telugudanam.com

      telugudanam.com

   


పద్యం

భావం

నమామి నారాయణ పాద పంకజం

వదామి నారాయణ నామనిర్మలం
భజామి నారాయణ తత్త్వమవ్యయం
కరోమి నారాయణ పూజనం సదా 

ఆది పురుషుడైన నారాయణుని పాదపద్మములకు మ్రొక్కుచున్నాను. నిర్మలమైన ఆ నారాయణుని నామమును పలుకుచున్నాను. నారాయణుని సత్యమైన తత్త్వమును సేవించుచున్నాను. ఎల్లప్పుడును నారాయణుని పూజచేయుదును.

ఆలోక్య సర్వ శాస్త్రాణి

విచార్యచ పునః పునః
ఇమమేకం సునిష్పన్నం
ధ్యాయేన్నారాయణం సదా 

సర్వ శాస్త్రములను చదివి, మరల మరల చక్కగా విమర్శ చేసి, పరమాత్మ స్వరూపుడుగా గోచరించిన పరమపురుషుడైన నారాయణుని ధ్యానించెదను.

శ్రీ రమా హృదయేశ్వరా!

భక్త జన చిత్త జలరుహ భాస్కరా
కారుణ్య రత్నాకరా!
నీవె గతి కావవే నారాయణా 

లక్ష్మీదేవి మనస్సునాకర్షించినవాడా! భక్తజనుల మనస్సులనెడి తామరపూలను వికసింపజేయు సూర్యునివంటివాడా! దయకు సముద్రమంతటివాడా! నారాయణా! మాకు నీవే దిక్కు కావలెను.

పాప కర్మములఁ జేసి

నరక కూపములఁ బడజాల నిఁకను
నీపాద భక్తి యొసఁగి
యొక్క దరిఁ జూపవె నారాయణా 

నారాయణా! ఇంతవరకేమోగాని, ఇకమీద పాప కర్మములు చేసి నరకమనే నూతిలో పడి దుఃఖము అనుభవించలేను, నీ పాదములందు భక్తినిచ్చి నన్నొక ఒడ్డునకు చేర్చుము.

దాన ధర్మములఁ జేయ

నేర, నీ దాసులను బొగడ నేర
నా నేరములఁ దలఁపక
దయ చేసి నన్నేలు నారాయణా 

నారాయణా! నేను పూర్వము దానధర్మములు చేయక పోయితిని. నీ భక్తులను పొగడలేక పోయితిని. నా నేరములను మనసులో పెట్టుకొనక నన్ను రక్షింపుము.

ఆన యించుక లేకను

దుర్భాషలాడు నా జిహ్వ యందు
నీ నామ చతురక్షరిని
దృఢముగా నిలుప వలె నారాయణ 

నారాయణా! అదుపు - ఆజ్ఞలు లేక అనరాని మాటలు పలుకు నా నాలుక మీద నీ చతురాక్షరిని (నారాయణ అను నామమును) స్థిరముగా నిలుపుము.

ఒకట పరిశుద్ధి లేక

నా జన్మ మకట! వ్యర్థం బాయెను
అకలంక మగు మార్గముం
జూపవే సకలేశ! నారాయణా 

నారాయణా! మనస్సునందు పరిశుద్ధత లేకపోవుట చేత నా మానవ జన్మ వ్యర్ధమైపోయినది. నాకు నిర్మలమైన మార్గమును చూపింపుము.

వేగి లేచినది మొదలు

సంసార సాగరంబున నీఁదుచు
మీ గుణము నొక వేళను
దలఁపగదె మేలనుచు నారాయణ 

నారాయణా! తెల్లవారిలేచినది మొదలు ఈ నిస్సారమైన సంసార సాగరములో పడి ఈదులాడుచు, ఒక్కసారైనను మీ గుణములను కీర్తించకుండ ఉన్నాను.

లోక వార్తలకు మరఁగి

కర్ణముల మీకథల విన నేరను
ఏ కరణీ భవ జలధిఁ
దుదముట్ట నీఁదెదను నారాయణా 

నారాయణా! లోకములోని పనికిమాలిన విషయములు వినుటకు అలవాటు పడి, చెవులారా మీ కథలను వినకపోతిని. ఈ జనన మరణరూపమైన సంసారసాగరమునెట్లు తరింపగలను?

ఇల మనుజ జన్మ మెత్తి

సుజ్ఞాన మించు కంతయు లేకను
కలఁతఁ జెందెడు చిత్తమున్‌
స్వచ్ఛంబుగాఁ జేయు నారాయణా 

నారాయణా! ఈ భూమిలో మనుష్య జన్మమెత్తి, మంచి జ్ఞానమును సంపాదింపలేక కలవరపడు మనసుతో తిరుగుచున్నాను. నా మనస్సును స్వచ్ఛముగా చేయుము.

ఎంత పాపాత్ముఁడైన

మిముఁ దలంచి కృతకృత్యుఁడౌనుఁ
బుడమి నింత పరుసవేది సోఁకిన,
లోహంబు హేమమౌ నారాయణ 

నారాయణా! పరుసవేది తగిలినచో ఇనుము బంగారమైనట్లు, నిన్ను మనసార తలచినచో ఎంత పాపాత్ముడైనను పాప విముక్తుడై మోక్షమును పొందును.

కామాంధకారమునను,

బెక్కు దుష్కర్మలఁ జేసి నేను
నీ మఱుఁగు జొచ్చినాను
నామీఁద నెనరుంచు నారాయణా 

నారాయణా! కామమనెడి కారుచీకటి కన్నులు మూసివేయగా ఎన్నో చెడ్డపనులు చేసినాను. ఇప్పుడు నిన్ను శరణము వేడినాను. నా మీద దయ ఉంచి రక్షింపుము.

సమయమైనపుడు మిమ్ముఁ

దలచుటకు శక్తి గలుగునో కలు
గదో, సమయమని తలఁతునిపుడు
నా హృదయ కమలమున నారాయణా 

నారాయణా! శరీరము నుండి ప్రాణములు లేచిపోవునప్పుడు నిన్ను స్మరించుటకు శక్తియుండునో లేకపోవునో తెలియదు. శరీరము ఆరోగ్యముగా నున్న ఈ సమయములోనే నా హృదయ పద్మములో నిన్ను తలచుకొందును. అనుగ్రహింపుము.

ఆటలన్నియు ఱంకులు

నేనాడు మాటలన్నియు బొంకులు
పాటింప నింతకైన,
చేయుచు నున్నదే పాపంబు నారాయణ 

నారాయణా! నీ పూజలు తప్ప ఇతరమైన పనులు చేసినచో అవి అన్నియు వ్యభిచారములే. అనగా శాస్త్రవిరుద్ధములైన పనులే. అట్లే నీ నామస్మరణ తప్ప వేరుగా చెప్పెడు మాటలన్నియు అసత్యములే. (""సత్‌" అనగా దైవము. దానిని గూర్చి కాక ఇతర విషయములను గూర్చి మాటలాడినచో అవి అన్నియు అసత్యము అని భావము). ఓ దేవా! ప్రాపంచిక వ్యామోహములో పడి నేనిపుడు చేయుచున్నదేమి?

వావి దప్పిన వాఁడను

దుష్క్రియా వర్తనుఁడ నగుదు నేను
బావనునిగాఁ జేయవే, ననుఁ
బతిత పావనుఁడ నారాయణా 

పతితులైన వారిని పావనము చేయు ఓ నారాయణా! చుట్టరికములను గూడ పాటింపక ఎన్నో దుష్కార్యములు చేసినాను. నీవు నన్ను పావనునిగా జేయుము. నీకు నమస్కరించెదను.

దేహమే స్థిరమనుచు

దెలిసి నే మోహబద్ధుఁడ నగుచును
సాహసంబున జేసితిఁ
నేగురు ద్రోహంబు నారాయణా 

నారాయణా! ఈ శరీరము శాశ్వతమనుకొని భ్రమపడి, వ్యామోహములలో చిక్కుకుని, గురువులు చెప్పిన మంచిమాటలు వినక స్వేచ్ఛగా ప్రవర్తించి గురుద్రోహము చేసినాను. నన్ను మన్నించి అనుగ్రహింపుము.

ఎన్ని జన్మము లాయెనో,

నేటి కెందెందు జన్మించినానో
నన్ను దరిఁ జేర్పఁ గదవె,
యిఁకనైన నా తండ్రి నారాయణా 

నారాయణా! నేను ఈ నర జన్మమెత్తకముందు ఎన్ని జన్మములెత్తినానో! ఎక్కడెక్కడ పుట్టి ఏ విధముగా ప్రవర్తించినానో నాకు తెలియదు. ఇంకనైనను నన్ననుగ్రహించి ఒకదరికి చేర్పుము. (అనగా మోక్షమును ప్రసాదింపుమని భావము)

యమ కింకరులఁ దలఁచిన,

నాగుండె యావులింపుచు న్నది
యముని బాధలు మాన్పను
గురుతైన వైద్యుఁడవు నారాయణా 

నారాయణా! యమకింకరులను దలచుకొన్నంతనే నా గుండె భయముతో బేజారగుచున్నది. ఆ యముని బాధ మాన్పుటకు నీవే నిజమైన వైద్యుడవు. (వైద్యుడు బాధలు మాన్పునట్లు, నీవు యమబాధను మాన్పగలవని యర్ధము)

అరయఁ గామ క్రోధముల,

లోభంబు మోహమద మత్సర
ములు, తఱుఁగ వెప్పుడు మనసున
నన్ను మన్నించి కృపజూడు నారాయణా 

నారాయణా! కామము, క్రోధము, లోభము, మదము, మోహము, మాత్సర్యము అను ఆరును మనసులోనే కాపురముండు శత్రువులు. వీరి ప్రభావము నా మీద ప్రతాపము చూపుచున్నారు. ఇట్లు కామాది శత్రువులకు వశుడనైన నన్ను మన్నించి దయతో చూడుము.

ఆశా పిశాచి పట్టి,

వైరాగ్య వాసనలఁ జేరనీయదు
గాసి పెట్టుచు నున్నది
నేనేమి చేయుదును నారాయణా 

నారాయణా! ఆశ అనెడి పిశాచము నన్ను పట్టి పీడించుచున్నది. వైరాగ్యమను దానిని నా దగ్గరకు రానిచ్చుటలేదు. అది నన్ను చాలా బాధ పెట్టుచున్నది. ఏమి చేయమందువు? చెప్పుము.

తాపత్రయంబుఁ జెంది,

చాలఁ బరితాప మొందెడు చిత్తము
నీ పాదములఁ జెందినఁ
జల్లనై నిలిచునింక నారాయణా 

నారాయణా! ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవికములనెడి తాపత్రయముల (మూడు తాపముల)తో చాలా బాధపడుచున్న నా హృదయము నీ పాదముల సన్నిధికి చేరినచో చల్లబడును గదా!

చింతా పరంపరలచేఁ

చిత్తంబు చీఁకాకు పడుచున్నది
సంతోషమునఁ గూర్పవె,
దివ్య ప్రసాదమును నారాయణా 

నారాయణా! అనేక విధములయిన చింతలతో మనస్సు చికాకు పడుచున్నది. సంతోషము గలుగుటకు ఏదైన దివ్యౌషధమును ప్రసాదింపుము.

ప్రాయమెల్లను బోయెను,

నాశ లెడఁ బాయఁ జాలక యున్నవి
మాయా ప్రపంచమేల,
నిర్మించితివి మాయయ్య నారాయణా 

ఓ తండ్రీ! నారాయణా! వయస్సు మీరిపోయినది. కాని ఇంకను ఆశలు మాత్రము వదలకుండ పీడించుచున్నవి. ఇటువంటి మాయతో గూడిన ప్రపంచమును ఎందుకు నిర్మించినావు?

శరణుఁ జొచ్చినవాఁడను

నేఁ జేయుదురితముల నపహరించి
పరమ పద మొసఁగఁ గదవె
యిఁకనైనఁ బరమాత్మ నారాయణా 

పరమాత్ముడవైన ఓ నారాయణా! నేను నిన్నే శరణు జొచ్చినాను. నా పాపములన్నింటిని పోగొట్టి నాకు ఈ జన్మతోనైనను మోక్షమును ప్రసాదింపుము

సంకల్పములు పుట్టినఁ

గర్మ వాసనల దృఢముగఁ జేయవు
సంకటము నొందించకే
నను సత్య సంకల్ప నారాయణా 

సత్యమైన సంకల్పములు గల నారాయణా! నాకు కొన్ని మంచి సంకల్పములు పుట్టుచుండును. కాని అవి కార్యరూపమును ధరించులోపల నా పూర్వజన్మములలోని కర్మవాసనలు వచ్చి వానిని చెదరగొట్టు చుండును. నీవు సత్యసంకల్పుడవు కావున నా సత్సంకల్పములను ఫలింపజేసి నన్ను ఉద్ధరింపుము. తిరిగి జన్మములెత్తు దుఃఖములలో పడద్రోయకుము.

ఒకవేళ నున్న బుద్ధి

యొక వేళ నుండదిఁక నేమి సేతు
విశదంబుగాఁ జేయవే
నీవు నా చిత్తమున నారాయణ 

నారాయణా! ఒక సమయములో ఉన్న మంచి బుద్ధి ఇంకొక సమయములో ఉండుటలేదు. స్థిరముగా నుండవలసిన బుద్ధి చంచలముగా మారుచున్నది. ఏమి చేయుదును? నీవే నా మీద దయయుంచి నా బుద్ధిని స్వచ్ఛముగాను, స్థిరముగాను ఉంచుము

నెట్టుకొని సకల జీవ

కోటులను గొట్టి భక్షించినాను
పొట్ట కొఱకై నీచుల
సేవించి రట్టయితి నారాయణా 

నారాయణా! ఈ పొట్ట నింపుకొనుటకై ఎన్నోప్రాణులను అనగా పక్షులను, మేక - లేడి మున్నగు జీవులను చంపి ఆరగించినాను. అంతేకాదు, ఈ జానెడు పొట్ట నింపుకొనుటకై నీచులైన ధనికులను సేవించి అవమానముల నొందినాను.

నేను పుట్టినది మొదలు

ఆహార నిద్రలను జనె కాలము
పూజ యెప్పుడు సేయుదు,
నీపదధ్యానంబు నారాయణా 

నారాయణా! నేను పుట్టినది మొదలు కొంత ఆహార సంపాదనములోను, కొంత నిద్రలోను కాలమంతయు వ్యర్ధముగా గడచిపోయినది. ఇంక నీ పూజలు, నీ పాదధ్యానము ఎప్పుడు చేయవలెనో తెలియుటలేదు.

ప్రొద్దు వోవక యున్నను

వేసరక పొరుగిండ్లు తిరుఁగుగాని
బుద్ధిమాలిన చిత్తము
నీయందుఁ బొందదే నారాయణా 

నారాయణా! ఏమియు తోచనిచో కాలక్షేపమునకు ఇరుగుపొరుగు వారి ఇండ్లకు పోవుటలో ఆసక్తి చూపును గాని, ఈ మనస్సు నీ చుట్టు తిరుగుటకు ఇష్టపడదు. ఇదేమి విచిత్రము?

ఎన్ని విధములఁ జూచిన

నిత్యమును హృదయమున మిము
మఱవక యున్నంతకన్న సుఖము
వేరొక్కటున్నదే నారాయణా 

నారాయణా! ఎన్ని విధాల ఆలోచించినను, నిత్యము నీ నామస్మరణము మరచి పోకుండ ఉండుట కన్న సుఖము మరియొకటి ఉన్నదా?


Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: