telugudanam.com

      telugudanam.com

   


పద్యం

భావం

చిత్త శుద్ధి కలిగి చేసిన పుణ్యంబు

కొంచమైన నదియు గొదవుగాదు
విత్తనంబు మఱ్ఱి వృక్షంబునకు నెంత
విశ్వదాభిరామ! వినుర వేమ! 

మంచి మనసుతో చేసిన చిన్న పనైనా మంచి ఫలితాన్నిస్తుంది. పెద్ద మర్రిచెట్టుకి కూడా విత్తనం చిన్నదే కదా!

ఆత్మశుద్ధి లేని యాచారమది యేల

భాండశుద్ధి లేని పాకమేల?
చిత్తశుద్ధిలేని శివపూజలేలరా?
విశ్వదాభిరామ! వినుర వేమ! 

మనసు నిర్మలంగా లేనట్లయితే ఆచారాలు పాటించటం వల్ల ప్రయోజనం లేదు. పాత్రలు శుభ్రంగా లేని వంట, మనసు స్థిరంగా లేని శివపూజ వ్యర్థాలే అవుతాయి. ఏమీ ప్రయోజనముండదు.

గంగిగోవుపాలు గరిటెడైనను చాలు

కడివెడైన నేమి ఖరము పాలు
భక్తిగలుగు కూడు పట్టెడైనను చాలు
విశ్వదాభిరామ! వినుర వేమ! 

కడివెడు గాడిద పాలకంటే గరిటెడు ఆవుపాలు మేలును కలిగిస్తాయి. భక్తితో పెట్టిన కూడు పట్టెడు అయినప్పటికీ తృప్తిని కలిగిస్తుంది.

నిక్కమైన మంచినీల మొక్కటి చాలు

తళుకు బెళుకు రాళ్ళు తట్టెడేల?
చాటుపద్య మరయ చాలదా ఒక్కటి
విశ్వదాభిరామ! వినుర వేమ! 

తట్టెడు గులకరాళ్ళ కంటే, ఒక మంచి నీలం శ్రేష్ఠం. అదే విధంగా వ్యర్ధమైన పద్యాల కంటే, ఒక చక్కని చాటు పద్యం శ్రేష్ఠమవుతుంది.

మిరపగింజచూడ మీద నల్లగనుండు

కొరికిచూడ లోనచురుకు మనును
సజ్జను లగువారి సారమిట్లుండురా
విశ్వదాభిరామ! వినుర వేమ! 

మిరియపుగింజ మీద నల్లగానుప్పటికీ దానిని కొరికితే వెంటనే చురుక్కుమంటుంది. మంచి వారు పైకి ఏవిధంగా కనిపించినప్పటికీ అతనిని జాగ్రత్తగా గమనిస్తే అసలు విషయం బయటపడుతుంది.

మృగమదంబు చూడ మీఁద నల్లగనుండు

బరిఢవిల్లు దాని పరిమళంబు
గురువులైన వారి గుణము లీలాగురా
విశ్వదాభిరామ! వినుర వేమ! 

కస్తూరి చూడటానికి నల్లగా ఉన్నప్పటికీ దాని సువాసన నాలుగు దిక్కులకు వెదజల్లునట్లు, పెద్దలైన వారు బయటికి ఆడంబరంగా కనపడక గొప్ప గుణాలు కలవారై ఉంటారు.

మేడిపండు చూడ మేలిమై యుండు

పొట్టవిప్పి చూడ పురుగులుండు
బిరికి వాని మదిని బింకమీలాగురా
విశ్వదాభిరామ! వినుర వేమ! 

అత్తిపండు పైకందంగా కనపడుతుంది. దానిలోపల పురుగులుంటాయి. అదే విధంగా పిరికివాని ధైర్యం కూడా పైన పటారం లోన లొటారంగా ఉంటుంది.

నేర నన్నవాఁడు నెరజాణ మహిలోన

నేర్తునన్న వాఁడు నింద జెందు
ఊరుకున్న వాఁడె యుత్తమయోగిరా
విశ్వదాభిరామ! వినుర వేమ! 

తనకు ఏమీ రాదు అని చెప్పుకొనే వాడు నిజంగా తెలివైనవాడు. అన్నీ వచ్చని చెప్పువాడు గౌరవాన్ని పొందలేడు. మౌనంగానున్నవాడే ఉత్తమ యౌగి అనిపించుకొంటాడు.

గంగ పాఱు నెపుడు కదలని గతితోడ

ముఱికి వాగు పాఱు మ్రోఁతతోడ
పెద్ద పిన్నతనము పేరిమి యీలాగు
విశ్వదాభిరామ! వినుర వేమ! 

గొప్పదైన గంగానది కూడ ప్రశాంతంగా ప్రవహిస్తుంది. చిన్నదైన మురికి కాలువ పెద్ద శబ్ధం చేస్తూ ప్రవహిస్తుంది. గొప్పవారికి, నీచునికి ఈ రకమైన బేధమే ఉన్నది.

నిండునదులు పారు నిల్చి గంభీరమై

వెఱ్ఱివాగు పాఱు వేగబొర్లి
అల్పుడాడు రీతి నధికుండు నాడునా
విశ్వదాభిరామ! వినుర వేమ! 

ఓ వేమా! నీటితో నిండిన నదులు గంభీరంగా నిల్చి ప్రవహిస్తాయి. చిన్న సెలయేరులు పైకి పొర్లి వేగంగా ప్రవహిస్తాయి. చెడ్డగుణాలు గలవారు మాట్లాడినంత తొందరగా, మంచిగుణాలు గలవారు మాట్లాడరు.

అల్పుడెపుడు పల్కు నాడంబరము గాను

సజ్జనుండు బల్కు చల్లగాను
కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగునా
విశ్వదాభిరామ! వినుర వేమ! 

ప్రపంచంలో ఉన్న జనులకు ప్రియమైన పలుకులతో ఆనందం కలిగించు వేమనా! అల్పుడు శాంతంతో మాట్లాడతాడు. కంచు ధ్వని చేసినట్లుగా బంగారం ధ్వని చేయదు కదా! అల్పుడు కంచుతోనూ, సజ్జనుడు బంగారంతోనూ సమానం.

కులము లోన నొకడు గుణవంతుడుండిన

కులము వెలయు వాని గుణము చేత
వెలయు వనములోన మలయజంబున్నట్లు
విశ్వదాభిరామ! వినుర వేమ! 

కులంలో ఒక వ్యక్తి గుణవంతుడన్నట్లయితే ఆ కులమంతా అతని వలన గౌరవాన్ని పొందుతుంది. వనంలో ఒక్క మంచి గంధపు చెట్టు ఉన్నప్పటికీ ఆ వనమంతా వాసన వెదజల్లుతుంది.

పూజకన్న నెంచ బుద్ధి నిదానంబు

మాటకన్న నెంచ మనసు దృఢము
కులముకన్న మిగుల గుణము ప్రధానంబు
విశ్వదాభిరామ! వినుర వేమ! 

పూజాపునస్కారాల కంటే బుద్ధి ప్రధానం. మాట కంటే మనసు ప్రధానం. కులం కంటే గుణం ప్రధానం.

ఉత్తముని కడుపున నోగు జన్మించిన

వాఁడె చెఱచు వాని వంశమెల్లఁ
జెఱకు వెన్నుపుట్టి చెరపదా! తీపెల్ల
విశ్వదాభిరామ! వినుర వేమ! 

చెఱకు మొక్క చివర కంకి పుట్టి దాని తీపిని చెరచునట్లుగా, ఉత్తమ వంశంలో దుష్టుడు పుట్టిన ఆ వంశం యొక్క గౌరవం నశిస్తుంది.

కులములోన నొకఁడు గుణహీనుఁడుండిన

కులము చెడును వాని గుణము వలన
వెలయు జెఱకునందు వెన్ను వెడలి నట్లు
విశ్వదాభిరామ! వినుర వేమ! 

చెఱకు గడకు చివర వెన్నులడితే చప్పబారినట్లుగా, గుణహీనుడైన వ్యక్తి వలన ఆ కులమంతా చెడిపోతుంది.

రాముఁడొకఁడు పుట్టి రవికుల మీడేర్చె

కురుపతి జనియించి కులముఁ జెఱచె
ఇలనుఁ బుణ్యపాప మీలాగు గాదొకో
విశ్వదాభిరామ! వినుర వేమ! 

రాముని పుట్టుకతో రఘువంశం ఉద్ధరించబడింది. దుర్యోధనుని పుట్టుకతో కురువంశం నశించింది. ప్రపంచంలో పుణ్య పాపాలు ఈ విధంగానే ఉంటాయి.

హీనగుణమువాని నిలుజేరనిచ్చిన

నెంతవానికైన నిడుము గలుగు
ఈఁగ కడుఁపు జొచ్చి యిట్టట్టు సేయదా
విశ్వదాభిరామ! వినుర వేమ! 

నీచుణ్ణి ఇంటిలో పెట్టిన ఎటువంటి వానికైనా కష్టం కలుగుతుంది. ఈగ కడుపులోకి వెళితే వికారాన్ని కలిగిస్తుంది.

వేరుపురుగుచేరి వృక్షంబుజెఱచుఁను

చీడ పురుగు జేరి చెట్టుఁజెఱచుఁ
కుత్సితుండు చేరి గుణవంతుఁజెఱచురా
విశ్వదాభిరామ! వినుర వేమ! 

వేరుపురుగు పెద్ద వృక్షాన్ని పాడుచేస్తుంది. చీడ పురుగు చిన్న చెట్టుని నశింపజేస్తుంది. చెడ్డవాడు గుణవంతుని చేరి అతన్ని నాశనం చేస్తాడు.

హీనుఁడెన్ని విద్యలు నేర్చినఁగాని

ఘనుఁడుఁగాడు హీనజనుఁడె కాని
పరిమళములు మోయ ఖరము తా గజమౌనె
విశ్వదాభిరామ! వినుర వేమ! 

నీచుడైన వ్యక్తి ఎంత చదువు చదివినా అతడు గొప్పవాడు కాలేడు. సుగంధ ద్రవ్యాలు మోసినంత మాత్రాన గాడిద ఏనుగు కాలేదు.

విద్యలేనివాడు విద్వాంసు చేరువ

నుండగానె పండితుండు గాడు
కొలని హంసలకడ గొక్కెర లున్నట్లు
విశ్వదాభిరామ! వినుర వేమ! 

హంసలతో కలిసినంత మాత్రాన కొంగ మారనట్లుగా, పండితులతో కలిసినప్పటికీ మూర్ఖుడు మారడు.

అల్పజాతి వాని కధికార మిచ్చిన

దొడ్డవారినెల్ల తొలగగొట్టు
చెప్పు తినెడు కుక్క చెరకు తీపెరుగునా?
విశ్వదాభిరామ! వినుర వేమ! 

దుష్టునకు అధికారం ఇస్తే, మంచి వారందరినీ వెడలకొట్టును. చెప్పు తినే కుక్క, చెరకు తీపి ఎరుగదు.

అల్పుఁ డైన వాని కధిక భాగ్యము గల్గ

దొడ్డవారి దిట్టి తొలగఁ గొట్టు
అల్పబుద్ధి వా డధికుల నెఱఁగునా
విశ్వదాభిరామ! వినుర వేమ! 

మూర్ఖునికి సంపద కలిగినట్లయితే పెద్ద వారినందరినీ తిరస్కరించి తిరుగుతాడు. అల్పుడైన వానికి గొప్పవారి యొక్క శక్తి గురించి ఏమి తెలుస్తుంది.

ఎద్దుకైనఁగాని యేడాది తెల్పిన

మాట దెలసి నడచు మర్మ మెఱిఁగి
మొప్పె తెలియలేడు ముప్పదేండ్లకునైన
విశ్వదాభిరామ! వినుర వేమ! 

ఒక సంవత్సరంపాటు బోధిస్తే, ఎద్దు కూడా మర్మాలను తెలుసుకొని నడుచుకుంటుంది. కానీ ముప్పై సంవత్సరాలు నేర్పినప్పటికీ మూర్ఖుడు తెలుసుకోలేడు.

ఎలుకతోలుఁదెచ్చి యేడాది యుతికిన

నలుపు నలుపేగాని తెలుపురాదు
కొయ్యబొమ్మను దెచ్చి కొట్టినఁ బలుకునా
విశ్వదాభిరామ! వినుర వేమ! 

ఎలుక తోలు ఎంతసేపు ఉతికినప్పటికీ అది తెలుపుగా మారదు. కర్రతో చేసిన బొమ్మ ఎంత కొట్టినప్పటికీ మాట్లడదు.

పాము కన్న లేదు పాపిష్టి జీవంబు

అట్టి పాము చెప్పినట్లు వినును
ఖలుని గుణము మాన్పు ఘను లెవ్వరును లేరు
విశ్వదాభిరామ! వినుర వేమ! 

పాము వంటి పాపిష్టి జీవి కూడా ఏదైనా చెప్తే వింటుంది కానీ, మూర్ఖునికి ఎంత చెప్పినా అతని గుణం మారదు.

వేము పాలువోసి ప్రేమతో బెంచిన

చేదువిరిగి తీపిజెందబోదు
ఓగు నోగెగాక యుచితజ్ఞు డెటులౌను
విశ్వదాభిరామ! వినుర వేమ! 

వేప చెట్టుకి పాలు పోసి పెంచినప్పటికీ చేదు విరిగి తీపెక్కదు. అదే విధంగా చెడ్డవాడు చెడ్డవాడే కానీ మంచివాడు కాలేడు.

ముష్టి వేపచెట్లు మొదలంట ప్రజలకు

పరగ మూలికకుఁ బనికివచ్చు
నిర్దయాత్మకుండు నీచుఁడెందునకౌను
విశ్వదాభిరామ! వినుర వేమ! 

పాలు పంచదార పాపర పండ్లలోఁ

జాలఁబోసి వండఁ జవికిరావు
కుటిల మానవులకు గుణమేల కల్గురా
విశ్వదాభిరామ! వినుర వేమ! 

ఎంత పంచదార పోసి వండినప్పటికి పాపరపండ్లలో తీపి ఎక్కడు. అదే విధముగ దోప్పులకు మంచి గుణము అలవడదు.

పాల నీడిగింట గ్రోలుచునుండెనా

మనుజులెల్లఁగూడి మద్యమండ్రు
నిలువఁదగని చోట నిలువ నిందలు వచ్చు
విశ్వదాభిరామ! వినుర వేమ! 

ఈడిగవాని ఇంటిలో పాలు తాగినా అవి మద్యమని లోకులు భావిస్తారు. నిలువ కూడని స్థలంలో నిలిస్తే అపకీర్తి కలుగుతుంది.

కానివానితోడఁ గలసి మెలఁగుచున్నఁ

గానివానిగానె కాంతు రవని
తాటి క్రింద పాలు ద్రాగిన చందమౌ
విశ్వదాభిరామ! వినుర వేమ! 

పనికిరాని వానితో తిరిగితే వారిని అందరూ పనికిరానివానిగానే చూస్తారు. తాటిచెట్టు కింద పాలు త్రాగినప్పటికీ కల్లు త్రాగినట్లుగానే అందరూ భావిస్తారు.


Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: