telugudanam.com

      telugudanam.com

   


పద్యం

భావం

శ్రీ భామినీ మనోహరు

సౌభాగ్య దయా స్వభావు సారసనాభున్
లోఁ భావించెద; నీకున్
వైభవము లొసగుచుండ, వసుధఁ గుమారా! 

ఓ కుమారా! సిరి సంపదలను ఇచ్చే లక్ష్మీదేవి మనసు చూరగొన్నవాడు! సౌభాగ్యాలను దయతో ఇచ్చే స్వభావం గలవాడు, నాభిలో పద్మం గల విష్ణువు, నీకు భూమిపై వైభవాలు ఇస్తుండగా ప్రార్ధిస్తున్నాను.

ఆజ్ఞ యొనర్చెడి వృత్తుల

లో జ్ఞానము గలిగి మెలగు లోకులు మెచ్చన్
బ్రాజ్ఞతను గలిగి యున్నన్
బ్రాజ్ఞులలోఁ బ్రాజ్ఞుఁడవుగ ప్రబలు కుమారా! 

ఓ కుమారా! నిన్ను చేయమని నియమించిన పనులను తెలివితో, లోకంలోని ప్రజలంతా మెచ్చేట్లు చేయాలి. నీ బుద్ధి నైపుణ్యం నీవు ప్రదర్శించడమే కాక, తెలివైన వారిలో నీవు తెలివైన వానిగా, పేరు ఘడిస్తూ అభివృద్ధి చెందు.

అతి బాల్యములో నైనను

బ్రతికూలపు మార్గములఁ బ్రవర్తింపక స
ద్గతి మీర మెలగ నేర్చిన
నతనికి లోకమున సౌఖ్యమగును కుమారా! 

ఓ కుమారా! చిన్నతనంలోనైనా సరే అపమార్గం తొక్కవద్దు. చెడ్డపనులు చేయవద్దు. మంచి పనులే చేయి. మంచి మార్గం అనుసరించేవారు సుఖంగా ఉంటారు.

వృద్ధజన సేవ చేసిన

బుద్ధి విశేషజ్ఞుఁ డనుచు బూత చరితుడున్
సద్ధర్మశాలి యని బుధు
లిద్ధరఁ బొగిడెదరు ప్రేమయెసగఁ కుమారా! 

ఓ కుమారా! పెద్దలను గౌరవించేవారిని, మంచి బుద్ది కలవారనీ, బాగా తెలివి తేటలు గలవారనీ, ధర్మం తెలిసిన వారనీ జనులు ఈ లోకంలో పొగుడుతారు.

పెద్దలు వద్దని చెప్పిన

పద్దుల బోవంగరాదు పరకాంతల నే
పొద్దే నెద బరికించుట
కుపదేశింపగఁ గూడ దుర్వి కుమారా! 

ఓ కుమారా! పెద్దలు వద్దు అని చెప్పిన పనులు చేయవద్దు. ఈ భూమిలో ఇతర స్త్రీలను ఎప్పుడైనా మనసులో తలచవద్దు.

తనపై దయ నుల్కొనఁ గను

గొన నేతెంచినను శీల గురుమతులను వం
దనముగఁ భజింపందగు
మనమలరగ నిదియ విబుధ మతము కుమారా! 

ఓ కుమారా! నువ్వంటే ప్రేమించేవారికి, మంచి ప్రవర్తన గలవారికి నమస్కారం చేయి. అవతలివారు ఆనందించేట్లు, నడుచుకోవడం బుద్దికలవారు చేసే పని.

ఉన్నను లేకున్నను పై

కెన్నడు మర్మంబుఁ దెలుప నేగకుమీ నీ
కన్న తల్లిదండ్రుల యశం
బెన్నఁబడెడు మాడ్కిఁదిరుగు మెలమిఁ గుమారా! 

ఓ కుమారా! నీకు ఉన్నా, లేకున్నా బయటికి తెలియనీకు. ఎప్పుడైనా నీకు రహస్యాలు తెలిస్తే, వాటిని ఇతరులకు చెప్పే ప్రయత్నం చేయకు. నీ కన్న తల్లిదండ్రులకు కీర్తి దశదిశలా వ్యాపించేలా చేయి.

పెద్దలు విచ్చేసినచో

బద్ధకముననైన దుష్ట పద్ధతి నైనన్
హద్దెఱిగి లేవకున్నన్
మొద్దువలెం జూతు రతని ముద్దు కుమారా! 

ఓ కుమారా! పెద్దలు నీ వద్దకు వస్తే, బద్ధకంగా చేతగానీ, చెడు మార్గానగానీ అమర్యాదగా ప్రవర్తించకు. అలా చేస్తే, నిన్ను మూర్ఖునిగా చూస్తారు.

సతతముఁ బ్రాతఃకాలో

చితవిధులను జరుపు మరసి శీఘ్రముగ నహః
పతి పూర్వ పర్వతాగ్రా
గతుడగుటకు మున్నె వెరవు గల్గి కుమారా! 

ఓ కుమారా! ఎల్లప్పుడూ సూర్యోదయానికి ముందే, నిద్రలేచి నీవు చేయవలసిన పనులు వేగంగా, శ్రద్ధతో చేసుకో.

పోషకుల మతముఁ గనుఁగొని

భూషింపగ గాని ముదము బొందరు మఱియున్
దోషముల నెంచు చుండును
దోషివయిన మిగులఁ గీడు దోచుఁ గుమారా! 

ఓ కుమారా! నిన్ను పోషించేవారి ఇష్టం తెలుసుకుని మసలుకో. నీవు ఎంత గౌరవించినా అతడు సంతోషించడు. పైపెచ్చు నీ తప్పులనే వెతుకుతూ ఉంటాడు. నీవు చెడ్డవాడివైతే పలు కష్టాలు కలిగిస్తాడు.

నరవరుడు నమ్మి తను నౌ

కరిలో నుంచునెడ వాని కార్యములందున్
సరిగా మెలంగ నేర్చిన
పురుషుడు లోకమునఁ గీర్తిఁ బొందుఁ గుమారా! 

ఓ కుమారా! రాజు ఎవరిని నమ్మి తన పనులు చేసేందుకు సేవకుని నియమిస్తాడో, ఆ సేవకుడు సరిగ్గా చేయాలి. చేస్తే లోకంలో కీర్తి సంపాదిస్తాడు.

ధనవంతుడె కులవంతుడు

ధనవంతుడె సుందరుండు ధనవంతుండే
ఘనవంతుడు బలవంతుడు
ధనవంతుడె ధీరుడనుచు దలతె? కుమారా! 

ఓ కుమారా! ఈ లోకంలో అందరూ ధనవంతుడు, అన్ని మంచి లక్షణాలు కలవాడుగా భావిస్తారు. సంపద కలవాడుగా, గొప్ప కులంలో జన్మించినవాడుగా అందగాడిగా, బలవంతునిగా, ధైర్యశాలిగా భావిస్తారు.

పనులెన్ని కలిగి యున్నను

దినదినమున విద్య పెంపు ధీయుక్తుడవై
వినగోరుము సత్కథలను;
కని విబుధులు సంతసించు గతినిఁ గుమారా! 

ఓ కుమారా! ఎన్ని పనులు ఉన్నప్పటికీ, ప్రతి దినం జ్ఞానం పెంచుకొనేందుకు, మంచి కథలు విని, తెలుసుకొనే ఆసక్తి చూపితే, బుద్దిమంతులు వారిని చూసి ఆనందిస్తారు.

ధరణీ నాయకు రాణియు

గురు రాణియు నన్నరాణి కులకాంతను గ
న్న రమణి దనుగన్నదియును
ధరనేవురు తల్లులనుచుఁ దలుపు కుమారా! 

ఓ కుమారా! దేశాన్ని పాలించే రాజుగారి భార్య రాణి, గురువుగారి భార్య, అన్నగారి భార్య, తన భార్యను కన్న తల్లి అనగా అత్తగారు, తనను కన్న తల్లి ఈ ఐదుగురినీ తల్లులుగా భావించాలి.

సదమల మతితోఁ బెద్దల

మదికింపుగ మెలగు, నింద మానుము పరులన్
మృదు మార్గములను వదలకు
విదితంబుగ దానఁ గీర్తి వెలయుఁ గుమారా! 

ఓ కుమారా! మంచి బుద్ధి కలిగి పెద్దల మనసుకు, సంతోషం కలిగేట్లు మసలుకోవాలి. మంచి మార్గం విడువరాదు. ఇలా చేస్తే నీకు మంచి కీర్తి లభిస్తుంది.

ఆచార్యున కెదిరింపకు

బ్రోచిన దొర నింద సేయఁ బోకుము కార్యా
లోచనము లొందఁ జేయకు
మాచారము విడవఁ బోకుమయ్య! కుమారా! 

ఓ కుమారా! గురువు మాటకు ఎదురు చెప్పకు. చేరదీసిన వారిని నిందించకు. చేసే పనిపై ఎక్కువ ఆలోచింపకు. మంచి మార్గం వదలిపెట్టకు.

కల్లలగు మాట లాడకు

మెల్లజనంబులకు వేగ హృదయము కడు రం
జిల్లగఁ బల్కుము నీకది
తెల్లము రహిఁగీ ర్తిఁగాంచు దెరగు కుమారా! 

ఓ కుమారా! అబద్దాలు చెప్పకు, అందరూ ఆనందించేలా మాట్లాడు. అది అందరికీ ఆనందమే! మంచి పేరు గడించేందుకు మార్గం.

ఏనాడైనను వినయము

మానకుమీ మత్సరమున మనుజేశులతోఁ
బూనకు మసమ్మతయి బహు
మానమునను బొందు మిదియె మతము కుమారా! 

ఓ కుమారా! ఎప్పుడూ వినయంగా ఉండు. అధికారులతో పట్టుదలకు పోకు. వారికి ఇష్టంలేని పనులు చేయవద్దు. ఇవి పాటించడం సమాజంలో గౌరవం పొందేందుకు మంచి మార్గం.

చేయకుము కాని కార్యము

పాయకుము మఱిన్ శుభం; బవని భోజనమున్
జేయకుము రిపు గృహంబున
గూయకు మొరుమనను నొచ్చుకూత కుమారా! 

ఓ కుమారా! చేయరాని పనులు చేయవద్దు. మంచి పనులను విడువవద్దు. శత్రువుల ఇంట భోజనం చేయవద్దు. ఇతరుల మనసు బాధపడేట్లు మాట్లాడవద్దు.

పిన్నల పెద్దలయెడఁ గడు

మన్ననచే మెలగు సుజన మార్గంబుల నీ
వెన్నికొని తిరుగుచుండిన
నన్ని యెడల నెన్నఁబడదువన్న కుమారా! 

ఓ కుమారా! చిన్నవారైనా, పెద్దవారైనా మర్యాదగా ప్రవర్తించు, అలా చేస్తే మంచివారని పిలుస్తారు. సరిగ్గా నడచుకుంటే లోకంలో కీర్తి గడిస్తారు. అంతా మెచ్చుకుంటారు.

తనకు విద్యాభ్యాసం

బును జేసినవానికన్న బొలుపుగఁ బదిరె
ట్లను దూగు దండ్రి వానికి
జననియుఁ బదిరెట్లుఁదూగు జగతిఁ గుమారా! 

ఓ కుమారా! విద్యాభాసం చేసిన గురువు కంటే, తండ్రి పదింతలు ఎక్కువ. కన్న తల్లి, తండ్రి కంటే పదింతలు ఎక్కువ. ఇది లోకంలో సంగతి.

తమ్ములు తమయన్న యెడ భ

యమ్మును భక్తియును గలిగి యారాధింపన్
దమ్ముల నన్నయు సమ్మో
దమ్మునఁ బ్రేమింపఁ గీర్తి దనరుఁకుమారా! 

ఓ కుమారా! అన్నగారంటే తమ్ముళ్ళకు భక్తి ఉండాలి. అలాగే తమ్ముళ్ళు అంటే అన్న ప్రేమతో ఉండాలి. అప్పుడే వారిద్దరి మధ్య సఖ్యత ఉంటుంది. మంచివారని అనిపించుకుంటారు.

అప్పం దన తల్లిగ మే

లొప్పంగని జరుపవలయు నుర్వీస్థలిఁ జి
న్నప్పుడు చన్నిడి మనిపిన
యప్పడతియు మాతృతుల్యయండ్రు కుమారా! 

ఓ కుమారా! తోబుట్టువులను తల్లి లాగా చూడాలి. ఈ లోకంలో పాలిచ్చి పెంచిన స్త్రీని కూడా తల్లి అంటారు. తల్లికాకున్నా సరే!

బూటకపు వర్తనముఁ గని

జూటరి వీడనుచుఁ దప్పఁ జూతురుగా! యా
బాటను విడి సత్యము మది
బాటించి నటించు వాడె నరుడు కుమారా! 

ఓ కుమారా! కపట మార్గాన పోవద్దు. అబద్దాలు చెప్పేవారిని, మోసగాళ్ళను ఎవరూ నమ్మరు. కనుక చెడు బాటన నడవద్దు. సత్యం మనసులో ఉంచుకుని, నడచుకునేవాడే మనిషి.

ధరణిని పరోపకారా

చరణ వ్రతనిష్ఠనెపుడు సలుపుము నీకా
తెర గుప వాసాదివ్రత
వరకర్మము కంటె మేలు వచ్చు కుమారా! 

ఓ కుమారా! ఈ లోకంలో ఎప్పుడూ నిష్ఠతో ఉపకారమే చేయాలి. ఎందుచేతంటే ఉపవాసాలు, వ్రతాలకంటే ఉపకారం చేస్తే ఎక్కువ ఫలం పొందుతారు.

వగవకు గడచిన దానికి

పొగడకు దుర్మతుల నెపుడు; పొసగని పనికై
యొగి దీనత నొందకుమీ
తగ దైవగతిం బొసంగు ధరను కుమారా! 

ఓ కుమారా! జరిగిన దానికి చింతించకు, చెడ్డవారిని ఎలాంటి పరిస్థితులలో పొగడకు. సాధ్యం కాని పనులు వదిలిపెట్టు. దైవం ఎలా నడిపితే అలాగే జరుగుతుంది.

పని బూని జనులు సంతస

మునఁ దాలిమి సత్యశౌచములను బ్రవర్తిం
చిన యశము నొందుచుందురు
గనుగొను మిదె దొడ్డ నడకఁ గాగ కుమారా! 

ఓ కుమారా! జనులు సంతోషంతో సత్యం వీడక పనిచేస్తే కీర్తి గడిస్తారు. ఇది మంచిపని అని తెలుసుకోవాలి.

సరి వారి లోన నేర్పున

దిరిగెడి వారలకు గాక తెరవాటులలో
సరయుచు మెలగెడి వారికి
పరు వేటికి గీడె యనుభవంబు కుమారా! 

ఓ కుమారా! నీ స్నేహితులు మంచి వారైతే నీకు గౌరవం, దుష్టులైతే నీకు అగౌరవం లభిస్తాయి. ఇది అనుభవం మీద తెలుస్తుంది.

బరులెవ్వరేని దనతో

బరిభాషించినను మేలు పలుక వలయు నా
దరము గల చోటఁ గీడు
న్గరము నొనర్పంగరాదు గదర కుమారా! 

ఓ కుమారా! ఇతరులతో మంచి మాటలనే మాట్లాడాలి. చెడు మాటలు పలుకరాదు. ఆదరం ఉన్నచోట కీడు కలిగేలా చేసుకోరాదు కదా!

సిరి చేర్చు బంధువుల నా

సిరియే శుభముల నొసంగు చెలువుల గూర్చున్
సిరియే గుణవంతుండని
ధరలోఁ బొగడించునంచు దలపు కుమారా! 

ఓ కుమారా! సంపద అనేది బంధువులను పెంచుతుంది. సంపద శుభాలను కలుగజేస్తుంది. సంపద వలన స్నేహితులు పెరుగుతారు. సంపద గల మానవుని గుణవంతునిగా కీర్తిస్తారు.


Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: