telugudanam.com

      telugudanam.com

   

తెలుగు సాహిత్యంలో పేరడీ

పేరడీ అంటే అనుకరణ. అనుకరణ చెయ్యని ప్రాణి ఈ సృష్టిలో ఉండదు. శిశువు పుట్టినది మొదలు తన పరిసరాలను గ్రహిస్తూ అనుకరిస్తుంది.ముఖ్యంగా తల్లిదండ్రులను అనుకరిస్తూ ఎదుగుతుంది. అనుకరణకు సాధ్యంకాని రంగమె ఈ సృష్టిలో లేదు. కళా రంగంలో ఈ అనుకరణ సర్వసామాన్యంగా ఉంటుంది. ఒక కళాకారుడు సృష్టించిన కళాభినయం తరువాతి తరాలకు అనుకరణయోగ్యంగా ఉంటుంది. ఆ కళాకారుని చాతుర్యాన్ని అనుసరిస్తూ అనెక ఇతర కళాభినయాలు ఆవిష్కరణకు నోచుకుంటాయి. తాము అనుకరించే కళాభినయం కూడా దేనికో ఒకదానికి అనుకరణ కాక మానదు. అదే ఈ సృష్టిలోని వైచిత్ర్యం. అనుకరణ అనేక రకాలుగా ఉంటుంది. ముఖ్యంగా ఆదర్శ అనుకరణ ఒకటి. ఇందులో కొంటెతనం ఏమీ ఉండదు. సినిమా గీతాల బాణీలకు భక్తి పాటల రచన ఈ కోవలోకి వస్తుంది. రెండవది వికటానుకరణ. ఇది రచయిత శైలీ విన్యాసాలను, అభిరుచులను హేళనాత్మకంగా అనుకరించడం. దీన్నే సాహిత్యంలో పేరడీ అంటారు. పేరడీ స్వతంత్ర రచన కాదు. అనుకరణే ప్రధానంగా కలిగిన ఏకైక సాహితీ ప్రక్రియ పేరడీ. ఈ అనుకరణ కాకతాళీయమైందది కాది, ఇది పూర్తిగా ఉద్దేశపూర్వకమైనదే. అయితే పేరడీని గ్రంధ చౌర్యంగా భావించే అవకాశముంది. పేరడిస్టు మూలంలోని పదాలను, పాదాలను తన ఇష్టమొచ్చిన రీతిగా మార్చకుండానే అర్ధాంతరాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తాడు. రచనలోని పాత వేషం పోయి కొత్త వేషాన్ని సృష్టిస్తాడు. పేరడీ మూల రచనకు పేరుతెస్తుందేకానీ చౌర్యం కాదు. అయితే పేరడీ చదివినపుడు మాతృక గుర్తుకొచ్చి తీరాలి. లేదంటే ఆ దోషం పేరడిస్టుదే. అందరికీ తెలిసిన రచనలనే, ముఖ్యంగా ఖ్యాతినొందిన రచనలను, సత్తా వున్న రచనలను పేరడీలుగ పేరడిస్టులు మలుస్తారు. కథ, నవల, పద్యం, గేయం ఇలా ఏ ప్రక్రియలోనైనా పేరడీ ఉండొచ్చు. వస్తునువ్నుబట్టి, రూపాన్నిబట్టి పేరడీని రకరకాలుగా వింగడించి చూపే అవకాశముంది.

తెలుగు సాహిత్యంలో పేరడీ ధోరణులు మొట్టమొదటిసారిగా శ్రీనాధుడు రచించిన "క్రీడాభిరామం"లో కనిపిస్తాయి. పేరడీ లక్షణాలుగా చెప్పుకునే ప్రతి లక్షణమూ పొల్లుపోకుండా సరిపోయే పేరడీ చాటువుల్లో లభించడం విశేషం. వికటకవి తెల్నాలి రామకృష్ణౌని ప్రప్రధమ పేరడీ కవిగానూ, అతడు కవయిత్రి మొల్ల పద్యాన్ని అధిక్షేపిస్తూ చెప్పిన పద్యాన్ని ప్రప్రధమ పేరడీ పద్యంగానూ నిర్ణయించవచ్చని భావిస్తారు. అంతేకాకుండా అల్లసాని పెద్దన చేసిన "అమవసనిసి" పద ప్రయోగాన్ని అవహేళన పూర్వకంగా అధిక్షేపిస్తూ తెనాలి రామకృష్ణుడు చెప్పిన పద్యం సాహితీ లోకంలో సుప్రసిద్ధమైనదే.

"కలనాటి ధనము లక్కర

గలనాటికి దాచ కనులగర్భునివశమా?

నెలనడిమి నాటి వెన్నెల

లలవడునే గాదె బోయ అమవసనిసికిన్" అను పెద్దన చాటువుకు అధిక్షేపంగా రామకృష్ణుడు ...

"ఎమితిని సెపితివి కపితము?

బ్రమపడి వెరిపుచ్చకాయవడిదిని సెపితో?

ఉమెత:కయ తిని సెపితో?

అమవసనిసి అన్నమాట అలసని పెద్దనా!" అన్నాడు.

ఆధునిక సాహిత్యంలో పేరడీకి మారుపేరుగా నిలిచిన జలసూత్రం రుక్మిణీనాధ శాస్త్రి జరుక్ శాస్త్రిగా సుప్రసిద్ధులు. ఈయన అత్యంత హాస్యప్రియుడు. ఎదుటివారు ఎంతవారైనాసరే తనకు తోచింది నిర్భయంగా, నిర్మొహమాటంగా అనేవాడు. ఈయన ఎన్నో పద్యాలు రాశారు, కథలు రాశారు. అయితే ఎతనికి పేరుతెచ్చిపెట్టినవి మాత్రం ఈయన రచించిన పేరడీలే. పేరడీకి ఆయన పర్యాయపదమయ్యాడు. తెలుగు సాహిత్యంలో పేరడీ ప్రక్రియకు ప్రాచుర్యం కల్పించి, సుస్థిర రూపకల్పన చేశారు. భావకవులనూ, అభ్యుదయ కవులనూ జరుక్ శాస్త్రి పేరడీ చేశారు. నాయని సుబ్బారావు, విశ్వనాధ, మల్లవరపు విశ్వేశ్వర రావు, పిఠాపురం యువరాజు, శ్రీశ్రీలాంటి సుప్రసిద్ధ కవుల రచనల తీరుతెన్నులను అకటావికటం చేశారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి రచించిన "తొలి వియోగిని నేనే, తొలి ప్రేయసిని నేనే" అని సాగే ప్రసిద్ధ ఖండికను హేళనాత్మకంగా అనుకరించాడు.

"విరహమే విశ్వముగ, బేల కార్చిచ్చుగా

నుసిగా పలకరించి, పసిమిగా పులకించి

తులసిమొక్కను నేనే

తురక వేపను నేనే

ఆనాటికీనాటి

కేనుమృత్కణమేను" అన్నాడు.

వీరు శ్రీశ్రీ గేయాలకు చేసిన పేరడీలు బాగా ప్రసిద్ధి చెందాయి.

"ఆనందం అర్ణవమైతే

అనురాగం అంబరమైతే

అనురాగపుటంచులు చూస్తాం

ఆనందపు లోతులు చూస్తాం"

అన్న శ్రీశ్రీ అద్వైతాన్ని జరుక్ శాస్త్రి...

"ఆనందం అంబరమైతే

అనురాగం బంభరమైతే

అనురాగం రెక్కలు చూస్తాం

ఆనందం ముక్కలు చేస్తాం" గా పేరడీ రచన చేశారు.

స్వయంగా శ్రీశ్రీనే తన రచనైన "ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమసమూహములు" గీతానికి "ఏరి తల్లీ నిరుడు మురిసిన ఇనప రచయితలు" అంటూ పేరడీ వ్రాశాడు. శ్రీశ్రీ కవిత్వానికి పేరడీ రచనలను చేసిన మరో కవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు. శ్రీ జయభేరికి "గుండుభేరి" పేరుతోను, "మహాప్రస్థానం"కు "మహా ప్రతిష్ఠానం" పేరుతోను పేరడీలు రచించాడు. "పొలాలనన్నీ హలాల దున్నీ" అను కవితకు "అవాకులన్నీ చవాకులన్నీ" అంటూ పేరడీ రచన చేశాడు. శ్రీశ్రీ ప్రసిద్ధ రచనైన "నేను సైతం"కు జొన్నవిత్తుల "నేను సైతం తెల్లజుట్టుకు నల్లరంగును కొనుక్కొచ్చాను" అంటూ చక్కటి పేరడీ రాశారు. సుప్రసిద్ధ కవియైన రాయప్రోలు సుబ్బారావు రచించిన "ఏదేశమేగినా ఎందుకాలిడినా" గేయానికి ద్వాదశి నాగేస్వర శాస్త్రి "ఏ కాలేజికేగినా ఎందుకాలిడినా, ఏమేస్టరొచ్చినా ఎవ్వరేమనినా, చెయ్యరా అల్లరి నిర్భయముగాను, నిలుపరా నీ జాతి వారసత్వమును" అని పేరడీ రచించారు. కేవలం రాయప్రోలు వరి రచనలోని లయను, పదబందాలనూ మాత్రమే స్వీకరించి ఆయన ఈ పేరడీ రాశారు.

ఈ పేరడీలు పద్యానికో, పాటకో పరిమితం కాలేదు. సాహిత్యానికి కూడా విస్తరించాయి. తెలుగు నవలా రంగంలో చరిత్ర సృష్టించిన యండమూరి వీరేంద్రనాధ్ రచించిన "తులసిదళం" నవలను అధిక్షేపాత్మకంగా సంగీతీ రెడ్డి "వేపమండలు" అనే నవలను రచించారు. ఈ నవలలో ఈమె "తులసిదళం"లోని పేర్లను, కథను, సంఘటనలను, పాత్రలను, పద ప్రయోగాలను, మేనరిజాలను, లోటుపాట్లను పూర్తిగా అనుకరిస్తూ అతిశయించి చూపుతూ రచించారు. ఈ సంగీతా రెడ్డి మరెవరో కాదు, యండమూరు వీరేంద్రనాధే. తన రచన మీద తనే పేరడీ రాసుకుని పాఠకుల్ని విభ్రాంతికి గురిచేశాడు.పేరడీ రచనలలో ప్రసిద్ధివహించిన మరో రచయీ శ్రీరమణ. విశ్వనాధ, అడవి బాపిరాజులాంటి రచయితల శైలిని అనుసరిస్తూ ఎన్నో పేరడీలను ఆయన రచించారు. తెలుగులో తొలిసారిగా పేరడీల సంకలనం చేసి ప్రచురించి ఖ్యాతి గడించారు. కథా సాహిత్యంలోకి వస్తే ప్ర్ముఖ హాస్య రచయిత మునిమాణిక్యం నరసిమ్హారావు "శ్రీకాంతాయమ్మగారి కైఫీయతు" పేరుతో కైఫీయతుల ధోరణిలో మంచి పేరడీ కథ సృష్టించారు. 1937లో ఈయన అంతకు 150 ఏళ్ళ క్రిందటి కైఫీయత్తులోని భాషను, వాక్య నిర్మాణాన్ని, ప్రత్యయాలను హాస్యం కోసం ప్రయోగిసూ ఈ కథ రాశారు. అలాగే ముళ్ళపూడి వెంకట రమణ రాసిన "రాజకీయ భేతాళ పంచవింశతిక" నీతి నియమాలు పాటించని రాజకీయ నాయకులపై పెద్ద విసురు.

లిఖిత సాహిత్యానికేకాక మౌఖిక వాజ్ఙయమైన జానపద సాహిత్యంలో కూడా ఈ పేరడీ ప్రవేశించింది. బావమరుదుల వికటాలు, నాగవల్లి పాటలు, అల్లుడి మీద పాటలు, విందుల పాటల్లో పేరడీ ప్రస్ఫుటంగా కంపిస్తుంది. ఇంకా చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారి చేతిలో పేరడీ వీరవిహారం చేసిందనే చెప్పాలి. ఆయన పంచాంగ ఫలితాలను ఆటపట్టించాడు. ఔషధాల, గ్రంధాల అమ్మకాల ప్రకటనల ఆంతర్యాలను అవహేళన చేశాడు. మూఢనమ్మకాలను, అర్ధం లేని ఆచారాలను నొచ్చుకోని రీతిలో రచించాది. వీరి ప్రహసనాలన్నీ గ్రంధరూపంలో సంకలనమయ్యాయి. మందడి తిలక్, చందు సుబ్బారావు తదితరులు కూడా పేరడీ రచనల్లో తమ శైలితో పాఠకులను అలరించారు. ఇలా తెలుగు సాహిత్యంలో పేరడీ రచనల్ స్థానం విలక్షణమైనది. తెలుగు సాహిత్యంలో లబ్దప్రతిష్టులైన ప్రతి కవి, రచయిత రచన్ల మీద పుంఖానుపుంఖాలుగా పేరడీలు వెలువడ్డాయి, వెలువడుతూనే వున్నాయి. వీటికి తెలుగు సాహిత్యాభిమానులు ఇచ్చిన ప్రోత్సాహం తెలుగు హాస్య సంపదకు వరంలాంటిది.


వెలుదండ నిత్యానందరావు గారి "తెలుగు సాహిత్యంలో పేరడీ" సౌజన్యంతో

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: