telugudanam.com

      telugudanam.com

   

తెలుగు సామెతల్లో స్త్రీ

సామెత సమానార్ధం కలది. చెప్పదలుచుకున్న మాటకు పర్యాయపదంగా మరోమాట చెప్పడం. సామెతలు నిత్యజీవితంలో జన వ్యవహారంలో వినవచ్చునటువంటి సర్వసాధారణమైన వాక్యాలు. వ్యక్తి జీవితంలోనూ, సంఘ జీవితంలోనూ అనుభవంచేత గోచరమగు సత్యాలు సామెతలందు ఇమిడివుంటాయి. సామెత అను పదంలో సామ్యము అంటే పోలిక ఉండుటచే సామెతలు అలంకారములకు ఆయువుపట్టులాంటివి. యతిప్రాసలకు ప్రాణంవంటివి. అనిర్వచనీయమైన గుణమేదో సామెతల్లో ఇమిడియుండుటచే కాలక్రమేణా దేశంలో ఆనోటా ఈనోటా పడి నలిగి ఎక్కువ వాడుకలోకి వచ్చాయి. మొదట జానపదుల అనుభవాలలో పండిన ఈ సామెతలు పండితులను సహితం ఆకర్షించడంచేత సాహిత్యంలో చిలువలు పలువలుగా రూపుదిద్దుకున్నాయి. 'సామెత లేని భాష-ఆమెత లేని ఇల్లూ ఉండవేమో. ఆమెత అంటే విందు. సామెతకు దేశం, కులం, మతం, ఎల్లలు లేవు. తమిళం, కన్నడం, ఆంగ్ల భాషలనుండి కూడా సామెతలు వచ్చి తెలుగులో చేరాయి. తాము చెప్పే మాటలకు బలాన్ని చేకూర్చి, చేసే పనులకు సామెత ఉత్సాహాన్నివ్వడమేకాక ఆలోచంచి చేసినా, అనాలోచితంగా చేసినా మనం చేసే పనులను విడమర్చి చెప్తుంది. నిత్యజీవితంలో ఎక్కువగా పురుషులకంటే స్త్రీలే సామెతలను వాడుతూ ఉంటారు. అలాంటి సామెతల్ని గురించి తెలుసుకుందాం.

"తలలు బోడులైతే తలపులు బోడులా!" ఈ సామెత యవ్వనంలో వున్న స్త్రీలనుద్దేశించి చెప్పబడింది. కన్యాశుల్కం చెలామణి అవుతున్న రోజుల్లో, అంటే అరవై, డెబ్బై ఏళ్ళ ముదుసలికి పది పన్నెండేళ్ళ బాలికను డబ్బుకు అమ్మి పెండ్లి చేసే వారు. పెళ్ళైన కొద్దికాలానికే ముసలి భర్త చనిపోవడం, బాల వితంతువుగా ఆమె మారడం జరిగేది. అప్పటి ఆచార వ్యవహారాలనుబట్టి బాల వితంతువులకు తల వెంట్రుకులు తీయించి తెల్ల చీర కట్టబెట్టి ఇంట్లో కూర్చోబెట్టేవారు. ఈ సందర్భంలో ఏర్పడిన సామెతే ఇది. యుక్తవయసులో వున్న వితంతువులకి తల వెంట్రుకలు తీయించి బోడిగుండు చేసినంత మాత్రాన వారి మనసులోని యవ్వనపు తలపులు తొలగిపోతాయా? అనే ప్రశ్న వేసుకొంటే అర్ధమవుతుంది సామెతలోని సొగసు. "కలకంఠి కంట కన్నీరొలికిన సిరి ఇంటనుండదు" ఇంటికి మహాలక్ష్మిలాంటిది ఇల్లాలు. అలాంటి ఇల్లలు ప్రతి చిన్న విషయానికీ అంటే భర్త కోపగించుకుంటేనో, అత్తగారు అరిస్తేనూ, ఇరుగుపొరుగు పోట్లాడినా చీటికి మాటికి ఏడుస్తూ కూర్చుంటే ఆ ఇంట్లో సిరి సంపదలు కరువైపోతాయట. అంటే ఆ ఇంట్లో తలపెట్టిన పన్లకు ఆటంకం ఏర్పడుతుందనే లోకోక్తి ఉన్నది. "ఇంటిని చూసి ఇల్లాల్ని చూడమన్నారు" అనే సామెతలో ఓ ఇంట్లోకి ప్రవేశిస్తూనో ఆ ఇంటి శుభ్రత ఆ ఇంట్లో సర్దిన వస్తువుల తీరు ఆ ఇంటి వాతావరణాన్ని చూస్తూనే ఇల్లాలి శుభ్రత, మంచితనం మొదలైన గుణగణాలను బేరీజు వేసి చెప్పవచ్చును. ఇంటి పరిసరాలు, వాతావరణం పరిశుభ్రంగా ఉంటే ఆ ఇంటి ఇల్లాల్ని కూడ పరిశుభ్రతకు ప్రతీకగా మంచితనానికి మారుపేరుగా పరిగణించవచ్చును. ఆ ఇంటి వాతావరణం దానికి వ్యతిరేకంగా ఉంటే ఆ ఇల్లాలిని అశుభ్రతకు ప్రతీకగా పరిగణించి పూర్వకాలంలో మన పెద్దలు ఈ సామెతను ప్రయోగించారు.

సామెతల వాజ్ఙయంలో అత్తగారికి సంబంధించిన సామెతలు అనేకం. "అత్తలేని కోడలుత్తమురాలు - కోడలు లేని అత్త గుణవంతురాలు" ఇందులో ఒకటి. అసలు అత్త లేకపోతే అత్తా కోడళ్ళ ఆరళ్ళు ఉండవు కదా! అందుకే అలాంటి కోడల్ని ఉత్తమురాలన్నారు. అలాగే కోడలు లేని అత్త కూడా. "అత్త ఏలిన కోడలు చిత్తబట్టిన వరి" అంటే అత్తింట్లో అందర్నీ మెప్పిస్తూ తెలివిగా కాపురం చేసిన కోడలు ఎక్కడికి వెళ్ళినా, ఎలాంటి సమస్యలైనా ఎదుర్కొనగల శక్తి, సామర్ధ్యాన్ని కలిగివుంటుందని అర్ధం. "అత్తగారింటి సుఖం మోచేతి దెబ్బవంటిది" అత్తగారింట్లో సుఖపడ్తున్నాని కోడలు అనుకున్నా అది మోచేతికి తగిలిన గాయంలా ఉండీ ఉండీ బాధపెడ్తూనే ఉంటుంది. "అత్తపేరు పెట్టి కూతుర్ని కుంపట్లో తోసిందట" అత్త మీద ఉన్న కోపం ఆమె పేరున్న కూతురుపై చూపడం అంటే ఆ కోడలికి అత్తమీద ఎంతటి ద్వేషం ఉందో తెలుస్తూనే ఉంది. అలాంటి కోడళ్ళు ఈనాడూ ఉన్నారు మరి. "అంగడి మీద చేతులు అత్త మీద కన్ను" అత్త మీద కన్ను వేస్తూనే అత్తను దోచుకొంటున్న కోడలి వైనం ఇది. "అత్తను కొడితే కోడలు ఏడ్చిందట" ఇలా అత్తకు సంబంధించిన సామెతలు అనేకం.

ప్రజల ఆచార వ్యవహారాలనుబట్టీ, వృత్తినిబట్టీ కూడా కొన్ని సామెతలు పుట్టాయి."రొద్దానికి ఎద్దును పెనుగొండకు పిల్లను ఇవ్వకూడదు" అనేది ఒక సమస్యాయుత సామెత. పెనుగండ ప్రాంతంలో బావులు చాలా లోతుగ వుంటాయి గనుక నీళ్ళు తోడడం చాలా కష్టమనీ, అందుకే అలాంటి వారితో పిల్లనిచ్చి వియ్యమందకూడదనీ, మెరక సేద్యం చేయడం కష్టం కనక అలాంటి ప్రదేశాలకు ఎద్దుల్ని పంపించకూడదనీ ఒక నమ్మకం ఇండేది. అయితే ఇలాంటి కాలక్రమేణ ఆచార వ్యవహారాల మార్పుతోబాటు మరుగున పడిపోయాయి.

పల్లెపడుచులు తమ నిత్య జీవితంలో ఉపయోగించే కొన్ని సామెతలు ద్వంద్వార్ధాలతో కూడి ఉన్నప్పటికీ వారి జీవితాలకు ఆపాదించుకోవడం దినచర్య. "కొడుకు బాగుండాలి కూతురు ముండమోయాలి", "కూతురు కనలేకపోతే కొడుకు మీద విరుచుకుపడ్డాట్ట", "కడుపు కూటికేడిస్తే కొప్పు పూలకేడ్చిందట", "సారె పెట్టకుండా పంపేను కూతురా, నోరుపెట్టుకుని బ్రతకమందట" వంటి సామెతలు ఈ కోవలోనివే. అలాగే "కాలు జారితే తీసుకోవచ్చుగానీ నోరు జారితే తీసుకోలేము" కాలు జారి బురదలో పడితే వెంటనే బయటకు తీసుకోవచ్చుగానీ నోరు జారి పదిమంది యెదుట చెప్పరాని మాటను అనాలోచితంగా అనలేదని చెప్పి విన్నవారిని నమ్మించడం అసాధ్యం. మానవ జీవితంలో నిత్య వాక్పరిపాలనలో వ్యక్తుల ప్రమేయం లేకుండానే జాలువారే పద ప్రయోగం సామెత. అందుకే "సామెత చెప్పని ఇల్లాలు-ఆమెత ఇవ్వని ఇల్లు" ఉండవేమో అంటే బాగుంటుంది.

-కోకా విమలకుమారి

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: