telugudanam.com

      telugudanam.com

   


పద్యం

భావం

మసకొని రేంగుబండ్లుకును మౌక్తికముల్ వెలవోసినట్లుదు

ర్వ్యసనముజెంది కావ్యము దురాత్ములకిచ్చితిమోస మయ్యె నా
రసనకుఁ బూతవృత్తిసుక రంబుగ జేకురునట్లు వాక్సుధా
రసములుచిల్క బద్యుముఖ రంగమునందునటింప వయ్యసం
తసము జెంది భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ! 

రేగుపండ్లను ముత్యాలుపోసి కొనినట్లు, దురాశతో మోసపోయి నా కావ్యాలను దుర్మార్గులకిచ్చాను; నా నాల్కకు పవిత్రత సులభంగా కలిగేలా, పలుకుతేనియలు చిల్కునట్లు నా పద్యం, ముఖమను నాట్యరంగమందు సంతోషంతో నీవు నటించు.

భండన భీముఁడార్తజన బాంధవుఁ డుజ్జ్వల బాణతూణకో

దండకళా ప్రచండ భుజ తాండవకీర్తికి రామమూర్తికిన్
రెండవసాటి దై వమిఁక లేఁడనుచున్ గడగట్టి భేరికా
దాండదదాండ దాండ నినదంబుల జాండమునిండ మత్త వే
దండము నెక్కి చాటెదను దాశరథీ! కరుణాపయోనిధీ! 

యుద్ధంలో భయంకరుడు, దుఃఖితులకు చుట్టం, ధనుర్విద్యలో, భుజబలంలో పేరు గన్న రాముని వంటి దేవుడింకొకడు లేడు. ఈ విషయం నేను లోకానికి చాటుతాను.

నీ సహజంబు సాత్త్వికము, నీవిడిపట్టు సుధాపయోధి, ప

ద్మాసనుఁడాత్మజుండు, గమలాలయ నీ ప్రియురాలు, నీకు సిం
హాసనమిద్ధరిత్రి గొడు గాకస మక్షులు చంద్రభాస్కరుల్
నీ సుమతల్ప మాదిఫణి నీవెసమస్తము గొల్చునట్టి నీ
దాసుల భాగ్యమెట్టిదయ దాశరథీ! కరుణాపయోనిధీ!! 

స్వాతికం నీకు సహజం. పాలసముద్రం నీకు విడిది స్థలం. బ్రహ్మ నీ కొడుకు. లక్ష్మీదేవి నీ భార్య. భూమి నీ సింహాసనం, ఆకాశం గొడుగు. సూర్యచంద్రులు నీ కన్నులు. శేషుడు నీకు పూలపాన్పు. ప్రపంచమంతా నీవే. అట్టి నిన్ను కొల్చేవారి భాగ్యమెట్టిదో కదా?

సలలిత రామనామ జపసార మెఱుంగను, గాశికాపురీ

నిలయుఁడగాను, మీచరణ నీరజరేణు మహా ప్రభావముం
దెలియ నహల్యగాను, జగతీవర! నీదగు సత్యవాక్యముల్‌
దలఁపగ రావణాసురుని తమ్ముఁడగాను, భవద్విలాసముల్
దలఁచి నుతింప నాతరమె దాశరథీ! కరుణాపయోనిధీ! 

అతి సున్నితమైన నీ నామజపమందలి లోతు, తెలుసుకునేందుకు కాశీలో ఉండేవాడను కాను. నీ పాద ధూళి ఘనత తెలుసుకునేందుకు అహల్యను కాను. సత్య సంధత తెలుసుకునేందుకు విభీషణుడను కాదు. నీ లీలలు పొగడడం నా శక్తికి మించిన పని.

ఇతఁడు దురాత్ముఁడంచు జనులెన్నఁగ నాఱఁడిఁ గొంటి నేనెపో

పతితుఁడ నంటినో, పతిత పావనమూర్తివి నీవుగల్గ నే
నితరుల వేఁడనంటి నిహ మిచ్చిన నిమ్ము, పరం బొసంగుమీ
యతులిత రామనామ మధు రాక్షరపాళి నిరంతరంబు హృ
ద్గతమని నమ్మి కొల్చెదను దాశరథీ! కరుణాపయోనిధీ! 

నేను పెద్ద పాపాత్మునిగా ప్రజలచే నిందలుపొంది ఉండడం చేత, పాపులను రక్షించే నిన్ను తప్ప అన్యులను సేవించలేను. ఇహమిచ్చినా, పరమిచ్చినా నీ ఇష్టం. నేను మాత్రం నీ నామాన్నే నిత్యం మనసులో స్మరించుకుంటాను.

వాసవ రాజ్యభోగ సుఖ వార్ధిని దేలు ప్రభుత్వమబ్బినా

యాసకుమేర లేదు కనకాద్రిసమాన ధనంబుగూర్చినం
గాసును వెంటరాదు కని కానక చేసిన పుణ్యపాపముల్
వీసరబోవ నీవు పదివేలకు జాలు భవంబునొల్ల నీ
దాసునిగాగ నేలుకొను దాశరథీ! కరుణాపయోనిధీ! 

స్వర్గాధిపత్యం వంటి ప్రభుత్వ మబ్బినప్పటికీ, నా ఆశకు తుది ఉండదు. బంగారు కొండంతటి ధనమబ్బినా, కాస్తైనా వెంటరాదు. తెలిసీ తెలియక చేసిన పుణ్యపాపాలు వదలవు. కావున పుట్టుక కోరను రక్షించు.

ఎక్కడి తల్లిదండ్రి సుతులెక్కడి వారు కళత్ర బాంధవం

బెక్కడ జీవుఁడెట్టి తను వెత్తిన బుట్టును బోవుచున్న వా
డొక్కడెపాప పుణయ ఫల మొందిన నొక్కడె కానరాడువే
ఱొక్కడు వెంటనంటిభవ మొల్లనయాకృప జూడువయ్యనీ
టక్కరి మాయలందిడక దాశరథీ! కరుణాపయోనిధీ! 

తల్లిదండ్రు లెక్కడ? కొడుకు లెక్కడివారు? భార్య చుట్టాలెక్కడ? జీవుడెట్టి దేహమును ధరించి పుట్టబోతున్నాడు? పాపపుణ్యాలు పొందటానికి తానొక్కడే కానీ, యితరుడెవ్వడూ కానరాడు. ఏదైనా వెంట నంటదు కాన పుట్టుక లేకుండా చేసి నన్ను కాపాడు.

శ్రీ రఘురామ! చారుతుల-సీతాదళధామ శమక్షమాది శృం

గార గుణాభిరామ! త్రిజ-గన్నుత శౌర్య రమాలలామ దు
ర్వార కబంధరాక్షస వి-రామ! జగజ్జన కల్మషార్నవో
త్తారకనామ! భద్రగిరి-దాశరధీ కరుణాపయోనిధీ! 

రఘువంశాన పుట్టినవాడవు, సొంపైన తులసీదళాలను మాలగా ధరించినవాడవు, శాంతి, సహనం మొదలగు గుణాలు కలవాడవు, ముల్లోకాలు పొగడదగిన పరాక్రమలక్ష్మికి ఆభరణమైనవాడా! వారింపనలవికాని కబంధుడను రాక్షసుని సంహరించినవాడా! జనుల పాపాలను సముద్రమును దాటించు నామము గలవాడా! భద్రాచలంలో వెలసిన దయాసముద్రుడవైన, ఓ దశరథ కుమారా! శ్రీరామా!

రామ! విశాల విక్రమ పరాజిత భార్గవరామ! సద్గుణ

స్తోమ! పరాంగనా విముఖ సువ్రతకామ! వినీల నీరద
శ్యామ! కకుత్థ్సవంశ కలశాంబుధిసోమ సురారిదోర్బలో
ద్దామ విరామ! భద్రగిరి! దాశరథీ కరుణాపయోనిధీ! 

జనులను సంతోషింపజేయువాడవు, పరశురాముని జయించినవాడవు, పరస్త్రీలయందాసక్తి లేనివాడవు, నల్లని మేఘమువంటి శరీర కాంతిగలవాడవు, కకుత్థ్స వంశంలో జన్మించినవాడవు, సముద్రమునకు చంద్రునివంటి వాడవు, రాక్షసులను సంహరించినవాడవైన భద్రాచల రామా!

అగణిత సత్యభాష, శరణాగత పోష, దయాలసజ్ఝరీ

విగత సమస్తదోష, పృథివీసురతోష, త్రిలోక పూతకృ
ద్గగ నధునీమరంద పద కంజవిశేష, మణిప్రభా ధగ
ద్ధగిత విభూష, భద్రగిరి! దాశరథీ కరుణాపయోనిధీ! 

సత్యం మాట్లాడేవాడవు, శరణన్న వారిని రక్షించేవాడవు, దయతో పాపాలు పోగొట్టేవాడవు, బ్రాహ్మణులను సంతోషింపజేసేవాడవు, గంగానది పుట్టిన పాదపద్మాలు గలవాడవు, మణులతో నిగ నిగ మెరిసే సొమ్ములు గలవాడవు. భద్రాచల రామా!

రంగదరాతి భంగ, ఖగరాజ తురంగ, విపత్పరంపరో

త్తుంగ, తమః పతంగ, పరితోషితరంగ, దయాంతరంగ, స
త్సంగ, ధరాత్మజాహృదయ సారసభృంగ, నిశాచరాబ్జమా
తంగ, శుభాంగ, భద్రగిరి! దాశరథీ కరుణాపయోనిథీ! 

శత్రువులను సంహరించినవాడవు, గరుత్మంతుడు వాహనంగా గలవాడవు, ఆపదలను పోగొట్టేవాడవు, రంగనాధునిచే సేవించబడినవాడవు, దయకలిగిన మనస్సుగలవాడవు, సత్సంగుడవు, సీతాహృదయమనే పద్మానికి తుమ్మెదవంటివాడవు, రాక్షసులకు బీభత్సకరుడవు, శుభాంగుడవైన భద్రాచల రామా!

శ్రీద, సనందనాది ముని సేవిత పాద దిగంత కీర్తి సం

పాద, సమస్తభూత పరిపాల వినోద విషాద వల్లికా
చ్ఛేద, ధరాధినాథకుల సింధు సుథామయపాద, నృత్యగీ
తాది వినోద, భద్రగిరి! దాశరథీ కరుణాపయోనిధీ! 

సంపదలనిచ్చేవాడవు, మునులచే పూజింపబడినవాడవు, కీర్తిమంతుడవు, అన్ని భూతములను పాలించువాడవు, దుఖాఃలను పోగొట్టేవాడవు, క్షత్రియ కులంలో చంద్రుడవు, నృత్యము, గానము వేడుకగా గలవాడవు, భద్రాచల రామా!

ఆర్యుల కెల్ల మ్రొక్కి, వినతాంగుఁడనై, రఘునాథభట్ట రా

చార్యుల కంజలెత్తి, కవి సత్తములన్ వినుతించి, కార్య సౌ
కర్య మెలర్ప, నొక్కశతకం బొనగూర్చి రచింతునేఁడు తా
త్పర్యమునన్ గ్రహింపుమిది, దాశరథీ కరుణాపయోనిధీ! 

పెద్దలకందరికీ మ్రొక్కి, వంచిన శరీరము గలవాడనై గురువైన రఘునాథభట్టుకు నమస్కరించి, కవిశ్రేష్ఠులను పొగడి, కార్య లాభమునకై ఒక శతకాన్ని వ్రాస్తున్నాను. దీనిని ఇష్టంతో గైకొనుము. భద్రాచల రామా!

శ్రీరమణీయ హార! యతసీ కుసుమాభశరీర! భక్త మం

దార! వికారదూర! పరతత్త్వవిహార! త్రిలోక చేతనో
ద్ధార! దురంత పాతక వితాన విదూర! ఖరాదిదైత్య కాం
తార కుఠార! భద్రగిరి! దాశరథీ కరుణాపయోనిధీ! 

హారాలు గలవాడవు, అవిసెపూవువంటి శరీరకాంతి గలవాడవు, భక్తులకు కల్పవృక్షానివి, వికారాలు లేనివాడవు, దేవతాతత్త్వమందు విహరించువాడవు, మూడులోకాలలో గల ప్రాణులను పోషించేవాడవు, పాపాలను పోగొట్టేవాడవు, ఖరాది రాక్షసారణ్యమునకు గొడ్డలివంటి వాడవు, భద్రాచల రామా!

దురితలతాలవిత్ర, ఖర దూషణకానన వీతిహోత్ర! భూ

భరణకళా విచిత్ర! భవబంధ విమోచనసూత్ర! చారువి
స్ఫుర దరవిందనేత్ర! ఘన పుణ్యచరిత్ర! వినీలభూరికం
ధరసమగాత్ర! భద్రగిరి! దాశరథీ కరుణాపయోనిధీ! 

పాపమను తీగలకు కొడవలివంటివాడవు, ఖరదూషణాదులనే అడవికి అగ్నివంటివాడవు, భూమిని రక్షించటంలో విచిత్రుడవు, పుట్టుక అనే ముడిని విడదీయటమే విధిగాగలవాడవు, ప్రకాశించు పద్మాలవంటి నేత్రాలుగలవాడవు, పుణ్యచరిత్రుడవు, మేఘకాంతి వంటి శరీరకాంతి గలవాడవు.

కనకవిశాలచేల భవకానన శాతకుఠారధార స

జ్జనపరిపాలశీల దివిజస్తుత సద్గుణ కాండకాండ సం
జనిత పరాక్రమక్రమ విశారద శారద కందకుంద చం
దన ఘనసార సారయశ దాశరథీ కరుణాపయోనిధీ! 

బంగారు మయమైన వస్త్రములు గలవాడవు, సంసారమను నడవికి గొడ్డలి మొనవంటివాడవు, సజ్జనుల పరిపాలించెడివాడవు, దేవతలచే బొగడబడినవాడవు, మంచి గుణములు గలవాడవు, బాణవిద్యలో బండితుండవు, శరత్కాలపు మేఘము, మొల్లలు, గంధము పచ్చ కర్పూరము వంటి నిగ్గైన కీర్తిగలవాడవు.

శ్రీ రఘువంశ తోయధికి శీతమయూఖుడవైన నీ పవి

త్రోరు పదాబ్జముల్, వికసితోత్పల చంపక వృత్తమాధురీ
పూరితవాక్ప్ర సూనములఁబూజ లొనర్చెదఁ జిత్తగింపు మీ
తారకనామ భద్రగిరి! దాశరథీ కరుణాపయోనిధీ! 

రఘువంశానికి చంద్రునివంటివాడవు, అట్టి నీ చరణాలను ఉత్పలము, చంపకము మొదలగు పద్యవృత్తాలనే పూలచే పూజిస్తాను. నా పూజలను గైకొనుము.

గురుతరమైన కావ్యరస గుంభన కబ్బుర మంది ముష్కరుల్

సరసులమాడ్కి సంతసిల జాలరదెట్లు శశాంక చంద్రికాం
కురముల కిందు కాంతమణి కోటి స్రవించిన భంగి వింధ్యభూ
ధరమున జాఱునే శిలలు దాశరథీ! కరుణాపయోనిధీ! 

మూఢులు గ్రంథాలలోని రసంయొక్క కూర్పునకు రసికుల వలె సంతోషింపజాలరు. ఎట్లనగా చంద్రుని వెన్నెలకు చంద్రకాంత శిలలు కరిగి జారునట్లు, వింధ్యపర్వతంపై ఉండే రాళ్ళు జారవు.

తరణికులేశ నానుడులఁ దప్పులు గల్గిన నీదునామ స

ద్విరచిత మైన కావ్యము పవిత్రముగాదె! వియన్నదీ జలం
బరుగుచు వంకయైన, మలి నాకృతిఁ బాఱిన దన్మహత్వముం
దరమె గణింప నెవ్వరికి! దాశరథీ! కరుణాపయోనిధీ! 

నా మాటలలో తప్పులున్నా, నీ పేరుతో వ్రాయబడు కావ్యం పవిత్రమైనదే, ఎట్లనగా గంగానది నీరు వంకరగా పారినా, మురికిగా మారినా దాని గొప్పతన మెక్కడ పోవును?

దారుణ పాతకాబ్ధికి సదా బడబాగ్ని, భవాకులార్తి వి

స్తార దవానలార్చికి సుధారసవృష్టి, దురంత దుర్మతా
చార భయంకరాటవికిఁ జండకఠోర కుఠారధార నీ
తారకనామ మెన్నుకొన, దాశరథీ! కరుణాపయోనిధీ! 

నీ పేరు పాపమను సముద్రంకు బడబాగ్ని వంటిది, సంసారమను కార్చిచ్చుకు అమృతపు వాన, దుర్మతాచారములకు గొడ్డలి మొన వంటిది.

హరునకు నవ్విభీషణున కద్రిజకుం దిరుమంత్రరాజమై,

కరికి నహల్యకు ద్రుపదకన్యకు నార్తిహరించుచుట్టమై,
పరగినయట్టి నీ పతితపావననామము జిహ్వపై నిరం
తరము నటింపఁజేయుఁమిక దాశరథీ! కరుణాపయోనిధీ! 

నీ నామం ఈశ్వరునకు, విభీషణునకు, పార్వతికిని శ్రేష్ఠమగు మంత్రమైనది. అట్టి పరమ పవిత్రమైన నీ నామం, నా నాలుక మీద ఎప్పుడూ ఆడేలా చేయి.

ముప్పున గాలకింకరులు ముంగిట వచ్చినవేళ, రోగముల్

గొప్పరమైనచోఁ గఫము కుత్తుక నిండినవేళ, బాంధవుల్
గప్పినవేళ, మీస్మరణ గల్గునొ గల్గదొ! నాఁటికిప్పుడే
తప్పకచేతు మీ భజన దాశరథీ! కరుణాపయోనిధీ! 

ముసలితనంలో యమభటులు వాకిట ముందుకు వచ్చిఉండగా, రోగమెక్కువై కఫం గొంతులో నిండినప్పుడు, బంధువులు చుట్టుకొన్నప్పుడు, మిమ్ము తలుస్తానో, తలువలేనో, భజిస్తానో, భజించలేనో కాబట్టి యిప్పుడే ఆ పని నెరవేరుస్తాను.

పరమదయానిధే, పతితపావననామ హరే యటంచు సు

స్ధిరమతులై సదా భజనసేయు మహాత్ముల పాదధూళి నా
శిరమునఁదాల్తు, 'మీరటకు జేరకు'డంచు యముండు కింకరో
త్కరముల కానఁబెట్టునఁట దాశరథీ! కరుణాపయోనిధీ! 

దయకు సముద్రంవంటివాడవు, పాపులనుద్ధరించు పేరుగలవాడవు. హరీ అని నిలకడగల బుధ్ధితో కొలుచు మహాత్ముల కాళ్ళ దుమ్ము నా నెత్తిపై దాల్తును. అప్పుడు యముడు తన భటులను నా జోలికి పోవద్దని ఆజ్ఞాపిస్తాడు.

అజునకు తండ్రివయ్యు సనకాదులకున్‌, బరత త్త్వమయ్యు స

ద్ద్విజ మునికోటికెల్లఁ బరదేవతవయ్యు, దినేశ వంశ భూ
భుజులకు మేటివయ్యు బరిపూర్ణుడవై వెలిగొందు పక్షిరా
డ్ధ్వజ మిముఁ బ్రస్తుతించెదను, దాశరథీ! కరుణాపయోనిధీ! 

బ్రహ్మకు తండ్రివి, సనకాదులకు పరతత్త్వంవు, బ్రాహ్మణులకు, ఋషులకు ముఖ్య దేవుడవు, సూర్యవంశపు రాజులలో అధికుడవు, అట్టి నిన్ను పొగడెదను.

పండిత రక్షకుం డఖిల పాప విమొచనుఁ, డబ్జసంభవా

ఖండల పూజితుండు, దశకంఠ విలుంఠన చండకాండ కో
దండ కళా ప్రవీణు డవు, తావకకీర్తి వధూటికిత్తుఁ బూ
దండలుగాఁగ నా కవిత, దాశరథీ! కరుణాపయోనిధీ! 

పండిత రక్షకుడు, పాపాలను పోగొట్టేవాడు, బ్రహ్మేంద్రాదులతో పూజించబడినవాడు, రావణాసురుని సంహరించినవాడు అను నీ కీర్తి కన్యకు నా కవిత్వాన్ని పూదండలాగా ఇస్తాను.

శ్రీ రమ సీతగాఁగ, నిజ సేవకబృందము వీరవైష్ణవా

చారజనంబుగాఁగ విరజానది గౌతమిగా వికుంఠ ము
న్నారయ భద్రశైల శిఖరాగ్రముగాఁగ వసించు చేతనో
ద్ధారకుడైన విష్ణుడవు, దాశరథీ! కరుణాపయోనిధీ! 

లక్ష్మీదేవి సీత, సేవకులు వైష్ణవజనులు, విరజానది, గోదావరి, వైకుంఠం, భద్రాచలం కాగా ప్రాణులను ఉధ్ధరించే విష్ణువు నీవు.

కంటి నదీతటంబుఁ, బొడగంటిని భద్రనగాధివాసమున్,

గంటి నిలాతనూజ,నురు కార్ముక మార్గణ శంఖచక్రముల్
గంటిని, మిమ్ము లక్ష్మణునిఁ గంటి, కృతార్థుఁడనైతి నో జగ
త్కంటక దైత్యనిర్ధళన, దాశరథీ! కరుణాపయోనిధీ! 

నది ఒడ్డున భద్రాచలం నందుండటం చూశాను, సీతను చూశాను, గొప్పవైన ధనుస్సును, బాణములను, శంఖచక్రములను చూశాను, మిమ్ము, లక్ష్మణుని చూసి కృతార్ధుడనయ్యాను.

హలికునకున్ హలాగ్రమున నర్థము సేకురుభంగి, దప్పిచే

నలమటఁజెందువానికి సురాపగలో జలమబ్బినట్లు, దు
ర్మలిన మనోవికారియగు మర్త్యుని నన్నొడఁగూర్చి నీపయిం
దలపు ఘటింప జేసితివి దాశరథీ! కరుణాపయోనిధీ! 

రైతుకు నాగేటి చివర ధనమిచ్చినట్లు, దాహంతో బాధపడేవానికి గంగానదీజల మబ్బినట్లు, చెడు మనస్సు గల నాకు నీపై భక్తి కలుగునట్లు చేశావు.

కొంజక, తర్కవాదమును గుద్దలిచేఁ బరతత్త్వభూస్థలిన్

రంజిలఁద్రవ్వ, కన్గొనని రామనిధానము నేఁడు భక్తి సి
ద్ధాంజనమందు హస్తగతమయ్యె భళీయనంగ మదీయహృ
త్కంజమునన్ వసింపుమిఁక, దాశరథీ! కరుణాపయోనిధీ! 

తర్కవాదంతోనైనా కనుగొనలేని రాముడను నిధి, భక్తియను బైరాగుల కాటుకతో నందఱు చేజిక్కిన దయ్యెను. ఇంక నా మనస్సులో స్థావరంగా నిలువుము.

రాముఁడు ఘోరపాతక విరాముఁడు, సద్గుణకల్పవల్లి కా

రాముఁడు, షడ్వికారజయరాముఁడు, సాధుజనావనవ్రతో
ద్దాముఁడు రాముడే పరమ దైవము మాకని మీయడుంగు గెం
దామర లే భజించెదను, దాశరథీ! కరుణాపయోనిధీ! 

పాపాలను పోగొట్టువాడు, మంచిగుణాలు అను కల్పవృక్షపు తీగెలకు దోటవంటివాడు, వికారాలను జయించినవాడు, మంచివారిని రక్షించువాడు అయిన రాముడే, ముఖ్య దేవుడుగా నీ అడుగులను పద్మాలతో కొల్చెదను.


Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: