telugudanam.com

      telugudanam.com

   


పద్యం

భావం

అడిగిన యట్టి యాచకుల యాశ లెఱుంగక లోభవర్తియై

కడపిన ధర్మ దేవత యొకానొకయప్పుడు నీదువాని కె
య్యెడల నదెట్లు పాలు తమకిచ్చునె యెచ్చటనైన లేగలన్
గుడువంగ నీనిచో గెరలి గోవులు తన్నునుగాక భాస్కరా! 

మనిషి లోభియై అడిగిన యాచకుల కోరిక తీర్పక నిరాకరించిన యెడల వానికి ధర్మదేవత ఎప్పుడూ సంపదలు ఇవ్వదు. ఎలా అంటే, ఆవులు తమ దూడల గుడువనీయక పాలు పితుకుకొనదలచువారిని, ఎగిరిపడి విఱుగ తన్నును గానీ, పాలను పితుకనిచ్చునా? పితుకనీయవు.

అంగన నమ్మరాదు తనయొంకకు రాని మహాబలాఢ్యు వే

భంగుల మాయలొడ్డి చెఱుపం దలపెట్టు, వివేకియైన సా
రంగ ధరుం బదంబులు కరంబులు గోయగ జేసె దొల్లి చి
త్రాంగియనేకముల్ నుడువరాని కుయుక్తులుపన్ని భాస్కరా! 

ఎంతటి వానినైనా, మాయలతో మోసగించి పాడుచేయు ఆడదానిని ఎవడూ నమ్మకూడదు. పూర్వము చిత్రాంగి అనునది తన తెలివితో, లేని నిందలను మోపి రాకుమారుడైన సారంగధరుని కాళ్ళూ చేతులూ నరికింపలేదా!

అదను దలంచికూర్చి ప్రజ నాదర మొప్ప విభుండు కోరినన్

గదిసి పదార్ధ మిత్తురటు కానక వేగమె కొట్టి తెం డనన్
మొదటికి మోసమౌ బొదుగు మూలము గోసిన బాలుగల్గునే
పిదికినగాక భూమి బశుబృందము నెవ్వరికైన భాస్కరా! 

రాజైనవాడు, ఎప్పుడూ సమయాన్ని బట్టి ప్రజలను మర్యాదతో ప్రేమించి అడిగిన పన్నులు ఇస్తారుగానీ, సమయమెఱుగక కోపించి కొట్టి తెమ్మనిన ప్రజలు బాధపడటమేగానీ, రాజునకు ఫలం లేదు. ఎట్లనగా, గోవులను మచ్చికచేసి పిండుకొంటే పాలు దొరుకునుగానీ, పొదుగు మొదట కోసిన పాలు దొరుకునా? దొరకవు.

ఆదరమింత లేక నరుడాత్మబలోన్నతి మంచివారికిన్

భేదము చేయటన్‌ దనదు పేర్మికి గీడగు మూలమెట్లమ
ర్యాద హిరణ్యపూర్వకశిపన్ దనుజుండు గుణాఢ్యుడైన ప్ర
హ్లాదున కెగ్గుజేసి ప్రళయంబును బొందడెమున్ను భాస్కరా! 

లోకంలో తాను బలముగలవాడని గర్వించి, సాధుజనులకు కీడు చేసినవాడు తప్పక నశించును. గుణనిధియగు ప్రహ్లాదకుమారుని బాధపెట్టి హిరణ్యకశిపుడు చావలేదా?

ఈ జగమందు దా మనుజుడెంత మహాత్మకు డైన దైవ మా

తేజము తప్ప జూచునెడ ద్రిమ్మరి కోల్బడు నెట్లన న్మహా
రాజకుమారుడైన రఘురాముడు గాల్నడ గాయలాకులున్
భోజనమై తగన్వనికి బోయి, చరింపడె మున్ను భాస్కరా! 

మనిషి ఎంత గొప్పవాడైనా, దైవగతి మారునప్పుడు అన్నిటినీ కోల్పోయి బేలయై తిరుగును. దశరధునంతవానికి కుమారుడైన శ్రీరామచంద్రుడు అన్నిటినీ విడిచి అడవిలో కూరలు-కాయలు భుజించి తిరుగలేదా?

ఉరుగుణవంతుడొడ్లు దనకొండపకారము సేయునప్పుడున్

బరహితమే యొనర్చు నొకపట్టుననైనను గీడు సేయగా
నెఱుగడునిక్క మేకద యదెట్లనగవ్వముబట్టియెంతయున్
దరువగజొచ్చినం బెరుగు తాలిమి నీయదె వెన్నభాస్కరా! 

గుణవంతుడు పరులు తనకెంత అపకారము చేసినా, ఆ అపకారులకు ఉపకారమే చేస్తాడుగానీ చెడు చేయడు. పెరుగు ఎంతగా తనను కలియబెట్టి చిలికినా వెన్ననే యిచ్చునుగదా?

ఊరక సజ్జనుం డొదిగియుండిననైన దురాత్మకుండు ని

ష్కారణ మోర్వలేక యపకారముచేయుట వాని విద్యగా
చీరలు నూఱుటంకములు చేసెడివైనను బెట్టె నుండఁగాఁ
జేరి చినింగిపోఁ గొఱుకు చిమ్మట కేమి ఫలంబు భాస్కరా! 

సజ్జనుడు తొలగి, ఎంత దూరంగా ఉన్నా, దుర్జనుడు ఓర్వలేమితో, వానికి కీడు ఒనర్చును. నిష్కారణముగా పెట్టెలోని బట్టలను కొరికి చింపెడు చిమట పురుగునకు ఏమి లాభముండును?

ఏగతిఁ బాటుపడ్డఁ గలదే భువి నల్పునకున్ సమగ్రతా

భోగము భాగ్యరేఖ గల పుణ్యునకుం బలె? భూరిసత్వసం
యోగమదేభకుంభ యుగళోత్ధిత మాంసము నక్కకూన కే
లాగుఘుటించు సింహము దలంచినఁ జేకురుఁగాక భాస్కరా! 

నీచుడెంత శ్రమపడినా, భాగ్యలక్షణములు గల పుణ్యాత్మునకు వలే, భోగమబ్బదు. మదపుటేనుగుకు ఉన్న తలయందలి మాంసము సింహమునకు సాధ్యమగునుగానీ, నక్కకు చిక్కునా, చిక్కదు!

ఒక్కఁడె చాలు నిశ్చలబలోన్నతుఁడెంతటి కార్యమైనఁదాఁ

జక్కనొనర్పఁ గౌరవు లసంఖ్యులు పట్టిన ధేనుకోటులం
జిక్కఁగనీక తత్ప్రబలసేన ననేక శిలీముఖంబులన్
మొక్కపడంగఁజేసి తుదముట్టఁడె యొక్క కిరీటి భాస్కరా! 

ఉక్కుగలవాడు ఒక్కడైనా, ఎంత ఘనకార్యమైనా సాధింపగలడు. మహాబలశాలి అగు అర్జునుడు తానొక్కడైనా, అంతమంది కౌరవవీరులను గెలిచి ఆవులను మరలింపలేదా?

కానక చేరఁ బోల దతికర్ముడు నమ్మిక లెన్ని చేసినం

దా నది నమ్మి వానికడ డాయఁగఁబోయిన హాని వచ్చు న
చ్చో నదియెట్లనం గొరఁకు చూపుచునొడ్డినబోను మేలుగా
బోనని కాన కాసపడిపోవుచుఁ గూలదె కొక్కు భాస్కరా! 

పాపాత్ముడు ఎన్ని విధాల నమ్మించినా వాని చెంత చేరరాదు. వాని తేనెమాటలకు మోసపోయి దగ్గర చేరిన ఎడల తప్పక హాని కలుగును. తిండి మీది ఆశచే పందికొక్కు బోనునపడి ప్రాణమును విడుచుటలేదా?

కారణమైన కర్మములు కాక దిగంబడ వెన్ని గొందులం

దూఱిన నెంతవారలకుఁ దొల్లి పరీక్షితు శాపభీతుడై
వారధి నొప్పు నుప్పరిగపైఁ బదిలంబుగ డాఁగి యుండినం
గ్రూరభుజంగదంతహతిఁ గూలఁడె లోకులెరుంగ భాస్కరా! 

ఎచ్చట దాగినా, ఎంతవారికైనా కాగలపని కాకమానదు. పూర్వము విప్రశాపభయము వల్ల పరీక్షిన్మహారాజు సముద్రము మధ్యలో రహస్యముగా కాపురమున్నా, దుష్ట సర్పముచే కరువబడలేదా?

ఒక్కడు మాంసమిచ్చె మఱియొక్కడు చర్మము గోసి యిచ్చె వే

ఱోక్కరు డస్ధి నిచ్చొనిక నొక్కడు ప్రాణములిచ్చె వీరిలో
నొక్క నిపట్టునన్ బ్రదుక నోపక యిచ్చిరో కీర్తి కిచ్చిరో
చక్కగ జూడు మంత్రి కుల సంభవ! రాయన మంత్రి భాస్కరా! 

ఒకడు మాంసమిచ్చెను. మరొకడు చర్మము కోసి ఇచ్చెను. వేరొకడు వెన్నెముక తీసి ఇచ్చెను. ఇంకొకడు ప్రాణములే ఇచ్చెను. వీరిలో ఒక్కరైనా, వాటిని తాము బ్రతుకలేక ఇచ్చారో, కీర్తి కోసం ఇచ్చారో గ్రహించు, ఓ రాయన మంత్రి!

సన్నుత కార్యదక్షుఁ డొకచాయ నిజప్రభ యప్రకాశ మై

యున్నపుడైన లోకులకు నొండొక మే లొనరించు సత్వసం
పన్నుఁడు భీముఁ డాద్విజుల ప్రాణము కావఁడె ఏకచక్రమం
దెన్నికగా బకాసురుని నేపున రూపడఁగించి భాస్కరా! 

గొప్పబలము గల కార్యశూరుడు స్వాభావికమైన తన తేజము తరిగి ఒకచోట ఉన్ననూ, పరోపకారము గల పనులలో వెనకడుగు వేయడు. పూర్వము ఎకచక్రపురమున తన క్షాత్రధర్మమును వదలి బిచ్చమెత్తుకొని తినుచుండియూ భీముడు బకాసురుని చంపి, ఆ ఊరి బ్రాహ్మణులకు మేలు చేకూర్చెను కదా!

అవని విభుండు నేరుపరియై చరియించిన గొల్చువార లె

ట్లవగుణులైన నేమి పనులన్నియు జేకుఱు వారిచేతనే
ప్రవిమల నీతిశాలియగు రాముని కార్యము మర్కటంబులే
దవిలి యొనర్పవే? జలధి దాటి సురారుల ద్రుంచి భాస్కరా! 

రాజు నేర్పరియైన యెడల, సేవకులు ఎలాంటి వారైనా పనులు నెరవేరును. నీతివిశారదుడగు శ్రీరఘురాముని కార్యము, చపలచిత్తములగు కోతులు చక్కజేయలేదా?

వంచన యింతలేక యెటువంటి మహాత్ముల నాశ్రయించినన్

గొంచెము కాని మేలు సమగూడ దదృష్టము లేనివారికిన్
సంచితబుద్ధి బ్రహ్మ ననిశంబును వీఁపున మోచునట్టి రా
యంచకు దుంపతూండ్లు దిననాయెఁగదా ఫలమేమి భాస్కరా! 

కపటం లేక, ఎంత గొప్పవారిని సేవించినా, తన అదృష్టముకు మించి కొంచెం కూడా లాభించదు. పుట్టినది మొదలు బ్రహ్మను వీపున మోయు రాజహంసకు తామరదుంపల కంటే మించిన మంచి ఆహారము దొరకలేదు కదా!

అతిగుణహీనలోభికి బ దార్థము గల్గిన, లేక యుండినన్

మితముగగాని కల్మిగల మీదటనైన భుజింపడింపుగా
సత మన్మినము దేహమును సంపద నేఱులు నిండి పాఱినన్
గతుకగజూచు గుక్క తన కట్టడమీఱక యెందు భాస్కరా! 

ఏరులు పొరలి పారినట్లు, కుక్క నాలుక కొనతోనే గతికినట్లు, లోభి తనకు సంపద పుష్కలముగా గల కాలంలోనైనా కడుపారా భుజింపడు.

అనఘునికైన జేకుఱు ననర్హునిగూడి చరించినంతలో

మన మెరియంగ నప్పు డవ మానము, కీడు ధరిత్రియందు; నే
యనువుననైనదప్పవు; య దార్థము; తా నది యెట్టులన్నచో
నినుమునుగూర్చి యగ్నినల యింపదె సమ్మెట పెట్టు? భాస్కరా! 

ఇనుముతో కూడిన అగ్నికి సమ్మెటపోటు కల్గినట్లు, దుష్టునితో కలిస్తే, మరే సంబంధం లేకపోయినా, వానితో కలసి ఉన్నంతమాత్రానే, ఆ దుష్టునికి వచ్చే కీడు వానితో ఉన్నవారికి కూడా వచ్చును.

ఆరయ నెంత నేరుపరి యై చరియించిన వానిదాపునన్

గౌరవ మొప్పగూర్చునుప కారి మనుష్యుడు లేక మేలు చే
కూర; దదెట్లు? హత్తుగడ గూడునె? చూడబదాఱువన్నె బం
గారములోన నైన వెలి గారము కూడకయున్న? భాస్కరా! 

గౌరవం ఇచ్చే స్నేహితుడు లేకపోతే, తానెంతవాడైనా మానవునికి మేలు జరుగదు. మేలువన్నె బంగారమైనా టంకము లేకపోతే యితర వస్తువుతో కలువదుకదా!

ఈ క్షితి నర్థకాంక్ష మది నెప్పుడు పాయక లోకులెల్ల సం

రక్షకుడైన నత్ర్పభుని రాకల గోరుదు రెందు జంద్రికా
పేక్ష జెలంగి చంద్రుండుద యించు విధంబునకై చకోరపుం
బక్షులుచూడవే యెదుర పారముదంబునుబూని భాస్కరా! 

వెన్నెల పులుగులు వెన్నెలపై ఇష్టంతో చంద్రునికై ఎదురుచూచునట్లే, లోకులు ఎప్పుడూ ధనమును ఆశించి తమ రాజు రాకకై ఎదురు చూస్తారు.

ఉరుకరుణాయుతుండు సమ యోచిత మాత్మదలంచి యుగ్రవా

క్పరుషత జూపినన్ ఫలము గల్గుట తధ్యముగాదె యంబుదం
బుఱిమినయంతనే కురియ కుండునె వర్షము లోకరక్షణ
స్థిరతరపౌరుషంబున నశేషజనంబు లెఱుంగ భాస్కరా! 

దయామయుడైన దొర సమయం కొలది కఠినముగా మాటలాడినా, సమయము వచ్చినప్పుడు ఎందులోనూ కొరతచేయడు. మేఘము భయము కలుగునట్లు ఉరిమినా వెంటనే వర్షించును కదా?

ఎట్టుగఁ బాటుపడ్డ నొక యించుక ప్రాప్తము లేక వస్తువుల్

పట్టువడంగ నేరవు నిబద్ధిత సురావళిఁ గూడి రాక్షసుల్
గట్టు పెకల్చి పాల్కడలిఁ గవ్వము చేసి మథించి రంతయున్
వెట్టియె కాక యే మనుభవించిరి వా రమృతంబు భాస్కరా! 

మనిషి ఎంత పాటుపడినా పూర్వపుణ్యఫలం లేనిదే ఏమీ దొరకదు. రాక్షసులు దేవతలతో కలిసి అమృతం మీద ఆశతో మందర పర్వతంను పెల్లగించి తెచ్చి సముద్రమును తరచి కూలీలేని చాకిరి చేశారే కానీ ఫలమేమైనా అనుభవింపగలిగిరా?

కట్టడ యైనయట్టి నిజ కర్మము చుట్టుచు వచ్చి యేగతిం

బెట్టునొ పెట్టిన ట్లనుభ వింపక తీఱదు కాళ్ళు మీఁదుగా
గిట్టక వ్రేలుఁడంచుఁ దలక్రిందుగఁ గట్టిరె యెవ్వరైన నా
చెట్టున గబ్బిలంబులకుఁ జేరిన కర్మము గాక భాస్కరా! 

తన పూర్వకర్మము తనను ఏ విధముగా నియమించునో, మనిషి అలాగే నడుచుకోవాలిగానీ తప్పించుకోవడానికి వీలులేదు. గబ్బిలములు చెట్లకు తలక్రిందులుగా తమ కర్మము కొలది తమకు తామే వ్రేలాడుచున్నవిగానీ, వానిని ఎవరైనా వ్రేలాడగట్టారా?

కానిప్రయోజనంబు సమకట్టదు తా భువి నెంతవిద్యవాఁ

డైనను దొడ్డరాజుకొడుకైన న దెట్లు? మహేశుపట్టి వి
ద్యానిధి సర్వవిద్యలకుఁ దానె గురుండు వినాయకుండు దా
నేనుఁగురీతి నుండియు నదేమిటి కాడఁడు పెండ్లి? భాస్కరా! 

మనిషి తానెంత చదువరియైనా, రాజుబిడ్డైనా కానీ, పని కానేకాదు. మహేశ్వరునంతవానికి కొడుకై ఎల్ల విద్యలకూ గురువైనట్టి విఘ్నేశ్వరుడు తాను పెండ్లి చేసుకోగలిగెనా?

క్రూరమనస్కులౌ పతులఁ గొల్చి వసించిన మంచివారికిన్

వారిగుణంబె పట్టి చెడువర్తన వాటిలు మాధురీజలో
దారలు గౌతమీముఖమహానదు లంబుధిఁ గూడినంతనే
క్షారముఁజెందవే? మొదలికట్టడ లన్నియుఁ దప్పి భాస్కరా! 

తియ్యనినీరు కలిగిన గోదావరి, గంగ మొదలగు ప్రవాహములన్నీ సముద్రమున పడి, ఉప్పగా మారి చెడిపోయినట్లుగా, చెడ్డావాడగు ప్రభువు యొక్క సాంగత్యము వల్ల యోగ్యులూ చెడిపోయి క్రూరులవుతారు.

గిట్టుట కేడఁ గట్టడ లిఖించును నచ్చటఁగాని యొండుచోఁ

బుట్టదు చావు జానువులపున్కల నూడిచి కాశిఁ జావఁ గా
ల్గట్టిన శూద్రకున్ భ్రమల గప్పుచు దద్విధి గుర్రమౌచు నా
పట్టునఁగొంచు మఱ్ఱికడఁ బ్రాణము తీసెఁగదయ్య భాస్కరా! 

ఎవడెక్కడ చచ్చునట్లు విధి నియమమున్నదో, వానికి అక్కడే చావు తటస్థించునుగానీ, తప్పదు. పూర్వం శూద్రకుండను రాజు కాశీ పట్టణములో చావవలెనని కోరి వేరే చోటకి పోవక మోకాళ్లను ఖండించుకొనియున్ననూ, వాని విధి, గుర్రము రూపముతో వానిని ఈడ్చుకొనిపోయి ఒక మర్రి దగ్గర ప్రాణములు తీసెనుగదా?

ఘనబలసత్త్వ మచ్చుపడఁ గల్గినవానికి హాని లేనిచోఁ

దనదగుసత్త్వమే చెఱుచుఁ దన్ను నదెట్లన? నీరు మిక్కిలిన్
గను వసియించినన్ జెఱువు కట్టకు సత్త్వము చాలకున్నచోఁ
గనుమలు పెట్టి నట్టనడి గండి తెగంబడకున్నె? భాస్కరా! 

చాలా బలం ఉన్నవానికి ఇతరుల వల్ల బాధ లేకపోయినా, తన బలమే తనను పాడుచేయటానికి చాలు. చెరువు ఎంత నిండి ఉన్నా, కట్ట గట్టిగా లేకపోతే కన్నాలు పెట్టి, గండిపడి తెగిపోవటానికి తన నీరే కారణము కదా!

చంద్రకళావతంసుకృప చాలనినాఁడు మహాత్ముఁడైనఁ దా

సాంద్ర విభూతిఁబాసియొక జాతి విహీనునిఁ గొల్చియుంట యో
గీంద్ర నుతాంఘ్రిపద్మ మతిహీనత నొందుట కాదుగా హరి
శ్చంద్రుఁడు వీరబాహునిని జంబుగఁ గొల్వఁడెనాఁడు? భాస్కరా! 

దేవుని కరుణ లేనప్పుడు మనిషి తన సంపదనంతా కోల్పోయి నీచజాతి మానవుని కొలిచి బ్రతుకుట అతని తప్పుగాదు. పూర్వము సత్యహరిశ్చంద్రుడను చక్రవర్తి తన వైభవమును పోగొట్టుకొని వీరబాహుడను మాలవానికి ఊడిగము చేయలేదా?

చదు వది యెంత కల్గిన రసజ్ఞత యించుక చాలకున్న యా

చదువు నిరర్థకంబు గుణసంయుతు లెవ్వరు మెచ్చ రెచ్చటం
బదనుగ మంచికూర నలపాకము చేసిన నైన నందు నిం
పొదవెడు నుప్పులేక రుచి పుట్టఁగ నేర్చునటయ్య! భాస్కరా! 

ఎంత చదివినా, రసజ్ఞత లేని చదువు రాణించదు సరికదా, అట్టిదానిని గుణవంతులెవ్వరూ మెచ్చుకొనరు. కూర ఎంత బాగా వండినా, ఉప్పులేనిదే రుచించదుగదా?

చేరి బలాధికుం డెఱిఁగి చెప్పిన కార్యము చేయకుండినన్

బారము ముట్టలేఁడొక నెపంబునఁ దాఁజెడు నెట్టి ధన్యుఁడున్
బోరక పాండుపుత్రులకు భూస్థలి భాగము పెట్టు మన్న కం
సారిని గాకుచేసి చెడఁడాయెనె కౌరవభర్త? భాస్కరా! 

బలవంతుడైనవాడు కీడు, మేలు ఎరిగి చెప్పిన పని వినకపోతే, ఎంత సహాయసంపదలు కలవాడైనా, ఏదో ఒక మిషచేత ఓడిపోవును. పాండవులూ, మీరూ భూభాగము పంచుకోండి అని చెప్పిన శ్రీకృష్ణుని మాట వినని దుర్యోధనుడు నశించెను కదా?

చేసిన దుష్టచేష్ట నది చెప్పక నేర్పునఁ గప్పిపుచ్చి తా

మూసినయంతటన్ బయలుముట్టక యుండ దదెట్లు? రాగిపై
బూసినబంగరుం జెదరిపోవఁ గడంగిన నాఁడు నాటికిన్
దాసిన రాగి గానఁ బడదా జనులెల్ల నెఱుంగ భాస్కరా! 

ఎంత రహస్యముగా ఉంచినా, చేసిన చెడ్డ పని బయటపడక మానదు. పైన బంగారముతో ఎంతచక్కగా పొదిగినా, క్రమముగా బంగారమరిగిపోయిన కొలదీ రాగికాడ బయటపడదా?


Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: