telugudanam.com

      telugudanam.com

   

అమ్మ తప్పిపోయింది

[ వెనుకకు ]

ఆమెవరో కానీ….
గత కొద్ది రోజులుగా
మురికివాడలో …..పూరిగుడిసెలో….
దిక్కుతోచక బిక్కుబిక్కుమంటూ బతకుతుంది 
చిమ్మ చీకట్లు చుట్టుముడుతున్నా
ఆమె కళ్ళల్లో ఆత్మాభిమానం 
వెన్నెల దివ్వె వెలుగుతుంది 
అదే పనిగా ఆరాతీస్తే
ద్రావిడ కుటుంబానికి చెందిన 
నలుగురు అక్క చెల్లెళ్లలో తానొక్కతని 
ఒకప్పుడు బాగా బతికినదని అర్ధమవుతుంది 
పిల్లల పట్టించుకోవట్లేదా? అని 
ఎవరైనా జాలి చూపులు చూస్తే
వాళ్లేమి చేస్తారు 
పరిస్ధితులు చేజారిన చిల్లర కాసులై పోతుంటే
నాలుగు పైసలిచ్చే వారి మాట వింటారన్నట్లు 
చిరిగిన చీరకొంగుతో
చెమర్చిన కళ్ళను ఒత్తుకుంటుంది 
తన అరచేతి నుడికారాన్ని తిన్నప్పుడు 
నిద్దట్లో సైతం తననే పలవరించేవారని 
మార్కెట్‌ మాటలు రుచి మరిగినాక 
తనను మరచిపోవడం మొదలు పెట్టారన్నట్టు 
మూగగా రోదిస్తూ… దీర్ఘంగా నిట్టూరుస్తూంది 
ఎప్పడైనా… ఎవరైనా
అచ్చ తెలుగులో అమ్మా అని పిలిచినప్పుడు 
ఇక్కడి కన్న పేగు కలుక్కుమంటుంది 
అక్కడెక్కడో ఈవిడగారి పుత్రరత్నాలు 
పదిమంది ముందు తనతల్లి తప్పిపోయిందని 
ఇంగ్లీషులో ఏడుస్తున్నారు.
 

మూలం: శ్రీనివాసరావు

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: