telugudanam.co.in

      telugudanam.co.in

   

కూచిపూడి కళాక్షేత్రం

ఈ పేరు వినని తెలుగు కళాకారుడు ఉండడు. కూచిపూడి భాగవతుల ప్రదర్శనలకు నోచుకోని గ్రామం తెలుగునాట లేదు. తమ ప్రదర్శనల ద్వారా విశ్వ విఖ్యాతినొందిన కూచిపూడి గ్రామం కృష్ణా జిల్లాలో మచిలీపట్నంకు 15 మైళ్ళ దూరంలో ఉంది. తన పదాలతో దక్షిణ దేశాన్నంతా సుసంపన్నం చేసిన క్షేత్రయ్య స్వగ్రామమైన మువ్వ గ్రామంలో 500 సంవత్సరాలకు పూర్వమే నాట్య కళకు అంకురార్పణ జరిగినట్లు చారిత్రాకాధారాలున్నాయి.

కూచిపూడి భాగాతుల ప్రదర్శనానికి మూలపురుషుడు సిదేంద్ర యోగి. ఈయన తన నాత్య గీతాభినయాలను కూచిపూడి కళాకారులకు అంకితం చేశాడు. ఆనాటినుంచీ ఈనాటివరకూ కూచిపూడి నాట్య ప్రదర్శనలు, వారి భాగవతాలూ, వంశపారంపర్యంగా ప్రచారం పొందాయి.

ఇలా ఆ కళను వంశపారంపర్య విద్యగా చేసి, కూచిపూడిలో పుట్టిన ప్రతి బ్రాహ్మణ మగబిడ్డకూ ముక్కులూ, చెవులూ కుట్టిస్తారు. ఆడ వేషాలు వేయడానికి కూడా అనువుగా ఉంటుందని ఇలా ముక్కులూ, చెవులూ కుట్టిస్తారు. 15వ శతాబ్దం నాటికే వీరు ఖ్యాతి వహించారు. ఇందుకు ఆధారం 1502నాటి మచ్చుపల్లి కైఫీయతు. 16వ శతాబ్దం చివరి భాగం నుండీ ఈనాటి వరకూ పారిజాతాపహరణాన్ని ప్రదర్శిస్తూ ప్రశంశలు అందుకొంటున్నారు. గోల్కొండ నవాబు అబ్దుల్ హసన్ తానీషా 1687లో కూచిపూడి కళాకారులకు కూచిపూడి గ్రామాన్ని అగ్రహారంగా దానమిచ్చాడు.

భామాకలాపాన్ని వీరు ఒక మహా కావ్యంగా తీర్చిదిద్దారు. ఏండ్ల తరబడి ప్రదర్శించి ప్రజా హృదయాలను చూరగొన్నారు. .భామాకలాపంలో శ్రీ కృష్ణుడు, సత్యభామలు నాయికా నాయకులు. కథా సందర్భాన్నిబట్టి ఇందులో వచనం నడుస్తూ ఉంటుంది. భామాకలాపం తర్వాత వీరి ప్రదర్శనలలో ముఖ్యమైనది గొల్ల కలాపం. గొల్లకలాపంలో నాయిక గొల్ల కన్య. ఆమె, "బ్రాహ్మణ జన్మ ఉత్తమమైందా? గోప జన్మ ఉత్తమమైందా? అని బ్రాహ్మణునితో వాదోపవాదాలకు దిగుతుంది.

ఈ భాగవతులు పురాణేతిహాసాలనుండి కథలు తీసుకుని యక్షగాన నాటక రూపంలో భరత నాట్య శాస్త్ర సంప్రదాయాలను అనుసరించి ప్రదర్శనలను ఇస్తూ ఉంటారు. రాన్రానూ వీటిని కొంతవరకు మార్చి వీధి నాటకాలుగా ప్రదర్శించారు. వీరు క్షేత్రయ్య పదాలను ఎక్కువ ప్రచారంలోకి తీసుకొచ్చారు. వీరి వీధి నాటకాల్లో పురాణేతిహాసాలకు సంబంధించిన గాధలను యక్ష గాన వీధి నాటకాల రూపంలో సంప్రదాయసిద్ధంగా ప్రదర్శించేవారు. వాటిలో త్యాగరాయ కృతులు, జయదేవుని అష్టపదులు, మువ్వగోపాల పదాలు, భద్రాచల రామదాసు కీర్తనలు, దశావతారాలు వంటివి ఎన్నో ఉండేవి. వీరు నాట్య సంగీతాల్లోనే కాకుండా అలంకార శాస్త్రం, మంత్ర, భాషా, వాధ్య శాస్త్రాల్లోనూ కూడా నైపుణ్యం కలవారు. కూచిపూడి నృత్య కళను పునరుద్ధరించడానికి సిద్ధేంద్ర కళాక్షేత్రాన్ని ఏర్పాటు చేసి గురుకుల పద్ధతిలో శిక్షణ ఇస్తున్నారు.


కూచిపూడి


కూచిపూడి నృత్యం :

కూచిఫూడి గ్రామంలో పుట్టిన ఆ నృత్యం నృత్యంలో తెలుగు వారికీ శాస్త్రీయత ఉందని నిరూపించింది. ఆ నిరూపణకు ముఖ భూమిక వహించినవారు వెంపటి చినసత్యం గారు. కలాపం, యక్షగానం, నృత్యం అను మూడు నిధులకు పట్టుగొమ్మైన కూచిపూడిలో కలాపాలకు వెంపటి వెంకట నారాయణ, యక్షగానాలకు చింతా వెంకటరామయ్య, నృత్యాంశాలైన కేళికలకు వేదాంతం లక్ష్మి నారాయణ శాస్త్రి వాటిని అభివృద్ధి చేశారు. కూచిపూడి మూడు నిధులుగా ప్రజ్వరిల్లే గొప్ప రీతి. కలాపానికి వెంపటి వెంకట నారాయణ, యక్షగానాలకు చింతా వెంకటరామయ్య, కేళికలకు వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి గార్లు ప్రఖ్యాతి గడించి వాటిని బాగా అభివృద్ధి చేశారు.

వెంపటి చినసత్యం నృత్యరూపకాలకు కొత్త వాతావరణం కల్పించి సామూహిక నృత్యాలకు శుభ్రంగా అన్ని రూపాలలో మిళితంకాగల నృత్య భూమికను స్థిరం చేశారు. దేవదానవ మూర్తులకు, స్వయంవర శోభనలకు, వీరశైవులకు గల అభినయ దృశ్యాలను ఉదేగభరితం చేశారు. 1963లో చెన్నైలో కూచిపూడి ఆర్ట్ అకాడెమీని స్థాఫించారు. అనేక నృత్యరూపకాలను రచింపజేసి, నృత్య దర్శకత్వం వహించారు. శ్రీ కృష్ణ పారిజాతం, చండాలిక, మేనకా విశ్వామిత్ర, రుక్మిణీ కల్యాణం, కిరాతార్జునీయం మొద్లగు నృత్య నాటాలు ఈయన దర్శకత్వంలో పేరెన్నికగన్నవి. వైజయంతిమాల, హెమమాలిని, మంజుభార్గవి, చంద్రకళ, రత్నపాప, పద్మామీనన్, ప్రభా రమేష్ వంటి వారంతా వారి శిష్యులే. భారతీయ సంప్రదాయ నృత్య కళలలో నేడు కూచిపూడి నాట్యం గురించి తెలీని స్వదేశీయులు లేరు. విదేశీయులని సైతం ఆకర్షించిన ఈ నృత్య రీతి అనేకమంది విదేశీ కళాకారులకు సువర్ణ గవాక్షాలను తెరిచింది. విదేశాలలో అంతులేని ఆదరణను పొందింది.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: