telugudanam.com

      telugudanam.com

   


పద్యం

భావం

శ్రీ సద్గురు పరమాత్మను

వాసిగ సేవించి సుకవివరులకు నతులన్‌
జేసి "హితశతకము"ను నే
వ్రాసెద కనినట్టి లోకపద్ధతి వెలయన్‌. 

శ్రీరంజిల్ల నజస్రం

బారోగ్య సుఖాయురవ్య యానందంబుల్‌
కోరిక తమంత చేరవె?
వారకకృషిచేయు నిపుణు వసుధనుహితుఁడా. 

నేరక యేపని నెఱపఁగ

నూరక తినితిరుగు వ్యర్థ యువవర్గమ్ముల్‌
భారము మోయఁగఁ దనకని
ధారణి వగఁగుములుగాదె! తలపఁగ హితుఁడా. 

విద్దెగడింపక పెద్దల

సుద్దులఁ బెడచెవినిబెట్టి సోమరులగుచున్‌
రద్దిని దిరిగిన యువ లే
ప్రొద్దును దీనత్వబాధఁ బొందరెహితుఁడా. 

పనులను బోషణచేయుట

వసుమతిఁ గృషిచేసి పంట వరలించుటయున్‌
బసలేనివన్న మఱపున
మసలెడి యువమేలుగనునె మహిలో హితుఁడా. 

అనయము స్వేచ్ఛావర్తన

మనుగడ తెరువులఁగనకయ మసలెడియున లెం
దును గొఱగాక యధమగతి
మనవలయుటఁ దెలియరొక్కొ! మహిలోహితుఁడా. 

ధనమును వసతులు పెద్దలు

పనుపఱచి చదువఁబనిచిన పలుగాకులుగా
మొనపునఁ దిరిగెడిమందులు
పెనుదైన్యపు మనుగడను నవియరొక్కొ! హితుడా. 

ఏపాటు పడఁగనేరక

సాపాటుల మేటు లగుచు సంసారములన్‌
లోపింపఁ గుంచుయువలను
బ్రాపించునె? బ్రతుకునందు భద్రము హితుఁడా. 

కలవారికలిమి పంతురు

సులువుగఁ దినవచ్చు నంచు సోమరులగుచున్‌
బలుపోకలఁ జరియించెడి
ములుచల కింతేనిమేలు మొనయునె? హితుఁడా. 

పనులుపాట్లు సేయఁ బ్రాల్మాలి తిరిపాన

బ్రదుకఁగోరి తిరుగు పడుచువాండ్రు
దేశసంపదకును దెవులుగాఁ జెలరేఁగి
హానికరులుగారె? యవనిహితుఁడా. 

దొంగతనముచేసి దోపిడిఁ గావించి

బొంకులాడి మోసపుచ్చి ధనము
గడనసేయఁ దలఁచు కష్టాత్ము లెడయని
వ్యథలఁ గ్రుంగిపోరె! యరయహితుఁడా. 

పెద్దలసుద్దులు వినగా

నద్దిర! మేమల్పులమొకొ? యనుగర్వమునన్‌
హద్దులుగానక తిరిగెడి
గద్దఱిమూకలకు మేలుగల్గునె హితుఁడా. 

నడవడి నలువౌమనుజుని

గడుగొప్పగ నెంత్రుజనులు గారవమారన్‌
నడవడి చెడుగైన నరుని
నెడగిల్లఁ గఁ జూచుచుందు రెల్లరు హితుఁడా. 

ఎక్కడఁజూచినఁ బనులం

జక్కం జేయకయ ధనము సంపాదింపన్‌
మక్కువపెఱిగెను యువలకు
అక్కట! యిదియెట్లు సాధ్యమగునో! హితుఁడా. 

పొలములఁ బనులను నరయక

కలకొలఁదిగుడిచి కృషికుఁడు ఘనతరపదవుల్‌
గలవారి నంటిమెలఁగినఁ
గలుగునె? ఫలమింత యేనిఁ గాంచఁగ హితుఁడా. 

సర్వజ్ఞుల మనుకొని దు

ర్గర్వోద్ధతి నొరులఁ జుల్కఁగాంచెడువారిన్‌
పర్వెఱుఁగని జడులనుచును
సర్వజనుల్‌ రోఁతఁగనరె? సతతము హితుఁడా. 

కలవార మన్నగర్వము

కలవారలు నిర్భయంబు గదురగ స్వార్థం
బెలయింపఁగోరి లోకుల
నలయింపఁ గడంగుచుందు రౌరా! హితుఁడా. 

ధన సుఖ సంపత్తులఁ దా

మనువుగ జీవించుచుండి యన్యులపెనుపు
గనఁజాల కీర్ష్యమిడికెడి
జనులకు దుఃఖంబెఫలము సత్యము హితుఁడా. 

ఊరక యుండెడివారల

నేరంబులమోపి వృథగ నిందించెడు వా
క్శూరుల దుఃఖదవానల
మారఁగ వర్థిల్లుగాదె! యనిశెము హితుఁడా. 

తనకెంతయున్నఁ దనివిం

గన కన్యహితముఁ జెఱుపఁగఁ గడగెడు కుజనున్‌
మనుజాకారపు రక్కసుఁ
డని భయమున జనులెడయరె? యరయగ హితుఁడా. 

పదవిగలప్పుడు గౌరవ

మొదవును నధికారిజనుల, కుచితపునడతన్‌
బొదలు సుమతులకు మన్నన
బ్రదికినయంతకుఁ గదుకొనుఁ బాయక హితుఁడా. 

సప్పమ్ము కాటువేయును

మొప్పమ్మగు తనకను భయము కతమునన్‌, దా
నెప్పుడు ఖలు డన్యజనుల
కొప్పమి ఘటియించునౌర యూరక హితుఁడా. 

నెపముల రువ్వుచు నన్యుల

నపవాదము పాలుచేసి యలయించుటకై
విపరీతచర్య మెలఁగెడు
కపటులు మేలేమిపొందఁగలరొకొ? హితుఁడా. 

తనమేలు గోరుమిత్రుని

యనురూపహితముఁ గొనకయ యస్థిరమతితోఁ
బనివడి తిరిగెడు నరునకు
ననుకూలఫలాప్తి చూడనగునే?హితుఁడా. 

నమ్మిన యజమాను మో

సమ్ముగ నష్టమునఁగుంచు స్వామిద్రోహిన్‌
నమ్మరుగద! జనులెవ్వరు
నిమ్మహి నాహీనుని బ్రదు కేవము హితుఁడా. 

మాటలమార్దవ మొసఁగును

మీటుగధనమును, సుఖమ్ము, మించుయశమ్మున్‌
మాటల పరుసము గూర్చును
గాటపుదైన్యమ్ము, వగపుఁ గలఁకువ హితుఁడా. 

కోపము తాలిమిఁ జెఱచును

కోపమ్మున దుడుకెసఁగును గొడవలు మించున్‌
కోపమ్ము నడచు సుగుడికిఁ
బ్రాపించును శాంతిసుఖము భద్రము హితుఁడా. 

తప్పొదవఁ గప్పిపుచ్చఁగఁ

దప్పులుగావించి మఱియుఁ దడబడుచున్నన్‌
దప్పులు పెక్కగుఁ గావునఁ
దప్పొప్పుకొని సుఖముఁ గనఁదగుగద? హితుఁడా. 

ఎవ్వరికేనియు నాపద

నివ్వటిలన్‌ సాయపడెడి నిర్మలచరితుల్‌
దివ్వెలుగద! జాతితమం
బవ్వలఁద్రోయంగ నవని నరయగ హితుఁడా. 

వచ్చెడి యాయమ్మంతయు

వెచ్చింపుచు నిల్లు నడపు విధమది మీఁదన్‌
బొచ్చెపు జీవికగతితో
నిచ్చలు గష్టంబులంద నిరుకగు హితుఁడా. 


Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: