telugudanam.com

      telugudanam.com

   

పీర్ల పండగ

పీర్ అంటే మహాత్ముడు అని అర్ధం. మొహరం పండగనే పీర్ల పండగ అంటారు. హసన్, హుస్సేన్ అనే ముస్లిం వీరుల స్మారకార్ధం ముస్లింలు జరుపుకునే కార్యక్రమమే పీర్ల పండగ. ధర్మ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన వీరులకు ప్రతీకగా హస్తాకృతి కలిగిన రూపాలను తయారుచేసి, వాటిని అలంకరించి, ఊరేగించి, పూజించేవాటిని పీర్లు అని పిలుస్తారు.

మొహరం నెలలో 10వ రోజు సహాదత్‌ను సంతాప దినంగా పాటించవలసిందిగా ఖురాన్ నిర్వచించింది. ఆ రోజున పీర్లు అనే హస్తాకృతులను ఊరేగించి, ఊరియందుగల బావి దగ్గరో, నదుల దగ్గరో వాటిని శుభ్రం చేసి, నిర్ణీత పేటికలో ఉంచి మరుసటి మొహరం నెల వరకు ముజావర్ వద్ద భద్రపరచడం జరుగుతూ ఉంటుంది.


పీర్ల పండగ


మొహరం నెలలో చంద్రుడు స్పష్టంగా కనిపించిన అయిదవ రోజు రాత్రి పంజాకపిటార అనే విగ్రహాలనుంచిన పెట్టెను, ముజావిర్ అనే అర్చకుని ఇంటి నుండి పీర్ల మసీదుకు ఊరేగింపుగా తెస్తారు. ఆ విగ్రహాలకు పది రోజులు పూజలు జరుగుతాయి. పీరులంటే వీరులయొక్క హస్తాకృతిలో, విగ్రహాల రూపంలో కొలుస్తారు. హస్తం పంజా రూపంలో వుంటుంది గనుక వీటిని ఉంచే స్థలాన్ని పీర్ల పంజా అంటారు. ఈ హస్తాలను పొడవైన కర్ర చివర భాగంలో అమర్చుతారు. వాటిని రంగురంగుల గుడ్డలతో అలంకరించి రకరకాల రంగుల కాగితాల పూల దండలను నిలువెల్లా అలంకరిస్తారు. ప్రతి రోజూ ఆ పీర్ల పంజాలను సాంబ్రాణి ధూపంతో పూజిస్తారు. పీర్లను దర్శించటానికి పిల్లలు, పెద్దలు వచ్చి పోతుంటారు. ఆనాడు హిందూ, ముస్లింల మధ్య ఏమాత్రం భేదభావాలు లేకుండా సామరస్యంగా పూజిస్తారు.

పీర్ల పండగలోని విశేషమైన అంశం; నిప్పుల గుండంలో నడవడం. పీర్లను మసీదు నుండి బయటకు తీసి, సన్నాయి మేళంతో గనం చేస్తూ ఊరేగించి, హసన్, హుస్సేన్‌లకు జోహారులర్పిస్తారు. ఊరేగింపు అయిన తరువాత రాత్రికి అంతకు ముందే ఏర్పాటు చేసిన నెప్పుల గుండం దగ్గరకు వస్తారు. డప్పు వాయిద్యాల మధ్య పరుగు పరుగున నిపుల గుండం మధ్య నుంచి నడిచిపోతారు. ఇలా నిప్పుల గుండంలో నడిచివెల్ళడం పీర్ల మహాత్యంగా భావిస్తారు. ఆ రోజున విందు ఏర్పాట్లు చేసుకుంటారు. హిందువులను కూడా ఆ విందులకు ఆహ్వానిస్తారు. ఈ పండగలో అనేక మొహరం గీతాలు పాడతారు. హసన్, హుస్సేన్‌లను కీర్తిస్తూ అనేక గీతాలు పాడతారు. హిందు, ముస్లిం సమైక్యతలకు నిదర్శనంగా జరిగే ఈ పండగ మతసామరస్యానికి ప్రతీక.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: