telugudanam.com

      telugudanam.com

   

భాష - ఉత్పత్తి

భాష - ఉత్పత్తిమానవ జీవితం సుఖ దుఖాల సమ్మేళనం. తనలో సంఘర్షణలను రేకెత్తిస్తున్న భావాలను, తన కష్ట సుఖాలను సాటి మానవుడితో పంచుకోవడానికి ఆది మానవుడు సంజ్ఞలు (Gestures) చేసేవాడు. వాటి ద్వారా ఒకరినొకరు సమాచారాన్ని పరస్పరం వ్యక్తపరుచుకునేవారు. ముఖ వికాసం వలన సుఖాన్ని, ముఖ వికారం వలన దుఖాన్ని బహిర్గతం చేసుకునేవారు. అట్లేగాక కొన్ని ధ్వనుల ద్వారా కూడా అంతరంగాన్ని వెల్లడించుకునేవారు. అంటే అభిప్రాయాన్ని వ్యక్తపరచే ఒక సాధనం భాష అన్నమాట. అవయవాల సహాయంతో భావాన్ని తెలియజేసే మాటల సముదాయాన్ని కూడా భాష అనవచ్చు. కొన్ని సందర్భాలలో ఉచ్చారణ లేకుండానే అవయవాల కదలికల ద్వారా కూడా అభిప్రాయాన్ని వెల్లడించవచ్చు. వెళ్ళు, రా, వద్దు, నిశ్శబ్దం వంటి వాటిని అవయవాల సంకేతాల ద్వారా తెలపడం అందరికీ తెలిసిందే.

పుట్టిన పిల్లలకు భాష లేదు. వారి రోదనల ద్వారా వారికేది అవసరమో తెలుపుతారు. ఈ పిల్లలు క్రమేపీ పెరుగుతూ తమ చుట్టుపట్లనున్న ధ్వనుల పరిచయం వలన భాషను మెల్లగా నేర్చుకుంటారు. అంతేగానీ మాటలు స్వతస్సిద్ధంగా రావు. ఈ భాష మానవునకు స్వతస్సిద్ధంగా అబ్బినది కాదు.

భాష ఎప్పుడు, ఎలా పుట్టిందీ, ఎవరిచే ప్రారంభించబడిందీ, ఎవరిచే అనుకరించబడిందీ, సమాజంలో ఎలా కలపబడిందీ, శబ్దానికీ అర్ధానికీగల సంబంధం ఎటువంటిదీ మొదలైన ప్రశ్నలు ప్రతి దేశంలోనూ ఉద్భవించినవే. మొదట్లో వీటి గురించి చర్చించినవారు వేదాంతులు. తరువాత భాషా శాస్త్రజ్ఞులు. వీటికి సమాధానాలివ్వడం సాధ్యపడదు. మనుషులు మాట్లాడడం ప్రారంభించిన తరువాతే చరిత్ర ప్రారంభమయ్యింది. ప్రధమ సృష్టి ఎలా జరిగిందీ, భాష ఎలా ఉత్పన్నమయ్యిందీ అనే ప్రశ్నలకు తత్వశాస్త్రజ్ఞులు సమాధానాలు ఇవ్వలేదు. భాష ఆవిర్భావం గురించి భిన్నాభిప్రాయాలున్నాయి.

మన దేశాన "వాక్కు" దేవతగా భావించబ్డింది. భాష గో రూపమనీ, ప్రధమంలో ఇది దేవతలకు మాత్రమే వచ్చివుండేదని చెబుతారు. భాషాపతియే బృహస్పతి అని వేదమున 10వ మండలంలో 125వ ఋక్కునందు చెప్పబడింది. గ్రీసు దేశస్థులు భాషను గురించి చక్కని పరిశీలన చేశారు. వీరు భాష ప్రకృతిసిద్ధమైనదిగా భావించారు. వేదాంతమునందు జీవమును గురించి తర్కించినట్లు భాష యొక్క ఆది, అంత్యములను గురించి నిశిత విమర్శను చేశారు.

ధాతువులే భాషకు మూలములు. ఈ ధాతువులనుండియే పదజాలమంతా అనగా భాషయంతయూ బయల్పడింది. ఒకరి మనసులోని ఉద్దేశాన్ని ఇతరులకు తెలియజెప్పుటయే భాష యొక్క ముఖ్యోద్దేశ్యం. మనం మాట్లాడు భాషా పదములకు ఆయా అర్ధం ఇలా కలిగిందన్న ప్రశ్నకు మనం జవాబు చెప్పలేముగానీ మనకు చక్కగా అర్ధమవుతున్నది. అయితే ఈ అర్ధము మనం ప్రయత్నించి కల్పించినదా లేక సాంకేతికా అని ఆలోచిస్తే మనం సృష్టించినది మాత్రము కాదని చెప్పవచ్చు. ఇది సాంకేతిమమయ్యుంటే ఈ సాంకేతికార్ధం ఎలా పుట్టిందని ప్రశ్నిస్తే అది లోకపు వాడుకనుబట్టి అని చెప్పవలసివుంది. ఈ శబ్దార్ధాలు పుట్టడానికి పూర్వమే ఒకరికన్నా వ్యక్తులు ఉండాలి. ఒక్కరేయుండిన భాష ఏర్పడే అవకాశమే లేదు. ఒకరికంటే ఎక్కువ మంది వ్యక్తులున్నప్పుడే ఒకరి మనసులోని విషయం ఇంకొకరికి తెలియజెప్పాలనే అభిలాష కలుగుతుంది. ఈ సందర్భాన భావాన్ని తెలియజేసేందుకు కొన్ని మూగ సంజ్ఞలు ప్రారంచించబడ్డాయి. ఆ సంజ్ఞల వలన భావ ప్రకటన కొంత కష్టంగా చేయబడుతుండడంతో ఈ ప్రకటన సులభంగా అర్ధమయ్యేందుకు మాటలు తయారుచేయబడాలి. ఈ మాటలే భాషకు మూలాధారాలైనాయి.

భాష ఎప్పుడూ మారుతూనే ఉంటుంది. ఈ మార్పు మనుషుల ద్వారానే కల్పించబడుతుంది. అయితే ఇది కేవలం ఒకే ఒక్క వ్యక్తి వల్లనో, ఒక శాసనం వల్లనో జరగదు. వ్యక్తులే కారణభూతులైనప్పటికీ ఏ వ్యక్తికీ భాషను మార్చే ప్రత్యేకత లేదు. అనేక కారణాల వలన భాష మార్పులకు గురవుతున్నది. వాటిలో అనుకరణ ఒకటి. స్పష్టంగా పలకాలనే భావన కూడా మార్పుకు ఒక కారణం. స్పష్టంగా అంటే "క్ష్మ" అనడానికి బదులు "క్షమ" అనుట వంటిది. అలసత్వం, దీర్ఘ పదాలను పలకలేక వాటిని చిన్నవిగా పలకాలనే ప్రయత్నం, వర్ణ లోపం మొదలైనవి భాష మార్పు చెందడానికి ఇతర కారణాలు. ఈ భాషా పదాలు మొదట్లో ఎలా ఉండేవి? తరువాత ఎలా మరాయి? ప్రస్తుతం ఏ రూపాన ఉన్నాయి? ఏయే కారణాల వలన ఈ మార్పులు కలిగాయి? మొదలైన విషయాలనన్నింటినీ విమర్శించి, వ్యాకరించి, ఇప్పటి భాషలోని పదాలకు ప్రధమమున ఉన్న బీజములైన ధాతువులను కనుగొనడమే భాషా శాస్త్రమనిపించుకొంటున్నది. భాష మారుతుండడంతో పూర్వమున్న అర్ధాలు మారి కొంత కాలానికి కొత్త అర్ధాలు కలుగినాయి. పూర్వం విందు అనే పదానికి అతిధి అనే అర్ధముండేది. కానీ ఇప్పుడా అర్ధం లేదు. సంస్కృత పదమైన కక్ష తెలుగులో చంక అయ్యింది.

భాషలన్నీ ఒకే భాషనుంచి ఉత్పన్నమైనవా లేక వేరు వేరు భాషనలుండి ఉప్తన్నమైనవా అనే వివాదముంది. ప్రస్తుత భాషల పరిస్థితులనుబట్టి, భాషలను మాట్లాడేవారి స్థితిగతులనుబట్టి, వారి వారి ప్రకృతులనుబట్టి, వారికిగ ఇతరుల సంబధానలుబట్టి భాష వేరు వేరు రూపాలను సంతరించుకోవడం జరుగుతుంటుంది. ఒకే పదాన్ని ఒక పిల్లవాడు ఒక రీతిగా పలికితే మరో పిల్లవాడు మరో రీతిగా పలుకుతాడు. అదే పదం చదువుకున్నవారు ఒక రీతిగానూ, నిరక్షరాస్యులు మరో రీతిగానూ పలుకుతారు. భాషలో ఇటువంటి మారుపులెన్ని వచ్చినప్పటికీ భాషా శాస్త్రవేత్తలు ఈ భాష ప్రధమమున ఏ కుటుంబానికి చెందినదోయను విషయాన్ని అన్వేషించి వాటి కుటుంబాలను ఏర్పాటు చేశారు. పాశ్చాత్య దేశాలందలి స్పానిష్, ఫ్రెంచి, ఇటాలియన్ మరియు పోర్చుగీసు భాషలన్నె మొదట లాటిన్ భాషనుండి వచ్చాయని చెప్పవచ్చు. అదేవిధంగా ఉత్తర భారత దేశములోని భాషలన్నీ సంస్కృత భాషకు సంబంధించినవని సంబంధించినవనీ, ఈ భాషలన్నె, జెంద్ అవెస్థా భాషయూ ఒకే భాష నుండి పుట్టినట్లు తెలుస్తున్నది. అట్లే ఇంగ్లీషు భాష ట్యూటానిక్ భాషా కుటుంబానికి చెందినదని తెలుస్తున్నది. ఉత్తర హిందూస్తానుకు చెందిన భాషలన్నీ ఇండో ఆర్యన్ భాషా కుటుంబానికి చెందినవి. దక్షిణ భారత దేశ భాషలు ద్రవిడ భాషా కుటుంబానికి చెందినవి. భాషా కుటుంబాలను ఏర్పరచడంలో పదం కన్నా పద సంఘటనా రీతి, వ్యాకరణాంశాలు ముఖ్యం. భాషా సంపర్కం వలన కొన్ని వ్యాకరణాంశాలు భాషలో లోపించవచ్చుగానీ వ్యాకరణంలో మాత్రం మార్పులు జరగవు. ఇలా భాషా కుటుంబాల ద్వారా భాషల గురించి సులభంగా తెలుసుకునే అవకాశం ఏర్పడింది.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: