telugudanam.com

      telugudanam.com

   

పగటి వేషాలు

సాధారణంగా కళారూపాలన్నిటినీ రాత్రిపూటే ప్రదర్శిస్తారు. ఐతే ప్రత్యేకంగా పగటిపూట ప్రదర్శించే వేషాలు కావడం వల్ల వీటికి "పగటి వేషాలు" అని నామకరణం వచ్చింది. ప్రజా వినోదం ప్రధాన ఆశయంగా, ప్రజల ఆశలకూ, ఆశయాలకూ దర్పణంగా ఇవి దేశంలో ప్రచారం పొందాయి. వీటిని గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. నాటి పరిపాలకుల దృష్టికి ప్రజా సమస్యలను తీసుకురావడం, వర్తమానాలను చేరవేయడం కొరకు ప్రధానంగా ఈ ప్రదర్శనలు ప్రచారంలోనికి వచ్చాయని ప్రతీతి.


పగటి వేషాలు      


కృష్ణాజిల్లా కూచిపూడి పగటి వేషధారులకు నిలయం. నృత్యనాటకాలు ఆడేవారు నాట్య మేళములుగా ఏర్పడి తమకున్న కళా ఔన్నత్యంలో ప్రదర్శనలూ ఇస్తున్నారు. కూచిపూడివారిలో కొందరు సంవత్సరంలో కొన్ని నెలలు సంచార మేళములుగా ఏర్పడి ప్రజలలో విజ్ఞాన ప్రభోధం చేస్తూ - తద్వారా ఆనందాన్నీ, ఆలోచననూ కలిగిస్తుంటారు. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని మరచిపోకూడదు. కూచిపూడి - భాగవత కథా, ప్రదర్శనలకు ప్రత్యేకత అయితే, గడ్డిపాడు - పగటి వేషాలకు ప్రసిద్ది పొందింది. అసలు పగటి వేషాలకు ఒక విలువను చేకూర్చిన వారు గడ్డిపాడు వారే అనిపిస్తుంది.

గడ్డిపాడు వారు సుమారు 60 రకాల వేషాలను ప్రదర్శించేవారు.

ఈ వేషాలలో నిత్యజీవితంలో ఉండేవి కొన్ని. పౌరాణికంగా కొన్ని, కల్పిత వేషాలు కొన్ని, పూర్తిగా హాస్య ప్రధానమైనవి కొన్ని. వీరి వేషాలలో ఉండే గొప్పతనం నమ్మించడం. అంటే గొర్రెలుకాచే గొర్రెలకాపరి వేషం ధరిస్తే అక్షరాలా అలాగే ఉండడం.కూచిపూడి వారైనా, గడ్డిపాడు వారైనా - దేశంలో ఉన్న మతాలనూ, కులాలనూ, మాండలిక భాషనూ ఆకళింపు చేసుకొనడంలో వీరికివీరే సాటి. పగటి వేషాల ద్వారా - రాజులలో మార్పును తేవడం, ప్రజల్లో చైతన్యాన్ని కలిగించడం ప్రత్యేకించి ఉదహరించవలసి ఉంటుంది. కాకతీయ యుగంలో యుగంధర మహామంత్రి పిచ్చి యుగంధరుడుగా నటించి 'ఢిల్లీ సుల్తాన్ పట్టుకపోతాన్ 'అంటూ ఢిల్లీ సుల్తానులను జయించింది పగటి వేషంతోనే. అంతదాకా ఎందుకు? కళింగ గంగరాజు పగటి వేషాలవారి సాయంతోనే శత్రువులను జయించాడనే కథ విన్నదేకదా.జనంలో ప్రచారం పొందిన పగటి వేషాలలో కొన్ని:

1.శక్తివేషం, 2.భేతాళుడు, 3.దేవర పెట్టె, 4.భోగం వేషం, 5.పాములవాడు, 6.ఎరుకల వేషం, 7.దొమ్మర వేషం, 8.కోయ వేషం, 9.కాశీ ప్రయాణం, 10.ఫకీరు వేషాలు, 11.బ్రహ్మంగారి తత్వాలు, 12.అత్తాకోడళ్ళ సంవాదం, 13.గొల్లభామ, 14.మందుల వేషం, 15.దాదినమ్మ వేషం, 16.జేగంట భాగవతులు, 17.హరిదాసులు, 18.భట్రాజు వేషం, 19.లింగబలిజ వేషం, 20.చోడిగాడు, 21.బట్టల అమ్మకం, 22.దాసరి వేషం, 23.రెడ్డి వేషం, 24.గంటి భాగవతం, 25.బైరాగుల వేషాలు, 26.బుడబుక్కల వేషం, 27.సోమిదేవమ్మ, 28.అర్థనారీశ్వరుడు, 29.వైష్ణవ వేషాలు, 30.పంతులు వేషాలు, 31.సోదె, 32.వితంతువు, 33.మాదిగ వేషం, 34.తహశీల్‌దారు, 35.జంతరు పెట్టె, 36.చిట్టి పంతులు, 37.దివాను వేషం, 38.సింగి-సింగడు, 39.అవధాని, 40.మొండి బండవాళ్ళు, 41.లంబాడి పడుచు, 42.రాధాకృష్ణ సంవాదం, 43.సోమయాజులు, 44.శారద వేషం, 45.జంగమ దేవర, 46.సాతాని వేషం, 47.పఠాను వేషం, 48.కోమటి వేషం, 49.కాశీకావళ్ళు, 50.వానాలమ్మ, 51.పడుచుపెళ్ళాం-ముసలి మొగుడు, 52.గయ్యాలి పెళ్ళాం, 53.పిట్టల దొర, 54.రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ - ఇలా మరెన్నో పగటి వేషాలు ప్రచారం పొందాయి.

ఒకనాటిమాట - భారతదేశంలో స్వతంత్ర, సామంత రాజుల పాలనలోనూ చిత్ర విచిత్రమయిన ఈ వేషాలు చాలా ప్రచారంలోకి - వ్యాప్తిలోకి వచ్చాయని అంటారు.

రకరకాల మారు వేషాలు ధరించి గూఢచారులుగా సమాచారాలను, అందించేవారని చరిత్ర చెబుతూంది. వీరు వర్తకులుగా - రత్నాలు-వజ్రాలు అమ్మే వ్యాపారులుగా కోటలోకి ప్రవేశించి రాజును వంచించడం - అక్కడి విషయాలను చూసి, అక్కడి బలహీనతలను సేకరించి, దండయాత్రలు చేయడం జరుగుతూ ఉండేవి. ఒక్కమాటలో చెప్పాలంటే అలా ప్రారంభమైనవే ఈ పగటి వేషాలు. వీటిని ఒకప్పుడు 'బహురూపాలు 'అని పిలిచేవారు. భరతకోశంలో వీటి ప్రస్తావన ఉంది. సర్వేశ్వరశతకంలో వీటి ప్రస్తావన ఉంది. పండితారాధ్యచరిత్రలో వీటి వివరణ కనిపిస్తుంది. ఇంతవరకూ మనకు లభ్యమయిన చారిత్రకాధారాలను బట్టి-సుమారు మూడు వందల ఏళ్ళనాడు మైసూరు ప్రాంతం నుంచి పల్లావఝుల వెంకట రామయ్య ఆంధ్రదేశం రావడం, రేపల్లెలో ఉంటూ, మనవారికి కొందరికి పగటి వేషాలు నేర్పాడని అంటున్నారు. తరువాత గడ్డిపాడు ప్రధాన కేంద్రం, నివాస స్థానం అయిందని పరిశీలకుల అంచనా.

వీథి భాగవతాలకు కూచిపూడి ఎలా ప్రధాన కేంద్రంగా ఉందో, అలా పగటి వేషాలకు గడ్డిపాడు ప్రధాన కేంద్రం అయింది. పగటి వేషాలు ధరించే వారిలో పల్లావఝుల వారు, శ్రీకారం వారు, కూచివారు, కనుపూరివారు, బెల్లంకొండ వారు, బాపట్లవారు, కవులవారు ఇలా మరికొందరు. పైన పేర్కొన్న వీరందరినీ తీర్చిదిద్దిన ఆయన మైసూరు బ్రాహ్మణుడు. ఇలా పగటి వేషాలు తెలుగు ప్రజలకు ఆనందాన్ని తద్వారా విజ్ఞానాన్ని అందిస్తూన్నాయి.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: