telugudanam.com

      telugudanam.com

   

వాడుక భాష

ప్రజలు తమ నిత్య జీవితంలో మట్లాడుకునే భాష వాడుక భాష.

సనాతన భావాలను సమర్ధిస్తూ గ్రాంధిక భాషలో రచనలు చేయడమేగాక బిచ్చగాడితో సైతం గ్రాంధిక భాషలోనే మట్లాడేవారు కొక్కొండ వెంకటరత్నం (1842-1915)గారు. ఇంట్లో భార్యతో కూడా గ్రాంధికంలోనే సంభాషించేవారు.

వాడుక భాషలో గ్రంధ రచన సాగాలని గురజాడ పిలుపునిచ్చారు. వాడుక భాషను 'కులట అని గేలి చేసే పండితులు దానిని దూరంగా విసర్జించక యేల వాడుక చేతురు? వారు యంటీ నాచ్ కాదు కాబోలు? అంటూ ఒక చురక తగిలించి ఆ పండితులు చేసే తప్పులను ఆయన ఎత్తి చూపారు.

1917లో వేటూరి ప్రభాకర శాస్త్రి గారు వాడుక భాషను రాసే విధానంలో కొత్త దారులు తొక్కారు. "మండలాల్లో మాటలు మారినాయని భాష చెడ్డ భాష అవుతుందా? కొత్త గ్రంధాలు చదువుకొని, కొత్త మాటలు నేర్చుకొన్నట్లు అన్య మాండలిక గ్రంధాలు చదువుకొని ఆ పదాలు నేర్చుకోవాలి. ఆ మాటలు తెలియని ఆ భాష చెడ్డదనడం మంచిది కాదు. మారడం భాషకు సహజం" అన్నారు.

తెలుగు భాష గురించి ఆధునిక పద్ధతిలో ఆలోచించిన తొలి భాషా విజ్ఞాని గిడుగు రామమూర్తి గారు. వీరు భాషా యుద్ధాలు చేసినవారుగా ప్రసిద్ధులు. తెలుగునాట తెలుగు భాష గురించి ఆధునిక పద్ధతులలో అలోచించిన తొలి భాషా శాస్త్రవేత్త గిడుగు రామమూర్తి పంతులు గారు.

వ్యావహారిక భాషావాదాన్ని ప్రారంభించిన గిడుగువారు గ్రాంధిక భాషాద్వేషి కానేకాదు. ఆయన ప్రాచీన సాహిత్యంలో చదవని గ్రంధంలేదు. తెలియని అర్ధంలేదు పద స్వరూపంలేదు. గ్రాంధిక వాదులందరికన్నా గొప్ప పాండిత్యం, భాషాధికారంగల గొప్ప పండితుడాయన. అమోఘమైన జ్ఞాపకశక్తి. గిడుగువారి వ్యావహారిక భాషావాదానికి పంచప్రాణాలు అనదగిన అయిదు అంశాల్ని రమాపతిరావు ఇలా పేర్కొన్నారు. (ప్రసిద్ధ సాహితీమూర్తులు):

1. తెలుగులో లక్షణగ్రంధాలు తక్కువ. అందులో పండితులు ప్రామాణికంగా అంగీకరించేవి ఇంకా తక్కువ. అందువల్ల వీటిని ఆధారంగా చేసుకొని ప్రాచీన, అర్వాచీన కావ్యభాషని శాసించకూడదు. తాము ప్రమాణం గావించుకొన్న లక్షణాన్నిబట్టి గాని, అనుశాసనాన్ని బట్టిగాని ఆయా కావ్యప్రయోగాలను పరిష్కరించకూడదు. ఆ విధంగా పరిష్కరించటం కూటకరణమనే సాహిత్య ద్రోహమవుతుంది.

2. ఈ లక్షణగ్రంధాలూ, వ్యాకరణాలూ ఒక సూత్రవిషయంలో గానీ, ఒక నిర్ధిష్ట పదప్రయోగ విషయంలో గానీ, ఏకగ్రీవంగా అంగీకరిస్తునాయా? లేదు. ఎవరిని ప్రమాణంగా శిరసావహించాలి? ఎవరిని కాదనాలి? కాబట్టి ఆధునికులిట్లా ప్రయోగించకూడదు అని శాబ్దికులు కవులను, రచయితలను తప్పుపట్టకూడదు.

3. ఏ ప్రయోగానికైనా లోకవ్యవహారం వల్లనే సాధుత్వం కలుగుతుంది. లోకవ్యవహారంలో ఉంటే ఆ ప్రయోగాలన్ని సాధువులే. కవి ప్రయోగం వల్ల ఏ శబ్దానికైనా ఔచిత్యానౌచిత్యాలు సంక్రమిస్తాయే కాని సాధుత్వం నిర్ధారితం కాదు.

4. వ్యవహారిక భాషోద్యమ వాదులు యధేచ్చావిహారవాదులు కారు. తప్పులన్నీ ఒప్పులని అంగీకరిచంచాల్సిందే అని వారెన్నడూ వారించరు. ఒప్పులను తప్పులనకుండా ఉంటే చాలు. లోకం సహజంగా మారుతున్నట్లే భాషకూడా మారుతూనే ఉంటుంది. భాషకు మార్పు అనేది ఉండదు అనుకోవడం శాస్త్రీయ దృక్పధం కాదు.

5. వ్యావహారిక భాషావాదాన్ని అంగీకరిస్తే మాండలిక పదప్రయోగం విభిన్న ప్రాంతీయులు పరస్పర అర్ధావబోధకు ప్రతిబంధకమవుతుందని కావ్యభాషాసమర్ధనవాదులనడం స్పృహణీయం కాదు, మతిమంతం కాదు. కవ్యభాషలో కూడా మాండలిక పద ప్రయోగం లేకపోలేదు. ఈ ప్రయోగాలన్నింటినీ నిఘంటువులూ వ్యాకరణ సూత్రాలూ స్వీకరించి లక్షణ నిర్ధేశాన్ని విస్తృతపరచాలి.

ఈ వాడుకభాషా వాదాన్ని చేపట్టినందుకు గిడుగువారు పండితులతో యుద్ధం చేయవలసివచ్చింది. దీన్ని గ్రామ్యవాదమనీ, గిడుగువారు గ్రామ్యాచార్యులనీ గ్రాంధికవాదులు హేళన చేస్తూ పద్యాలూ, వ్యాసాలు రాశారు. జయంతి రామయ్యపంతులు, కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రి, వేదం వెంకటరామశాస్త్రి, శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి మొదలైన వాళ్ళతో ఢీకొనవలసి వచ్చింది. ఆంధ్రసాహిత్య పరిషత్తు గ్రాంధిక భాషావాదానికి అండగ నిలిచింది. గిడుగువారు 'తెలుగూ పత్రిక ద్వారా గ్రాంధిక వాదాన్ని ఖండిస్తూ వ్యావహారిక వాదాన్ని బలపరిచారు. పండితులే తప్పులు లేకుండా రాయలేని గ్రాంధికం బలవంతాన రుద్దడం ఎందుకంటూ "ఆంధ్రపండిత బిషక్కుల భాషాభేషజం" అనే పుస్తకం ప్రచురించారు. గిడుగువారు "Memorandum on Modern Telugu" సమర్పిస్తే జయంతి రామయ్యపంతులు "A Defence of Literary Telugu" విడుదల చేసారు. కాని తాతాసుబ్బరాయశాస్త్రి, బంకుపల్లి మల్లయ్యశాస్త్రి, పంచాగ్నుల ఆదినారాయణశాస్త్రి, తిరుపతి వెంకట కవులు వంటి పండిత ప్రకండులు గిడుగువారిని సమర్ధించారు. శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి 'ప్రబుద్ధాంధ్రా పత్రిక వల్లా' నవ్యసాహిత్య పరిషత్తువారి 'ప్రతిభా పత్రికవల్ల, గురజాడ 'కన్యాశుల్కం' వల్లా వాడుకభాష అందలమెక్కింది.

"దేశభాషతో తమ కేమీ సంబంధములేనట్టు దేశభాష గుడ్డిపండితులకు గుత్త కిచ్చివేసి, తాము కళ్ళుమూసుకొని ఊరుకున్న నాగరికులు మరి ఏ దేశమందైనా క్రీ.శ. ఇరవైయో శతాబ్దమందున్నారా? ఏమి కర్మము? ఏమి పాపము? తెలుగుభాషకు తెలుగువారికి ఏమి ఇంత దుర్గతి పట్టినది? దేశస్థుల భాష, దేశమందున్న శిష్టుల భాష గ్రామ్యమట! పండితులకైనా బాగా రానిది గ్రాంధిక భాషట! అయ్యో, దేశభాషా! నిన్ను తృణీకరించడము చేత గదా నూటిక పదిమందైనా తెలుగక్షరాలు వచ్చినవాళ్ళు దేశములో లేకపోవడము, చదువు నేర్చిన వాళ్ళయినా తెలుగు పుస్తకము ముట్టుకోకపోవడము! ఇకనైనా తెలుగువారు కండ్లు విప్పిచూతురా?" అని గిడుగువారు ఎంతో ఆవేదనపడ్డారు.

నాగరికతకు దూరంగా కొండల్లో జీవిస్తున్న ఆదిమ ప్రలైన సవరుల కోసం జీవితాన్ని త్యాగం చేశారు. తమ కాలాన్ని, ధనాన్ని వినియోగించారు. సవర భాషలోని పదజాలానికి ప్రకృతి ప్రత్యయం చేసి శోధించి భాషాతత్త్వాన్ని సాధించారు. రెండు నిఘంటువులు రచించారు. తెలుగువారికి 'తుది విన్నపం' చేస్తూ భాషాభిమానాన్ని ప్రబోధించారు. గిడుగువారి వ్యవహారిక భాషోద్యమం వల్ల ఆధునిక సాహిత్యం కొత్త సొగసులు సంతరించుకుంది. రచనావైవిధ్యం, వైశిష్ట్యంతో పుష్టిచేకూరింది. విశ్వవిద్యాలయాలలో వాడుకభాష రాజ్యమేలుతోంది. పత్రికలు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి. అక్షరాస్యత పెరిగింది. తెలుగు అధికారభాషగా, పరిపాలనా భాషగా కీర్తికెక్కింది. దీనికంతటికీ గిడుగు పిడుగే మూలకారకుడు.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: