telugudanam.com

      telugudanam.com

   

జానపద కళా రూపాలు

తెలుగు నాటక రంగం ఆవిర్భవించి నూరేళ్ళు దాటింది.ఈ నూరేళ్ళుగా వినోదాన్ని నాటకాలనుండి పొందుతున్నాం. సినిమా రాకముందూ, సినిమా వచ్చాకా కూడా సగటు మానవుడి దృష్టి నుంచి నాటక రంగం ఏనాడూ దూరం కాలేదు. ప్రజల అంతరాంతరాల్లో నాటుకు పోయిన ఈ జీవ కళ ఆవిర్భవించకముందు అంటే వంద సంవత్సరాలకు పూర్వం మానవుడు విజ్ఞానం, వినోదాలకోసం ఏం చేసేవాడు? అని ప్రశ్న ఉదయిస్తే దానికి సమాధానం ఎవరో కొద్ది మంది దగ్గర మాత్రమే దొరుకుతుంది. ఆ కొద్దిమంది కూడా మేధావులేమీ కాదు. సామాన్య మానవులు మాత్రమే వాళ్ళు. ఆ సామాన్య మానవులు కూడా గ్రామీణ నేపధ్యం కలవారు లేక గ్రామీణ సంప్రదాయం పట్ల అభిమానం కలవారు మాత్రమే. వారిని పలకరిస్తే పరవశంతో నోరు విప్పుతారు ఆనాటి వినోద కార్యక్రమాల గురించి. జనం జనం ఒక్కటై జనం మధ్యలో పుట్టుకొచ్చిన "జానపద కళారూపాల" గురించి.

అతి ప్రాచీనమైన కళలివి. మానవుడి అంతరాంతరాలనూ, మనో వికాసాన్నీ బైటపెట్టి విజ్ఞాన వినోదాలకు మార్గదర్శకంగా నిలిచిన ప్రతీకలు. వీటిలో సంగీతముంది. సాహిత్యముంది. నాట్యముంది. నటన ఉంది. అభినయుముంది, ఆహర్యముంది. అన్ని మేలుకలయికల క్రమశిక్షణ ఉంది. రెండు వేల సంవత్సరాల చారిత్రక సంపద వీటికి వారసత్వంగా ఉంది. వీటిని బహువిధాల ఆదరించిన రాజులు పోయినా, రాజ్యాలు పోయినా వీటి రాజ ఠీవి మాత్రం చెక్కుచెదరలేదు. కారణం వీటి పోషణాభారాన్ని తీసుకున్నవారు ప్రజలు. ప్రజల మద్దతుతో, వారి అభిమానంతో, వారి ఆదరణతో మనుగడ సాగిస్తున్న కళలు కాబట్టి ఇవి ప్రజా కళలుగా నేటికీ విరాజిల్లుతున్నాయి.

ప్రజల మధ్యనే స్వతస్సిద్ధంగా పుట్టి ప్రవర్ధమాన మయిన కళారూపాలు అవడం వల్లనే వాటికి జానపద కళారూపాలని పేరు వచ్చింది.ఈ జానపద కళారూపాలు జాతి జీవితంలో సామాజికంగా, సాంస్కృతిక పరంగా పెనవేసుకుని ఉండడంచేత దేశంలో, సమాజంలో రాజకీయ, సాంఘీక పరిణామాలు ఎన్ని వచ్చినా అనూచానంగా వస్తూన్న ఈ కళారూపాలు చెదరకుండా అలానే నిలిచి ఉన్నాయి.మన ప్రాచీన కళారూపాలైన కురవంజి, యక్షగానం, తోలుబొమ్మలాటలు, కలాపం, బుర్రకథ, హరికథ, వీథినాటకం, చోడిగాడు, భాగవతమేళం, పగటివేషాలు, వాలకం, రుంజలు భజనలు, పిచ్చుకుంటలు, దాసర్లు, చిందుమాదిగలు, బైండ్లు, కాటికాపర్లు, కాశీకావళ్లు, జంతరుపెట్టె, గంటి భాగోతులు, విప్రవినోదులు, సాధనాశూరులు-ఇలా మరెన్నో ఉన్నాయి. వీటన్నిటినీ జానపద కళారూపాలనే అంటారు.ఇవన్నీ ఇప్పుడు ఉన్నాయా అని ప్రశ్నించుకొంటే-కాల ప్రభావంలో కొన్ని కొన్ని కాలగర్భంలో కలసిపోయి ఉండవచ్చు. కాని చాలామట్టుకు పల్లెల్లో ఉన్నాయి. పల్లె జనావళిని అలరిస్తూన్నాయి.

జానపద కళారూపాలు అనేవి ఒక్క మనకే పరిమితమైనవి కావు. ఇవి ఏ దేశంలో, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ వేషభాషల్లో ఉన్నా అక్కడి ప్రజల ఆశలకూ, ఆశయాలకూ, ఆలోచనా సరళికి ప్రతిరూపాలుగానే చెప్పుకోవలసి ఉంటుంది. ఇటువంటి ప్రత్యేకతలను కలిగిఉన్నాయి కాబట్టే ఈ కళారూపాలు ప్రజలను ఆకట్టుకోవడం జరుగుతూంది. వీటిని ఇలా విభాగించుకోవచ్చును. 1.స్వాభావిక రూపాలు, 2.వృత్తి సంబంధీక రూపాలు, 3.వ్యంగ్య రూపాలు, 4.మిశ్రమాలు.

నన్నయ కాలానికి నాటకాదులు ప్రచారంలో ఉన్నాయనడానికి- "...ఉదాత్త రసాన్విత కావ్య నాటక క్రమములు బెక్కు సూచితి" అన్న పద్యం ద్వారా బోధ పడుతుంది. రెండు వేల ఏళ్ళనాడే ప్రచారంలో ఉండినట్లు భాగవతంలో కృష్ణుని జన్మ సమయంలో గోపికలు ఈ తరహా పాటలనే పాడినట్లు దశమస్కంధం లో వర్ణించబడింది కూడా.

జానపద గాయకులు - రుంజవారు, బీరన్నలవారు, వీరముష్టివారు, బవనీలవారు, జంగములు, పిచ్చుకగుంట్లవారు, దాసరులు, శారదకాండ్రు, మొదలైనవారు.వీరు అనేక విధములైన వాద్య విశేషములతో ఊరూరా తిరుగుతూ వాద్యాలను వినిపిస్తూ పాటలు పాడుతుంటారు.

జానపద వాద్యవిశేషాలు:- వీరణములు, గుమ్మెట, ఒగ్గులు, కోలలు, శంఖము, శారద, అందేలు, కటివాద్యము, డప్పు, తప్పెట, తాళాలు, తంబుర, జమిడికలు, చిరుతలు, నాగస్వరము, గజ్జెలు, ఢిక్కి, పిల్లనగ్రోవి, కొమ్ముబూరలు, బుర్రలు, రుంజ మొదలయినవి. వీరు పాడే పాటల్లో, చెప్పే కథల్లో చారిత్రక, పౌరాణిక, పారమార్థిక ఇతివృత్తాలు ప్రధానాలు.


జానపద కళారూపాలు ఎన్నో - మరెన్నో

ఒక్కొక్క కళను గురించి ఒక్కొక్క గ్రంధం రాయవచ్చు. కీలు బొమ్మలు, బుట్టబొమ్మలు, శారదగాండ్రు, మూకాభినయాలు, వీరభద్ర విన్యాసం, జముకుల కథలు, గారడీ ప్రదర్శనలు, డప్పుల కోలాటం, గరగ నృత్యం, పులివేషాలు, కాముని పున్నమి వినోదాలు, గొల్లసుద్దులు, వీరముష్టివారు, ఫకీరు వేషాలు, తుమ్మెదపాటలు, గోండుజాతి నృత్యాలు, విప్రవినోదులు, బతుకమ్మ, బొడ్డెమ్మ పండుగలు, సాధనాశూరులు, గంటె భాగవతులు, కాటి కాపటివాళ్ళు, బైండ్లవాళ్ళు, కోలాటనృత్యం, దొమ్మరాటలు, జంతరు పెట్టె, వీథిపురాణం, అశ్వనృత్యం - పిచ్చుకుంటల కథలు, హరిహరీపదాలు, ఘటనృత్యం, కాశీకావళ్ళు, బుడబుక్కలు - ఇలా ఒకటేమిటి - తెలుగు కళామతల్లి మణిహారాలుగా ఎన్నో వర్థిల్లాయి - వర్థిల్లుతున్నాయి ప్రతి కళకూ ఒక చరిత్ర - ఒక ప్రత్యేకత ఉంది. జానపద కళారూపాలు - ఇంకా ఎన్నో మరెన్నో దేశవ్యాప్తంగా ప్రజల మధ్య - ప్రజానందాన్ని అందిస్తూ - ప్రజాకళలుగా వర్థిల్లుతూనే ఉన్నాయి.

విస్తృత ప్రచారంలో ఉన్నకొన్ని జానపద కళారూపాల గురించి తెలుసుకుందాం.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: