telugudanam.com

      telugudanam.com

   

కురవంజి

మన ప్రాచీన కళారూపాలలో చాలా ప్రాచీనమైనది కురవంజి అని కొందరి అభిప్రాయం. తెలుగు కావ్యాలలో కురవంజి ప్రస్తావన చాలా చోట్లే అగుపిస్తుంది. కొందరు కొరవంజి అనీ, కురవంజి అనీ పిలవడమూ కద్దు. ఇంకా పరిశోధకుల దృష్టి నుంచి ఆలోచిస్తే కొరవంజి పరిణామమే యక్షగానం అనీ చెప్పకపోలేదు. కురవంజి విశేషాలను గురించిన విషయ సేకరణలో కురవంజి అంటే కొరవజాతి స్త్రీ అని, ఎరుకలు చేసే నాట్య విశేషమనీ చెప్పబడింది. పదహారవ శతాబ్ధిలోనే కురవంజి నృత్య విశేషం ఉందనీ, అప్పటికే అది చాలా ప్రాచీనమైనదనీ అంటున్నారు.


కురవంజి


కురవంజి అనేది ఒక నాట్య విశేషానికి చెందిన అడుగు (లయ). ఈ నాట్యాన్ని ఆదవులలో నివశించే కురవలు అనే జాతి ప్రజలు ప్రదర్శిస్తారు కాబట్టి దానిని "కురవంజి" అన్నారు. ఈ కళారూపం అటవికులది.వీళ్ళు అడవి జంతువుల చర్మాలనీ, ఈకలనీ, పులి గోళ్ళూ, ఎలుగుబంటి వెంట్రుకలు మొదలైన వాటిని ధరించి నృత్యాలు చేస్తారు. పుణ్య క్షేత్రాల్లో యాత్రికుల వినోదార్ధం క్షేత్ర మహత్యాల గురించి కథలల్లి ప్రదర్శించేవారు. మన ఆంధ్ర దేశంలో సోది చెప్పేవారిలో ఈ కళ కొంచెం మిగిలుంది. వీరు ఔషధాలు అమ్ముతారు. చేతులు చూసి భవిష్యత్తు చెబుతారు.

తెలుగు ప్రబంధాలలో కొరవంజి రచనలు కనిపిస్తాయి. యక్ష గానాలలో కూడా కొరవంజి పాత్ర ఉంది. అయ్యలరాజు రామభద్రుడు రామాభ్యుదయంలో 'జక్కణి కొరవంజి మేళముల గేళికలు సల్పిరి ' అని పేర్కొనడం చేత అప్పటికే చాలా కాలంగా కొరవంజి నాట్యం చాలా ప్రాచుర్యం పొంది ఉన్నట్లు ఊహించవచ్చు. ఎరుక చెప్పడం మనకు తెలిసిందే - అంతేనా? స్తంభన, వశీకరణ, ఆకర్షణ, సాముద్రికం - ఇలాంటి విధ్యలెన్నో తెలుసు. ప్రప్రధమంలో విడిగా ఉన్న కురవంజి పాత్ర ఏనాడూ, ఎలా దృశ్య కావ్యాలలో ప్రవేశించిందో ఇదమిత్థంగా ఇదీ అని చెప్పలేము. ఈ కురవంజులలో రెండు విభాగాలు గోచరిస్తున్నాయి. అంటే శృంగార కురవంజులు, వేదాంత కురవంజులు అన్నమాట. అక్కడ కొన్ని విషయాలను పరిశీలించక తప్పదు. శృంగార కురవంజులు - అన్నప్పుడు నాయికా నాయకుల ప్రణయానికి సంబంధించినదన్నమాట. వీటిని ఒకటి, రెండు మూడు భాగాలుగా విభజన చేసుకోవలసి ఉంటుంది.

1.కొరవ నాయకుల ప్రణయాన్ని మాత్రమే చిత్రించే కొరవంజి. వీటి క్రిందకు వచ్చేవి - ఉదాహరణకు గరుడాచల యక్షగానం, కిరాత విలాసం. ఈ తరహా కురవంజిలో కురవంజి సోది చెప్పదు.

2.ఇందులో రెండో రకం ఉంది.ఈ రకం శృంగార కురవంజులలో ఏ పార్వతీదేవో, కథానాయకుడో కురవంజి వేషంలో వెళ్ళి నాయికకు సోది చెప్పడం అన్నది ఉంటుంది. అంటే - ఇందుకు ఉదాహరణగా తులాభారం, మన్నారుదాస విలాసాలను పేర్కొనవలసి ఉంటుంది.

3.మూడవరకం కొరవంజి ఉంది. ఆ కొరవంజిలో ఎరుకత మామూలు ఎరుకతేగాని దేవగణానికి చెందిందికాదు. ఇక వేదాంత కురవంజిని గురించి చెప్పవలసి వస్తే - ఇది ప్రధానంగా వేదాంత బోధకు సంబంధించి ఉంటుంది.

నేడు ఆంధ్ర దేశంలో కొరవంజి నాటకాల ప్రదర్శన కనిపించటంలేదు. కాని ఎరుకల పాట మాత్రం ఏకపాత్రగా "సోదెమ్మ సోదో" అంటూ ఈనాటికీ ఆనాటి వేషధారణనే అనుకరిస్తూ సోదె చెబుతూ ఉంటుంది.

వీథి నాటకాలకు చాలా వయసు ఉన్నట్లుగా హాల శాతవాహనుడు రచించిన గాథా సప్తశతి మనకు చెబుతూనే ఉంది. సుమారు రెండువేల ఏళ్ళకు పూర్వమే వీథి నాటక లక్షణాలు, దేశి వాద్య విశేషాలు ఉన్నట్లు-నాటి శిల్ప ప్రతికృతుల రూపావశేషాల ద్వారా గుర్తించవలసి ఉంటుంది.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: