telugudanam.com

      telugudanam.com

   


పద్యం

భావం

శ్రీమదనంత లక్ష్మీ యుతోర: స్థల,

చతురాననాండ పూరిత పిచండ,
దర చక్ర, ఖడ్గ, గదా శరాసనహస్త,
నిఖిల వేదాంత వర్ణిత చరిత్ర,
సకల పావన నదీ జనక పాదాంభోజ,
రమణీయ ఖగకులోత్తమ తురంగ,
మణిసౌధవ త్ఫణామండ లోరగతల్ప,
వరకల్పకోద్యాన వన విహార,
భాను సితాభానునేత్ర, సౌభాగ్యగాత్ర,
యోగిహృద్గేయ, భువనైక భాగధేయ,
చిత్ర చిత్ర ప్రభావ, దాక్షిణ్యభావ,
హత విమతజీవ, శ్రీకాకుళాంధ్రదేవ! 

శ్రీకాకుళ ఆంధ్ర దేవా! ఆంధ్ర మహా విష్ణువా, ఎంతో శుభకరమైన లక్ష్మీ దేవిని, నీవు వక్షస్థలంపై నిలుపుకుంటావు. నీ కడుపులో అన్ని లోకాలను దాచుకుంటావు. పవిత్ర గ్రంథాలలో నీ చరిత్ర కలవాడవు. శంఖం, చక్రం, గద, ధనుస్సులను నీ నాలుగు చేతులలో ధరించి వెలిగిపోతావు. పావన గంగానదీ తీరంలో పుట్టిన, పక్షిరాజు గరుత్మంతుడు నీ వాహనం. వేయి పడగల శేషువు నీ పడక. ఇక నీ వనవిహారం కల్పవృక్షాల తోటలో, విశ్వానికి వెలుగు ప్రసాదించే సూర్య చంద్రులు నీ నేత్రాలు. యోగులతో పొగడ్తలు అందినవాడవు. అన్ని మహిమలు కలవాడవు. దయ, కరుణ నీ సొత్తు. శత్రువులను శిక్షించి, భక్తులను రక్షించగలవాడవు.

వైజయంతీదామ, వర్ణిత సూత్రామ,

శోభననామ, లోకాభిరామ,
కువలయశ్యామ, వికుంఠపట్టణధామ,
శ్రుతిహితనామ, దైవతలలామ,
కృతదైత్య సంగ్రామ, గీతార్థ పరిణామ,
యదుకులాంబుధిసోమ, అఘవిరామ,
సంగర జిత భౌమ, రంద్గుణస్తోమ,
త్రిభువన క్షేమ, వర్ధిష్ణుకామ,
దాసులము గామ? నీ పేరు దలచుకోమ?
కొసరితిమి ప్రేమ, కోరిన కోర్కులీవ?
చిత్ర చిత్ర ప్రభావ, దాక్షిణ్యభావ,
హత విమతజీవ, శ్రీకాకుళాంధ్రదేవ! 

శ్రీకాకుళ ఆంధ్ర దేవా! నీవు కంఠానికి వైజయంతి అనే మాల అలంకరించావు. దేవతల నాయకునితో పొగడ్తలు అందుకున్నావు. నీ నామస్మరణ సర్వ శుభాలను ఇస్తుంది. నీవు అన్ని లోకాలను సంతోషపెడతావు. నీ శరీరం నల్ల కలువ ఛాయ కలిగి ఉంటుంది. వైకుంఠం నీ నివాసం. నీ పేరు వింటే చెవులు ఆనందంతో పరవశిస్తాయి. భగవద్గీతలో ప్రతి అర్ధం ఫలితం నీవే. సాగరం వంటి యదువంశానికి నీవు చంద్రుడవు. జనుల పాపాలను తొలగించేవాడవు. మూడులోకాలను రక్షించేవాడవు. నా వంటి భక్తుల కోర్కెలు తీర్చగలవు. అలాంటి నీ ప్రేమ కోరుకుంటూ, నిన్ను ఎల్లప్పుడూ స్మరిస్తూ, నిన్ను నిత్యం పూజించే మా కోర్కెలు తీర్చు.

మానుషహర్యక్ష, మార్తాండ సోమాక్ష,

త్రిభువనాధ్యక్ష, కౌంతేయపక్ష,
మదనకోటి విలాస, మంజుల దరహాస,
శ్రీహృన్నివాస, కౌశేయ వాస,
శార్జ్ఞకోదండ పిచండ భృతాజాండ,
వినతవేదండ, రవిప్రచండ,
దీన శరణ్య, విద్విట్‌భేద నైపుణ్య,
భక్తానుగణ్య, దిక్ప్రభువరేణ్య,
సిద్ధసంకల్ప, అవికల్ప, శేషతల్ప,
నిష్కళంక, నిరాతంక, నిరుపమాంక,
చిత్ర చిత్ర ప్రభావ, దాక్షిణ్యభావ,
హత విమతజీవ, శ్రీకాకుళాంధ్రదేవ! 

శ్రీకాకుళ ఆంధ్ర దేవా! నరసింహావతారం దాల్చినవాడా! రెండు కన్నులుగా సూర్య చంద్రులు కలవాడవు. మూడు లోకాలకు అధిపతివి. పాండవుల మీద ప్రేమ కలిగినవాడవు. అందమైన చిరునవ్వు కలవాడవు. కోటిమన్మథులు ఒకటైనా నీ సౌందర్యానికి సాటిరారు. లక్ష్మీదేవి మనసులో ఆనందంతో గడుపుతావు. పట్టుబట్టలు ధరిస్తావు. శార్జ్ఞం అనే విల్లు కలవాడవు. నమస్కరించే ఏనుగు కలవాడవు. నీ తేజస్సు సూర్యుని తేజస్సు కన్నా ఎక్కువగా ఉంటుంది. దిక్కులేని వారికి నీవే దిక్కు. శత్రువులను సంహరించే శక్తి కలవాడవు. అన్ని దిక్కులలోగల పాలకుల కంటే ఉన్నతుడవు. భక్తుల కోరికలు తీర్చగలవాడవు. మాయలు, మర్మాలు కలవాడవు. కళంక రహితుడవు. భయం లేనివాడవు. నీతో సాటిలేని పేరున్నవాడవు.

గోవింద, ముచికుంద సేవిత పాదార

వింద, నిత్యానంద, విశ్వతుంద,
శ్రీమంత, విజయలక్ష్మీకాంత, నిర్మల
స్వాంత, భక్తోద్యాన వనవ సంత,
అఘనాశ, కోటిసూర్యప్రకాశ, వరేశ,
విజితాశ, సన్మనోంబుజ నివేశ,
సద్గుణ గేహ, వాసవనీల సమదేహ,
బంధురోత్సాహ, సుపర్ణవాహ,
పండితస్తోత్ర చారిత్ర, పద్మనేత్ర,
మధుర మంజులభాష, సమస్తపోష,
చిత్ర చిత్ర ప్రభావ, దాక్షిణ్యభావ,
హత విమతజీవ, శ్రీకాకుళాంధ్రదేవ! 

శ్రీకాకుళ ఆంధ్ర దేవా! గోపాలకా! నీవు ముచికుందుడు అనే రాజుగారిచే సేవలందినవాడవు. నిత్యం ఆనందంగా ఉండేవాడవు. అందగాడవు. సర్వ శుభాలను చేకూర్చేవాడవు. జయలక్ష్మికి ప్రాణ సమానుడవైనవాడవు. స్వచ్ఛమైన మనసు గలవాడవు. ఉద్యానం వంటి భక్తులకు వసంత రూపుడైనవాడవు. భక్తుల పాపాలను నాశనం చేయగలవాడవు. కోటి సూర్యుల కాంతి గలవాడవు. గొప్ప ప్రభువు అయినవాడవు. ఉత్తమ గుణాలు కలవాడవు. ఎంతో ఆనందంగా ఉండేవాడవు. శరీరం ఇంద్ర నీలకాంతి గలవాడవు. పక్షిరాజు వాహనంగా కలవాడవు. పద్మాలు కన్నులుగా కలవాడవు. తీయనైన, కమ్మనైన మాటలు చెప్పగలవాడవు. సమస్తాన్ని పోషించే శక్తిగలవాడవు.

శ్రీకాకుళము భక్తలోక చింతామణి

శ్రీకాకుళము సుకృతాకరంబు
శ్రీకాకుళము ధరాలోక వైకుంఠంబు
శ్రీకాకుళము మర్త్యసేవితంబు
శ్రీకాకుళము వేదసిద్ధాంత మహిమంబు
శ్రీకాకుళము హతవ్యాకులంబు
శ్రీకాకుళము మహాక్షేత్రావతంసంబు
శ్రీకాకుళము సర్వసిద్ధికరము
తెలియ శ్రీకాకుళము నీ దివ్యదేశ
మాంధ్రనాయక నీవె శ్రీహరిని నిజము,
చిత్ర చిత్ర ప్రభావ, దాక్షిణ్యభావ,
హత విమతజీవ, శ్రీకాకుళాంధ్రదేవ! 

శ్రీకాకుళ ఆంధ్ర దేవా! భక్తుల కోరికలు తీర్చేవాడా! ఈ క్షేత్రాన్ని పవిత్రమైన పుణ్య స్థలంగా మార్చినవాడా! శ్రీకాకుళం భూలోకంలో వెలసిన ఒక వైకుంఠం. మానవులతో పూజలందుకునే దేవాలయం. పవిత్రమైన వేదాలలో చెప్పిన శక్తి, మహిమ కలది. జనుల బాధలను పోగొట్టేది. అన్ని క్షేత్రాలలో తలమానికమైనది. అన్నిటినీ చేకూర్చేది ఈ శ్రీకాకుళేశ్వర మహాక్షేత్రం. నమ్మినవారికి, తెలుసుకోగోరే వారికి ఇది శ్రీహరి నివాసం. ఆంధ్రనాయకుడవు నీవే శ్రీహరి! ఇది నిజం.

ఇంద్రనీలచ్ఛాయ లీను నెమ్మేనిపైఁ

గనకాంబరప్రభ గ్రందుకొనఁగఁ
బర్వసుధాంశు శోభాసముజ్జ్వలవక్త్ర
మున సూర్థ్వపుండ్రము ముద్దు గుల్క
నెగుభుజంబుల ధగద్ధగితాంగద ద్యుతుల్‌
మూర్ధరత్న కిరీటమునఁ జరింప
వర్ణితోర స్థలి వైజయంతిక, కౌస్తు
భాంతర శ్రీదేవియంద మమర
రమ్ము దర్శన మిమ్ము ఘోరములఁ జిమ్ము
మభయ మిమ్ము భవత్తత్త్వ మానతిమ్ము,
చిత్ర చిత్ర ప్రభావ, దాక్షిణ్యభావ,
హత విమతజీవ, శ్రీకాకుళాంధ్రదేవ! 

శ్రీకాకుళ ఆంధ్ర దేవా! నీలకాంతులులాగా ప్రకాశించే నీ శరీరంపై, బంగారు బట్టల కాంతులు ప్రసరింపజేయగా, పిండి ఆరబోసినట్లు పౌర్ణిమినాటి వెన్నెలలో, ధగధగ కాంతులు ప్రకాశిస్తూ, అందమైన నీ ముఖం నిలువు బొట్టు పెట్టుకోగా, ఉన్నత భుజాలపై జిగేలుమనే వెలుగులు వ్యాపించి, రత్నాలు పొదిగిన కిరీటంపై పడగా, నీ రొమ్ముపై కౌస్తుభ మణిలోపలి లక్ష్మీదేవి ఆనందించగా ప్రత్యక్షమై, మా పాపాలను నశింపజేయి. మమ్మల్ని రక్షించేందుకు వాగ్దానం చేయి.

వరమిచ్చినట్టి శంకరుని కెగ్గు దలంచు

భస్మాసురుని పేరుఁ బాపినావు
తన యిల్లు గాచు నుగ్రుని బోరుటకుఁ బిల్చు
బాణుచేతులు తెగ బరికినావు
తొలుమిన్కు లజుని మ్రుచ్చిలి గొన్న సోమకుఁ
జంపి విద్యలు ధాత కంపినావు
బలిమి దైత్యులు సుధాకలశము న్గొన వారి
వంచించి సురలకుఁ బంచినావు
నిఖిలదైవత కార్యముల్‌ నిర్వహించు
నీకు నిజకార్యము భరంబె నిర్వహింప,
చిత్ర చిత్ర ప్రభావ, దాక్షిణ్యభావ,
హత విమతజీవ, శ్రీకాకుళాంధ్రదేవ! 

శ్రీకాకుళ ఆంధ్ర దేవా! వరం ఇచ్చిన శివునిపై అదే వరాన్ని ప్రయోగించి, నాశనం చేయదలచిన భస్మాసురుని నీ మాయతో మోసగించి, తన ఇంటి ముందు కాపలా ఉన్న శివుని, యుద్ధానికి రమ్మని పురిగొల్పిన బాణాసురుని వేయిచేతులు నరికేశావు. సోమకాసురుడు అనే రాక్షసుడు వేదాలను దొంగిలిస్తే, అతడిని చంపి వాటిని బ్రహ్మకు అందజేశావు. భుజబలంతో అమృతాన్ని కాజేసిన రాక్షసులను మాయచేసి, వారి నుంచి అమృతం సంపాదించి దేవతలకు అందించావు. ఇలా దేవతల పనులు బాగా చేశావు. నీ పనులు చేసుకోడానికి నీకు తీరిక లేదు. సొంత పనులు చేసుకోవడం నీకు బరువా?

అచట లే వని కదా యరచేతఁ జఱచె గ్రు

ద్ధత సభా స్తంభంబు దానవేంద్రుఁ
డచట లే వని కదా యస్త్రరాజం బేసె,
గురుసుతుం డుత్తరోదరమునందు
నచట లే వని కదా యతికోసి ననిచెఁ
బాండవు లున్నవనికి గౌరవకులేంద్రు
డచట లే వని కదా యాత్మీయసభను ద్రౌ
పదివల్వ లూడ్చె సర్వధ్వజుండు
లేక యచ్చోటులను గల్గలేదె ముందు
కలవు కేవల మిచ్చోటఁ గల్గు టరుదె,
చిత్ర చిత్ర ప్రభావ, దాక్షిణ్యభావ,
హత విమతజీవ, శ్రీకాకుళాంధ్రదేవ! 

శ్రీకాకుళ ఆంధ్ర దేవా! నీవు అంతటా ఉండవనే భ్రమతో హిరణ్యకశిపుడు, స్తంభాన్ని పగలగొట్టబోయి చావు కొని తెచ్చుకున్నాడు. ఉత్తర గర్భంలో బ్రహ్మాస్త్రాన్ని అశ్వద్ధామ ప్రయోగించి, తన నాశనాన్ని తానే కొనితెచ్చుకున్నాడు. అడవిలో ఉన్న పాండవుల వద్దకు దుర్యోధనుడు దుర్వాసుని పంపాడు. మరలా అతడే నీవు లేవు అనుకుని ద్రౌపదిని నిండు సభలో అవమానించబోయాడు. ఆ సమయంలో నీవు పూనుకుని మహిమ చూపావు. అలాగే నీవు ఇక్కడ ఉండడంలో ఆశ్చర్యం లేదు.

అంచితాఖండదీపారాధనల చేత

దీపించు నెప్పుడు దేవళంబు
అగరు సాంబ్రాణి ధూపార్పణంబులచేత
భవనంబదెప్పుడుఁ బరిమళించు
నతినృత్యగీత వాద్యస్వనంబులచేత
నెప్పుడు గోవెల యెసక మెసగు
నఖలోపచార సమర్పణంబులచేత
మెఱయు నెప్పుడు దిరుమేను కళల
నిపు డొకించుక లోభిత్వ మెనసి నట్లు
దోఁచుచున్నాడ విట్టియద్భుతము గలదె,
చిత్ర చిత్ర ప్రభావ, దాక్షిణ్యభావ,
హత విమతజీవ, శ్రీకాకుళాంధ్రదేవ! 

శ్రీకాకుళ ఆంధ్ర దేవా! నీవు కొలువు ఉండే ఈ క్షేత్రం, అఖండ కాంతులతో వెలుగుతుంది. సాంబ్రాణి ధూపదీపాలతో కమ్మని వాసన వేస్తుంది. నృత్య గీత వాయిద్యాలతో అలరారుతుంది. పవిత్రమైన నీ శరీరం అన్ని సేవలతో కాంతివంతంగా ఉంటుంది. కానీ ఈనాడు అవి లేని లోటు కనిపిస్తుంది. ఇది తప్పదా!

భక్తిఁజేసిన శిలాప్రతిమ మాత్రమె కాని

హరి యిందు గలుగునా యనెడువారు
స్వామి యిందుండిన సత్యంబు జూపక
యుండునే యని పల్కుచుండువారు
బుద్ధావతారంబు బూనినా డఖిలంబు
గని కనకట్లుండు ననెడువారు
దేవతామహిమంబు దెలియునో యేమేని
నడువ నున్నదొ యని నుడువువారు
నీకు నిత్యోపచారముల్‌ లేక యున్న
లోకు లి ట్లాడుకొండ్రు పరా కి దేమి,
చిత్ర చిత్ర ప్రభావ, దాక్షిణ్యభావ,
హత విమతజీవ, శ్రీకాకుళాంధ్రదేవ! 

శ్రీకాకుళ ఆంధ్ర దేవా! లోకంలో సర్వజనులు నీకు నిత్యం జరపాల్సిన, ఉపచారాలు జరపక పోవడంచేత, నిన్ను బుద్ధావతారం అంటున్నారా! నీవు అసలు ఉన్నావా? లేవా అని సంశయంతో ఉంటే, నీ మహిమలు చూపి సేవలు చేయించుకోలేక, ఊరకే ఉంటావా? అంతేకాదు, ఇకపై తమపట్ల, మహిమలు ప్రదర్శిస్తారో లేదో అని కూడా అనుమానంతో ఉన్నావు. వారి అనుమానాలు తొలగించు. ఇది నీకు ఎలా సాధ్యమో అర్థం కావడం లేదు.

ధర నూటయెనిమిది తిరుపతులందు శ్రీ

కాకుళం బరయ బ్రఖ్యాతమేని
యాంధ్రనాయకుడ వం చఖిలదేశంబుల
నిన్నుఁ గీర్తించుటే నిజమయేని
వై ఖానసోక్తికి వంచన రాకుండ
నెరులు చూపినమాట నిజమయేని
వైకుంఠుడవు స్వయంవ్యక్తిగా నర్చావ
తార మొందినమాట తథ్యమేని
వివిధ పూజోత్సవములు నిర్విఘ్నములుగ
జేసికొనకున్న నీకు బ్రసిద్ధి గలదె,
చిత్ర చిత్ర ప్రభావ, దాక్షిణ్యభావ,
హత విమతజీవ, శ్రీకాకుళాంధ్రదేవ! 

శ్రీకాకుళ ఆంధ్ర దేవా! ఈ భూమిపై 108 తిరుపతులు ఉన్నాయి. అందులో శ్రీకాకుళేశ్వరస్వామి క్షేత్రం పరమ పావనమైనది. నీ భక్తులంతా నిన్ను ఆంధ్రనాయకుడవు అని పొగడడం సత్యం. అయితే నీ అంతట నీవు సేవించేందుకు, అనుకూలమైన అవతారం ఎత్తిన మాట నిజం. పూర్వంలాగా నిరాటంకంగా పూజలు నిర్వర్తించుకోలేకపోతే, నిన్ను నేను నమ్మలేను.

మానితంబుగ గరుత్మద్ధ్వజారోహణం

బెప్పు డొనర్తువో చెప్పు మయ్య!
గరిమతో నీ తిరుక్కళ్యాణ సంభ్రమం
బెప్పుడెప్పుడొ వేగ చెప్పుమయ్య
రమతో మహోన్నతరథ మెక్కి తిరువీధు
లెప్పు డేతెంతువో చెప్పుమయ్య
ధరణి నభ్యాగతదాస ప్రజాబృంద
మెప్పుడో బలియునో చెప్పుమయ్య
వత్సరోత్సవ వీక్షణవాంఛ జనుల
కెపుడు ఫలియించునో యానతీ గదయ్య,
చిత్ర చిత్ర ప్రభావ, దాక్షిణ్యభావ,
హత విమతజీవ, శ్రీకాకుళాంధ్రదేవ! 

శ్రీకాకుళ ఆంధ్ర దేవా! గరుడధ్వజాన్ని, ఎపుడు ఎత్తించుకొని, నీ వివాహ వేడుక జరిపించుకుంటావో, మా తల్లి రమాదేవితో కలిసి, దేవుని వీధులలో ఎపుడు విహరిస్తావో, నీకొరకు ఎంతో దూరం నుంచి వచ్చే, నీ భక్తుల సంఖ్య ఎలా పెరుగుతుందో? ఇలా ప్రతి ఏటా జరిగే నీ తిరునాళ్ళు చూడాలి. మావంటి వారి ఆశలు ఎపుడు నెరవేరుతాయో? వివరించు స్వామీ!

తగునట్లు తిరుమేను తా నామతింపుచు

మిన్న పీతాంబరం బున్న దనుచుఁ
గనులతోఁ బుట్టిన కౌస్తుభం బది పోవఁ
దక్కు సొమ్మది నీకు తక్కెననుచు
లలితరత్న ద్యుతి మొలచినట్లు కిరీట
ముత్తమాంగముఁ బాయకున్న దనుచు
మండిత మాణిక్యకుండలంబులు కర్ణ
యుగళితోఁ బుట్టినట్లున్న వనుచు
నిండుకొన్నావు గడియించు నేరుపరివె
ప్రావలువ బ్రారువాణముల్‌ భ్రాంతి యేమి?
చిత్ర చిత్ర ప్రభావ, దాక్షిణ్యభావ,
హత విమతజీవ, శ్రీకాకుళాంధ్రదేవ! 

శ్రీకాకుళ ఆంధ్ర దేవా! నాకో సందేహం వస్తుంది. నీవు ధరించిన పట్టు బట్టలు ఏనాటివి? నీవు వక్షంపై ధరించే కౌస్తుభ హారం ఏమైంది? నీ తలపై ధరించిన కిరీటం ఎప్పటిది? చెవులకు పెట్టుకున్న కుండలాలు ఏ కాలపువి? ఎపుడూ పాతవాటితోనే ఉంటావు. కొత్తవి నీకు ఇష్టం లేదా?

వంచన గాదె దివ్యక్షేత్రపతులలో

మంత్రార్థకృత్యము ల్మాని యున్న?
నపకీర్తిగాదె లోకాలోకములయందు
వత్సరోత్సవములు వదలి యున్న?
నగుబాటు గాదె యవ్వనమతస్థజనులలో
నిజదాసకోటి మన్నింపకున్నఁ?
బరిపాటి గాదె యల్పజ్ఞానమతులలో
దేవతామహిమంబుఁ దెలుపకున్న?
నేఁటిదా నీ ప్రతిష్ట వర్ణించి చూడఁ
బాడి దప్పిన బలునిందపాలు గావే?
చిత్ర చిత్ర ప్రభావ, దాక్షిణ్యభావ,
హత విమతజీవ, శ్రీకాకుళాంధ్రదేవ! 

శ్రీకాకుళ ఆంధ్ర దేవా! నీకు మంత్రోచ్ఛారణలో జరిగే పూజాదికాలు నిలిచిపోతే, అది నీకు ఇతర దేవాలయాలయందు అవమానం కాదా? ఏటా నీ తిరునాళ్లు సక్రమంగా జరుగకపోతే, అది బాగా ఉంటుందా! నీ భక్తులను నీవు రక్షించు. లేకపోతే, వారి ఎగతాళి మాటలు వినాల్సి ఉంటుంది. సమయం వస్తే, నీ మహిమ చూపు. లేకపోతే, నీ భక్తులకు నీపై నమ్మకం పోతుంది. నీ కీర్తి ప్రతిష్టలు నీకు తెలుసు. అవి పోకుండా చూసుకో.

తిరునాళ్ళతఱి వచ్చెఁ బరిపరివిధముల

నెలమి సామగ్రి జేయింప వేమి?
సేవకు లందందు సేవింప భావింప
తిరువీథుల రథంబు ద్రిప్పవేమి?
వృజిన మెల్ల దొలంగు నిజ మంచుఁ బ్రజలెంచు
పరమప్రసాదంబుఁ బంచవేమి?
దివ్యదేశం బిది తీర్థంబు సార్థంబు
చక్రతీర్థము కృప సలుపవేమి?
హటము గావించి నీయన్వయంబు లెత్తి
కీర్తి నిందగ వర్ణించి గేలిపఱతు,
చిత్ర చిత్ర ప్రభావ, దాక్షిణ్యభావ,
హత విమతజీవ, శ్రీకాకుళాంధ్రదేవ! 

శ్రీకాకుళ ఆంధ్ర దేవా! నీ తిరునాళ్ళు దగ్గర పడ్డాయి. అవసరమైన సామగ్రి ఇంకా భద్రపరచవేమి? నీ భక్తులు నిన్ను రధంపై వీధులలో తిప్పరేమి? నీ ప్రసాదం సర్వ పాపాలను తొలగిస్తుంది, అని మేము అనుకుంటాం. మరి ఆ ప్రసాదం మాకు పంచిపెట్టవేమి? నీ శ్రీకాకుళేశ్వరస్వామి క్షేత్రం గొప్పదని కీర్తిస్తారు. మరి, స్వార్థం తరిగిపోతున్నా, చక్రతీర్థం అనే కొలనును కరుణించు. ఇలా చేయకపోతే, నీ మొండితనాన్ని ఎగతాళి చేస్తా.

అబ్బుకోఁ గలవొ కాయక్లేశ మొనరించు

దేవాసురు లటుండ దివ్యరమను
దోచుకోఁ గలవొ చే సాచి లోకము లాచి
బలిమహాదాత వైభవము లెల్ల
రాఁ దీయగలవొ సత్రాజిత్తు డీకున్న
మాణిస్యమంతక మొక మమతఁ గొల్పి
నాటించ గలవొ సన్నకసన్ననె వనంబు
పెట్టు మ్రా న్పెకలించి పెరటిలోన
దెచ్చుకొన వేమి వస్త్రాన్న దీపధూప
గంధ తాంబూలములకైన గడన దెలిసె,
చిత్ర చిత్ర ప్రభావ, దాక్షిణ్యభావ,
హత విమతజీవ, శ్రీకాకుళాంధ్రదేవ! 

శ్రీకాకుళ ఆంధ్ర దేవా! దేవతలు, రాక్షసులు పాలసముద్రాన్ని మధించకపోతే, లక్ష్మిని పొందలేక పోయేవాడివి కదా, దేహి అని బలిని అర్థించకపోతే, భూమి, ఆకాశాన్ని ఆక్రమించే అవకాశం నీకు లేదు కదా! నీకు సత్యభామతో పాటు, శ్యమంతకమణిని సత్రాజిత్తు ఇవ్వకున్నా, నీకు అది దొరికేదా! ఇంద్రుడు అంగీకరించకపోతే, నందనవనంలో పెరిగిన పారిజాత వృక్షాన్ని, పెల్లగించి నాటించలేక పోయేవాడివి కదా! ఇవన్నీ అందరినీ అర్థించే తీసుకున్నావు కదా! నీవు ఏమి సంపాదించగలవో తెలిసింది.

తలను బించెపుదండ ధరియించవలె గాని

మణికిరీటము బెట్ట మనుజపతివె?
గళమున వనమాలికలు పూనవలె గాని
హారము ల్వేయ దేశాధిపతివె?
కరమున మురళి చక్కగ బూనవలెగాని
శాతాపి బూనంగ క్షత్రియుడవె?
తనువు గోక్షీరవాసన గుప్పవలె గాని
చందనం బలద రాజవె తలంప?
నెల్లలోక మెఱింగిన గొల్లవాడ
వేది కుల మింత రాజస మేమి నీకు?,
చిత్ర చిత్ర ప్రభావ, దాక్షిణ్యభావ,
హత విమతజీవ, శ్రీకాకుళాంధ్రదేవ! 

శ్రీకాకుళ ఆంధ్ర దేవా! నీవు శిరసుపై కిరీటం ధరించావు. మరి నెమలి పింఛాలు మరిచావా? నీవు రాజువా! కిరీటాలు ధరించేందుకు? నీవు ఎలా దేశాధిపతివి! పిల్లనగ్రోవి పట్టవలసినవాడవు. కత్తి పట్టుకోవడంలో అర్థం ఏమిటి? నీవు యదువంశంలో పుట్టావు. కనుక గోవులతో కదా నీవు తిరగాల్సింది. అప్పుడు నీ శరీరం ఆవు పాలవాసన వేయాలి. మంచి గంధపు వాసన వస్తుందేమి? ఇంత అహంకారానికి కారణం ఏమిటి?

భిల్లాంగనాదంతపీడిత ఫలభుక్తి

హేయంబు దోఁచలే దింత నీకు
సంక్రందనాత్మజ స్యందన సారథ్య
మొరుసుగాఁ దోఁచలే దింత నీకు
గోపాలకానేక గోవత్సపాలనం
బెగ్గుగాఁదోఁచలే దింత నీకు
వ్రజబాలికా ముక్తవస్త్రాపహరణము
హీన మై తోఁచలే దింత నీకు
నుచ్చనీచంబు లెఱుఁగక యిచ్చఁజేయు
చేష్ట లివి భక్తహితమతిఁ జేసి తండ్రు,
చిత్ర చిత్ర ప్రభావ, దాక్షిణ్యభావ,
హత విమతజీవ, శ్రీకాకుళాంధ్రదేవ! 

శ్రీకాకుళ ఆంధ్ర దేవా! శబరి ప్రేమతో ఎంగిలి చేసిచ్చిన, పండ్లను మిక్కిలి ఇష్టంతో నీవు తిన్నావు. అర్జునుని రథంపై కూర్చోబెట్టి, నీవు సారథ్యం వహించావు. గోవులను, దూడలను మేపావు. గోపికల బట్టలను దొంగిలించావు. ఇవన్నీ నీవు చేయాల్సిన పనులేనా? అసలు నీకు మంచి చెడులు తెలియదా ఏమి? నీవేం చేసినా నీ భక్తులు కొందరు నిన్ను స్మర్థిస్తారు.

విక్రమాక్రమిత భూచక్రుఁడౌ హైమాక్షు

పొం గణంచుటలు కోణంగితనము
కరగతామృతకుంభ గర్వితాసురకోటి
దూలఁగొట్టుటలు గయ్యాళితనము
కుచపూర్ణ విషదుగ్ధకుటిల యౌ పూతన
పేరు మాయించుట పిల్లతనము
కంసపురీ ద్వారగమనావరోధి యౌ
మదకరి నీడ్చుట మకురుతనము
వడిగలతనంబులా యివి? గడన యేమి
కొద్దిపను లివి నీ కిది పెద్దతనమె?
చిత్ర చిత్ర ప్రభావ, దాక్షిణ్యభావ,
హత విమతజీవ, శ్రీకాకుళాంధ్రదేవ! 

శ్రీకాకుళ ఆంధ్ర దేవా! హిరణ్యాక్షుడు భూమిని చుట్టగా చుట్టి, సముద్రంలో దాచాడని నీవు, నరసింహావతారం దాల్చి అతన్ని చంపావు. ఇహ, అమృత భాండం రాక్షసులపాలు కారాదని, మోహిని రూపం దాల్చి వారి నుంచి దాన్ని కాజేశావు. నిన్ను పసితనానే చంపేందుకు వచ్చినా, పూతన రాక్షసి పన్నాగం ముందుగా పసిగట్టావు. ఆమెను కసిదీరా చంపేశావు. మధురానగరంలో నిన్ను ప్రవేశించనీయడం లేదని, మదించిన ఏనుగును పడదోసి చంపావు. ఇవన్నీ నా ఉద్దేశంలో - గొప్ప పనులు కానే కావు.

కెరలి కంసుడు నిన్ను నఱకఁ గాచినవాని

బారి సోదరి ద్రోచి పాఱినావు
సరిపోర నరకు నొంచఁగ లేక చేతివి
ల్లాలిచే నిడి దండ నలరినావు
తెగడి బంధువుల లాజిఁ దిట్టి కొట్టఁగ నోర్చి
వైదర్భి జేపట్టి వచ్చినావు
దర్పకోద్ధతి కెంతొ తత్తరపడి నిజ
స్త్రీ పదాబ్జములఁ జే మోపినావు
నీ పరాక్రమ మిట్టిది నిఖిలజగము
లాజ్ఞ మీఱక నిల్చుట యధ్బుతంబు,
చిత్ర చిత్ర ప్రభావ, దాక్షిణ్యభావ,
హత విమతజీవ, శ్రీకాకుళాంధ్రదేవ! 

శ్రీకాకుళ ఆంధ్ర దేవా! నీ పుట్టుక ఒక అద్భుతం. నీవు ఎప్పుడు జన్మిస్తావా? నిన్నెప్పుడు చంపేద్దామా అని కంసుడు ఎదురు చూస్తుండగా, నీవు ఆ విషయం ముందే పసిగట్టి, అతడికి చిక్కకుండా పారిపోయావు. నీ సోదరి యోగమాయను కంసుని బారిన పడేశావు. నరకాసురుడితో యుద్ధం చేసే ధైర్యం లేక, విల్లు, బాణం సత్యభామకు అందించావు. నీవు చేతులు దులుపుకున్నావు. రుక్మిణిని చేపట్టే సమయంలో బంధువుల అవమానాలు సహించావు. మన్మథ తాపానికి తట్టుకోలేక, భార్య పాదాలపై పడ్డావు. అలాంటి నిన్ను అమాయక ప్రజలు దేవుడని కొలుస్తారు. ఎంత చిత్రం.

ఆలు నిర్వాహకురాలు భూదేవి యై

యఖిలభారకుఁడను నాఖ్యఁ దెచ్చెఁ
నిష్ట సంపన్ను రాలిందిర భార్య యై
కామితార్థదుఁడన్న ఘనతఁ దెచ్చెఁ
గమలగర్భుఁడు సృష్టికర్త తనూజుఁడై
బహుకుటుంబకుఁడన్న బలిమిఁదెచ్చెఁ
గలుష విధ్వంసియౌ గంగ కుమారి యై
పతిత పావనుఁడన్న ప్రతిభఁదెచ్చె
నాండ్రు బిడ్డలుఁ దెచ్చు ప్రఖ్యాతిగాని
మొదటి నుండియు నీవు దామోదరుఁడవె,
చిత్ర చిత్ర ప్రభావ, దాక్షిణ్యభావ
హత విమతజీవ, శ్రీకాకుళాంధ్రదేవ! 

శ్రీకాకుళ ఆంధ్ర దేవా! బ్రహ్మాండ భారాన్ని మోసే భూదేవి, అనే భార్య నీకు ఉండడం చేత, నీవు అపారమైన భూ భారం మోయగలవాడవనీ, విశేష సంపద కలిగిన లక్ష్మీదేవి నీకు మరో భార్య అయినందున, నీవు అన్ని సంపదలు కలిగి ఉన్నావనీ, సృష్టికి మూలమైన బ్రహ్మ పుత్రుడైనందున, నీవు పెద్ద సంసారివనీ, గంగానది నీ కుమార్తె అయినందున, ఆమె గొప్పతనం నీదిగానూ, నీకు వచ్చిన గొప్ప పేరుకు కారణం నీ బిడ్డలు, నీ భార్య కదా! నీకంటూ ప్రత్యేక ప్రతిభ లేదనిపిస్తుంది.

సకలంబు నీవ యై యొకమఱ్ఱియాకుపై

నిచ్చఁ బరుండునాఁ డెంత గలవొ!
తన బిడ్డఁ డని యశోదాదేవి పొత్తుల
నిడుక ముద్దాడునాఁ డెంత గలవొ!
తక్కులమారత్త దక్కించుకొనఁగని
న్నెత్తుక పెంచునాఁడెంత గలవొ!
భయలేశ మెఱుఁగక బల్పాము పడగపై
గంతులు వైచునాఁడెంత గలవొ!
పరువు గలవాఁడ నేమి ప్రాఁబల్కులందుఁ
దెలియ వరిముక్కు ముల్లంత గలవొ! లేవొ!
చిత్ర చిత్ర ప్రభావ, దాక్షిణ్యభావ,
హత విమతజీవ, శ్రీకాకుళాంధ్రదేవ! 

శ్రీకాకుళ ఆంధ్ర దేవా! అన్నింటా నీవే నిండి ఉండి, ఒక మర్రిఆకుపై, వటపత్రశాయివి అయినావు. గోపికలు నిన్ను ప్రేమతో ముద్దాడినప్పుడు పసివాడవు. నీ మేనత్త సాకిన రోజులలో నీవు బాలుడవు. కాళీయ సర్పరాజు తలపై నాట్యం చేసే వేళ కూడా పిల్లవాడివే. వేదాలలో నీవు వరిముల్లు అంత అతి చిన్నవాడివిగా వర్ణించడం జరిగింది.

కవ్వడి కెంత చక్కగా బోధ చేసిన

నితర హింసాకర్మ మిష్టపఱువ
రాయబారం బెంత రసికత నడిపిన
ననికి భారతుల నాయుత్త పఱుప
విశ్వరూపం బెంత విమలతఁ జూపిన
నోర్వని కురురాజు నులుకుపఱుప
విలుఁబట్టనని యెంతొ చెలిమిగఁ బలికిన
నవల సుయోధను నాసపఱుప
పోరు చంపక చుట్టముల్ పోర నీల్గఁ
జూచుచుంటివి యేనాటి చుట్టమీవు?
చిత్ర చిత్ర ప్రభావ, దాక్షిణ్యభావ,
హత విమతజీవ, శ్రీకాకుళాంధ్రదేవ! 

శ్రీకాకుళ ఆంధ్ర దేవా! శత్రువులను వధించలేనని అశక్తత చూపిన అర్జునుని, ఉత్తేజపరచేందుకు గీతా బోధ చేశావు. నీవు కౌరవులు, పాండవుల మధ్య రాయబారం నడిపింది సంధిచేసేందుకు కాదు. యుద్ధాన్ని ప్రోత్సహించేందుకే. దుర్యోధనుని భయపెట్టేందుకు విశ్వరూపం చూపావు. ఆయుధం చేత పట్టనన్నావు. యుద్ధం జరుగుతూ ఉంటే, అందులో బంధుగణం మరణిస్తుంటే, నీవు చూస్తూ ఊరుకున్నావు. నీవు వారికి ఏనాటి చుట్టానివి?

నాఁగలి రోఁకలన్నకు నిచ్చి శంఖాది

పంచాయుధములీవు పట్టినావు,
తాటి టెక్కెంబు కోల్తల పెద్ద కెత్తించి
గరుడధ్వజం బీవు గట్టినావు,
వెలరాని కఱవోని వలువ జ్యేష్ఠున కిచ్చి
కనకాంబరంబీవు గట్టినావు,
మద్యమగ్రజునకు మత్తిలఁ ద్రావించి
జున్నుపాల్పెరుగీవు జుఱ్ఱినావు
తగవరివె యన్నదమ్ముల ధర్మమీవె
తీర్పవలెఁ గాని మఱి యొండు తీర్పఁగలఁడె
చిత్ర చిత్ర ప్రభావ, దాక్షిణ్యభావ,
హత విమతజీవ, శ్రీకాకుళాంధ్రదేవ! 

శ్రీకాకుళ ఆంధ్ర దేవా! నాగలి, రోకలి నీ అన్న బలరామునికి ఇచ్చి, నీవు శంఖం, చక్రం లాంటి ఆయుధాలు తీసుకున్నావు. యుద్ధంలో తాళధ్వజాన్ని, నీ జేష్ట సోదరునిచే ఎత్తించి, నీవు మాత్రం గరుడ ధ్వజం ధరించావు. వెల తక్కువ బట్టలు మీ అన్నకు ఇచ్చావు. విలువైన పట్టుబట్టలు నీవు కట్టుకున్నావు. అన్నను మద్యం మత్తులో ముంచేశావు. నీవు జున్ను, పాలు, పెరుగు, వెన్నలను దొంగలాగా జుర్రుకున్నావు. అన్నదమ్ముల మధ్య బేధాలు నీవే తీర్చాలి. వేరొకడు సరిచేయలేడు కదా!

అప్పనంబులు గొను నఖిలదిగ్‌మండలే

శ్వరులచే వేంకటాచలనివాసుఁ
డరుదుగా నఱువదా ఱవరసంబులు మహా
భోగంబుఁ గొనునీలభూధ్రవరుడు
పానకం బంది సాబాలు భక్తుల కిచ్చి
యెసఁగును మంగళాద్రీశ్వరుడు
పుట్లకొలంది మైపూఁతఁగాఁ గొను మంచి
గందంబు సింహనగ ప్రభుండు
సాటిసాములరీతి నిచ్చోట నీవు
మూర్తిమత్వంబు జూపక కీర్తి గలదె?,
చిత్ర చిత్ర ప్రభావ, దాక్షిణ్యభావ,
హత విమతజీవ, శ్రీకాకుళాంధ్రదేవ! 

శ్రీకాకుళ ఆంధ్ర దేవా! తిరుపతి వెంకటేశ్వరుడు దిక్పాలకుల నుండి కానుకలు స్వీకరిస్తాడు. జగన్నాధుడు అరవై రుచుల మహాభోగాలు అందుకుంటాడు. మంగళగిరి నరసింహస్వామి సగం పానకాన్ని భక్తులకు ఇస్తాడు. సింహాద్రి అప్పన్న మంచి గంధాన్ని పూతగా గ్రహిస్తాడు. ఇతర దైవాలలాగా నీవు గొప్పతనాన్ని చూపించకపోతే ఖ్యాతి రాదు.

కన్నవారల మున్ను గారాగృహంబున

విడిచి పొఱితివి నీ కడిమి యేమి?
పగవాడు పురుటిలో బట్టి నెత్తుకపోవ
దమకించుచున్న నీ ధైర్యమేమి?
ముద్దుమన్మని గోప్యముగ నాడు బంధింప
దెలియనట్లున్న నీ తెగువ యేమి?
వైరిధాటికి నోడి వనధి మధ్యమునందు
నిలు గట్టుకొన్న నీ బలిమి యేమి?
నిఱిగి తిరి గెన్నడెన్నడో తఱి యెఱింగి
యొరుల నడఁచితి వది యేమి భరమునీకు?
చిత్ర చిత్ర ప్రభావ, దాక్షిణ్యభావ,
హత విమతజీవ, శ్రీకాకుళాంధ్రదేవ! 

శ్రీకాకుళ ఆంధ్ర దేవా! నిన్ను కన్న తల్లిదండ్రులు చెరసాలలో ఉండగా వ్రేపల్లెకు చేరావు. శంబరాసురుడు పురిటిలో నీ పుత్రుడు ప్రద్యుమ్నుని, అక్రమంగా తీసుకుపోగా, మనుమడైన అనిరుద్ధుని బాణాసురుడు బంధిస్తే, ఏమీ ఎరగనట్టు నటించావు. శత్రుసేనలు దాడికెదిగితే వెన్నుచూపి, సాగర మధ్యలో ద్వారక నగరాన్ని నిర్మించుకుని ఉన్నావు. అలా చేశావుగాని ధైర్య సాహసాలు నీవు చూపలేదు. ఎపుడో నీకు వీలైనపుడు, అదును చూసి శత్రువులను మట్టుపెట్టావు. అది నీకు కష్టమనిపించలేదా?


Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: