telugudanam.com

      telugudanam.com

   


పద్యం

భావం

శ్రీ రుక్మిణీశ! కేశవ!

నారద సంగీతలోల నగధర శౌరీ
ద్వారక నిలయ జనార్ధన
కారుణ్యముతోడ మమ్ము గావుము కృష్ణా! 

రుక్మిణీదేవి భర్తవైన ఓ పరమేశ్వరా! నారద సంగీతమందు ప్రీతి కలిగినవాడా! గోవర్ధన పర్వతమును నీ చిటికెన వ్రేలితో ఎత్తి గోపాలురను రక్షించినవాడా! ప్రజలను కాపాడే ద్వారకావాసీ! ఓ శ్రీ కృష్ణా! మమ్ము దయతో కాపాడుము.

నీవే తల్లివి దండ్రివి

నీవే నా తోడు నీడ నీవే సఖుఁడౌ
నీవే గురుఁడవు దైవము
నీవే నా పతియు గతియు నిజముగ కృష్ణా! 

ఓ శ్రీకృష్ణా! నీవే నాకు తల్లివి, తండ్రివి మరియు సహాయకుడివి. నీవే నాకు మిత్రుడవు. నా గురువు కూడా నీవే. నా దైవము, ప్రభువు. నాకు జ్ఞానమును ఉపదేశించువాడవు. ఇలా సమస్తము నీవే అయివున్నావు.

నారాయణ పరమేశ్వర

ధారాధర నీలదేహ దానవవైరీ
క్షీరాబ్ధిశయన యదుకుల
వీరా ననుగావు కరుణ వెలయఁగ కృష్ణా! 

ఓ శ్రీమన్నారాయణా! పరమేశ్వరా! ఓ నీలమేఘశ్యామా! రాక్షసులను తుదముట్టించే రాక్షసవైరీ! పాలసముద్రముపై శనియించువాడా! యదువంశకులాగ్రణీ! నన్ను దయతో రక్షించుము.

హరియను రెండక్షరములు

హరియించును పాతకముల నంబుజనాభా!
హరి నీ నామమహత్మ్యము
హరి హరి పొగడంగవశమె హరి శ్రీకృష్ణా! 

పద్మము నాభియందు గల ఓ విష్ణుమూర్తీ! నీ హరి అను పేరు గల రెండు అక్షరములు, మా పాపములను హరించుచున్నవి. నీ పేరులోని మహాత్మ్యమును పొగడుట మా తరమా? కాదు అని భావం

క్రూరాత్ముఁ డజామీళుఁడు

నారాయణ యనుచు నాత్మనందను బిలువన్
ఏ రీతి నేలుకొంటివి
యేరీ నీసాటివేల్పు లెందును కృష్ణా! 

ఓ కృష్ణా! క్రూరుడైన అజామిళుడు తన వృద్ధాప్యంలో, తన కుమారుని 'నారాయణా' అని పిలిచినంతనే, నీవా క్రూరాత్మునికి మోక్షమిచ్చి కాపాడావు. నీ సాటి దైవం ఎక్కడున్నారు?

చిలుక నొక రమణి ముద్దులు

చిలుకను శ్రీరామయనుచు శ్రీపతి పేరుం
బిలిచిన మోక్షము నిచ్చితి
వలరగ మిము దలఁచు జనుల కరుదా కృష్ణా! 

తన పెంపుడు చిలుకచే శ్రీరామా అని పిలిపించినంత మాత్రముననే, ఒక ఆడ దానికి మోక్షము ప్రసాదించెను. అట్టి ఓ పరమేశ్వరా! నిన్ను తలచినవారికి మోక్షప్రాప్తి కలుగజేస్తావు అనటంలో ఎలాంటి ఆశ్చర్యమూ లేదు.

అక్రూరవరద మాధవ

చక్రాయుధ ఖడ్గపాణిశౌరి ముకుందా
శక్రాది దివిజసన్నుత
శుక్రార్చిత నన్ను కరణఁజూడుము కృష్ణా! 

ఓ కృష్ణా! అక్రూరుడను భక్తునికి వరమిచ్చినవాడా! మాధవా! చక్రాయుధధారీ! ఖడ్గము చేతియందు కలవాడా! అవక్ర పరాక్రమోత్తముడా! పాపములను హరించే శ్రీహరీ! ఇంద్రాది దేవతలచే స్తుతింపబడువాడా! శుక్రాచార్యునిచే పూజింపబడినవాడా! ఓ ముకుందా! దయతో మమ్ము కాపాడుము.

నందుని ముద్దుల పట్టివి

మందరగిరి ధరుని హరుని మాధవు విష్ణున్
సుందరస్వరూపుని మునిగణ
వందితు నిను దలఁతు భక్తవత్సల కృష్ణా! 

ఓ కృష్ణా! నీవు నందుని ముద్దులపట్టివి, మందరపర్వతమును మోసిన కూర్మావతారుడవు. శ్రీహరి, విష్ణువు కూడా నీవే. లక్ష్మీదేవి భర్తవు.లోకాలన్నింటినీ సమ్మోహింపజేసే ఆకర్షణీయమైన సుందర స్వరూపము కలవాడవు. మునులందరిచే కొనియాడదగు వాడవు. భక్తవత్సలుడవగు నిన్నే ఎల్లపుడూ మనసారా కొలిచెదను.

ఓ కారుణ్యపయోనిధి

నా కాధారంబ వగచు నయముగఁ బ్రోవ
న్నా కేల యితర చింతలు
నాకాధిప వినుత లోకనాయక కృష్ణా! 

ఓ కృష్ణా! సమస్తలోకాధిపతివైన నీవు దయాసముద్రుడవై నన్ను రక్షించుచుండగా, నాకు ఇతర దైవ చింతనలతో పనేమి? నా చింతలను పోగొట్టే సర్వాంతర్యామివి నీవే అయినపుడు నాకు ఇతర చింతలేల?

వేదంబులు గననేరని

యాది పరబ్రహ్మమూర్తి వనఘ మురారీ
నా దిక్కు జూచి కావుము
నీ దిక్కే నమ్మినాఁడ నిజముగ కృష్ణా! 

ఓ మురారీ! నీవు వేదాలకు అతీతుడవు. నీవే దిక్కని మనఃపూర్వకముగా నమ్మాను. నీ చల్లని చూపును నా పై ప్రసరింపజేసి దయచూపి కాపాడు తండ్రీ!

పదునాలుగు భువనంబులు

కుదురుగ నీకుక్షి నిలుపుకొను నేర్పరివై
విదితంబుగ నా దేవకి
యుదరములో నెట్టు లొదిగియుంటివి కృష్ణా! 

ఓ కృష్ణా! బ్రహ్మాండలోకములన్నింటినీ నీ బొజ్జలో నిలుపుకున్న పరమేశ్వరా! దేవకీదేవి గర్భములో ఎట్లా ఒదిగి ఉన్నావు తండ్రీ!

అష్టమి రోహిణి ప్రొద్దున

నష్టమగర్భమున బుట్టి యా దేవకికిన్
దుష్టుని కంసు వధింపవె
సృష్టి ప్రతిపాలనంబు సేయగ కృష్ణా! 

ఓ పరంథామా! శ్రీకృష్ణా! దేవకీదేవికి ఎనిమిదవ గర్భమున, రోహిణీ నక్షత్రమున, అష్టమి దినమందు జన్మించి, పాపాత్ముడైన నీ మేనమామ కంసుని సంహరించి లోకోద్ధరణ చేయటానికే పుట్టావు కదా!

అల్ల జగన్నాథుకు వ్రే

పల్లియ క్రీడార్థమయ్యె పరమాత్మునకున్
గొల్ల సతి యా యశోదయు
తల్లియునై చన్నుఁగుడిపె దనరగ కృష్ణా! 

ఓ కృష్ణా! జగన్నాథా! సమస్తలోకాలకు అధిపతివైన నీకు రేపల్లె వేడుకయ్యెను కదా! సాక్షాత్తు పరమేశ్వరునకే ఆ గొల్లసతియైన యశోద తల్లి అయ్యెను కదా! నీ మహాత్మ్యం ఎంత గొప్పది.

అందెలు గజ్జెలు మ్రోయగ

చిందులు ద్రొక్కుచును వేడ్క చెలువారంగా
నందుని సతి యా గోపిక
ముందర నాడుదువు మిగుల మురియుచు కృష్ణా! 

ఓ కృష్ణా! బాల్యమున నీ కాలి అందెలతో, గజ్జెలతో ఘల్లు ఘల్లుమని గెంతుతూ, ఆడుకొంటూ నందుని భార్య యశోద ముందర ముద్దులొలికే నీ మాటలతో అందరినీ అలరించావు.

హరిచందనంబు మేనున

కరమొప్పెడు హస్తములను కంకణరవముల్
ఉరమున రత్నము మెఱయఁగఁ
బరిగితివౌ నీవు బాలప్రాయము కృష్ణా! 

ఓ కృష్ణా! నీ శరీరము మంచిగంధముతో, అందమైన చేతులు కంకణములు, ఆభరణములతో, వక్షస్థలమున కౌస్తుభమణితో, ప్రకాశించుచున్న శరీరముతో ముద్దులొలుకుచూ బాల్యమును గడిపితివి. ఆనాటి నీ రూపము ఎంత మనోహరము!

పాణితలంబున వెన్నయు

వేణీమూలంబునందు వెలయఁగ పింఛం
బాణిముత్యము ముక్కున
నాణెముగా దాల్చు లోకనాథుఁడ కృష్ణా! 

ఓ కృష్ణా! సమస్తలోకాధిపతివై ఉన్నా, నీవు చిన్నపిల్లవానివలే చేతిలో వెన్నముద్దతోనూ, తలపై నెమలిపింఛముతోనూ, ముక్కున నవమౌక్తికముతోనూ అలరారుతున్నావు!

మడుగుకు జని కాళీయుని

పడగలపై భరతశాస్త్ర పద్దతి వెలయన్
గడు వేడుకతో నాడెడు
నడుగులు నా మదిని దలఁతు నచ్యుత కృష్ణా! 

ఓ కృష్ణా! అచ్యుతా! కేశవా! కాళీయుని గర్వము అణచుటకు ఆ భయంకర కాళీయుని సర్పముపైననే సరస్సునందు నాట్యమాడి, ప్రకాశించిన ఆ పాదపద్మములను నా మదిలో సదా స్మరింతును తండ్రీ!

బృందావనమున బ్రహ్మా

నందార్భకమూర్తి వేణునాదము నీ వా
మందార మూలమున గో
విందా పూరింతువౌర వేడుక కృష్ణా! 

ఓ కృష్ణా! గోవిందా! బృందావనంలోని ఉద్యానవనములలో మందార చెట్టునీడలో, నవమోహన సుందరాకారుడవై, బాలగోపాలుడవై, ప్రిల్లనగ్రోవి ఊదుతూ నీ ముగ్ధమనోహర సుందరరూపముతో మమ్ము ఆనందపరిచెదవు. ఎంత మనోహరుడివి కృష్ణా!

వారిజనేత్రలు యమునా

వారిని జలకంబులాడ వచ్చిన నీ వా
చీరలు మ్రుచ్చిలియిచ్చితి
నేరుపురా యదియు నీకు నీతియె కృష్ణా! 

ఓ కృష్ణా! యమునానదిలో జలకాలాడుతున్న గోపికల చీరలను దొంగిలించి, తెలివిగా వారికి, జ్ఞానోదయమును కలుగజేసిన నీ గొప్పతనము ఏమని పొగడగలను?

దేవేంద్రుఁడలుకతోడను

వావిరిగా ఱాళ్ళవాన పడిగుఱియింపన్
గోవర్థనగిరి యెత్తితి
గోవుల గోపకుల గాచుకొఱకై కృష్ణా! 

ఓ కృష్ణా! దేవేంద్రుడు చాలా కోపించి, గోపాలురపై అతి తీవ్రమైన భయంకర రాళ్ళ వర్షమును కురిపించగా, ఆ గోవులను, గోపాలురను కాపాడుటకై చిటికెన వేలితో గోవర్ధన పర్వతమును గొడుగువలె ఎత్తిన నీ సామర్ధ్యము నేనేమని ప్రశంసించగలను.

అండజవాహన విను బ్ర

హ్మాండంబుల బంతులట్ల యాడెడు నీ వా
కొండల నెత్తితి వందురు
కొండికపనిగాక దొడ్డకొండా కృష్ణా! 

గరుత్మంతుడు వాహనముగా గల ఓ కృష్ణా! బ్రహ్మాండలోకములను బంతులవలె ఆడే నీవు మందర, గోవర్ధన గిరులను ఎత్తావు అనటం విడ్డూరమా!

అంపాలంబిత కుండల

కంసాంతక! నీవు ద్వారకాపురిలోనన్
సంసారరీతి నుంటిని
హంసేంద్ర! విశాలనేత్ర అచ్యుత కృష్ణా! 

ఓ కృష్ణా! కంసుని చంపిన విశ్వేశ్వరా! నీ కర్ణాభరణాలు సర్వాంగ శోభితాలు. విశాల నేత్రములుగల ఓ పరమయోగశ్రేష్ఠీ! నీవు నాశనము లేనివాడవు. ఈశ్వరుడవు. గర్వము లేనివాడవు. ద్వారకాపురిలో సాధారణ సంసారివలే ఉన్నావు.

పదియాఱువేల నూర్వురు

సుదతులు యెలమండ్రు నీకు సొంపుగ భార్య
ల్విదితంబుగ బహురూపుల
వదలక రమియింతువౌర వసుధను కృష్ణా! 

శ్రీహరీ! కృష్ణావతారములో పదహారువేల నూర్గురు గోపికలనూ, అష్టభార్యలనూ సుఖించి తృప్తిపరచిన నీ మహిమ అత్యంత అద్భుతము కదా!

అంగన పనుపున ధోవతి

కొంగున నటుకులను ముడుచుకొని వచ్చిన యా
సంగతి విని దయనొసఁగితివి
రంగుగ సంపదలు లోకరక్షక కృష్ణా! 

ఓ కృష్ణా! తన భార్య పంపగా, నీ ప్రియసఖుడు కుచేలుడు నీ దర్శనార్థమై వచ్చి, నీకు ఏ కానుక ఇవ్వలేక, కొంగున ఉన్న అటుకులను ఇవ్వడానికి సిగ్గు పడుతుండగా, నీవు ఆ అటుకులను ఆరగించి, అతని మనస్సును తెలుసుకొని, సంపదలు ఇచ్చి కాపాడితివి. నీ విశాల దృష్టిని ఏమని పొగడగలను కృష్ణా!

హా వసుదేవ కుమారక

కావుము నా మాన మనుచు కామిని వేడన్
ఆ వనజాక్షికి నిచ్చితి
శ్రీ వర! యక్షయ మంటంచు చీరలు కృష్ణా! 

దీనజనోద్ధారకా! కృష్ణా! వసుదేవకుమారా! 'నా మానమును కాపాడుము' అని ప్రార్ధించిన ద్రౌపదికి తరిగిపోని చీరలిచ్చి, అభయమిచ్చి కాపాడిన కారుణ్యమూర్తీ, నీకిదే నా నమస్కారములు.

శుభ్రమగు పాంచజన్యము

అభ్రంకష మగుచు మ్రోవ నాహవ భూమిన్
విభ్రమలగు దనుజసుతా
గర్భంబుల పగులజేయు ఘనుఁడవు కృష్ణా! 

ఘనకీర్తిగల కృష్ణా! యుద్ధభూమిలో నీవు పూరించిన పాంచజన్య శంఖారావము ఆకాశము వరకు వ్యాపించి, భీకరధ్వని చేయగా, ఆ ధ్వనికి త్రుళ్ళిపడిన రాక్షస స్త్రీల గర్భములు బ్రద్దలయ్యెను గదా! నీవెంత ఘనుడవు కృష్ణా!

జయమును విజయున కియ్యవె

హయముల ములుకోల మోపి యదలించి మహా
రయమున రొప్పవె తేరున
భయమున రిపుసేన విఱిగి పాఱగ కృష్ణా! 

ఓ కృష్ణా! కౌరవసేన, నీ సారథ్యమును చూసి భయపడి పారిపోయేటట్లు నీవు అర్జునునికి రథసారథివై అత్యంత వేగముతో రథమును తోలి విజయము సిద్ధించునట్లు సాయపడితివిగదా!

దుర్జనౌలగు నృపసంఘము

నిర్జింపcగదలcచి నూవు నిఖిలాధారా
దుర్జనులను వధియింపను
నర్జునునకు నీవు సారధైతివి కృష్ణా! 

సమస్త లోకములకు ఆధారభూతుడవైన ఓ కృష్ణా! దుర్జనులైన దుర్మార్గ రాజ సమూహములను నిర్మూలించుటకై, సన్మార్గుడైన అర్జునునకు సారధివైనావు.

శక్రసుతు గాచుకొఱకై

చక్రము చేపట్టి భీష్మ జంపఁగ జను నీ
విక్రమ మేమని పొగడుదు
శక్రగ్రహ సర్వలోకనాయక కృష్ణా! 

ఓ కృష్ణా! కురుక్షేత్ర సంగ్రామంలో భీష్మాచార్యుని ధాటికి ఆగలేక, అర్జునుడు భీతిల్లు సమయములో నీవు చక్రమును చేత ధరించి "భీష్ముని చంపుదు, నిన్నుగాదు విడువుమర్జునా" అని నీవు చూపిన పరాక్రమమును వర్ణించ, మేము ఎంతటి వారము?

దివిజేంద్రసుతుని జంపియు

రవిసుతు రక్షించినావు రఘురాముఁడవై
దివిజేంద్రసుతుని గాచియు
రవిసుతు బరిమార్చితౌర రణమున కృష్ణా! 

ఓ కృష్ణా! నీ గొప్పతనము ఏమని పొగడగలను? ఎంతని పొగడగలను? రామావతారంలో ఇంద్రుని సుతుడు వాలిని చంపి, సూర్యుని సుతుడైన సుగ్రీవుని రక్షించావు. ఇప్పుడు కృష్ణావతారంలో సూర్యుని సుతుడైన కర్ణుని చంపించి, ఇంద్రుని సుతుడైన అర్జునుని కాపాడినావు. ఇది ఎంత ఆశ్చర్యకరము కృష్ణా! ఈ సూక్ష్మమును గ్రహించుటకు మేము ఎంతవారము తండ్రీ!


Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: