telugudanam.com

      telugudanam.com

   

ఎడారి అడుగులు

[ వెనుకకు ]

ఎడారి ఇసుకలో పాదముద్రలు
ఒంటరి ప్రయాణానికి సూచికలు 
అండదశ నుంచీ 
అగ్నిలో దహనమయ్యేవరకు 
గమనమంతా
జలవిహారమూకాదు 
వసంత విలాసమూ కాదు 
ఎదురయ్యేవరకు 
కనువిందుచేసే ఇంద్రధనుస్సులే కాదు 
కనికట్టు చేసే ఎండమావులు కూడా
అసలు 
ఉద్యానాలూ, ముళ్లపొదలు, ఎడారులూ
భూమ్మీదేకాదు 
మస్తిష్కాల్లోనూ
వేడి నిట్టూర్పులు 
అంతరంగ ఎడారి ప్రకోపాలే!
ఆలోచనల పాదాలు గాయపడి 
ఎర్ర్గా మండేది 
మనసు ముళ్లపొదలు చెలరేగినప్పుడే.
అంతర్మ్ధ్ఢధనానికీ, అలజడికీ
పారదర్శక ప్రతిరూపాలు కన్నీళ్లే!
హృదయ కేంద్రం రూపొందించే
ప్రసారాలను ప్రత్యక్షం చేసే బుల్లితెరలు 
ఆర్ద్రమైన కళ్లే
అన్ని బాటలూ ఒకే గమ్యాన్ని చేర్చవు 
నినాదంలో తరంగమై
సమూహంలో పరిభ్రమించినా
ఎగరేసిన నాణెం 
ఎప్పుడూ బొమ్మగానే పడదు 
బోరుసుపడిన ఆనవాళ్లే
ఎడారి ఇసుకలో పాదముద్రలు 
ఇవి 
సమసౌష్ఠవంగా సాగినంతమేర 
ఒక తీరాన్ని చిత్రించుకునే
ఆశల కొనఊపిరి స్పర్శ 
అనుభూతమవుతుంది 
జారిపడిన దిక్సూచి కోసం అన్వేషణలో 
ఆ పయనం 
అగమ్యమై అపశృతిలో ఆక్రోశిస్తుంది.
వెనక ముందు తడబాటుతో
చెల్లాచెదురై
సందిగ్ధాన్ని చిత్రించిన అడుగుజాడలు 
అక్కడ ఆగిపోతాయి 
ఎడారి సాగిపోతూనే ఉంటుంది.
 

మూలం: డా|| వై. రామకృష్ణారావు

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: