telugudanam.com

      telugudanam.com

   


పద్యం

భావం

శ్రీ భూ నీళా హైమవ

తీ భారతు లతుల శుభవతిగ నెన్నుచు న
త్సౌభాగ్యము నీ కొసఁగఁగ
లో భావించెదరు ధర్మలోల కుమారీ! 

ఓ కుమారీ! మంచి నడవడిక కలిగిన లక్ష్మీ, భూదేవి, నీళాదేవీ, హైమావతి, భారతి నీకు సకల శుభాలు కలిగిస్తారు. నిన్ను కాపాడుతారు.

చెప్పెడి బుద్ధులలోపలఁ

దప్పకు మొకటైన సర్వ ధర్మములందున్
మెప్పొంది యిహపరంబులఁ
దప్పింతయు లేక మెలగఁ దగును కుమారీ! 

ఓ కుమారీ! నేను చెప్పే నీతులు సరిగా అనుసరించు. సర్వ ధర్మాలకు న్యాయం చేయి. ఇహపరాలలో నీతిగా జీవించు.

ఆటలఁ బాటలలో నే

మాటయు రాకుండఁ దండ్రి మందిరమందున్
బాటిల్లుఁ గాఁపురములో
వాట మెఱిఁగి బాల! తిరుగ వలయుఁ కుమారీ! 

ఓ కుమారీ! ఆటపాటలలో ఏ విధమైన కఠినవాక్యాలు పలకకుండా, మాటపడకుండా, పుట్టింట్లో ఉండేటప్పుడు తల్లిదండ్రులకు మంచిపేరు తెచ్చే విధంగా నడుచుకోవాలి.

తెచ్చినఁ దేకుండిన నీ

కిచ్చిన నీకున్న మగని నెగ్గాడకు మీ
యెచ్చెము నీపైఁ దేలును
రచ్చల కామాట లెక్కు రవ్వ కుమారీ! 

ఓ కుమారీ! నీ మొగుడు నీకు పెట్టినా, పెట్టకపోయినా, తెచ్చినా, తేకపోయినా, అతనిని దూషించటం చాలా తప్పు. మగని తిట్టడం మగువకు మంచిది కాదు. ఐదవతనం హరిస్తుంది. అందరిలో అపహాస్యంపాలు కాక తప్పదు. కావునా, మొగుణ్ణి తిట్టకుండా ఉండటం మగువ విధి.

పతి పాపపుఁ బనిఁ జెప్పినఁ

బతిమాలి మరల్పవలయుఁ బతి వినకున్నన్
హిత మనుచు నాచరింపుము
మతిలోపల సంశయంబు మాని కుమారీ! 

ఓ కుమారీ! నీ పతి చెప్పిన చెడ్డపనులను వద్దని నెమ్మదిగా ప్రార్థించి, వారించి, ఆ పని మానేలా చేయాలి. నీ పతి వినకపోతే అంతా మన మంచికేనని, సందేహాలను వదిలి పనిని నిర్వర్తించాలి.

తిట్టిన దిట్టక, కొట్టిన

గొట్టక, కోపించెనేనిఁ గోపింపక, నీ
పుట్టినయింటికిఁ, బాదము
పెట్టినయింటికిని వన్నె పెట్టు కుమారీ! 

ఓ కుమారీ! నీ భర్త నిన్ను తిడితే, నువ్వు మరలా తిట్టకూడదు. కొడితే ఎదురు తిరిగి కొట్టకూడదు. ఒకవేళ నీ పై కోపగిస్తే, తిరిగి కోప్పడకు. పుట్టింటికీ, నీ అత్తగారింటికీ కీర్తి వచ్చేట్లు నడుచుకో!

దబ్బరలాడకు కదిమిన

బొబ్బలు పెట్టకుము మంచి బుద్ధిగలిగి యెం
దెబ్బెఱికముఁ బూనక కడుఁ
గొబ్బునఁ జిత్తమున వానిఁ గూర్పు కుమారీ! 

ఓ కుమారీ! అబద్ధాలు చెప్పకు. నీ భర్త కొట్టబోతే కేకలు పెట్టి అల్లరిపాలు కావద్దు. ఏ పనైనా అసహ్యించుకోక మంచిబుద్ధితో వెంటనే ఆయాపనులను నెరవేర్చు.

జపములు, గంగాయాత్రలు,

దపములు, నోములును, దాన ధర్మంబులు, పు
ణ్యపురాణము పతిభక్తికి
నుపమింపను సాటిరాక యుండు కుమారీ! 

ఓ కుమారీ! భార్యకు భర్తే ప్రత్యక్షదైవం కాబట్టి జపతపాలు, గంగా తీర్థయాత్రలు, నోములు, దానధర్మాలు, పుణ్యపురాణకథా శ్రవణాలు, మొదలగు పుణ్యకార్యాలన్నీ నీ భర్త తర్వాతే అని తెలుసుకో. కారణం, నీ భర్త పుణ్యంలో కొంత భాగంకు నువ్వు అర్హు రాలవయ్యావు కాబట్టి జ్ఞానమెరిగి మసలుకో. పతిభక్తి గొప్పదని తెలుసుకో.

ఇరుగు పొరుగిండ్లు కైనను

వరుఁడో, కాకత్తగారొ, వదినెయొ, మామో
మఱఁదియొ సెల విడకుండఁగఁ
దరుణి స్వతంత్రించి పోవఁ దగదు కుమారీ! 

ఓ కుమారీ! యవ్వనవతీ! నీ భర్త, వదిన, మామ, మరుదులు వెళ్ళమని చెప్తేనే తప్ప పొరపాటునైనా పొరుగిండ్లకు పోవద్దు. ఎవరి ఆజ్ఞ లేకుండా నీకు నువ్వే పొరుగిండ్లకు పోవటం పాతివ్రత్య లక్షణం కాదు.

కూతురు చెడుగై యుండిన

మాతది తప్పన్నమాట మది నెఱుగుదుగా
నీ తల్లిదండ్రులకు నప
ఖ్యాతులు రానీయఁ గూడ దమ్మ! కుమారీ! 

ఓ కుమారీ! కూతురు తప్పు చేస్తే తల్లిదే తప్పని నీకు తెలుసుకదా! కాబట్టి నీ కన్న తల్లిదండ్రులకు అపఖ్యాతి తీసుకురావద్దు.

అమ్మకు రెండబ్బకు రెం

డిమ్మహిఁ దిట్టంచు కూఁతు రెందుకు ధర నా
ద్రిమ్మరి పుట్టికపోయిన
నిమ్మళమని యండ్రు జనులు నిజము కుమారీ! 

ఓ కుమారీ! తల్లిదండ్రులను రెండుసార్లు తిట్టించే కూతురెందుకు? అపఖ్యాతి తెచ్చే మాతాపితరులను అపహాస్యం పాలు చేసే కూతురు పుట్టకపోయినా సంతోషమేనని ప్రజలనటం సత్యం.

తన బావల పిల్లల యెడఁ

దన మఱఁదుల పిల్లలందుఁ దనపిల్లల కం
టెను మక్కువ యుండవలెన్
వనితల కటులైన వన్నె వచ్చుఁ కుమారీ! 

ఓ కుమారీ! తన బావల, మరుదుల పిల్లలను, తమకన్న బిడ్డల కంటే ఎక్కువగా చూసుకునే ఆడదానికి కీర్తి వస్తుందనడంలో సందేహం లేదు.

ధనవంతుఁడైన యప్పుడుఁ

పెనిమిటి చిత్తం బెఱింగి పెండ్లాము మెలం
గును లేమి మెలఁగ నేర్చిన
వనితకు లోకమున వన్నె వచ్చుఁ కుమారీ! 

ఓ కుమారీ! భర్త భాగ్యవంతుడైనప్పుడు భార్య, అతని మనసు తెలుసుని నడుచుకోవాలి. ఒకవేళ భాగ్యహీనుడైనా కూడా అతని మనసు తెలిసి నడుచుకుంటే, ఆ స్త్రీ ఇహపరలోకాలలో కీర్తి గడిస్తుంది.

కడుపారఁ గూడుఁ గూరలు

దొడవులు వస్త్రములు మిగుల దొరకవనుచుం దా
వడితనమునఁ బెనిమిటితో
నెడఁబాసి చరింపఁ గూడ దెపుడు కుమారీ! 

ఓ కుమారీ! భర్త వద్ద తన కోరికలు తీరవని, అతని వద్ద పంచభక్ష్యపరమాన్నాలతో కడుపు నిండదని, కావలసిన రంగురంగుల వస్త్రాలు లభించవని, గూడు దొరకదని అనుకుని, తొందరపడి అతనిని వదిలేసి జీవించటం భార్యకు మర్యాద కాదు. సమాజం చిన్నచూపుతో చూస్తుంది.

అత్తపయిన్ మఱఁదలిపయి

నెత్తిన కోపమున బిడ్డ నేడ్పించుటకై
మొత్తినఁ దనకే కీడగుఁ
జిత్తములో దీనిఁజింత సేయు కుమారీ! 

ఓ కుమారీ! అత్త, మరదళ్ళపై వచ్చిన కోపమును బిడ్డలపై చూపిస్తే నష్టపోయేది తానేనని మరువకూడదు. మనసులో ఒకసారి దీనిని గురించి ఆలోచించుకో.

మృతియైనను బ్రతుకైనం

బతితోడనె సతికిఁ జెల్లుఁ బతిబాసిన యా
బ్రతు కొక బ్రతుకా? జీవ
న్మృతి గాక వధూటి కెన్న నిదియుఁ గుమారీ! 

ఓ కుమారీ! పతివ్రతయైన పడతికి తన పతితోనే జీవితమని తెలుసుకో! చావైనా, బ్రతుకైనా తన భర్తతోనే. భర్త విడిచిన ఆడదాని బ్రతుకొక బ్రతుకేనా! ఆ బ్రతుకు బ్రతికినా చచ్చినదానితో సమానమే.

జీవములు భర్తపద రా

జీవములని చిత్తమందుఁ జింతించిన ల
క్ష్మీవల్లభు చరణంబుల
సేవ లతాంగులకు నెమ్మిఁ జేయు గుమారీ! 

ఓ కుమారీ! భర్త పాదాల వద్దే తన జీవితమని తలచిన పతివ్రతలకు, తన పాదసేవాభాగ్యాలను ఆ విష్ణుమూర్తి ప్రేమతో కలుగజేస్తాడు.

తన కెంత మేలు చేసిన

మనమున కింపైన పనులుఁ మసలిన దాసీ
వనితల కెన్నటికైనం
జనవిచ్చి మెలంగరాదు జగతిఁ గుమారీ! 

ఓ కుమారీ! నీ యింటి పనివారు, నీకెంత మేలు చేసినా, నీ మెప్పుపొందాలని నీకెంత ఇష్టమైన పనులు చేసిపెట్టినా, వారితో కొంచెం జాగ్రత్తతో మెలగాలి. వారితో అత్యంత స్నేహం చేసి అమితంగా మోసపోవద్దు.

కులదేవతలకుఁ బెట్టిన

పొలుపునఁ దనయింటియాఁడు బొట్టెల కెల్లం
గలమాత్ర మొసఁగకుండినఁ
గలఁత పొడము దాన మేలు గాదు కుమారీ! 

ఓ కుమారీ! ప్రేమతో నీ ఇష్టదేవతలకు పెట్టినట్లు, నీ ఇంటి ఆడపడుచులకు ఉన్నంతలో పెట్టకపోతే, కలహం వచ్చి, వారి శాపానుగ్రహాలకు పాత్రురాలవవుతావు. వారిని నీ కులదేవతలలాగా అనుకో.

బద్ధకము సంజనిద్దుర

వద్దుసుమీ దద్దిరంబు వచ్చున దాసన్
గద్దింతు రింటివారలు
మొద్దందురు తోడివారు ముద్దు కుమారీ! 

ఓ కుమారీ! బద్ధకంతో సాయంకాలం నిద్రిస్తే మొద్దువని నిందిస్తారు. ఇంటివారు తూలనాడతారు.

వేకువజామున మేల్కని

పైకి వెడలి వచ్చి ప్రాచి పనిఁ దీర్పవలెన్
లేకున్నఁ దెల్లవాఱిన
లోకులు నవ్వుదురు సభల లోనఁ గుమారీ! 

ఓ కుమారీ! తెల్లవారుజామున నిద్ర లేవాలి. ఇంటి పనులు చేసుకోవాలి. అలాకాక పొద్దెక్కిన తరువాత లేస్తే, విన్నవారు నిన్ను చూసి నవ్వుకుంటారు.

తలవాకిట నెల్లప్పుడు

నిలువఁగ రా దెప్పు డెంత నిద్దురయైనన్
మెలఁకువ విడరాదు సుమీ
తల నడచుచు విప్పికొనుట తగదు కుమారీ! 

ఓ కుమారీ! వీధి గుమ్మం ముందు నిలుచోరాదు. మొద్దు నిద్రలో మెలకువగా ఉండాలి. నడిచేప్పుడు తల వెంట్రుకలు విప్పరాదు.

వారికి వీరికిఁ గలిగెను

గోరిన వస్తువులు మాకుఁ గొదవాయె నటం
చూరక గుటకలు మ్రింగుట
నేరముగాఁ దలఁపవలయు నెలఁత కుమారీ! 

ఓ కుమారీ! వారికి వీరికి ఉందని, తనకు లేదని చింతపడరాదు. ఇరుగుపొరుగు వారి యొక్క భాగ్యమును చూసి ఈర్ష్యపడరాదు. సంతృప్తిని అలవర్చుకోవాలి. తనకున్న దానితో తృప్తిపడటం చాలా ఉత్తమం. కోరికలతో చింతపడటం చాలా తప్పు.

నడకలలో నడుగుల చ

ప్పుడు వినఁబడకుండవలయును భువి గుంటలు క
న్పడరాదు మడమనొక్కులఁ
బడఁతుల మర్యాద లెఱిఁగి బ్రతుకు కుమారీ! 

ఓ కుమారీ! నీ అడుగుల చప్పుడు వినబడకుండా నడవాలి. నీ కాలి మడమల గుర్తులు పడకుండా నడవాలి. స్త్రీల సద్గుణాలు తెలుసుకుని జీవించు.

నవ్వంగ రాదు పలుమఱు

నవ్వినఁ జిఱునవ్వుగాని నగరా దెపుడున్
గవ్వలవలె దంతంబులు
జివ్వునఁ గానంగఁ బడెడి జాడఁ గుమారీ! 

ఓ కుమారీ! పలుమార్లు నవ్వరాదు, నవ్వితే చిరునవ్వు మాత్రం చాలు, పళ్లన్నీ కనిపించే విధంగా ఫకాలున నవ్వరాదు.

నోరెత్తి మాటలాడకు

మాఱాడకు కోపపడిన మర్యాదలలో
గోరంత తప్పి తిరుగకు
మీరకుమీ యత్తపనుల మెలఁగు కుమారీ! 

ఓ కుమారీ! ఎవరితోనైనా బిగ్గరగా మాట్లాడకు. ఇతరులు కోపగిస్తే, ఏమీ అనకు. పెద్దలు చెప్పిన పనులు శ్రద్ధగా చేయి.

తల్లిదండ్రు లన్నదమ్ములు

తులఁ దూగఁగ నిమ్ము పసిడిఁ తోనైనను వా
రలయింట సతత ముండుట
వెలఁదికి మర్యాదగాదు వినవె కుమారీ! 

ఓ కుమారీ! తల్లిదంద్రులు, అన్నదమ్ములు, బంగారంతో తులతూగేవారైనా, వారి ఇంట ఎక్కువ కాలం ఉండవద్దు. ఇది ఇల్లాలికి మంచిది కాదు.

పోకిళ్ళు పోక పొందిక

నాకులలోఁ బిందెరీతి నడఁకువగా నెం
తో కలసిమెలసి యుండిన
లోకములోపలను దా వెలుంగుఁ గుమారీ! 

ఓ కుమారీ! ఎచ్చులకు పోకుండా, ఆకు చాటు పిందెలా అణుకువతో ఉండాలి. అందరితో కలిసి ఉంటే లోకంలో మంచి పేరు వస్తుంది.

కడుఁ బెద్దమూటఁ దెచ్చినఁ

జెడుగై వర్తించెనేని జిరతర చింతం
బడుదురు తలిదండ్రులు తో
బడుచులు సోదరులు నింద బడుదురు కుమారీ! 

ఓ కుమారీ! అత్తవారింటికి నీవు ఎంత పెద్ద మూటతో వచ్చినా, చెడు మార్గంలో ప్రవర్తిస్తే, నీ తల్లిదండ్రులు, సోదరులు సంతోషించరు. అది నీకు చెడ్డపేరు తెస్తుంది. నీ ఆత్మీయులు నిందలపాలవుతారు.

కొన్నాళ్ళు సుఖము కష్టము

కొన్నాళ్ళు భుజింపకున్న గొఱగాదు సుమీ
పున్నమ దినముల వెన్నెల
యెన్నంగ సమాసలందు నిరులు కుమారీ! 

ఓ కుమారీ! కొన్నాళ్లు సుఖం, కొన్నాళ్లు కష్టం ఏవిధముగా అంటే - పౌర్ణమి రోజులలో వెన్నెల, అమావాస్య రోజులలో చీకటి లాగా ఉంటుంది. లేని దినాలలో కష్టంగా భావించక, ఓర్పుతో ఉంటే సుఖం కలుగుతుంది.


Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: