telugudanam.com

      telugudanam.com

   


పద్యం

భావం

శ్రీమనోహర! సురార్చిత సింధుగంభీర!

భక్తవత్సల! కోటి భానుతేజ!
కంజనేత్ర! హిరణ్య కశ్యపాంతక! శూర!
సాధురక్షణ! శంఖ చక్రహస్త!
ప్రహ్లాద వరద! పాపధ్వంస! సర్వేశ!
క్షీరసాగరశాయి! కృష్ణవర్ణ!
పక్షివాహన! నీల భ్రమరకుంతలజాల!
పల్లవారుణపాద పద్మయుగళ!!
చారుశ్రీచందనాగరు చర్చితాంగ!
కుందకుట్మలదంత! వై కుంఠధామ!
భూషణవికాస! శ్రీధర్మ పురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర! 

ఓ లక్ష్మీపతీ! దేవతలందరిచే పూజలందుకొనువాడా! సముద్రం లాంటి గంభీర స్వభావుడా! భక్తవత్సలా! కోటిసూర్య సమప్రభా! ఓ కమలాక్షా! హిరణ్యకశిపుడనే రాక్షసుని వధించిన వీరాధివీరా! అవక్రపరాక్రమవంతుడా! సాధురక్షకా! చక్రగదాధరా! ప్రహ్లాదునికి వరాలిచ్చి కాపాడినవాడా! మా పాపాలను పోగొట్టువాడా! ప్రపంచాధిపతీ! క్షీర సముద్రశయనా! కృష్ణవర్ణా! గరుత్మంతుడు వాహనంగా గలవాడా! తుమ్మెదల్లాంటి తల వెంట్రుకలు కల్గినవాడా! లేత ఎరుపు పాదపద్మాలుగలవాడా! ఓ వైకుంఠవాసీ! ఆభరణములచే నొప్పువాడా! దుష్టసంహారా! పాపాలు దరిచేరనీయనివాడా! ధర్మపురవాసీ! ఓ నరసింహస్వామీ! నీ కిదే నా నమస్కారం.

పద్మలోచన! సీస పద్యముల్ నీ మీదఁ

జెప్పబూనితినయ్య! చిత్తగింపు
గణ యతి ప్రాస లక్షణము జూడగ లేదు;
పంచకావ్య శ్లోక పఠన లేదు;
అమరకాండత్రయం బరసి చూడగలేదు
శాస్త్రీయ గ్రంథముల్ చదువలేదు;
నీ కటాక్షంబున నే రచించెదఁ గాని
ప్రఙ్ఞ నాయది కాదు ప్రస్తుతింపఁ;
దప్పుఁగలిగిన సద్భక్తి తక్కువౌనె?
చెఱకునకు వంకపోయిన చెడునె తీపి?
భూషణవికాస! శ్రీధర్మ పురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర! 

ఓ పద్మనేత్రా! నరసింహస్వామీ! నీ పై సీసపద్యాలు వ్రాయ తలచాను వినుము తండ్రీ! గణ, యతి, ప్రాస లక్షణాలు నాకు తెలియవు, పంచకావ్యములైన కుమారసంభవం, రఘువంశం, కిరాతార్జునీయం, శృంగార నైషధం, మాఘం శ్లోకాలను నేను చదవలేదు. త్రికాండయైన అమరం నాకు తెలియదు. వ్యాకరణ, తర్క, వేదాంత శాస్త్రాలు చదువుకొనలేదు. నీ కరుణా కటాక్షవీక్షణం చేత మాత్రమే వ్రాయ పూనుకొంటిని, నిన్ను ప్రస్తుతించే ప్రజ్ఞ నా వద్ద లేదు. తప్పు మిగిలిన నా సద్భక్తి తక్కువగునా? (తగ్గదు) వంకరగా నున్నా, చెఱకుగడ తీపి చెడునా? చెడదు. అట్లానే నా భక్తి కూడా తప్పుపోయినా ఇసుమంతైనా తగ్గదని భావం.

నరసింహ! నీ దివ్య నామమంత్రము చేత

దురిత జాలము లెల్లఁ దోలవచ్చు;
నరసింహ! నీ దివ్య నామమంత్రముచేత
బలువైన రోగముల్ బాపవచ్చు;
నరసింహ! నీ దివ్య నామమంత్రముచేత
రిపు సంఘముల సంహరింపవచ్చు;
నరసింహ! నీ దివ్య నామమంత్రముచేత
దండహస్తుని బంట్లఁ దరమవచ్చు;
భళిర! నే నీ మహామంత్ర బలముచేత
దివ్య వైకుంఠ పదవి సాధింపవచ్చు!
భూషణవికాస! శ్రీధర్మ పురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర! 

ఓ నరసింహస్వామీ! నీ పవిత్రనామమంత్రంచే సమస్త పాపాలను పోగొట్టవచ్చు. దీర్ఘవ్యాధులు నివారించవచ్చు. శత్రు సమూహాలను చంపవచ్చు. యమభటులను తరమవచ్చు! ఓహో! నీ నామమంత్రమహిమచే గొప్పదైన వైకుంఠం నందు పదవిని పొందవచ్చు. ఆహా! ఏమని చెప్పెదను? నీ నామమంత్ర మహిమచే సాధింపలేని కార్యం లేదు.

దనుజ సంహార! చక్ర ధర! నీకు దండంబు;

లిందిరాధిప! నీకు వందనంబు;
పతితపావన! నీకు బహు నమస్కారముల్;
నీరజాత దళాక్ష! నీకు శరణు;
వాసవార్చిత! మేఘ వర్ణ! నీకు శుభంబు;
మందరధర! నీకు మంగళంబు;
కంబుకంధర! శార్జ్గకర! నీకు భద్రంబు
దీనరక్షక! నీకు దిగ్విజయము;
సకల వైభవములు నీకు సార్వభౌమ!
నిత్యకల్యాణములు నగు నీకు నెపుడు;
భూషణవికాస! శ్రీధర్మ పురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర! 

ఓ రాక్షససంహారీ! చక్రధారీ! నీకు నమస్కారం. ఓ లక్ష్మీపతీ! నీకిదే నా వందనం. పతితపావనా నీకు పెక్కు నమస్కారాలు. పద్మపత్రదళాక్ష! నీకు వందనం. ఇంద్రాది దేవతలచే పూజింపబడువాడా! మేఘవర్ణశరీరా! నీకు శుభము! ఓ మంధరధరా! నీకు మంగళము. శంఖమువంటి కంఠంగలవాడా! విష్ణువు విల్లును ధరించినవాడా! నీకు మేలు. దీనులను రక్షించు నాథా! నీకు దిగ్విజయము. సార్వభౌమా! నీకెల్లపుడూ సకల పూజలతో, వేడుకలతో శుభమగుగాక!

ఇహలోక సౌఖ్యమ్ము లిచ్చగించెదమన్న

దేహ మెప్పటికిఁదా స్థిరత నొంద,
దాయుష్యమున్న పర్యంతంబు పటుతయు
నొక్క తీరుననుండ దుర్విలోన;
బాల్య యౌవన సుదుర్బల వార్ధకములను
మూఁటిలో మునిఁగెడి ముఱికి కొంప
భ్రాంతితో దీని గాపాడుద మనుకొన్నఁ
గాల మృత్యువు చేతఁ గోలుపోవు
నమ్మరాదయ్య! యిది మాయనాటకంబు;
జన్మమిక నొల్ల నన్నేలు జలజనాభ!
భూషణవికాస! శ్రీధర్మ పురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర! 

ఓ నరసింహస్వామి! ఇహలోకము అనగా భూలోకసుఖములు కోరుదామంటే ఈ శరీరము నశ్వరమైనది. శాశ్వతమైంది కాదు. జీవితాంతము బలము ఒకే విధంగా ఉండదు. ఈ దేహమనే కట్టె చిన్నతనము, ప్రాయము, ముసలితనమనే ముఱికి గుంటలో మునిగిపోయే తోలుతిత్తి, దీనిని ప్రేమతో నిలుపుకొందామంటే చావు, మృత్యువులలో ఇది జారిపోతుంది. దీనిని ఎన్నటికీ నమ్మరాదు. ఇది ఒక బూటకనాటకము వంటిది. పుట్టుకనేది నా కొద్దు తండ్రీ! ఓ పంకజనాభా! నన్ను రక్షించు.

లక్ష్మీశ! నీ దివ్య లక్షణగుణముల

వినఁజాల కెప్పుడు వెఱ్ఱినైతి;
నా వెఱ్ఱిగుణమును నయముగా ఖండించి
నన్ను రక్షింపుమో నళిననేత్ర!
నిన్ను నేనమ్మితి నితర దైవములనే
నమ్మ లే దెప్పుడు నాగశయన!
కాపాడినను నీవె కష్టపెట్టిన నీవె;
నీ పాదకమలముల్ నిరతి నేను
నమ్మియున్నాను; నీపాద నళినభక్తి
వేగ దయచేసి రక్షింపు వేదవిద్య!
భూషణవికాస! శ్రీధర్మ పురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర! 

ఓ నరసింహస్వామి! లక్ష్మీపతి! నీ యొక్క సద్గుణాలన్నీ వినాలని ఉవ్విళ్లూరే వెఱ్ఱివాడిని. ఓ పద్మక్షా! ఆ వెఱ్ఱిపోయేట్లు నన్ను దీవించి రక్షించు నళిననేత్రా! ఇతర దైవాలను నేనెన్నడూ నమ్మలేదు. కొలువలేదు. నిన్నే నమ్మాను తండ్రీ! ఓ భుజగశయనా! నీటముంచినా పాలముంచినా నీవే గతి! నీ పాదపద్మాలనే నేనెల్లప్పుడూ వేడుకుంటున్నాను. నా పై దయ చూపు తండ్రీ!

స్తంభమం దుదయించి దానవేంద్రునిఁ ద్రుంచి

కరుణతోఁ బ్రహ్లాదుఁ గాచినావు;
మకరిచేఁ జిక్కి సామజము దుఃఖించంగఁ
గృప యుంచి వేగరక్షించినావు;
శరణంచు నా విభీషణుడు నీ చాటున
వచ్చినప్పుడె లంక నిచ్చినావు;
ఆ కుచేలుడు చేరెఁ డటుకు లర్పించిన
బహుసంపదల నిచ్చి పంపినావు;
వారివలె నన్నుఁ బోషింప వశముగాదె?
యింత వలపక్షమేల? శ్రీ కాంత! నీకు;
భూషణవికాస! శ్రీధర్మ పురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర! 

ఓ నరసింహస్వామీ! స్థంభమునుండి వెలువడి, రాక్షసేంద్రుడైన హిరణ్యకశిపుని చంపి, కరుణతో ప్రహ్లాదుని కాపాడావు. గజేంద్రుని మొసలిబారినుండి రక్షించావు. శరణు, శరణు కాపాడమని వేడుకొన్న విభీషణుని లంకకు రాజును చేశావు. చారెడటుకులు సమర్పించినంత మాత్రానే, నీ ప్రియస్నేహితుడైన కుచేలునికి అపార సిరిసంపదలిచ్చి బ్రోచావు. వారివలె నన్ను కూడా దయతో బ్రోవవేమి తండ్రీ! శ్రీకాంత! రక్షించి బ్రోవుమయ్య! నేనేమి చేశానని ఇంత పక్షపాతం చూపిస్తున్నావు తండ్రీ!

ఐశ్వర్యములకు ని న్ననుసరింపఁగలేదు;

ద్రవ్య మిమ్మని వెంటఁదగుల లేదు;
కనక మిమ్మని చాలఁ గష్టపెట్టఁగ లేదు!
పల్లకిమ్మని నోటఁ బలక లేదు;
సొమ్ము లిమ్మని నిన్ను నమ్మికొల్వఁగలేదు;
భూము లిమ్మని పేరు పొగడ లేదు;
బలము లిమ్మని నిన్ను బ్రతిమాలగాలేదు;
పసుల నిమ్మని పట్టుఁబట్టలేదు;
నేను గోరిన దొక్కటే నీలవర్ణ!
చయ్యనను మోక్షమిచ్చినఁ జాలు నాకు;
భూషణవికాస! శ్రీధర్మ పురనివాస
దుష్టసంహార! నరసింహ! దురితదూర! 

ఓ నరసింహస్వామీ! నాకు ఐశ్వర్యాలు వద్దు. సంపదలొద్దు. ధనం వద్దు. బంగారం, వాహనాలు, సొమ్ములు, భూములు, శక్తియుక్తులు, పనులు మొదలగునవేవీ నాకక్కరలేదు. ఓ నీలమేఘశ్యామా! నిన్ను కోరేదొక్కటే! మోక్షం ప్రసాదించమని అడుగుతున్నాను. వెంటనే మోక్షప్రాప్తిని అనుగ్రహించు తండ్రీ!

చిత్తశుద్ధిగ నీకు సేవఁజేసెదఁ గాని,

పుడమిలో జనుల మెప్పులకుఁ గాదు;
జన్మపావనతకై స్మరణజేసెదఁ గాని,
సరివారిలోఁ బ్రతిష్ఠలకుఁగాదు;
ముక్తికోసము నేను మ్రొక్కివేఁడెదఁగాని,
దండిభాగ్యము నిమిత్తంబు గాదు;
నిన్నుఁబొగడ విద్య నేర్చితినేకాని,
కుక్షినిండెడు కూటి కొఱకుఁగాదు;
పారమార్థికమునకు నేఁ బాటుపడితిఁ
గీర్తికి నపేక్ష పడలేదు కృష్ణవర్ణ!
భూషణవికాస! శ్రీధర్మ పురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర! 

ఓ దుష్టసంహారా! నరశింహా! మనఃస్పూర్తిగా నిన్నే సేవిస్తాను గానీ, దుష్టజనుల మొప్పుకోసం కాదు. నా జన్మ సాఫల్యతకై నిన్నే స్మరిస్తాను గానీ, నా సాటివారిలో అనవసర గొప్పతనానికి కాదు. ముక్తికోసమే నిన్ను మ్రొక్కి వేడుకొంటున్నాను గానీ, అనిత్యమైన భోగభాగ్యాల కోసం కాదు. నిన్ను ప్రస్తుతించటానికే విద్యనేర్చాను గానీ, నశ్వరమైన శరీరం కోసం కాదు. ముక్తి కోసం నే పాటుపడుతున్నాను గానీ, కీర్తి కోసం కాదు. ఓ నీలమేఘశ్యామా! కీర్తిని కోరటం లేదు. ముక్తిని మాత్రమే ప్రసాదించమని వేడుకొంటున్నాను.

ఆదినారాయణా! యనుచు నాలుకతోడఁ

బలుక నేర్చినవారి పాదములకు
సాష్టాంగముగ నమస్కార మర్పణఁ జేసి
ప్రస్తుతించెదనయ్య బహువిధముల
ధరణిలో నరులెంత దండివారైనను
నిన్నుఁ గానని వారి నే స్మరింప;
మేము శ్రేష్ఠులమంచు మిడుకుచుంచెడివారి
చెంతఁ జేరఁగఁనోను శేషశయన!
పరమ సాత్వికులైన నీ భక్తవరుల
దాసులకు దాసుడను జుమీ ధాత్రిలోన;
భూషణవికాస! శ్రీధర్మ పురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర! 

ఓ ఆదినారాయణా! నరసింహా! తొలిదేవుడవు నీవే అని ఎవరు నిన్ను పూజిస్తారో వారి పాదాలకు సాష్టాంగ నమస్కారమొనరిస్తాను. ప్రశంసిస్తాను. నిన్నెరుంగని వారెంత గొప్పవరైనా, ఈ భూలోకాధిపతియైనా వారిని నేను తలవను. ఓ శేషశయనా! గొప్పవారమని స్వార్థబుద్ధితో, కీర్తికండూతితోనున్నవారిని దరిజేరనివ్వను. ఈ భూమిపై మిక్కిలి శాంత స్వభావుడైన నీ భక్తశ్రేష్ఠులను భక్తితో సేవిస్తాను.

శ్రవణ రంధ్రముల నీ సత్కథల్ పొగడంగ

లేశ మానందంబు లేనివాడు
పుణ్యవంతులు నిన్ను బూజసేయగ జూచి
భావమం దుత్సాహ పడనివాడు
భక్తవర్యులు నీ ప్రభావముల్ పొగడంగ
దత్పరత్వములేక తొలగువాడు
తనచిత్తమందు నీ ధ్యాన మెన్నఁడు లేక
కాలమంతయు వృథా గడుపువాడు
వసుధలోనెల్ల వ్యర్ధుండు వాడె యగును;
మఱియు జెడుగాక యెప్పుడు మమతనొంది;
భూషణవికాస! శ్రీధర్మ పురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర! 

ఓ శ్రీహరీ! నరసింహా! నీ ఉత్తమ కథలు వర్ణించగా, చెవులారా విని ఆనందించనివాడూ, పుణ్యాత్ములు నిన్ను పూజించగా, మనస్సులో ఉత్సాహపడనివాడూ, భక్తాగ్రేసరులు నీ ప్రభావాలను ప్రస్తుతించగా, భక్తితత్పరతను పొందనివాడూ, మనస్సు నీ యందుంచక కాలయాపన చేయువాడూ పనికిమాలిన దుర్మార్గుడగును, అట్టి వాడెల్లప్పుడూ మోహాంధకారంలో పడి నశించిపోతాడు.

గార్దభంబున కేల కస్తూరి తిలకంబు?

మర్కటంబున కేల మలయజంబు?
శార్దూలమునకేల శర్కరాపూపంబు?
సూకరంబున కేల చూతఫలము?
మార్జాలమున కేల మల్లెపువ్వులబంతి?
గుడ్లగూబల కేల కుండలములు?
మహిషాని కేల నిర్మలమైన వస్త్రముల్?
బకసంతతికి నేల పంజరంబు?
ద్రోహిచింతనఁ జేసెడి దుర్జనులకు
మధురమైనట్టి నీనామ మంత్రమేల?
భూషణవికాస! శ్రీధర్మ పురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర! 

ఓ నరసింహా! గాడిదకు కస్తూరిబొట్టు, కోతికి గంధం, బెబ్బులికి చక్కెరతో చేసిన పిండివంట, పందికి మామిడిపండు, పిల్లికి మల్లెమాలలు, గుడ్లగూబకు చెవులపోగులు, దున్నపోతుకు పరిశుభ్రమైన వస్త్రాలు, కొంగలకు పంజరం ఎలా సరిపడవో, అలానే దుర్మార్గ ప్రవృత్తులకు మధురమైన నీ దివ్యనామామృతం రుచించదు.

కోతికి జలతారు కుళ్లాయి యేటికి?

విరజాజి పూదండ విధవ కేల?
ముక్కిడితొత్తుకు ముత్తెంపు నత్తేల?
యద్దమేమిటికి జా త్యంధునకును?
మాచకమ్మకు నేల మౌక్తికహారముల్?
క్రూరచిత్తునకు స ద్గోష్ఠులేల?
ఱంకుఁబోతుకు నేల బింకపు నిష్ఠలు?
వావి యేటికి దుష్టవర్తనునకు?
మాట నిలకడ సుంకరి మోటు కేల?
చెవిటివానికి సత్కథా శ్రవణ మేల?
భూషణవికాస! శ్రీధర్మ పురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర! 

ఓ నరసింహా! కోతులకెందుకు జరీటోపీ! విధవస్త్రీలకు మల్లె, సన్నజాజుల పూలమాలలెందుకు? ముక్కులేని ముండకు ముక్కుపోగులెందుకు? పుట్టు గ్రుడ్డివానికి అద్దమెందుకు? కాపురానికి పనికిరాని ఆడదానికి ముత్యాల హారాలెందుకు? దుష్టబుద్ధులకు సద్గోష్టులెందుకు? వేశ్యలకెందుకు డాంభిక నియమాలు? దుష్ప్రవర్తనులకు వావి వరసలెందుకు? లంచగొండికెందుకు మాటనిలకడలు? చెవిటివానికెందుకు సత్కథా శ్రవణాలు? ఇవన్నీ అవసరం లేదు. వ్యర్థాలని అర్థం.

గౌతమీస్నానానఁ గడతేఱుద మటన్న

మొనసి చన్నీళ్లలో మునుగలేను;
తీర్థయాత్రలచేఁ గృ తార్థుఁడౌద మటన్న
బడలి నేమంబు లే నడపలేను;
దానధర్మముల స ద్గతిని జెందుదమన్న
ఘనముగా నాయొద్ద ధనములేదు;
తపమాచరించి సార్థకము నొందుదమన్న
నిమిషమైన మనస్సు నిలుపలేను
కష్టములకోర్వ నాచేత గాదు; నిన్ను
స్మరణఁజేసెద నా యధా శక్తి కొలది;
భూషణవికాస! శ్రీధర్మ పురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర! 

ఓ నరసింహస్వామీ! గోదావరిలో స్నానమాడి పునీతుడనౌదామంటే, తెగించి ఆ చన్నీళ్ళలో మునుగలేను. తీర్థయాత్రలు చేసి కృతార్థుడనౌదామంటే, నియమాలను నే పాటించలేను. దానధర్మాలచే సద్గతిని పొందుదామంటే, ఎక్కువైన ధనం నా వద్దలేదు. తపస్సులు చేసి ముక్తిపొందుదామంటే, ఒక్కనిమిషం కూడా మనస్సు నిల్పలేను. కష్టాలు భరించే శక్తి నా వద్దలేదు. దేవా! నాశక్తి కొలది నిన్ను స్మరిస్తాను.

పాంచభౌతికము దుర్బలమైన కాయం బి

దెప్పుడో విడుచుట యెఱుకలేదు,
శతవర్ణములదాక మితముఁ జెప్పిరి కాని,
నమ్మరా దామాట నెమ్మనమున;
బాల్యమందో, మంచి ప్రాయమందో, లేక
ముదిమియందో లేక ముసలియందో,
యూరనో, యడవినో, యుదకమధ్యముననో,
యెప్పుడో విడుచుట యేక్షణంబొ?
మరణమే నిశ్చయము; బుద్ధి మంతుడైన
దేహ మున్నంతలో మిమ్ముఁ దెలియవలయు;
భూషణవికాస! శ్రీధర్మ పురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర! 

ఓ నరసింహా! పంచభూతాలతో నిండిన భరింపనలవికాని శరీరమిది. ఎప్పుడు కూలునో ఎవరికి తెలుసు? నూరు సంవత్సరాల వయసని "శతమానః భవతి శతాయిష్షు"ని అంటారే కానీ, ఆ మాట నమ్మశక్యమగుట లేదు. బాల్యంలోనో, ప్రాయం వచ్చిన తరువాతనో లేక వయస్సయిన తర్వాతనో లేక దేహమందు పూర్తిగా శక్తియుడిగిన తర్వాతనో, ఎప్పుడు పోవునో చెప్పటం కష్టం. అదీగాక ఊరిలోనో, అడవిలోనో, నీటిలోనో ఎప్పుడో, ఏ సమయంలోనో, ఏ క్షణంలోనో ఈ దేహానికి మరణం తప్పదు. దేహమున్నపుడే జ్ఞానినై నిన్ను ధ్యానించును.

ఉర్విలో నాయుష్యమున్న పర్యంతంబు

మాయ సంసారంబు మరగి, నరుడు
సకల పాపములైన సంగ్రహించును గాని
నిన్ను జేరెడి యుక్తి నేర్వలేడు;
తుదకు గాలుని యొద్ద దూత లిద్దఱు వచ్చి
గుంజుక చని వారు గ్రుద్దుచుండ,
హింస కోర్వగలేక యేడ్చి గంతులువేసి
దిక్కు లేదని నాల్గు దిశలు చూడ,
దన్ను విడిపింప వచ్చెడి ధన్యుడెవడు?
ముందు నీదాసుడై యున్న ముక్తిగలుగు;
భూషణవికాస! శ్రీధర్మ పురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర! 

ఓ స్వామీ! నరసింహస్వామీ! భూమిపై నూకలున్నంతవరకు, మనిషి మాయా సంసారానికలవాటుపడి, ఎన్ని పాపాలైనా చేస్తాడుగానీ, నిన్ను చేరే సూక్ష్మపు ఆలోచన చేయడు కదా! చివరకు ఇద్దరు యమభటులు వచ్చి యీడ్చుకొని పోయి హింసిస్తుంటే సహింపలేలని, తనను రక్షించే ఉత్తముడెవ్వడా అని, నలుదిక్కులా చూస్తాడు గానీ, ముందుగానే నీ యందు భక్తి విశ్వాసముంచి ముక్తిపొందడుగదా!

భుజబలంబున బెద్ద పులులఁ జంపగవచ్చు,

పాముకంఠము జేత బట్టవచ్చు,
బ్రహ్మరాక్షస కోట్ల బాఱఁద్రోలగవచ్చు,
మనుజుల రోగముల్ మాన్పవచ్చు,
జిహ్వ కిష్టముగాని చేదు మ్రింగఁగవచ్చు,
బదను ఖడ్గము చేత నదుమవచ్చుఁ,
గష్టమొందుచు ముండ్ల కంపలో జొరవచ్చుఁ,
దిట్టుబోతుల నోళ్లు కట్టవచ్చుఁ,
బుడమిలో దుష్టులకు ఙ్ఞాన బోధఁ దెలిపి
సజ్జనులఁ జేయలేఁ డెంత చతురుఁడైన;
భూషణవికాస! శ్రీధర్మ పురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర! 

ఓ నరసింహా! భుజబలంతో పెద్దపులులను చంపవచ్చు, పాముకంఠాన్ని చేతితో పట్టుకోవచ్చు, బ్రహ్మరాక్షసులను పారద్రోలవచ్చు. మనిషి రోగాలను మాన్పవచ్చు. ప్రియంలేని చేదును మ్రింగవచ్చు. పదునైన కత్తిని చేత్తో అదిమిపెట్టవచ్చు. కష్టమైనా ముండ్ల కంపలో దూకవచ్చు. చెడువాగుడు కాయల నోళ్ళు అరికట్టవచ్చు. కాని ఈ భూమియందు దైవోపదేశం, దుర్జనులను సజ్జనులు చేయటం ఎంత సమర్ధునికైనా అలవికాదుకదా!

అవనిలోఁగల యాత్ర లన్ని చేయఁగవచ్చు,

ముఖ్యుడై నదులందు మునుఁగవచ్చు,
ముక్కుపట్టుక సంధ్య మొనసి వార్వఁగవచ్చుఁ,
దిన్నగాఁ జపమాల ద్రిప్పవచ్చు,
వేదాల కర్థంబు విఱిచి చెప్పఁగవచ్చు,
శ్రేష్ఠ క్రతువు లెల్ల జేయవచ్చు,
ధనము లక్షలు కోట్లు దానమీయగవచ్చు,
నైష్ఠికాచారముల్ నడుపవచ్చు,
జిత్త మన్యస్థలంబునఁ జేరకుండ
నీ పదాంభోజములయందు నిలుపరాదు!
భూషణవికాస! శ్రీధర్మ పురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర! 

ఓ నరసింహస్వామీ! భూమి మీద తీర్థయాత్రలన్నీ చేయవచ్చు. ముఖ్యనదులలో మునగవచ్చు, ముక్కు మూసుకొని, సంధ్యావందనం చేయవచ్చు. జపమాలతో జపించవచ్చు. వేదాలకు అర్థం విడమర్చి చెప్పవచ్చు. గొప్పవైన యజ్ఞాలను చేయవచ్చు. విరివిరిగా దానాలు చేయవచ్చు. నియమనిష్ఠలతో ఆచారవ్యవహారాలు ఆచరించవచ్చు. కానీ, ఓ దేవదేవా! ఏకాగ్రతతో నీ పాదపద్మాలను కొలవడం సాధ్యం కాకున్నది తండ్రీ!

భువన రక్షక! నిన్ను బొగడనేరని నోరు

ప్రజ కగోచరమైన పాడుబొంద;
సురవరార్చిత! నిన్నుఁ జూడగోరని కనుల్
జలములోపల నెల్లి సరపుగుండ్లు;
శ్రీరమాధిప! నీకు సేవఁజేయని మేను
కూలి కమ్ముడువోని కొలిమితిత్తి;
వేడ్కతో నీ కథల్ వినని కర్ణములైన;
గఠిన శిలాదులఁ గలుగు తొలులు;
పద్మలోచన! నీ మీఁద భక్తిలేని
మానవుఁడు రెండు పాదాల మహిషమయ్య!
భూషణవికాస! శ్రీధర్మ పురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర! 

ఓ నరసింహస్వామీ! లోకరక్షకా! నిన్ను స్తుతించని నోరు పాడుబడినబావి వంటిది. ఓ సర్వార్చితా! నిన్ను చూడగోరని కనులు నీటి బుడగలు వంటివి. ఓ లక్ష్మీపతీ! నిన్ను సేవించని శరీరం నిష్ప్రయోజనమైన తోలుతిత్తి వంటిది. నీ కథలు వినాలని ఉవ్విళ్ళూరని చెవులు కఠినశిలల మధ్యనుండే రంధ్రాల వంటివి! ఓ కమలాక్షా! నీ మీద భక్తిలేని మానవుడు రెండుపదాల దున్నపోతువంటివాడే! (అనగా నిష్ప్రయోజకుడు అని భావం)

ధరణిలో వెయ్యేండ్లు తనువు నిల్వగబోదు,

ధన మెప్పటికి శాశ్వతంబు గాదు,
దారసుతాదులు తన వెంట రాలేరు,
భృత్యులు మృతిని దప్పింపలేరు,
బంధుజాలము తన్ను బ్రతికించుకొనలేరు,
బలపరాక్రమ మేమి పనికిరాదు,
ఘనమైన సకల భాగ్యం బెంత గల్గియు
గోచిమాత్రంబైన గొంచుఁబోఁడు,
వెఱ్ఱికుక్కల భ్రమలన్ని విడిచి నిన్ను
భజనఁ జేసెడివారికి బరమ సుఖము;
భూషణవికాస! శ్రీధర్మ పురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర! 

ఓ జగన్నాథా! పరమాత్మా! నరశింహా! ఈ అశాశ్వతమైన శరీరం వెయ్యేండ్లు భూమిపై నిల్వజాలదు. ధనమెన్నటికీ స్థిరం గాదు. భార్యాబిడ్డలు తన వెంటరారు. భృత్యులు మృతువును తప్పించలేరు. బంధువులు బ్రతికించలేరు. బలపరాక్రమాలు పనికిరావు. గొప్ప సంపద కల్గియున్నా, ఇసుమంతైనా వెంట తీసుకుపోడు. వెఱ్ఱికుక్కల వంటి, అనగా పనికిమాలిన తలంపులు (ఆలోచనలు) మాని, నిన్నే మనఃస్ఫూర్తిగా భజించే వారికి, ఇహపర సౌఖ్యాలిచ్చి కాపాడే దాతవు నీవే గదా!

నరసింహ! నాకు దుర్ణయములే మెండాయె

సుగుణ మొక్కటిలేదు చూడఁ బోవ;
నన్యకాంతల మీద నాశమానగలేను,
ఒరుల క్షేమము చూచి యోర్వలేను,
ఇటువంటి దుర్బుద్ధు లిన్ని నా కున్నవి,
నేను జేసెడివన్ని నీచకృతులు;
నా వంటి పాపిష్ఠి నరుని భూలోకాన
బుట్టఁజేసితి వేల? భోగిశయన!
అబ్జదళనేత్ర! నా తండ్రివైన ఫలము
నేరములు గాచి రక్షింపు నీవె దిక్కు;
భూషణవికాస! శ్రీధర్మ పురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర! 

ఓ పద్మరేకులవంటి కన్నులు గలవాడా! నరసింహా! చూడగా నాలో దుర్గుణాలే ఎక్కువగా ఉన్నాయి కానీ, సద్గుణ మొక్కటైనా కానరాదు. పరస్త్రీ వ్యామోహం వదలలేను. యితరుల ఔన్నత్యాన్ని చూసి సహించలేను. యిటువంటి చెడుబుద్ధులున్నాయి నాలో. నేను చేసే పనులన్నీ తుచ్ఛములే. ఇలాంటి నన్ను ఈ భూమిపై ఎందుకు పుట్టించావయ్యా! ఓ శేషశయనా! నీవే నా తండ్రివి. నీవే నా దిక్కు. నీ పుత్రుని తప్పులు సైచి కావుము తండ్రీ!

ధీరతఁ బరుల నిందింప నేర్చితిఁగాని

తిన్నగా నినుఁ బ్రస్తుతింపనైతిఁ,
బొరుగు కామినులందు బుద్ధి నిల్పితి గాని
నిన్ను సంతతము ధ్యానింపనైతిఁ;
బెరికిముచ్చట లైన మురిసి వింటినిగాని
యెంచి నీ కథ లాలకించనైతిఁ,
గౌతుకంబునఁ బాతకము గడించితిఁగాని
హెచ్చు పుణ్యము సంగ్రహింప నైతి,
నవనిలో నేను జన్మించినందు కేమి
సార్థకము కానరాదాయె స్వల్పమైన;
భూషణవికాస! శ్రీధర్మ పురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర! 

ఓ నరసింహాస్వామీ! గర్వంతో ఇతరులను నిందించడం నేర్చానుగానీ, మనస్పూర్తిగా నిన్ను పొగడలేదు. పరస్త్రీలపై వ్యామోహం పెంచుకొన్నాను గానీ, నిరతం నిన్ను ధ్యానించలేదు. ఇతరుల వ్యవహారాలపై ఆసక్తి చూపాను గానీ, నీ పుణ్యకథా శ్రవణంపై శ్రద్ధ చూపలేదు. వేడ్కతో పాపాన్ని మూటగట్టుకొన్నాను గానీ, ఎక్కువ పుణ్యాన్ని సంపాదించుకోలేదు. ఈ భూమిపై పుట్టినందుకు కొంచమైనా జీవితసార్థకం కానరావట్లేదు. తండ్రీ! కరుణతో కరుణింపుము. కరుణేశ్వరా!

దేహమున్న వఱకు మోహ సాగరమందు

మునుఁగుచుందురు శుద్ధ మూఢజనులు
సలలితైశ్వర్యముల్ శాశ్వతం బనుకొని
షడ్భ్రమలను మానఁజాల రెవరు;
సర్వకాలము మాయ సంసార బద్ధులై
గురుని కారుణ్యంబుఁ గోరుకొనరు;
ఙ్ఞాన భక్తి విరక్తులైన పెద్దలఁ జూచి
నిందఁ జేయక తాము నిలువలేరు;
మత్తులైనట్టి దుర్జాతి మనుజులెల్ల
నిన్నుఁ గనలేరు మొదటికే నీరజాక్ష!.
భూషణవికాస! శ్రీధర్మ పురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర! 

ఓ నరసింహా! ఈ మూఢజనులు దేహమున్నంతవరకు మోహ సాగరాన మునిగి, తమకున్న ఐశ్వర్యాలు శాశ్వతమనుకొని కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే అరిషడ్వర్గాలను జయించలేకున్నారు. ఈ మాయా సంసారంనందు చిక్కి గురువు యొక్క కరుణను పొందలేకున్నారు. జ్ఞానులను, విజ్ఞానులను, భక్తులను, యోగీశ్వరులను చూచి హేళన చేస్తారేగానీ, ఓ నీరజాక్ష! ఐశ్వర్య గర్వమదాంధులై ఈ మూఢజనులు నిన్ను తెలుసుకోలేకున్నారయ్యా!

ఇలలోన నే జన్మ మెత్తినప్పటినుండి

బహు గడించితి నయ్య పాతకములు;
తెలిసి చేసితి గొన్ని, తెలియఁజాలక చేసి!
బాధ నొందితి నయ్య పద్మనాభ!
అనుభవించెడు నప్పు డతి ప్రయాసంబంచుఁ
బ్రజలు చెప్పఁగఁ జాల భయముఁ గలిగె;
నెగిరిపోవుటకునై యే 
యుపాయంబైనఁ
జేసి చూతమటన్నఁ జేతఁగాదు;
సూర్యశశినేత్ర! నీచాటుఁ జొచ్చినాఁడ,
కలుషములు ద్రుంచి నన్నేలు కష్టమనక;
భూషణవికాస! శ్రీధర్మ పురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర! 

ఓ ఇందీవరశ్యామా! పుండరీకాక్షా! ఈ పుడమిపై పడినప్పటినుండి తెలిసో, తెలియకో పెక్కుపాపాలను చేశాను. చాలా వ్యధచెంది ఉన్నాను తండ్రీ! ఓ పద్మనాభా! కష్టాలను భరించటం చాలా కష్టమని ప్రజలు చెప్పగా, కడుభీతినొందాను. కష్టనివారణోపాయం చేతకాకున్నది. సూర్యశశినేత్రా! నీ చెంతకు వచ్చాను. కష్టమనుకోక నా పాపాలు బాపి నన్ను బ్రోవుమో నారసింహా!

ధరణిలోపల నేను తల్లిగర్భమునుండి

పుట్టినప్పటినుండి పుణ్యమెఱుఁగ
నేకాదశీ వ్రతం బెన్నఁడుండఁగ లేదు,
తీర్థయాత్రలకైన దిరుగలేదు,
పారమార్థికమైన పనులు చేయఁగలేదు,
భిక్ష మొక్కనికైనఁ బెట్టలేదు,
ఙ్ఞానవంతుల కైనఁ బూని మ్రొక్కఁగ లేదు,
ఇతర దానములైన నీయలేదు,
నళినదళనేత్ర! నిన్ను నే నమ్మినాను,
చేరి రక్షింపవే నన్ను శీఘ్రముగను;
భూషణవికాస! శ్రీధర్మ పురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర! 

ఓ దుష్టసంహార! నరశింహా! దురితదూర! ఈ ధరణిపై తల్లిగర్భం నుండి పుట్టినది మొదలు పుణ్యం కొంచెమైనా చేయలేదు. ఏకాదశీవ్రత మెన్నడూ చేయలేదు. పోనీ తీర్థయాత్రలనైనా తిరిగానా! అదీలేదు. పుణ్యకార్యాలసలే చేయలేదు. ఒక్కనికైనా భిక్షవేసిన పాపానపోలేదు. జ్ఞానులకు మ్రొక్కలేదు. మరేయితర దానాలీయలేదు. నిన్నే నమ్మాను. నళినదళేక్షా! త్వరగా నన్ను కావుము తండ్రీ!

అడవిపక్షుల కెవ్వఁడాహార మిచ్చెను?

మృగజాతి కెవ్వఁడు మేఁతఁబెట్టె?
వనచరాదులకు భోజన మెవ్వఁడిప్పించెఁ?
జెట్ల కెవ్వఁడు నీళ్ళు చేఁదిపోసె?
స్త్రీలగర్భంబున శిశువు నెవ్వఁడు పెంచె?
ఫణుల కెవ్వఁడు పోసె బఁరగఁబాలు?
మధుపాళి కెవ్వఁడు మకరంద మొనరించె?
బసుల మెవ్వఁ డొసంగెఁ బచ్చిపూరి?
జీవకోట్లను బోషింప నీవెకాని,
వేఱె యొకదాత లేఁడయ్య వెదకిచూడ!
భూషణవికాస! శ్రీధర్మ పురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర! 

ఓ శ్రీహరీ! అడవిలోని పక్షులకెవ్వడాధారమయ్యెనో, మృగజాతికెవ్వడు మేతపెట్టెనో, అడవిలోని పశుపక్ష్యాదులకెవ్వడాహారమిచ్చెనో, చెట్లకెవ్వడు నీళ్ళుపోసి పెంచెనో, స్త్రీల గర్భములోని శిశువులనెవ్వరు పెంచిరో, పాములకెవ్వరు పాలుపోసి పెంచెనో, తుమ్మెద సమూహానికెవ్వరు మకరందమిచ్చెనో, పశువులకు పచ్చగడ్డి పెట్టిపోషించే వాడెవ్వడో, అట్టి జగద్రక్షకుడైన నరశింహమూర్తియే సర్వులకూ దాతగాని, వేరొకడు కాదు గదయ్యా!

పుండరీకాక్ష! నా రెండు కన్నుల నిండ

నిన్నుఁ జూచెడి భాగ్యమెన్నఁడయ్య?
వాసిగా నా మనోవాంఛ దీరెడునట్లు
సొగసుగా నీ రూపు చూపవయ్య,
పాపకర్ముని కంటఁబడక పోవుద మంచుఁ
బరుషమైన ప్రతిజ్ఞఁ బట్టినావె?
వసుధలో బతిత పావనుఁడ వీ వంచు నేఁ
బుణ్యవంతుల నోటఁ బొగడ వింటి,
నేమిటికి విస్తరించె నీ కింత కీర్తి?
ద్రోహినైనను నా కీవు దొరకరాదె?
భూషణవికాస! శ్రీధర్మ పురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర! 

ఓ పుండరీకాక్ష! నా కనులారా నిన్ను చూసే భాగ్యమెప్పుడయ్యా! గొప్పగా నా మనోవాంఛ తీరునట్లు సుందరమైన నీ రూపు చూపించవయ్య! పాపాత్ముని కంటపడరాదని కఠినమైన ప్రతిజ్ఞ పట్టావా? పాపులను బ్రోచే పరమాత్మవు నీవేయని మహాత్ములు తెలపగా విన్నాను. నీకింత ఘనకీర్తి ఎలా అబ్బింది? దుర్మార్గుడైన నేను నిన్ను తెలుసుకోలేకున్నాను తండ్రీ!

పచ్చి చర్మపుఁదిత్తి పసలేదు దేహంబు

లోపల నంతట రోయ రోఁత,
నరముల శల్యముల్ నవరంధ్రములు రక్త
మాంసముల్‌ కండలు మైలతిత్తి,
బలువైన యెండ వానల కోర్వదెంతైనఁ
దాళలే దాఁకలి దాహములకు,
సకల రోగములకు సంస్థానమయియుండు
నిలువ దస్థిరమైన నీటిబుగ్గ
బొందిలో నుండి ప్రాణముల్ పోయినంతఁ
గాటికే కాని కొఱగాదు గవ్వకైన;
భూషణవికాస! శ్రీధర్మ పురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర! 

ఓ నరశింహస్వామీ! ఈ శరీరం పచ్చితోలు సంచి వంటిది. సారం లేని దేహమిది. అంతరంగం అసహ్యమైనది. నరం, ఎముకలు, నవరంధ్రాల తోలుతిత్తి యిది. (కనులు, చెవులు, ముక్కు, నోరు, గుహ్యము, గుదం) రక్తమాంసాలు, కండలతోనున్న మురికి సంచి ఎండవానలకు తట్టుకోలేదు. ఆకలిదప్పులకు తాళలేదు. సకలరోగాల నిలయమీ శరీరం. ఇది స్థిరం కాని నీటి బుగ్గవంటిది. ప్రాణం పోతే, శ్మశానానికేగానీ, మరింకెందుకూ కొఱగాని దేహమిది, కావునా దేవా! బ్రతికున్నంత కాలం, నీపై భక్తి కలుగునట్లు దీవించు తండ్రీ!

నరసింహ! నా తండ్రి నన్నేలు నన్నేలు,

కామితార్థము లిచ్చి కావు కావు,
దైత్యసంహార! చాల దయయుంచు దయయుంచు
దీనపోషక! నీవె దిక్కు దిక్కు,
రత్న భూషితవక్ష! రక్షించు రక్షించు,
భువన రక్షక! నన్నుఁ బ్రోవు బ్రోవు,
మారకోటిసురూప! మన్నించు మన్నించు,
పద్మలోచన! చేయి పట్టు పట్టు,
సుర వినుత! నేను నీచాటు జొచ్చినాను,
నా మొఱాలించి కడతేర్చు నాగశయన!
భూషణవికాస! శ్రీధర్మ పురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర! 

ఓ నరశింహా! నా తండ్రీ! నన్నేలుకో. నా కోరికలను తీర్చి కావుము తండ్రీ! ఓ రాక్షస సంహారీ! నా పై దయచూపు. ఓ దీనపోషక! నీవే నాకు దిక్కు. రత్నాభరణ భూషిత వక్షస్థలం కలవాడా! నన్ను రక్షించు. లోకరక్షకా! నన్ను కాపాడు తండ్రీ! అగణిత సౌందర్యమూర్తి! ఓ నవమన్మథాకారా! నన్ను మన్నించు. ఓ పద్మలోచనుడా! నీ చేయినాకందించి సాయపడు. సురవినుత! నీ చాటున చొచ్చినాను. నా మొరాలించి నన్ను కరుణించవా! కనకభూషణ! భుజంగశయనా!

పక్షివాహన! నేను బ్రతికినన్ని దినాలు

కొండెగాండ్రను గూడి కుమతినైతి
నన్న వస్త్రము లిచ్చి యాదరింపుము నన్నుఁ
గన్నతండ్రివి నీవె కమలనాభ!
మరణ మయ్యెడినాఁడు మమతతో నీయొద్ద
బంట్ల దోలుము ముందు బ్రహ్మజనక!
ఇనజభటావళి యీడిచికొనిపోక
కరుణతో నాయొద్దఁ గావలుంచు;
కొనకు నీ సన్నిధికిఁ బిల్చు కొనియు నీకు
సేవకునిఁ జేసికొనవయ్య శేషశయన!
భూషణవికాస! శ్రీధర్మ పురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర! 

ఓ నరశింహా! పక్షివాహనా! బ్రతికినన్నాళ్ళు చెడ్డవారితో కలిసి, చెడుస్నేహాలు చేసి, దుర్బుద్ధితో దుర్మార్గుడనైనాను. ఓ కమలనాభ! నన్ను కన్నతండ్రివి నీవే. అన్న వస్త్రములిచ్చి ఆదరించు తండ్రీ! ఓ బ్రహ్మపితా! నేను మరణించిన తోడనే ముందుగా నీ భటులు వచ్చునట్లు చూడు తండ్రీ!యమభటులొచ్చి నన్ను యీడ్చుకొని పోకముందే, నీ భటులను దయతో నా వద్ద కావలి ఉంచు కరుణహృదయా! చివరకు నీ సన్నిథికి కొనిపోయి, నన్ను నీ సేవకునిగా చేసుకోవయ్యా! ఓ భుజగశయనా!


Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: