telugudanam.com

      telugudanam.com

   


పద్యం

భావం

శ్రీ విద్యుత్కలితాజవంజవ మహాజీమూత పాపాంబు ధా

రా వేగంబున మన్మనోబ్జ సముదీర్ణత్వంబుఁ గోల్పోయితిన్
దేవా! నీ కరుణా శరత్సమయ మింతేచాలు; చిద్భావనా
సేవన్‌ దామర తంపరై మనియెదన్ శ్రీ కాళహస్తీశ్వరా! 

సంపదలు అనే మెరుపు తీగలతో కూడిన, సంసారమనే మేఘముల నుండి కురిసిన, పాపములనే నీటిధారల చేత నా మనఃపద్మము కాంతిలేక చిన్నబోయినది. నీ దయ అను శరత్కాలము వచ్చినది. చాలు. ఇంక నా మనఃపద్మము వికసించుటే కాదు సర్వసమృద్ధులు కలవాడనై, నీ చిన్మూర్తిని ధ్యానించుచూ బ్రతుకుతాను. (పద్మములు వానదెబ్బకు వాడిపోవును. శరత్కాలములో వికసించి కాంతివంతమగును).

వాణీవల్లభ దుర్లభంబగు భవద్ద్వారంబున న్నిల్చి, ని

ర్వాణశ్రీఁ చెరపట్టఁ చూచిన విచారద్రోహమో, నిత్య క
ళ్యాణ క్రీడలఁ బాసి, దుర్దశలపాలై, రాజలోకాధమ
శ్రేణీ ద్వారము దూరఁ జేసి తిపుడో శ్రీకాళహస్తీశ్వరా! 

ఈశ్వరా! బ్రహ్మాదులకు కూడా సాధ్యం కాని, నీ ఇంటి సింహద్వారదేశమున నిలిచి ముక్తికాంతను చేపట్టాలను ఆలోచన, నా వంటి అల్పుడు చేసినందువల్లనో ఏమోకానీ, నీ సేవాభాగ్యమునకు దూరమై, అధములైన రాజులను సేవించునట్లు చేసినావు కదా!

అంతా మిథ్య తలంచి చూచిన నరుండట్లౌ టెరింగిన్ సదా

కాంతల్‌ పుత్రులు నర్థముల్ తనువు నిక్కంబంచు మోహార్ణవ
భ్రాంతింజెంది చరించుగాని, పరమార్థంబైన నీయందుఁ దా
జింతాకంతయుఁ జింత నిల్పడు గదా, శ్రీ కాళహస్తీశ్వరా! 

ఆలోచించినచో ఈ జగత్తంతా మాయేకదా! మానవుడా సంగతి తెలిసీ కూడా, భార్య, పుత్రులు, ధనము, తన శరీరము అన్నీ శాశ్వతము అని భావించి మోహము పొందుచూ, జీవనమునకు పరమార్థభూతుడవైన నిన్ను మనసులో ఒక్క నిమిషమైననూ ధ్యానించడు కదా! ఎంత అజ్ఞానము.

నీ నా సందొడఁబాటుమాట వినుమా! నీ చేత జీతంబు నే

గానిం బట్టక సతతంబు మది వేడ్కంగొల్తు నంతస్సప
త్నానీకంబున కొప్పగింపకుము నన్నాపాటియే చాలుఁదే
జీ నొల్లన్‌ గరినొల్ల నొల్ల సిరులన్ శ్రీ కాళహస్తీశ్వరా! 

ఈశ్వరా! నీకూ నాకూ అంగీకారమైన మాట ఒకటి చెప్తాను వినుము. నీ నుండి ఏ కాణీ కూడా జీతము ఆశింపక, నిత్యము నిన్ను సేవిస్తాను. నీవు నన్ను కామక్రోధాదులైన లోపలి శత్రువులకు అప్పగింపక రక్షించు. ఆ అనుగ్రహము చాలు. ఇంక నాకు గుర్రాలు వద్దు. ఏనుగులు వద్దు. ఐశ్వర్యములు వద్దు. అటువంటివేమీ కోరను.

భవకేళీ మదిరా మదంబున మహా పాపాత్ముడై వీడు న

న్ను వివేకింప డటంచు నన్ను నరకార్ణోరాశి పాలైనఁ బ
ట్టవు, బాలుండొక చోట నాటతమితోడన్‌ నూతఁ గూలంగఁ దం
డ్రి విచారింపక యుండునా? కటకటా! శ్రీ కాళహస్తీశ్వరా! 

జనన మరణ రూపమైన సంసారమనే ఆటలోపడి, కల్లు తాగినట్లు మత్తెక్కి అదే సుఖమనుకొని యీ నరుడు మహాపాపియై నన్ను (భగవంతుని) తెలుసుకొనలేకున్నాడని, నరక సముద్రములో మునిగిపోతుండగా చూస్తూ ఊరుకుంటావా? ఆటలధోరణిలో బాలుడు బావిలో పడినప్పుడు తండ్రి వానిని గురించి పట్టించుకొనకుండా ఊరుకుంటాడా? నీవు నన్ను రక్షింపకుండుట న్యాయము కాదని భావము.

స్వామిద్రోహము చేసి వేరొకనిఁ కొల్వన్‌ బోతినో? కాక నే

నీ మాట ల్విననొల్ల కుండితినో? నిన్నే దిక్కుగాఁ జూడనో?
యేమీ, యిట్టి వృధాపరాధి నగు న న్నీ దు:ఖవారాశి వీ
చీ మధ్యంబున ముంచి యుంపదగునా? శ్రీ కాళహస్తీశ్వరా! 

ఈశ్వరా! నిన్ను కాదని స్వామి ద్రోహము చేసి, మరొక దేవుని సేవించానా? పోనీ, నీవు చెప్పిన వేదవాక్యములపై నమ్మకము లేక నిరాదరణ చేసి, నాస్తికుడనైతినా? నిన్నే దిక్కుగా భావించలేదా? ఏ తప్పూ చేయని నన్ను, ఈ సంసార దు:ఖసముద్రంలో ముంచి, చూసి వినోదించటం నీకు న్యాయమా? నన్ను ఉద్ధరించటం నీ కర్తవ్యం కాదా? (పరమేశ్వరుని ముఖము నుండి వేదాలు పుట్టినవని ప్రసిద్ధి. వారిని నమ్మినవారిని నాస్తికులంటారు.)

దివిజక్ష్మారుహ ధేను రత్న ఘనభూతిన్ ప్రస్ఫురద్రత్న సా

నువు నీ విల్లు; నిధీశ్వరుండు సఖుఁ డర్ణోరాశి కన్యా విభుం
డు విశేషార్చకుఁ డింక నీ కెన ఘనుండున్ గల్గునే? నీవు చూ
చి విచారింపవు; లేమినెవ్వఁడుడుపున్? శ్రీ కాళహస్తీశ్వరా! 

కల్పవృక్షము, కామధేనువు, చింతామణి మొదలైన ఐశ్వర్యప్రదములైన వస్తువులతో నిండి ఉన్న బంగారు పర్వతము నీకు విల్లు. నవనిధులకు నాయకుడైన కుబేరుడు నీకు ప్రియమిత్రుడు. లక్ష్మీపతి అయిన నారాయణుడు నీ పరమ భక్తుడు. ఇన్ని ఉన్నా నీకంటే గొప్పవాడెవ్వడు? వీరిలో ఏ ఒక్కరితోనైనా చెప్పి దరిద్రమును పోగొట్టగల సామర్ధ్యము నీకున్నది. అయినా ఆ పని చేయవు. నిన్ను మరిచిపోతానని భయమా? నా మీద నీ అనుగ్రహ దారిద్రమును పోగొట్టేవాడవు నీవే తప్ప ఇంకెవరున్నారు?

నీతో యుద్ధము చేయనోపఁ; గవితానిర్మాణశక్తి నిన్నున్

బ్రీతుం చేయగలేను; నీ కొరకుఁ తండ్రిన్ చంపగాఁజాల; నా
చేతన్ రోకట నిన్ను మొత్తవెరతున్‌; చీకాకు నా భక్తి, యే
రీతిన్నాకిక నిన్నుఁ చూడగలుగున్? శ్రీ కాళహస్తీశ్వరా! 

అర్జునునిలాగా నీతో యుద్ధము చేయలేను. కవిత్వము చెప్పి నిన్ను సంతోషపరచలేను. శివభక్తుని వలే తండ్రిని చంపలేను. శివభక్తురాలి వలే నిన్ను రోకలితో మొత్తలేను. నా భక్తి, నాకు అడ్డమై నీ దయను పొందనీయకుండా చేస్తుంది. నిన్ను చూసే అవకాశం ఇంక నాకెలా కలుగుతుంది?

ఆలున్ బిడ్డలు తల్లిదండ్రులు ధనంబంచు న్మహాబంధనం

బేలా నా మెడ గట్టినాడ విక నిన్నేవేళఁ జింతింతు, ని
ర్మూలంబైన మనంబులో నెగడు దుర్మోహాబ్ధిలోఁ గ్రుంకి, యీ
శీలామాలపుఁ జింత నెట్లుడిపెదో శ్రీ కాళహస్తీశ్వరా! 

ఈశ్వరా! భార్యాపుత్రులు, తల్లిదండ్రులు, ధనములు అనే పాశములను నా మెడకు చుట్టావు. ఈ వ్యామోహంలో పడి నిన్ను నేనెట్లా స్మరించగలను? ఈ భరింపరాని దుఃఖము ఎలా పోగొడతావో శంకరా! నీ దయ.

నిప్పై పాతకతూలశైల మడచున్ నీనామము న్మానవుల్

తప్పన్ దవ్వుల విన్న నంతకభుజాదర్పోద్ధత క్లేశముల్
తప్పుం దారును ముక్తులౌదురనిశాస్త్రంబుల్‌ మహాపండితుల్
చెప్పంగాఁ దమకింక శంకలుండవలెనా? శ్రీ కాళహస్తీశ్వరా! 

శ్రీకాళహస్తీశ్వరా! నీ పేరు స్మరిస్తేనే కొండల వంటి పాపాలు పోతాయని, యముని వల్ల కలుగు నరకబాధలు తప్పుతాయని వేదశాస్త్రాలు, పండితులు చెప్తుంటే, ఈ మానవులకు ఇంకా అనుమానాలెందుకు? నీ పేరును స్మరించుటకు సిద్ధపడరెందుకు?

వీడెం బబ్బినయప్పుడున్, దమనుతుల్ విన్నప్పుడుం, బొట్టలో

గూ డున్నప్పుడు, శ్రీవిలాసములు పై కొన్నప్పుడుం గాయకుల్
పాడంగా వినునప్పుడుం చెలగుదంభప్రాయ విశ్రాణన
క్రీడాసక్తుల నేమి చెప్పవలెనో శ్రీ కాళహస్తీశ్వరా! 

ఈశ్వరా! నిన్ను, నీ ధ్యానమును మరచి, తమకు తాంబూలము దొరికినప్పుడు, అనగా భోగములు కలిగినప్పుడు, తమను ఎవరైనా పొగిడినప్పుడు, కడుపునిండా తిండి ఉన్నప్పుడు, ఐశ్వర్యవైభవములు బాగా ఉన్నప్పుడు, గాయకులు పాడినప్పుడు తమ గొప్పతనమును చూపుటకై ఆడంబరముగా దానధర్మములు చేస్తూ విర్రవీగు వారిని ఏమనాలో తెలియదు.

నిను సేవింపగ నాపదల్పొడమనీ, నిత్యోత్సవం బబ్బనీ,

జనమాత్రుండననీ, మహాత్ముడననీ, సంసార మోహంబు  పై
కొననీ, జ్ఞానము గల్గనీ, గ్రహగతుల్ కుందింపనీ, మేలు వ
చ్చిన రానీ, యవి నాకు భూషణములే శ్రీ కాళహస్తీశ్వరా! 

ఈశ్వరా! నేను నిన్ను సేవిస్తుండగా, నాకు కష్టాలు రానీ, సుఖాలు రానీ, నన్ను లోకము సామాన్యుడననీ, గొప్పవాడననీ, సంసార వ్యామోహము కలుగనీ, జ్ఞానమే కలుగనీ, గ్రహాచారము నన్ను క్రుంగదీయనీ లేక మంచి చేయనీ, అవి అన్నీ నాకు ఆభరణములు వంటివే అవుతాయి. నీ పాదసేవ చేస్తున్న నాకు అన్నీ నీ అనుగ్రహములు గానే కనిపిస్తాయి.

ఏ వేదంబు పఠించె లూత? భుజగం బే శాస్త్రముల్సూచెఁ దా

నే విద్యాభ్యసనం బొనర్చెఁగరి; చెం చే మంత్ర మూహించె? బో
ధా విర్భావ నిదానముల్ చదువులయ్యా? కావు; నీ పాదసం
సేవాసక్తియె కాక జంతు తతికిన్ శ్రీ కాళహస్తీశ్వరా! 

ప్రాణికోటికి మోక్షము కలుగుటకు నీ పాదాలు సేవించు భక్తి ఒక్కటే కారణం గానీ, చదువులెన్ని చదివినా జ్ఞానమును, మోక్షమును కలిగించునా? ఎంతమంది చదివినవారు లేరు? వారందరికీ జ్ఞానము కలిగిందా? మోక్షము కలిగిందా? నీ దయతో మోక్షము పొందిన సాలెపురుగు ఏ వేదము చదివింది? పాము ఏ శాస్త్రములు పఠించినది? ఏనుగు ఏ విద్యలు నేర్చుకొంది? ఎరుకలవాడు ఏ మంత్రజపము చేశాడు. వీరందరూ ముక్తి పొందటానికి చదువులే కారణమైనవా?

కాయల్గాచె వధూ నఖాగ్రములచేఁ గాయంబు, వక్షోజముల్

రాయన్రాపడె ఱొమ్ము, మన్మధ విహరక్లేశ విభ్రాంతిచే,
ప్రాయంబాయెను, బట్టగట్టెఁ దల, చెప్పన్ రోత సంసారమేఁ
జేయంజాల విరక్తుఁ చేయఁ గదవే శ్రీకాళహస్తీశ్వరా! 

ఈశ్వరా! స్త్రీల గోళ్ళగాట్లతో నా శరీరము కాయలు కాచింది. వారి స్తనముల రాపిడితో నా రొమ్ము రాయిలాగా గట్టిపడిపోయింది. మన్మధక్రీడల మీద వ్యామోహంలో పడి వయసు గడిచిపోయింది. తల బట్టతలై వెంట్రుకలు రాలిపోయినవి. ఇలా చెప్పుకొంటూ పోతే చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ సంసారం అంటే అసహ్యం కలుగుతుంది. ఇక నాకు పరిపూర్ణ వైరాగ్యము కలిగించి భవబంధ విముక్తున్ని చేయి.

నిన్నే రూపముగా భజింతు మదిలో, నీ రూపు మోకాలో? స్త్రీ

చన్నో? కుంచమొ? మేక పెంటికయొ? యీ సందేహముల్మాన్పి, నా
కన్ను లన్ఖవదీయమూర్తి సగుణాకారంబుగాఁ జూపవే
చిన్నీ రేజ విహారమత్త మధుపా! శ్రీకాళహస్తీశ్వరా! 

ఈశ్వరా! మోకాలో, స్త్రీ స్తన్యమో, కుంచమో, మేకపెంటియో నీ రూపము ఏదని నమ్మి భావించి సేవింతును? నా యీ అనుమానాలన్నీ పోగొట్టి నీ సుగుణమూర్తిని నాకు చూపించి ధన్యున్ని చేయుము.

నిను నా వాకిలిఁ గావుమంటినొ? మరున్నీ లాలకభ్రాంతిఁ గుం

టెన పొమ్మంటినొ? యెంగిలిచ్చితిను, తింటేగాని కాదంటినో?
నిను నెమ్మిం దగ విశ్వసించు సుజనానీకంబు రక్షింపఁ చే
సిన నా విన్నపమేల చే కొనవయా? శ్రీకాళహస్తీశ్వరా! 

ఈశ్వరా! బాణాసురునిలాగా నిన్ను నా గుమ్మము వద్ద కాపలా కాయమన్నానా? దేవతా స్త్రీలపై మోహపడి, వారివద్దకు రాయబారిగా వెళ్ళమన్నానా? తిన్నడు లాగా ఎంగిలి మాసం పెట్టి, తింటే గానీ వీల్లేదన్నానా? ఏ తప్పు చేశాను. సజ్జనులను రక్షించమన్నాను. అంతేకదా! నా ప్రార్ధన వినిపించుకోవేమి?

ఱాలన్ రువ్వఁగ చేతులాడవు, కుమారా! రమ్మురమ్మంచునే

చాలన్ చంపగ, నేత్రముల్దివియగా శక్తుండనేఁ గాను,నా
శీలంబేమని చెప్పనున్న దిక నీ చిత్తంబు, నా భాగ్యమో
శ్రీ లక్ష్మీపతి సేవితాంఘ్రియుగళా! శ్రీ కాళహస్తీశ్వరా! 

అజ్ఞానియైన ఒక కిరాతకుడు పూలులేవని రాళ్ళతో పూజించినట్లు నేను చేయలేను. సిరియాళునిలాగా కుమారుని పిలిచి చంపి వంటచేసి జంగమదేవులకు పెట్టలేను. తిన్నడు లాగా కన్నులు పీకి నీకు సమర్పించలేను. ఇంక నా భక్తి గాఢమైనదని ఎలా చెప్పగలను? ఈ మాత్రము భక్తికి నీవు హృదయములో సంతోషపడినచో అదే నాకు మహాభాగ్యము.

రాజుల్మత్తులు, వారి సేవ నరకప్రాయంబు, వారిచ్చు సం

భోజాక్షీ చతురంత యాన తురగీ భూషాదులాత్మ వ్యధా
బీజంబుల్, తదపేక్ష చాలుఁ, పరితృప్తింబొందితిన్, జ్ఞానల
క్ష్మీ జాగ్రత్పరిణామ మిమ్ము, దయతో శ్రీకాళహస్తీశ్వరా! 

ఈశ్వరా! రాజులు ఐశ్వర్యముతో మదించినవారు. వారి సేవ నరకము వంటిది. వారు దయతో ఇచ్చిన పరిచారికలు, పల్లకీలు, గుర్రాలు, భూషణములు మొదలగునవి సంసార బంధములు పెంచి దుఃఖమును కలిగిస్తాయి. వీటన్నింటినీ అనుభవించి సంతృప్తి పడ్డాను. ఇంక వాటిపై వ్యామోహము చాలు. జ్ఞాన సంపదను, దానివల్ల కలిగే మోక్షమును నాకు ప్రసాదించుము.

నీ రూపంబు దలంపగాఁ తుదమొదల్నేగాన, నీవై నచో

రా రా రమ్మని యంచుఁ చెప్పవు, వృధారంభంబులింకేటికిన్
నీరన్ముంపుము పాలముంపు మిక నిన్నే నమ్మినాడం జుమీ
శ్రీ రామార్చిత పాదపద్మయుగళా! శ్రీ కాళహస్తీశ్వరా! 

ఈశ్వరా! నీ రూపము ఊహించాలంటే, దాని మొదలు - చివర నాకు తెలియవు. పోనీ, నీవైనా నన్ను రమ్మని పిలుస్తావా? పిలవవు. ఇంక దయకై ఎన్ని పాట్లు పడిన ఏమి ప్రయోజనం? నన్ను నీట ముంచినా, పాల ముంచినా నీదే భారము. నిన్నే నమ్ముకొన్నాను.

నీకున్, మాంసము వాంఛయేని కరవా? నీ చేత లేడుండగా

జోకైనట్టిగా కుఠారముండ, ననలజ్యోతుండ, నీరుండగా
పాకరంబొప్ప ఘటించి, చేతిపునుకన్ భక్షింప కా బోయచేఁ
చేకొం టెంగిలి మాంసమిట్లు తగునా శ్రీకాళహస్తీశ్వరా! 

ఈశ్వరా! నీకు మాంసాహారముపై కోరిక కలిగినచో, నీ చేతిలో లేడి ఉంది. గండ్రగొడ్డలి ఉన్నది. నీ మూడవకంటిలో నిప్పున్నది. తలమీద నీరున్నది. కొంచెము శ్రమపడి వంట చేసుకుని శుచిగా రుచిగా తినలేకపోయావా? ఆ తిన్నడు ఎంగిలి చేసి పెట్టిన మాంసమే కావలసి వచ్చినదా? నీవంటి వాడు ఇట్లు చేయవచ్చునా?

రాజైదుష్కృతిఁ చెందెఁ చందురుడు, రారాజై కుబేరుండు దృ

గ్రాజీవంబునఁ గాంచె దు:ఖము; కురుక్ష్మాపాలుఁ డామాటనే
యాజిం గూలె సమస్త బంధువులతో; నా రాజ శబ్దంబు ఛీ!
ఛీ! జన్మాంతరమందు నొల్లనుజుమీ! శ్రీ కాళహస్తీశ్వరా! 

చంద్రుడు తాను రాజై గురుపత్నిని అపహరించి పాపమును మూటగట్టుకొనెను. కుబేరుడు పిశాచముల వంటి యక్షులకు రాజై దుఃఖము పొందెను. దుర్యోధనుడు కూడా పాండవులను సమూలముగా నాశనము చేసి రారాజు కావలెనన్న ఆశతో యుద్ధమునకు దిగి సమస్త బంధుమిత్రులతో నాశనమయ్యెను. ఈ రాజశబ్దములో ఇంత దోషమున్నది. కాబట్టి మరొక జన్మలో కూడా రాజు కావలెను అని కోరను. నీ దయారస వీక్షణమున్నచో చాలు.

రాజర్ధాతురుడైనచో నెచట ధర్మంబుండు? నేరీతి నా

నా జాతి క్రియ లేర్పడున్? సుఖము మాన్యశ్రేణి కెట్లబ్బు? రూ
పాజీవాళికి నేది దిక్కు? ధృతి నీ భక్తుల్ భవత్పాద నీ
రేజంబుల్ భజియింతురే తెరగునన్? శ్రీకాళహస్తీశ్వరా! 

పరిపాలకుడైన రాజు ధనమునందు ఆశ కలిగి పరిపాలన సరిగా చేయకపోతే రాజ్యములో ధర్మము ఎక్కడ ఉంటుంది? వర్ణాశ్రమ ధర్మములు ఎలా సక్రమంగా నడుస్తాయి? మంచివారికి సుఖం ఎలా కలుగుతుంది? వేశ్యలు మొదలైన వివిధ వృత్తులవారికి జీవనం ఎలా గడుస్తుంది? నీ భక్తులు స్వేచ్ఛగా నిన్నెలా సేవింపగలుగుతారు?

తరగల్, పిప్పల పత్రముల్ మెఱగుటద్దంబుల్ మరుద్దీపముల్

కరికర్ణాంతము లెండమావుల తతుల్ ఖద్యోత కీటప్రభల్
సురవీధీ లిఖితాక్షరంబు లసువుల్ జ్యోత్స్నాపయ: పిండముల్
సిరులందేల మదాంధు లౌదురో జనుల్ శ్రీ కళహస్తీశ్వరా! 

శంకరా! సంపదలు, నీటికెరటాలలాగా, రావిఆకులలాగా, మెరుపుటద్దాలలాగా, గాలిలోని దీపాలలాగా, ఏనుగు చెవులులాగా, ఎండమావులలాగా, మిణుగురుపురుగులులాగా, ఆకాశంలోని అక్షరాలలాగా, జీవులలోని ప్రాణాలలాగా, వెన్నెల ముద్దలలాగా చాలా చంచలములు, అశాశ్వతములు కదా! మనుషులు అటువంటి సంపదలతో గర్వించి తిరుగుతారేమి?

నిన్ను నమ్మినరీతి నమ్మనొరులన్, నీకన్న నా కెన్న లే

రన్నల్దమ్ములు తల్లిదండ్రులు గురుండాపత్సహాయుండు నా
యన్నా! యెన్నడు నన్ను సంస్కృతి విషాదాంబోధి దాటించి య
చ్ఛిన్నానంద సుఖాబ్ధిఁ దేల్చెదొ కదే! శ్రీ కాళహస్తీశ్వరా! 

ఈశ్వరా! నేను నిన్ను నమ్మినట్లు ఇతరులను ఎవరినీ నమ్మను. నాకు నీ కంటే అన్నలుగానీ, తమ్ములుగానీ, తల్లిదండ్రులుగానీ, గురువులుగానీ, కష్టాలలో ఆదుకొను ఆప్తులుగానీ ఇంకెవ్వరూ లేరు. నన్ను ఈ సంసార విషసముద్రమును దాటించి చిదానంద స్వరూపమైన సౌఖ్యసముద్రంలో ఎప్పుడు తేలియాడిస్తావో కదా! అంతా నీ దయ.

నీ పంచం బడియుండగాఁ గలిగిననన్భిక్షాన్నమే చాలు ని,

క్షేపం బబ్బిన రాజకీటకముల నే సేవింపగా నోప, నా
శాపాశంబులఁ జుట్టి త్రిప్పకుము సంసారార్ధమై, బంటుగాఁ
చేపట్టం దయగల్గెనేని మదిలో శ్రీ కాళహస్తీశ్వరా! 

ఈశ్వరా! నీ చూరుకింద నిలబడగలిగినచో, నాకు ఆ అదృష్టమే చాలు; భిక్షాన్నమైనా తిని బ్రతుకుతాను. పురుగులవంటి అధములైన ఈ రాజులను సేవింపలేను. నీవు నీ సేవకునిగా అంగీకరించునంత దయ కలిగితే, నన్ను ఇంక ఆశాపాశములతో బంధించి ఈ సంసార తాపత్రయంలో పడేయక విముక్తున్ని చేయి.

నీ పేరున్, భవదంఘ్రి తీర్ధము, భవ న్నిష్ఠ్యూత తాంబూలమున్

నీ పళ్ళెంబు ప్రసాదమున్ గొనికదా నే బిడ్డనైనాడ! న
న్నీ పాటిం కరుణింపు మోపనిక నే నెవ్వారికిం బిడ్డగాన్
చేపట్టందగుఁ పట్టి మానఁదగదో శ్రీ కాళహస్తీశ్వరా! 

ఈశ్వరా! నీ నామస్మరణం, నీ పాద తీర్ధం, నీవు నమిలి విడిచిన తాంబూలం, నీకు నివేదన చేసిన ప్రసాదం వీనిని స్వీకరించి కదా నీ పుత్రుడనైనాను! నీకిలా కొడుకు అయిన తర్వాత మరెవ్వరికీ కొడుకుగా పుట్టలేదు. నన్ను నీ దగ్గరికి చేర్చుకో. చేరుకున్న తరువాత మరలా విడిచి పెట్టకూడదు సుమా! (అనగా 'నీ సేవ చేయు నాకు పునర్జన్మ లేని మోక్షమును ప్రసాదింపుము' అని భావం.)

అమ్మా యయ్య యటంచు నెవ్వరిని నే నన్నన్శివా! నిన్ను నే

సుమీ! నీమదిఁ తల్లిదండ్రుల నటంచుంజూడగాఁబోకు, నా
కిమ్మైఁ తల్లియుఁతండ్రియున్ గురుఁడు నీవే కాన సంసారపుం
జిమ్మం జీకటి గప్పకుండఁ గనుమా! శ్రీ కాళహస్తీశ్వరా! 

ఈశ్వరా! అమ్మా అని, నాన్నా అని నేను ఎవ్వరినీ, ఏ జన్మలో పిలిచినా, ఆ పిలుపులన్నీ నిన్నే అని గ్రహించు. ఆ జన్మలనిచ్చిన తల్లితండ్రులను కాదని గ్రహించు. ఇప్పుడు నే నీ జన్మ ఎత్తాను. నాకిప్పుడు కూడా నీవే తల్లి, తండ్రి, గురువు. కావునా నన్ను ఈ జననమరణరూప సంసారం అనే చీకటిలో పడకుండా కాపాడు. (కొడుకు చీకటిలో దారి తెలియక తల్లడిల్లుతుంటే, తల్లిదండ్రులు చూసి ఊరుకుంటారా? వానిని వెలుగులోకి తీసుకురారా? అలాగే నన్ను జ్ఞానప్రకాశంలోకి తెచ్చి రక్షించు.)

కొడుకుల్ పుట్టరటంచు నేడ్తు రవివేకుల్ జీవనభ్రాంతులై!

కొడుకుల్ పుట్టరె కౌరవేంద్రున కనేకుల్, వారిచే నేగతుల్
వడసెన్? పుత్రులులేని యా శుకునకున్ వాటిల్లెనే దుర్గతుల్
చెడునే మోక్షపదం బపుత్రుకునకున్ శ్రీ కాళహస్తీశ్వరా! 

ఈశ్వరా! లోకంలోని జనులు ఎంత అవివేకులు! కొడుకులు పుట్టలేదని, తమకు ఉత్తమగతులు లేవని అజ్ఞానంతో ఏడుస్తున్నారు. కౌరవచక్రవర్తి దృతరాష్ట్రునకు వందమంది కొడుకులు పుట్టారు కదా! వారి వల్ల అతడు ఎంత ఉత్తమగతిని పొందాడు. బ్రహ్మచారిగా ఉండి అపుత్రకుడైన శుకమహర్షికి ఏ దుర్గతులు కలిగెను. ఇదంతా భ్రాంతి తప్ప మరొకటి కాదు. అపుత్రకుడైన వానికి మోక్షమార్గము మూసుకొని పోవునా? వట్టిది. "జ్ఞానేనహి నృణాం మోక్షః"

గ్రహదోషంబులు దుర్నిమిత్తములు నీ కల్యాణనామంబు ప్ర

త్యహమున్ బేర్కొను నుత్తమోత్తముల బాధంబెట్టగా నోపునే?
దహనుం గప్పగఁ జాలునే శలభసంతానంబు? నీ సేవఁ చే
సి హతక్లేశులుగారుగాక మనుజుల్ శ్రీ కాళహస్తీశ్వరా! 

ఈశ్వరా! విషమస్థానంలో నుండి గ్రహములు కలిగించు బాధలుగానీ, అపశకునములుగానీ, రోజూ నీ నామస్మరణం చేయు పుణ్యప్రురుషులను కష్టపెట్టగలవా? ఏమిటో ఈ ప్రజలు అజ్ఞానంలో పడి నిన్ను సేవించక దుఃఖములను అనుభవిస్తున్నారుగానీ, మిడుతలదండు అగ్నిని ఆవరింపలేదని గ్రహింపలేకున్నారేమి? ఇదెంత చిత్రమైన విషయము?

అడుగం బో నిక నన్యమార్గరతులం ప్రాణావనోత్సాహినై,

యడుగంబోయినఁ బోదుఁ నీదు పద పద్మారాధక శ్రేణీయు
న్నెడకున్, నిన్ను భజింపగాఁ గనియు నాకేలా పరాపేక్ష కో
రెడి దింకేమి? భవత్ప్రసాదమె తగున్ శ్రీ కాళహస్తీశ్వరా! 

ఈశ్వరా! నా జీవనయాత్ర సాగుటకై శైవులుకాక యితర మార్గానుసారులను యాచించను. ఒకవేళ యాచించినా, నీ చరణదాసులైన భక్తులనే యాచిస్తాను. అయినా, నిన్ను సేవించు పద్దతులు తెలుసుకొన్న నాకు ఇతరులను యాచించు అవసరమేమి ఉన్నది? నీ అనుగ్రహము కలిగిచో ఈ అల్పములైన ప్రాపంచిక సుఖములు ఎందుకు కోరతాను? అసలు కోరుటకు వీనిలో సారం ఏమున్నది?


Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: