telugudanam.com

      telugudanam.com

   

పేరిణి

పేరిణి శివతాండవం వీర నాట్యశైలికి చెందింది. ఈ సంప్రదాయం శైవ మతానికి సంబంధించింది. పేరిణికి సంబంధించిన ప్రస్తావన పాల్కురికి సోమనాధుని పందితారాధ్య చరిత్రలోనూ, శ్రీనాధుని కాశీఖండం, భీమఖండంలోనూ వర్ణించబడింది. కాకతి గణపతి చక్రవర్తికి సేనా నాయకుడైన జయప సేనాని 1253-54లో రచించిన నృత్యరత్నావళిలో పేరిణి గురించి వర్ణించాడు.


పేరిణి


పేరిణి నృత్యకారుడు రూప సంపన్నుడుగానూ, రసానుభవంగలవాడుగానూ, తాళజ్ఞుడుగానూ ఉండాలని జయప సేనాని అభివర్ణించాడు. కేవలం ఈ ఒక్క ఊహతోనే నటరాజ రామకృష్ణ చిరస్మరణీయమైన ఉధృతమైన తాండవ నృత్యాన్ని ఎంతో శ్రమించి తీర్చిదిద్దారు. పేరిణి తాండవ శైలికి సంబంధించింది. తాండవం అంటే తనలో తాను లయం చేసుకోవడం. పేరిణి తాండవం రెండు విధాలు. ఒకటి పురుషులచేతా, రెండవది స్త్రీలచేతా చేయబడుతుంది. పురుషుని పురుషత్వాన్ని లోకానికి తెలియజేస్తూ ప్రదర్శించే నర్తనమే పేరిణి శివతాండవం. ఇది వీరులు చేసిన వీర నాట్యం.

వరంగల్ జిల్లా ములుగు తాలూకాలో 1162లో రుద్రసేనాని అనే రెడ్డి సామంతుడు నిర్మించిన రామప్ప దేవాలయంలోని శిల్ప కళా సంపద అద్భుతమైంది. స్తంభాల మీదా, కప్పుల మీదా భరత నాట్యమంతా మూర్తీభవించి ఉంటుంది. శిల్పాల హస్త విన్యాస క్రమం మొదలైనవాటిని మృదంగ భంగిమలలో మలచిన తీరు అద్భుతం. "నేను పేరిణి తాండవాన్ని పునర్నిర్మించడానికి ఆ మాతృకలే నాకెంతో సహాయపడ్డాయి" అన్నారు నటరాజ రామకృష్ణ.

పేరిణి నృత్యం చేసే ప్రతి వ్యక్తీ శివుణ్ణి ఆవహించుకుని ఆవేశంతో నృత్యం చేస్తాడు. మేళవింపు విధానం పేరిణికి అతిముఖ్యమైనది.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: