telugudanam.com

      telugudanam.com

   


పద్యం

భావం

అందముగ నుండు పుష్పాల యందు సౌర

భమ్ము లేమియు లేకున్న వ్యర్ధమౌను;
క్రియల శూన్యపు మాటలు కేవలమ్ము
ఇంపుగా నుండు వినుటకే యేరికైన 

పుష్పాలెంత అందంగా ఉన్నా సువాసన లేకుంటే వాటి ఉపయోగం లేదు. క్రియా శూన్యపు మాటలు వినటానికి మాత్రమే ఇంపుగా ఉంటాయి.

అందమైన కలలు ఆకాశ హర్మ్యాలు

నిత్యజీవితాన నిజము కావు;
కలల బ్రతుకు లిలలొ కడుచుల్కనౌ గాదె
అట్టి కల్ల కలలో చెడ్డసేయు 

అందమైన కలలు గాలిమేడలే తప్ప నిజం కావు. కలలో బ్రతకటం వల్ల మనిషి చులకనైపోవటమే కాక ఆ కలల వల్ల చేటు కల్గుతుంది.

అందరకు నుండుమెట్లైన నండగాను

అంతమాత్రాన పూర్తిగా నందవలదు;
అంది, అల్లంత దూరాన అందనట్లు
మెలగు చుండుట నీకెంతొ మేలుకూర్చు 

అందరకు అండగా నుండుట మేలేగాని అందీ అందకుండా ఇతరులతో మెలగటం మరింతమేలు కల్గిస్తుంది.

అందలంబు నెక్కి ఆశయా లన్నింటి

నటకపైన చేర్చుటగునె న్యాయ
మేరు దాటి యెడ్డు చేరిన పిమ్మట
తెప్ప తగులబెట్టు తీరు గాదె? 

ఉన్నతపదవి లభించినపుడు ఆశయాలన్నిటిని ప్రక్కన పెట్టుట న్యాయం కాదు. ఏరు దాటిన పిమ్మట తెప్ప తగులబెట్టటం ఇలాంటిదే.

అందుబాటులో నున్నట్టి వన్ని తినుచు

తృప్తి చెందుచు బ్రతికెడి తీరు వలదు;
భుక్తి కోసము బ్రతుకుట ముక్తి గాదు
బ్రతుకుట కొరకు తినుటయే భావ్యమగును 

చేతికందిన ప్రతి దాన్ని తింటూ తినటానికే జీవించే పద్దతి మంచిది కాదు. బ్రతుకుటకు తగినంత తింటే చాలు.

అతిధి పూజల చేయని యా గృహస్థు

పితరులకు గల్గు నరకంపు పీడనమ్ము;
అతిధి పూజల జేసిన యాక్షణంబె
సంతసింతురు వారలు స్వర్గగతికి 

అతిధి పూజలు చేయని గృహస్థుని పితృదేవతలకు నరకయాతనలు తప్పవు. అతిధి పూజలందిన వెంటనే వారు స్వర్గలోకం చేరి సంతసిస్తారు.

అదుపు నందుంచు టుత్తమమౌను గాదె

తనదు మదిలోని పెరిగిన తామసంబు;
అదుపు తప్పిన ఆవేశ మదియు కూడ
తెచ్చు నాపద  ఎంతైన తెగువ చేయ 

తనలో పెరిగియున్న తామసాన్ని అదుపులో నుంచుట మంచిది. ఆవేశం అదుపు తప్పితే ఆ తెగువ వల్ల ఆపద కల్గును.

అన్ని నీకున్న సమయాన అప్పుడపుడు

ఏమియును లేని యున్నప్పు డెల్ల వేళ
నిన్ను వెన్నంటి యుండెడి నేస్త మెవడొ
ఆతడే నీకు నిజమైన ఆప్తు డయ్య! 

నీ దగ్గర సంపద ఉన్నప్పుడు అప్పుడప్పుడు, అదిలేనప్పుడు అన్ని వేళలను నిన్ను వెన్నంటి ఉండేవాడే నిజమైన మిత్రుడు.

అన్ని విషయాలు తెలిసిన యట్టివాడు

తనకు కొంచెమైన తెలియ దనును గాదె!
ఏమి యును లేని విస్తరి ఎగిరిపడగ
అన్ని యున్నట్టి విస్తరి అణగి యుండు 

అన్ని విషయాలు తెలిసినవాడు తనకేమీ తెలియదంటాడు. అన్నీ వడ్డించిన విస్తరి అణిగి ఉంటే ఏమీలేని (ఖాళీ) విస్తరి ఎగిరెగిరి పడటం లేదా.

అలుపెరుంగక ధనము నెంతైన పేర్చి

దాని నరకొరగా ఖర్చు తడవు సేసి
మూటలను గట్టి పలుమార్లు మురిసిపోవ
నిహపరంబుల సౌఖ్యంబు లెట్లు కల్గు? 

విశ్రాంతి తీసుకోకుండా అధికంగా ధనం సంపాదించి దానిలో కొంత మాత్రం ఖర్చు చేసి మిగిలినది మూటకట్టి, దాన్ని చూసి మురిసిపోతుంటే ఈ లోకంలోను, పరలోకంలోను సుఖాలుండవు.

అష్టకష్టాలు పడి పెంచి, అమ్మ యనుచు

తనకు తోడుగ బ్రతుకంత ధారపోయ
సతిని చుల్కన చేసెడి పతి వరేణ్యు
లెంద రెందురొ లెక్కింప నేరి తరము? 

అమ్మ అష్టకష్టాలు పడి తనను పెంచినదని చెపుతూ జీవితాంతం తనకు తోడుగా నుండు భార్యను చుల్కన చేసెడి భర్తలెందరో లెక్కింపజాలము.

అహము నిండ, మంచి ఆలోచనలు రావు,

మనసు వికలమగును, మదము హెచ్చు;
తాను దూరమౌను, తనవారి నుండియే
ఏవగింపబడును, హీను డౌను 

అహంభావికి మంచి ఆలోచనలు రావు. మనసు వికలమౌతుంది. మదం పెరుగుతుంది. తాను దూరమవుతూ తనవారి చేతనే అసహ్యింపబడి హీనుడౌతాడు.

అహము మితి మీరినందున నపజయమ్ము

తప్ప దేనాటికైనను తరచి చూడ;
అన్నిటికి నేనే యనెడి యా యహము వీడి
అనువెరింగి వర్తించిన యాధికుండు 

అహంభావం మితిమీరితే అపజయం తప్పదు. అహం వీడి ప్రవర్తించటమే ఉచితం.

ఆగడాలు చేసి అల్లరిపాలౌచు

దూరమగుట చూడ ఘోరమౌను
ఆప్తజనుల జేరి అభిమాన మొందుటే
నీకె శ్రేయమగును నిక్కువముగ 

చెడుపనులు చేసి తనవారికి దూరమగుట మిక్కిలి ఘోరము. ఆప్తులైనవారి అభిమానము పొందుటే శ్రేయోదాయకము.

ఆడుదానికి నెటువంటి యందమున్న

అప్సరసలను మించెడి ఆకృతైన
ఆమె వివరాలు తెలియని యంతవరకు
గుంభనంబుగ భావింప కూర్మి యగును 

అప్సరసలను మించిన అందముకల స్త్రీ ఎడల, ఆమె పూర్తి వివరాలు తెలియనంతవరకు గుంభనంగా ఉండటం మంచిది.

ఆపదలు కల్గినపుడె యందరకును

భక్తి భావంబు హెచ్చుగ వ్యాప్తి చెందు;
అట్టి యాపద దాటిన యాక్షణంచె
దైవమును మర్చిపోవు కృతఘ్నుడెపుడు 

కష్టాలు కల్గినపుడే అందరికి దైవభక్తి ఏర్పడుతుంది. ఆ కష్టాలు తొలగగానే దేవుని మర్చిపోతుండటం వల్ల కృతఘ్నుడౌతాడు.

ఆలు బిడ్డల పోషింప చాలినంత

ధనము కంటెను యధికమే తానుగూర్చి
నట్టి పైకాన, రవ్వంత యైనగాని
సతతసత్కార్యములు జేయ హితము గాదె? 

భార్యాబిడ్డలను పోషించటానికి చాలిన దానికంటె ఎక్కువగా సంపాదించిన పైకంతో కొంతైన మంచి పనులు చేయటానికి ఉపయోగించు

ఆలు మగలను విడదీయు టమిత సులువు,

అన్నదమ్ములు విడిపోదు రెన్నడైన,
ప్రాణ మిత్రుల విడదీయు పనిభరమ్ము;
అఖిలజను లెరుంగుదురీ దుఘనాను భవము 

భార్యాభర్తలను, అన్నదమ్ములను విడదీయగలం కాని ప్రాణస్నేహితులను విడదీయుటెంతో కష్టం.

ఇష్టమైనది ఎటువంటి కష్టమైన

స్వల్పకృషితోడ నేరీతి సాధ్యపడును?
కృషి మొనర్చుటనునది ఋషుల కైన
తప్పలేదని ఎరుగుము ధరణియందు 

కొద్ది కృషితో కష్టమైన పనులు చేయుట అసాధ్యము. ఋషులకు సైతం ఎంతో కృషితో తపస్సు చేయుట తప్పలేదు.

ఉండు యజమాని కహమెంతొ మెండుగాను

అదరగొట్టును పనిచేయుడంచు పరుల;
అహము పోద్రోల, పనుల దుస్సహము లైన
పొనర జేతురు పనివాండ్రు ముదము తోడ 

పనిచేయండి అంటూ సేవకులను యజమాని భయపెట్టట్టానికి కారణం అతనిలోని అహంభావమే. ఆ అహం అతడు వదిలిపెడితే మరింత సంతోషంతో పనివాళ్ళు కష్టమైన పనులు కూడా సాధిస్తారు.

ఉన్నతంబగు పదవితో నున్న యపుడు

మనసు నందలి భావాలు మట్టుపరిచి
సద్గుణాలకు రాసియై చతురమతిని
మేలమాడుచు తంత్రాన మెలగవలయు 

ఉన్నత పదవిలో నున్నవారు తమ మనసులోని భావాలు బయట పడనీయక, చతురోక్తులతో మెలుగుచు తోటి వారిచే మంచి వాడనిపించుకొని మసలాలి.

ఉన్నతస్థితి లోన నీ వుండినపుడు

సాయపడు మితరులకునీ శక్తి కొలది;
వారిలో గల నైపుణ్య సారమెరిగి
ప్రోత్స హింపుము వారెల్ల పొంగి పోవ 

ఉన్నతస్థితిలో ఉన్నప్పుడితరులకు శక్తికొలది సాయం చేయాలి. ఇతరుల నైపుణ్యాన్ని పరిశీలించి ప్రోత్సహిస్తే వారు సంతోషిస్తారు.

ఎండు మొక్కల బ్రతికింప నెవ్వరైన

పచ్చనైనట్టి వానిని పెచ్చరిల్లి
పీకబూనుట ఎటువంటి సాకు యగును?
పిల్లి చెలగాట మెలుకకు ప్రీతిగాదు 

ఎండిపోయిన మొక్కలను బ్రతికించాలనే సాకుతో పచ్చని మొక్కల పీకటం, పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణసంకటం లాంటిది.

ఎటుల బ్రతికితి మన్నదే యేరికైన

లక్ష్యమౌటయె మానవ లక్షణంబు
వ్యర్ధమౌనట్టి బ్రతుకు నిరర్ధకంబు
కాకి నూరేండ్లు బ్రతుకుట గనమె మనము? 

ఏ విధంగా బ్రతికామనే లక్ష్యముంచుకొనుట మానవుని ధర్మం. కాకి వలె నూరేళ్ళు బ్రతుకుట వ్యర్ధం.

ఎట్టి కష్టా లొకే పరి ఏర్పడినను

గుండె నిండుగ ధైర్యమ్ము గూర్చవలయు;
పిరికి పందగ నుండుట పెద్ద లోప
మట్టి వానికి నపజయ మౌట రూఢి 

కష్టాలొక్కుమ్మడిగా వచ్చినపుడే ధైర్యంగా వాటినెదుర్కోవాలి. పిరికి పందగా నుండే వాడికి అపజయం తప్పదు.

ఎట్టి బాధలు కటువుగా నేర్పడినను

యున్నతపు లక్ష్యమే మది యుండినపుడు
కష్ట భూయిష్ఠ మనిపించు గమన మీపు
ఏటి కెదరీది పనులు సాధించుకొమ్ము 

ఉన్నతమైన లక్ష్యం మనసులో ఉంటే ఎన్ని బాధలు కల్గినా కష్టాలన్నింటినీ ఎదురీది జయము సాధించుకోవాలి.

ఎట్టి యవమానములు పరు లెన్ని యేని

సల్పుచున్నను భరియింప జాలు మనసు;
సన్నిహితులైన వారల సున్ని తంపు
ప్రేమ భరియింప జాలద దేమి వింత! 

ఇతరులెన్నివిధాల అవమానించినా భరింపగల్గేవారు. తనకు సన్నిహితులైన వారల ప్రేమను భరించలేకుండుటయే ఓ వింత!

ఎట్టి యాపద మిత్రున కేర్పడినను

స్నేహ ధర్మంబు పాటించు నేస్తుడెపుడు
ఆపదబ్ధిలో దూకి కాపాడు కాని
లెక్క చేయడు ప్రాణంబు లేశమైన 

స్నేహితుడెప్పుడు మిత్రుని ఆపద తీర్చాలని ప్రయత్నిస్తాడు. ప్రాణాన్ని లెక్కచేయక ఆపద అనే సముద్రంలో దూకి కాపాడతాడు.

ఎట్టి యాపద లందైన ఎదురు నిల్చి

బయట పడగల్గుటే నీకు భావ్యమగును;
తీరెరింగిన పిమ్మట తెంపు చూప
జయము లభియించు నీకు; నిశ్చయము సుమ్ము 

ఎట్టి ఆపదల నుండియైన బయటపడగల్గుటే మంచిది. తగిన సమయంలో తెంపు చూపితే నిశ్చయంగా జయం లభిస్తుంది.

ఎట్టిపనియైన నాలస్య మేమిలేక

తలచినంతనె శ్రద్ధతో తక్షణంబు
చేయ బూనుట మిక్కిలి క్షేమకరము;
ఆలసించిన విషమౌను యమృతంబు 

ఆలస్యం చేయకుండా తలచిన పనిని శ్రద్ధతో చేయుట మిక్కిలి క్షేమం. ఆలస్యం చేస్తే అమృతం కూడా విషమౌతుంది.


Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: