రవర్తినిగా అభివర్ణించడం జరిగింది. శారీరకంగా ఆమె బలహీనురాలైనప్పటికీ మానసికంగా మహా బలవంతురాలు. ముఖ్యంగా సాహిత్యపరంగా తీసుకుంటే పూర్వకాలం నుంచీ నేటివరకూ ఎందరో సాహితీ రంగాన మల్లెలు పూయించారు. తమ రచనా సౌరభాలతో తెలుగు సాహితీ సీమను పరిమళింపజేశారు.

తెలుగులో కవిత్వం రాసిన తొలి తరం కవయిత్రులలో తాళ్ళపాక తిమ్మక్క, మొల్లలను ప్రధానంగా పేర్కొనవచ్చు. చాటువులు చెప్పిన వారిలో ఖడ్గ తిక్కన భార్య చానమ్మ, అతని తల్లి పోలమ్మ ఉన్నారు. ఈ చాటువులను క్రీ.శ.1260 ప్రాంతాల్లో చెప్పారు. తాళ్ళపాక తిమ్మక్క 1460 ప్రాంతాలకు చెందినది. తరువాత క్రీ.శ. 1630 ప్రాంతాల్లో విజయరాఘవ నాయకుని ఆస్థాన కవయిత్రి పసుపులేటి రంగాజమ్మ రామాయణ, భాగవతాలకు సంగ్రహాలు వ్రాసింది. "ఉషా పరిణయం"ను ప్రత్యేక పద్య కావ్యంగా వ్రాసిన వాళ్ళలో మొదటి రచయిత్రి రంగాజమ్మ.


వారిలో ముఖ్యులు :

తాళ్ళపాక తిమ్మక్క :

ఈమె "మంజరీ ద్విపద" అను గేయ కవిత్వమును, "సుభద్రా కళ్యాణము" అను గ్రంధాలను రచించి వినుతికెక్కిన విదుషీమణి. ద్విపదులతో కూర్చి వ్రాసిన మంజరీ ద్విపద గేయ వాజ్ఙయమున మిక్కిలి ప్రసిద్ధిగాంచి, ప్రజలు పాడుకొనుటకు అనువైన గేయ కవిత్వమీ మంజరీ ద్విపద.


లీలావతి :

గణిత శాస్త్ర పండితుడైన భాస్కరాచార్యుని కుమార్తె లీలావతి. గణిత శాస్త్రమందు తండ్రిని మించిన తనయగా ప్రసిద్ధి చెందినది. ఈమె నన్నయ సమకాలీనురాలుగా చెప్పబడుచున్నది.


గంగాదేవి :

13వ శతాబ్దంలో విద్యానగామునేలిన పట్టమహిషి ఈమె. మహాకవి కాళిదాసును గురువుగానెంచి అతన్ని ఆదర్శంగా తీసుకొని తనదైన చక్కని బాణీలో రచన చేసిన కవయిత్రి. ఈమె సంస్కృతమునందు "మధురా విజయము" అను మహా కావ్య రచన చేసినది. తాను వలపించుకొన్న వల్లభుని యాత్రలను వర్ణించుచు వ్రాసిన ఈ కావ్య రచన శబ్దార్ధ భర రసాలతో కూడినదై ఘట్టములను అతి నేర్పుగా రచించనది. శైవ మతాభిమానియైన ఈమె స్వతంత్ర ప్రతిపత్తి ప్రకృతిసిద్ధమైనట్టి వస్తువులనాశ్రయించి రచన చేసింది. ఎర్రాప్రెగడ, నాచనసోమన ఈమె సమకాలికులు.


మొల్ల :

రామాయణ మహాకావ్యమును రచించిన ఆతుకూరి మొల్ల తెలియని వారు సాహితీ లోకంలో ఉండరు. శ్రీకృష్ణదేవరాయల కాలమున వెలసిన మహా కవయిత్రి ఈమె. దేశీయమగు తెలుగు రచనపై ఈమెకు ప్రీతి ఎక్కువ. ఈమె పోతనామాత్యుని సమకాలీనురాలని కొందరి ఊహ.ఈమె పద్య శైలి విరిసీవిరియని లేత మందారవలె, వలపు చిలికేటి వయసు కన్నెవలె అతిసుకుమారంగా సాగుతుంది. మొల్ల రామాయణంలో 6 కాండములలో సుమారు 900 పద్యాలు కలవు.


మోహనాంగి :

ఈమె శ్రీకృష్ణదేవరాయల వారి కుమార్తె. "మరీచి పరిణయము" అను మహాకావ్యమును రచించెను. ఈమె తన గ్రంధమందు రాయల కాలమునాటి చారిత్రక సత్యములెన్నింటినో విశదపరచి నేటి చరిత్ర పరిశోధకులకు సహాయకారియైనది. "స్త్రీలనన్నంతనె చుల్కనజేయుట కుమారీ మౌఢ్యమేసుమ్ము నారీలోకంబున శేముషీయుతలు లేరే, పూర్వమింతేటికిన్" అంటూ మహిళా రచనలపై తనకుగల అభిమానమును వ్యక్తపరచుటేగాక ఆ గ్రంధమునకు తాను పతిగా కృతిపతిత్లమునంగీకరింతునని కూడా ఎన్నియో చమత్కారాలతో చెప్పెను. ఈమె రచయిత్రియేగాక చిత్రలేఖన, కావ్య రచన కళలో కూడా ప్రవీణురాలని చరిత్ర చెప్పుచున్నది.


రామభద్రాంబ :

రఘునాధ రాజు కాలాన అతని ఆస్థాన కవయిత్రిగా ప్రఖ్యాతిగాంచిన మహిళ. రఘునాధునిపై "రఘునాధాభ్యుదయము" అను గ్రంధాన్ని రచించినది. రఘునాధనాయకుని వర్ణనతో గ్రంధాన్ని ప్రారంభించినా, ఆ కావ్యమునందు తంజావూరు వర్ణనము, రఘునాధుని వంశ వర్ణనము, సభా వర్ణనము, అ కాలమునాటి స్త్రీ విద్య, స్త్రీ సంస్కారము, సంగీత, విద్య, నాటక రచనలు, నృత్య గాన విశేషాలు వర్ణించినది. మహిళామణియైననూ యుద్ధ వర్ణనలను చక్కని శ్లోకములతో ఉత్తేజితమైన శైలితో రచించెను. సంస్కృత భాషకు అమూల్య సేవలొనరించిన మహిళా మణిపూస ఈమె.


మధురవాణి :

ఈమె రాయాయణ సార కావ్యమును, కుమార సంభవమను నైషధ కావ్యమును కూడా రచించెను. ఈమె రఘునాధుని కాలమునందొక ప్రత్యేక స్థానమునొందిన విశిష్ట కవయిత్రిగా పేరుగాంచుటయేగాక అపారమగు తన పాండిత్య కౌశలముతో నాటి రాజు మెప్పునొంది రఘునాధునిచే కనకాభిషేకమును పొందిన ప్రజ్ఞాశాలి.


ముద్దుపళని :

ఈమె "రాధికా స్వాంతము" అను శృంగార కావ్యమును రచించెను. తొలి శృంగార కావ్యమును రచించిన మహిళగా ప్రసిద్ధురాలు. ఈమె రచనలో చక్కని జాతీయములు జాలువారును.


బాలపాపాయి :

16వ శతాబ్దికి చెందిన రచయిత్రి ఈమె. శైవమత ప్రవక్త. మిక్కిలి పవిత్రమైన అక్క మహాదేవి చరిత్రనంతయును యక్షగానములుగా మలచి రచన గావించిన విదుషీమణి. అనేక మంగళహారతులను కూడా రచించినది.


తరిగొండ వెంగమాంబ :

ఈమె శ్రీకృష్ణ భక్తురాలు. బాల వితంతువగుటచే ఈమె చిన్నతనమంతయూ ఆధ్యాత్మిక, వైదాంతిక చింతనలతో జీవితాన్ని గడిపింది. ఈమె ద్విపద భాగవతమును రచించినది. "నరసింహ శతకము", "శివ నాటకము", రాజయోగపాఠము", కృష్ణనాటకం", మొదలగు అనేక కావ్యములని ఈమె రచించినది. చాలా సరళమైన శైలి ఈమె స్వంతం.


కొటికలపూడి సీతమ్మ :

వీరేశలింగం పంతులుగారి సమకాలీనురాలు. స్త్రీ విద్యా ప్రచారమిచ్చిన సంఘసంస్కర్త. "సాధురక్షక శతకము", "అహల్యాబాయి", "సతీధర్మములు" ఈమె రచనలు. "ఉపన్యాస సుమమాలిక" అను వచన గ్రంధమును రచించినది.


బండారు అచ్చమాంబ :

18వ శతాబ్దపు రచయిత్రి ఈమె. చారిత్రక స్త్రీ చరిత్రము, పౌరాణిక స్త్రీ, ఆంగ్లేయాది విదేశీ రమణీ చరిత్రము అను మూడు భాగముల "అబలాసచ్చరిత్రమాల" అను గ్రంధమును రచించెను.


వెన్నెలగంటి హనుమాయమ్మ :

చందోలంకార వ్యాకరణాది శాస్త్ర పరిచయమును పొందిన మహిళ. శ్రీశ్రీ బ్రహ్మానంద సరస్వతీ స్వామి వారి పాదుకాపూజనము, దత్తపూజా కదంబకము, శ్రీ జగద్గురు శంకర భగవత్పాదాచార్య పూజావిధి మొదలగు గ్రంధములను రచించి ప్రసిద్ధినొందిన కవయిత్రి.


కాంచనపల్లి కనకాంబ :

"రంగ శతకము" వీరి మొదటి రచన. "గౌతమ బుద్ధ చరిత్రము, "పాండవోదంతము" అను గద్య కావ్యములు, "కాశీయాత్ర చరిత్రము", "పద్య ముక్తావళి" మున్నగు గ్రంధములను రచించెను. ఈమె శ్రీ కేసరిచే "స్వర్ణ కంకణము" పొందుటయేగాక "కవితా విశారద" వంటి అనేక బిరుదులతో సత్కరింపబడిన కవయిత్రి.


గుడిపూడి ఇందుమతీదేవి :

"అంబరీష విజయము", "తరుణీ శతకము", "నీతి తారావళి", "ఆంజనేయ స్తుతి", "గాంధి కీర్తనలు" మున్నగు పద్య గద్య కావ్యములను రచించిన కవయిత్రి. వీరు "గృహలక్ష్మి" కంకణాన్ని పొందినవారు. ఈమె గొప్ప వక్త కూడా.


చేబ్రోలు సరస్వతీదేవి :

"సరస్వతీ శతకము", "సత్యనారాయణ వ్రతకల్పము", "ఉత్తరరామ చరితము" వంటి ఉత్తమ గ్రంధాలను రచించిన మహా కవయిత్రి ఈమె.


దేశిరాజు భారతీదేవి :

"గృహలక్ష్మి" రచనల ద్వారా వీరు ఆంధ్రులకు సుపరిచితులు. "ముక్తాంబ" అను నాటికను రచించి ప్రఖ్యాతినొందారు.


కనుపర్తి వరలక్ష్మమ్మ :

"శారద లేఖలు" ద్వారా వీరు ఆంధ్రులకు సుపరిచితులు. "అపరాధిని", "వసుమతి" అను సాంఘిక నవలలు, "వరదరాజేశ్వరీయము" అను చారిత్రక నవల, ఎన్నో కథలు, ప్రహసనములు, వ్యాసములను రచించారు. "ద్రౌపదీ మాన సంరక్షణము", "సత్యాద్రౌపదీ సంవాదము" అను ద్విపద కావ్యములను రచించారు. ఈమె "స్వర్ణకంకణ" గ్రహీత.

ఇంకా గిడుగు లక్ష్మీకాంతమ్మ, జొన్నలగడ్డ శారదాదేవి, బుర్రా కమలాదేవి, మాణిక్యం వేదవల్లీ తాయారమ్మ, కవితిలక పులపర్తి కమలావతీదేవి, సీమకుర్తి సత్యవతీదేవి, ద్రోణమ్రాజు లక్ష్మీబాయమ్మ, పోణంకి కనకమ్మ, కల్లూరు విశాలాక్ష్మమ్మ, గంటి కృష్ణవేణమ్మ, రావూరు వెంకటసుబ్బమ్మ, ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గార్లు మహిళా కవితా మణిపూసలుగా విరాజిల్లారు. ఇలా ఇంకా అనేకమంది వనితారత్నాలు సాహితీవనంలో వన్నెతెచ్చిన తారలుగా వెల్గొందుట తెలుగు వారికి ఎంతో గర్వకారణమైనది.

- కోకా విమలకుమారి

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: