telugudanam.com

      telugudanam.com

   

కలాపాలు

జానపద కళారూపాలలో కలాపం చాలా ప్రసిద్ధమూ, ప్రాచీనమూ అయినది. భామా కలాపం, గొల్ల కలాపం, చోడిగాని కలాపం - ఇలా కలాపాలన్న పేరున చాలా ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పుకోవాలంటే యక్షగాన ప్రబంధాలకు రూపాంతరాలే కలాపం, బుర్రకథ, హరికథ. ఏదో ఒక నాయిక పాత్రను ధరించి ఆడుతూ, పాడుతూ తన కథను తానే మనకు చెప్పే యక్షగాన రూపమే కలాపం. భామాకలాపం, గొల్లకలాపం వంటివి దేశీకిందకు రావు. మార్గశాఖకు చెందినవి. అయితే చోడిగాని కలాపం మొదలయినవి దేశీ శాఖకు చెందినవి. కలాపం అన్నది, కలాప రచనలు అనేది వ్యవహారంలో ఉన్న పేరు.


కలాపాలు                                                        

భామాకలాపం, గొల్లకలాపం మొదలయినవి పేరులోనే కలాప పదాన్ని అలంకరించుకొన్నాయి. అంతేకాకుండా, కూరాకుల, కురవంజి, దాటిని, దాక్షిణీ, పంతులు వేషాలు మొదలయినవి కూడా తమ కథాకథనాన్ని కలాపమనే పేరుతోనే వ్యవహరిస్తూ ఉంటాయి. కలాపం ముఖ్య లక్షణం ఆడిపాడి అభినయించడం. పామరులను సైతం ఆకర్షించుకొని, అర్థం అయ్యేలా నిలచిన కలాపాలు - రసాత్మకతను నింపుకొని ఉండడమే ఇప్పటికీ సజీవ కళలుగా నిలిచి ఉండడానికి కారణం. ఇంతకీ ఈ కలాప ప్రదర్శనలు ఎప్పటినుంచి ప్రచారంలోకి వచ్చాయి? అని ప్రశ్నించుకొంటే ఇదే సమయమని చెప్పడానికి తగిన ఆధారాలు కనిపించవు. అపూర్వ ప్రచారం తెచ్చిపెట్టినవారుగా కూచిపూడి వారినే పేర్కొనవలసి ఉంటుంది. చోడిగాని కలాపం - చోడిగాని వేషం - చేతిలో వంకర కర్ర, కాలికి కడియాలు, గోచీ, కంబళీ, అడ్డంగా కట్టిన తలగుడ్డతో చోడిగాడు మనకు ప్రత్యక్షం అవుతాడు. ఇతగాడి వేషం హాస్యంగా ఉంటుంది. ఆహార్యం - ఒంటినిండా సున్నపు బొట్టులూ, మధ్య నల్ల చుక్కలూ, కాకి ఈకల కుచ్చు ఇదీ ఇతని వాలకం. పల్లెలలో - దసరా ఉత్సవాలలో గొంతాలమ్మ పండుగలలోని ప్రదర్శనల్లో ఇతగాడిదే అగ్రతాంబూలం. ఇతనికి పేర్లు అనేకంగా వినిపిస్తాయి. సోలెగాడు, చోలెగాడు, చోడిగాడు, సింగడని ఇలా పిలుస్తుంటారు. ఇతగాడి పా త్ర మనకు కొత్త ఏంగాదు. ఆంధ్రజన జీవితంలో - ప్రాచీన కళారంగంలో జీవించి ఉంది. తోలుబొమ్మల ఆటలో జుట్టుపోలిగాడు, బంగారక్క, అల్లాటప్పగాడులకి ఎటువంటి ప్రాముఖ్యం ఉందో ఈ చోడిగాడికి కలాపంలో అంతటి ప్రాధాన్యం ఉంది. ఇక్కడ జుట్టుపోలిగానికి, చోడిగానికీ పాత్రలలో కాస్త తేడా ఉంది. బొమ్మలాటలలో అవి హాస్య పాత్రలు మాత్రమే. చోడిగాని కలాపంలో ఇతడు హాస్యగాడూ, కథనాయకుడూ కూడాను. కురవంజి కథా రూపంలో సింగీ సింగని ప్రణయ కలహమే ఈ చోడిగాని కలాపానికి కథా వస్తువు. దీనిని ఎరుకల అనీ పిలవడం కద్దు. దీనిలోని కథా వస్తువైన చెంచులక్ష్మీ నృసింహుల వివాహగాథను క్రీ.శ.1600 ప్రాంతంలో గరుడాచల మహాత్త్యమనే పేర ఓబయమంత్రి యక్షగానంగా రాశాడు.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: